women child welfare department
-
మహిళా, శిశు సంక్షేమశాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం
-
మహిళల వివాహ వయసు పెంపుపై కసరత్తు
సాక్షి, న్యూఢిల్లీ : మహిళల చట్టబద్ధ వివాహానికి అర్హమైన వయసును పున:పరిశీలిస్తామని స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటనపై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం మహిళల వివాహానికి కనీస వయసు 18 సంవత్సరాలు కాగా తాజా ప్రతిపాదనను సమీక్షించేందుకు ప్రభుత్వం కసరత్తు సాగిస్తోంది. బాలికల్లో తల్లయ్యే సామర్థ్యం, వివాహ వయసు- శిశు జనన సంబంధ మరణాల నిష్పత్తి (ఎంఎంఆర్), సంతాన సాఫల్యం వంటి అంశాలను పరిశీలించేందుకు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఓ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. వివాహానికి కనీస వయసును పొడిగిస్తే బాలికలు తమ విద్యాభ్యాసాన్ని పూర్తిచేయడంతో పాటు వివాహం, పిల్లల బాధ్యతలను తలకెత్తుకునేందుకు శారీరకంగా, మానసికంగా సంసిద్ధమయ్యే వెసులుబాటు లభిస్తుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సైతం యోచిస్తోంది. చదవండి : డిజిటల్ హెల్త్ మంచిదే కానీ.. ఇక ఈ నిర్ణయంతో జనాభా పెరుగుదలనూ కట్టడి చేయవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది భవిష్యత్‌లో మహిళల ప్రసవంపై కూడా సానుకూల ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. సంతాన ప్రాధాన్యాలను, గర్భవతిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పిల్లల పెంపకంపై సాధికార నిర్ణయాలు తీసుకునే పరిణితి మహిళలకు సమకూరుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. చట్టబద్ధ వివాహ వయసును పెంచడం మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం, సాధికారతకు దారితీయడంతో పాటు సరైన జీవిత భాగస్వామిని ఎంచుకునే అవకాశం ఉంటుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఈ నిర్ణయం మహిళతో పాటు, పిల్లల ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుందని, మహిళల సామాజికార్థిక ఎదుగుదలకు దోహదం చేస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
మహిళా సురక్షిత నగరాలకు 2,900 కోట్లు
న్యూఢిల్లీ: నగరాలను మహిళలకు సురక్షితంగా మార్చేందుకు కేంద్రం రూ.2,900 కోట్లు కేటాయించింది. ఇందుకోసం ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, లక్నోలను ఎంపిక చేసింది. మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. నిర్భయ నిధుల్లో నుంచి ఖర్చు చేయనున్న మొత్తం రూ.2,919.55 కోట్లలో ఢిల్లీకి రూ.663.67 కోట్లు, ముంబైకి రూ.252 కోట్లు, బెంగళూరుకు రూ.667 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో వీడియో పర్యవేక్షణ,ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు, వీడియో ఫీడ్ షేరింగ్ ఉన్న పెట్రోలింగ్ వ్యాన్లను, మహిళా పోలీస్ స్టేషన్లను ఏర్పాటుచేస్తారు. -
మా కూతురు ఉందో, లేదో ..
పశ్చిమగోదావరి ,ఏలూరు (మెట్రో) : ఒక పేద కుటుంబాన్ని గత 10 రోజులుగా జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న వైనమిది. జనవరి 23వ తేదీన తాడేపల్లిగూడెంలోని 16వ వార్డు జువ్వలపాలెంలో దాసరి నాగభూషణం, రామలక్ష్మి దంపతులు తమ కుమార్తెకు సమీప బంధువుతో వివాహానికి ఏర్పాట్లు చేశారు. పెండ్లికుమార్తెకు 18 సంవత్సరాలు నిండకపోవడంతో బాల్యవివాహం చేస్తున్నట్లు మహిళా శిశు సంక్షేమశాఖకు సమాచారం అందింది. దీంతో సదరు శాఖ సూపర్వైజర్ పెళ్లి చేసే కుటుంబం వద్దకు వెళ్లి విచారించి పెళ్లిని నిలుపుదల చేయించారు. పెళ్లి చేసేందుకు బాలికకు ఇంకా 6 నెలలు రావాల్సి ఉందనీ, అప్పుడు 18 సంవత్సరాలు నిండుతాయని తేల్చారు. దీంతో సదరు కుటుంబం పెళ్లి విషయాన్ని వాయిదా వేసుకుంది. ఇక్కడ వరకూ బాగానే ఉన్నప్పటికీ ఆ తరువాతే సీన్ మారిపోయింది. పోలీస్‌స్టేషన్‌కు పంచాయితీ ఈ పెళ్లి విషయం ఇంతలో రెవెన్యూ శాఖకు, పోలీసులకు తెలిసింది. దాంతో పెళ్లి పెద్దలతోపాటుగా, బాలికను, పెళ్లి కుమారుణ్ని, వారి తల్లితండ్రులను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తారని చెప్పారు. కాని అలా జరగలేదు. 24వ తేదీన ఇదే పంచాయితీ జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ కార్యాలయానికి చేరింది. బాలికను, కుటుంబం మొత్తాన్ని తీసుకుని సదరుశాఖ సూపర్వైజర్ జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ కార్యాలయానికి చేరుకున్నారు. ఇక్కడ కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తారని ఆశించారు. ఇరు కుటుంబాలతో రాతపూర్వకంగా పెళ్లి చేయబోమని కాగితాలు తీసుకున్నారు. అనంతరం సదరు సూపర్వైజర్ను, కుటుంబ సభ్యులను తిప్పి పంపేసి కేవలం బాలికను మాత్రం ఐసీడీఎస్ అధికారులు తమ అదుపులో ఉంచుకున్నారు. అప్పటి నుంచికాళ్లరిగేలా తిరుగుతున్నారు కేవలం తమ కుమార్తెను మాత్రమే అదుపులో ఉంచుకుని కౌన్సెలింగ్ ఇస్తాం, మరో 24 గంటల్లో రావాలని చెప్పినప్పటి నుంచి కాళ్లరిగేలా జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ అధికారుల చుట్టూ సదరు కుటుంబ సభ్యులు తిరుగుతూనే ఉన్నారు. తమ కుమార్తె ఎక్కడ ఉందో, ఎలా ఉందో కూడా ఆ తల్లిదండ్రులకు సమాధానం ఇవ్వడం లేదు. ఎప్పుడు ఈ ప్రక్రియ పూర్తి చేస్తారో, తమ కుమార్తెను ఎప్పుడు తమతో పంపిస్తారో అని గత 10 రోజులుగా ఆ పేద కుటుంబం తాడేపల్లిగూడెం నుంచి ఏలూరుకు ప్రతి రోజూ ఉదయం చేరుకుని కార్యాలయం వద్దే సాయంత్రం వరకు పడిగాపులు పడుతోంది. అధికారులు సమాధానం చెప్పకపోవడంతో తిరిగి రాత్రికి ఇంటికి వెళుతున్నారు. అధికారులు అదుపులోకి తీసుకున్న రోజే తమ కూతురు చచ్చిపోతానని బాధపడిందనీ, ఈ నేపథ్యంలో తమ కూతురికి ఏమైందోనని తల్లి కన్నీటిపర్యంత మవుతోంది. కాళ్లుపట్టుకున్నా డీసీపీఓ కరుణించలేదనీ, కనీసం సమా«ధానం కూడా చెప్పడం లేదని తండ్రి బోరున విలపిస్తున్నాడు. మా కూతురు ఉందో, లేదో తెలీడం లేదు మా కూతురు ఉందో లేదో తెలీడం లేదు. కౌన్సెలింగ్ ఇస్తున్నాం అంటున్నారు. వచ్చాక సరైన సమాధానం చెప్పడం లేదు. ఎవర్ని కలవాలో కూడా తెలీడం లేదు. తాడేపల్లిగూడెం మున్సిపల్ ఛైర్మన్, వార్డు కౌన్సిలర్ కూడా చెప్పారు. అయినా అధికారులు కనికరించడం లేదు. డీసీపీఓ కాళ్లు పట్టుకుని బతిమలాడినా చలించలేదు. తమ కూతురు అసలు ఉందా? లేక అనారోగ్యం పాలైందా? ఉంటే ఎక్కడ ఉందో చెప్పాలి. ఎలా ఉందో చూపించాలి. – దాసరి నాగభూషణం, రామలక్ష్మి, బాలిక తల్లిదండ్రులు నమ్మకం కలిగాక పంపిస్తాం బాలిక మా సదన్‌లోనే ఉంది. కౌన్సెలింగ్ ఇస్తున్నాం. మాకు ఎప్పుడు నమ్మకం కలిగితే అప్పుడు పంపిస్తాం. తల్లిదండ్రులకు తెలీదు అనడంలో వాస్తవం లేదు. బాలిక ఆరోగ్యంగానే ఉంది. ఇంకా రెండు, మూడు రోజులు కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. లేనిపోని అపవాదులు మాపై వేయవద్దు. బాలికలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలనే మేం ప్రయత్నిస్తున్నాం. – సీహెచ్ సూర్య చక్రవేణి, డీసీపీఓ మా పరిధిలోది కాదు బాల్యవివాహాన్ని అడ్డుకోవడం వరకే మా పరిధి. తరువాత జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలోకి వెళ్లిపోతుంది. బాలికను వారి ఆధీనంలోనే ఉంచుకుంటారు. వారే బాలిక విడుదలకు ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుంది. – ఎస్.విద్యావతి, ఐసీడీఎస్, ప్రాజెక్టు డైరెక్టర్ -
బాలలపై లైంగిక వేధింపులు ఆందోళనకరం
సాక్షి, హైదరాబాద్: బాలలపై లైంగిక వేధింపులు పెరుగుతున్నాయని, వేధింపులకు గురైన బాలలు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటున్నారని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జగదీశ్వర్ ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్‌లో జిల్లా సంక్షేమాధికారులు, సీడీపీఓ, డీసీపీఓల శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బాలల రక్షణ బాధ్యతగా తీసుకోవాలని, లైంగిక దాడులను అరికట్టాలన్నారు. బాలల హక్కులను హరిస్తున్నారని, వారి రక్షణ ప్రశ్నార్థకంగా మారుతోందని శాఖ సంచాలకులు విజయేందిర ఆవేదన వ్యక్తం చేశారు. బాలల హక్కుల రక్షణపై అవగాహన కల్పించేందుకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోందని వివరించారు. -
‘తీవ్ర నేరాల్లో బాలలను పెద్దవారిలాగే విచారించాలి’
న్యూఢిల్లీ: హత్య, లైంగికదాడుల వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడ్డ 16 ఏళ్లు దాటిన బాలురను పెద్దవారిలాగే భారత శిక్షాస్మృతి ప్రకారం విచారించాలని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రతిపాదించింది. కేబినెట్ ఆమోదంకోసం పంపనున్న ముసాయిదా నోట్లో భాగంగా ఈ ప్రతిపాదనను చేసినట్టు అధికారవర్గాలు తెలిపాయి. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటారన్నాయి. నిర్భయ గ్యాంగ్‌రేప్ కేసులో 16 ఏళ్ల నిందితుడికి స్వల్పశిక్ష పడిన నేపథ్యంలో ఈ ప్రతిపాదన చేశారు. దీనికి ఆమోదం లభిస్తే 16-18 ఏళ్ల వయసుండే నిందితులకు జువైనైల్ చట్టం ప్రకారం మినహాయింపులు లభించవు. దీన్ని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ వ్యతిరేకించింది. ‘క్రిమినల్ కోర్టుల అధికారాలపై వైఖరి చెప్పండి’ హత్య, లైంగిక దాడులవంటి నేరాల్లో 16-18 ఏళ్ల వయసు నిందితులను విచారించే విషయంలో క్రిమినల్కోర్టుల అధికారాలపై నాలుగు వారాల్లో వైఖరి తెలపాలని సుప్రీంకోర్టు సోమవారం కేంద్రాన్ని కోరింది. -
‘బంగారుతల్లి’కి భరోసా ఏదీ?
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో ‘బంగారు తల్లి’కి భరోసా దక్కడంలేదు. ఈ పథకం ఇంకా బాలారిష్టాలను అధిగమించడంలేదు. జనాభాలో బాలికల నిష్పత్తి పెంచడం, విద్య ద్వారా బాలికా సాధికారత సాధించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘బంగారుతల్లి’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ యేడాది మే ఒకటో తేదీ నుంచి మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ పథకం అమల్లోకి వచ్చింది. దరఖాస్తు ప్రక్రియపై అవగాహన లేకపోవడంతో ప్రజలు అయోమయానికి లోనవుతున్నారు. బ్యాంకు, గ్రామైక్య సంఘం ఖాతాలు, ఆధార్ కార్డులు లేవంటూ దరఖాస్తులు ఆమోదించడం లేదు. మరోవైపు అన్ని అర్హతలున్న లబ్ధిదారుల ఖాతాలో నేటికీ నయాపైసా జమ కాలేదు. బంగారు తల్లి పథకంలో భాగంగా జిల్లాలో ఈ యేడాది మే ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు 2,775 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,502 మంది చిన్నారులు పథకంలో లబ్ధిపొందేందుకు అర్హులని ప్రాథమికంగా గుర్తించారు. అయితే బ్యాంకు ఖాతాలు, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు లేదంటూ చివరకు 1,094 మందిని అర్హులుగా తేల్చారు. పథకంలో లబ్ధిపొందేందుకు అర్హత సాధించిన బాలిక తల్లి ఖాతాలో మొదటి విడతలో రూ.2,500 చొప్పున జమ చేయాల్సి ఉంటుంది. మే ఒకటో తేదీ నుంచి పథకం అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటివరకు ఖాతాలో నయాపైసా జమ కాకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. గ్రామైక్య సంఘాలు, ఏపీఎం, డీపీఎం స్థాయిలో దరఖాస్తులను పరిశీలించి ఆన్లైన్లో వివరాలు నమోదు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్డీఏ) ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, సమగ్ర శిశు అభివృద్ధి పథకం(ఐసీడీఎస్) ద్వారా ‘బంగారు తల్లి’ అమలు కావాల్సి వుంది. అయితే లబ్ధిదారులను గుర్తించడంలో ప్రభుత్వ శాఖల నడుమ సమన్వయలోపం కనిపిస్తోంది. జిల్లాలో గర్భిణులు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్న ప్రసవాలు, వీరిలో బంగారు తల్లికి అర్హులైన వారి వివరాలు సేకరించేందుకు ప్రత్యేక వ్యవస్థ లేదు. మండల సమాఖ్యలు, మున్సిపాలిటీల ద్వారా అందిన దరఖాస్తులను మాత్రమే డీఆర్డీఏ అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్(ఏపీఎం)లు పరిశీలిస్తున్నారు. మార్గదర్శకాలపై అవగాహన ఏదీ? లబ్ధిదారుల గుర్తింపు, ఎంపికకు సంబంధించిన మార్గదర్శకాలపై గ్రామైక్య సంఘాలు, అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన లేమి స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లా కేంద్ర ఆసుపత్రి, ఏరియా, కమ్యూనిటీ ఆసుపత్రుల్లో లబ్ధిదారులను గుర్తించేం దుకు కొన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా ఓ ఉద్యోగిని నియమించారు. వీరు అందించే వివరాలను ఏపీఎంలు పరిశీలించి, లబ్ధిదారులను ఎంపిక చేసేలా ఏర్పాట్లు చేశారు. కాగా మరోవైపు లబ్ధిదారుల ఎంపికను ఆధార్ కార్డుతో అనుసంధానించడంతో చాలా దరఖాస్తులు ఆమోదానికి నోచుకోవడం లేదు. అందోలు మండలంలో 63 దరఖాస్తులు అందగా, ఒక్క లబ్ధిదారు పేరు కూడా ఖరారు కాలేదు. ‘మండల సమాఖ్యలు, మున్సిపాలిటీల ద్వారా బంగారుతల్లి పథకం కింద దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. దౌల్తాబాద్, సదాశివపేట మండలంలో ఒకరిద్దరు ఖాతాల్లో నిధులు జమ అయినట్లు సమాచారం ఉంది. ఎంపిక చేసిన లబ్ధిదారులకు నిధులు మంజూరైనట్లు సమాచారం అందింది’ అని డీపీఎం రమ ‘సాక్షి’కి వెల్లడించారు.