దాసరి నాగభూషణం, రామలక్ష్మి, బాలిక తల్లిదండ్రులు
పశ్చిమగోదావరి ,ఏలూరు (మెట్రో) : ఒక పేద కుటుంబాన్ని గత 10 రోజులుగా జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న వైనమిది. జనవరి 23వ తేదీన తాడేపల్లిగూడెంలోని 16వ వార్డు జువ్వలపాలెంలో దాసరి నాగభూషణం, రామలక్ష్మి దంపతులు తమ కుమార్తెకు సమీప బంధువుతో వివాహానికి ఏర్పాట్లు చేశారు. పెండ్లికుమార్తెకు 18 సంవత్సరాలు నిండకపోవడంతో బాల్యవివాహం చేస్తున్నట్లు మహిళా శిశు సంక్షేమశాఖకు సమాచారం అందింది. దీంతో సదరు శాఖ సూపర్‌వైజర్ పెళ్లి చేసే కుటుంబం వద్దకు వెళ్లి విచారించి పెళ్లిని నిలుపుదల చేయించారు. పెళ్లి చేసేందుకు బాలికకు ఇంకా 6 నెలలు రావాల్సి ఉందనీ, అప్పుడు 18 సంవత్సరాలు నిండుతాయని తేల్చారు. దీంతో సదరు కుటుంబం పెళ్లి విషయాన్ని వాయిదా వేసుకుంది. ఇక్కడ వరకూ బాగానే ఉన్నప్పటికీ ఆ తరువాతే సీన్ మారిపోయింది.
పోలీస్‌స్టేషన్‌కు పంచాయితీ
ఈ పెళ్లి విషయం ఇంతలో రెవెన్యూ శాఖకు, పోలీసులకు తెలిసింది. దాంతో పెళ్లి పెద్దలతోపాటుగా, బాలికను, పెళ్లి కుమారుణ్ని, వారి తల్లితండ్రులను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తారని చెప్పారు. కాని అలా జరగలేదు. 24వ తేదీన ఇదే పంచాయితీ జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ కార్యాలయానికి చేరింది. బాలికను, కుటుంబం మొత్తాన్ని తీసుకుని సదరుశాఖ సూపర్‌వైజర్ జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ కార్యాలయానికి చేరుకున్నారు. ఇక్కడ కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తారని ఆశించారు. ఇరు కుటుంబాలతో రాతపూర్వకంగా పెళ్లి చేయబోమని కాగితాలు తీసుకున్నారు. అనంతరం సదరు సూపర్‌వైజర్‌ను, కుటుంబ సభ్యులను తిప్పి పంపేసి కేవలం బాలికను మాత్రం ఐసీడీఎస్ అధికారులు తమ అదుపులో ఉంచుకున్నారు.
అప్పటి నుంచికాళ్లరిగేలా తిరుగుతున్నారు
కేవలం తమ కుమార్తెను మాత్రమే అదుపులో ఉంచుకుని కౌన్సెలింగ్ ఇస్తాం, మరో 24 గంటల్లో రావాలని చెప్పినప్పటి నుంచి కాళ్లరిగేలా జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ అధికారుల చుట్టూ సదరు కుటుంబ సభ్యులు తిరుగుతూనే ఉన్నారు. తమ కుమార్తె ఎక్కడ ఉందో, ఎలా ఉందో కూడా ఆ తల్లిదండ్రులకు సమాధానం ఇవ్వడం లేదు. ఎప్పుడు ఈ ప్రక్రియ పూర్తి చేస్తారో, తమ కుమార్తెను ఎప్పుడు తమతో పంపిస్తారో అని గత 10 రోజులుగా ఆ పేద కుటుంబం తాడేపల్లిగూడెం నుంచి ఏలూరుకు ప్రతి రోజూ ఉదయం చేరుకుని కార్యాలయం వద్దే సాయంత్రం వరకు పడిగాపులు పడుతోంది. అధికారులు సమాధానం చెప్పకపోవడంతో తిరిగి రాత్రికి ఇంటికి వెళుతున్నారు. అధికారులు అదుపులోకి తీసుకున్న రోజే తమ కూతురు చచ్చిపోతానని బాధపడిందనీ, ఈ నేపథ్యంలో తమ కూతురికి ఏమైందోనని తల్లి కన్నీటిపర్యంత మవుతోంది. కాళ్లుపట్టుకున్నా డీసీపీఓ కరుణించలేదనీ, కనీసం సమా«ధానం కూడా చెప్పడం లేదని తండ్రి బోరున విలపిస్తున్నాడు.
మా కూతురు ఉందో, లేదో తెలీడం లేదు
మా కూతురు ఉందో లేదో తెలీడం లేదు. కౌన్సెలింగ్ ఇస్తున్నాం అంటున్నారు. వచ్చాక సరైన సమాధానం చెప్పడం లేదు. ఎవర్ని కలవాలో కూడా తెలీడం లేదు. తాడేపల్లిగూడెం మున్సిపల్ ఛైర్మన్, వార్డు కౌన్సిలర్ కూడా చెప్పారు. అయినా అధికారులు కనికరించడం లేదు. డీసీపీఓ కాళ్లు పట్టుకుని బతిమలాడినా చలించలేదు. తమ కూతురు అసలు ఉందా? లేక అనారోగ్యం పాలైందా? ఉంటే ఎక్కడ ఉందో చెప్పాలి. ఎలా ఉందో చూపించాలి. – దాసరి నాగభూషణం, రామలక్ష్మి, బాలిక తల్లిదండ్రులు
నమ్మకం కలిగాక పంపిస్తాం
బాలిక మా సదన్‌లోనే ఉంది. కౌన్సెలింగ్ ఇస్తున్నాం. మాకు ఎప్పుడు నమ్మకం కలిగితే అప్పుడు పంపిస్తాం. తల్లిదండ్రులకు తెలీదు అనడంలో వాస్తవం లేదు. బాలిక ఆరోగ్యంగానే ఉంది. ఇంకా రెండు, మూడు రోజులు కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. లేనిపోని అపవాదులు మాపై వేయవద్దు. బాలికలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలనే మేం ప్రయత్నిస్తున్నాం. – సీహెచ్ సూర్య చక్రవేణి, డీసీపీఓ
మా పరిధిలోది కాదు
బాల్యవివాహాన్ని అడ్డుకోవడం వరకే మా పరిధి. తరువాత జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలోకి వెళ్లిపోతుంది. బాలికను వారి ఆధీనంలోనే ఉంచుకుంటారు. వారే బాలిక విడుదలకు ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుంది. – ఎస్.విద్యావతి, ఐసీడీఎస్, ప్రాజెక్టు డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment