ఆస్తులు పోతాయని..అక్క భర్తకిచ్చి..
నాయుడుపేట(నెల్లూరు): అభం శుభం తెలియని విద్యార్థినిని అక్క భర్తకిచ్చి పెళ్లిచేయాలనుకున్నారు. తాను చదువుకుంటానని, పెళ్లి వద్దని వేడుకుంటుంటే కచ్చితంగా చేసుకోవాలని తల్లిదండ్రులే బెదిరిస్తున్న సంఘటన నాయుడుపేట మండలం కల్లిపేడులో చోటు చేసుకుంది. బాధితురాలి కథనం మేరకు కల్లిపేడు గ్రామానికి చెందిన కాటూరి వెంకటరమణయ్య, సౌభాగ్యమ్మ కుమార్తె కాటూరి గీత నాయుడుపేట జెడ్పీబాలుర ఉన్నత పాఠశాల్లో పదో తరగతి చదువుతోంది. గత శనివారం వెంకటగిరి మండలం వెందోడు గ్రామంలో ఉన్న గీత పెద్దమ్మ కూతురు బొజ్జా శిల్ప ఆకస్మికంగా మృతి చెందింది.
శిల్ప పెద్దకర్మ ఈనెల 18న జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శిల్పకున్న ఇద్దరి బిడ్డలు అనాథలవుతారని, ఆస్తిపాస్తులు పోతాయని ఆమె భర్త బొజ్జా మస్తాన్ (35)కు గీతనిచ్చి వివాహం చేసేందుకు తల్లిదండ్రులు నిర్ణయించారు. ఆ విషయం విద్యార్థినికి చెప్పడంతో తనకు పెళ్లొద్దని, తాను ఇంకా చదువుకుంటానని చెప్పింది. దీంతో ఆమె తల్లిదండ్రులు స్పందిస్తూ పెళ్లి చేసుకోకపోతే చంపేస్తామని బెదిరించారు. ఈ క్రమంలో శుక్రవారం పాఠశాలలో నిర్వహించే కృష్ణా పుష్కరాల సదస్సులో పాల్గొనేందుకు వచ్చింది.
తనకు పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ఒత్తిడి తెస్తున్నారనే విషయాన్ని స్నేహితులతో చెప్పుకొని విలపించింది. వారు కూడా పాఠశాలలో సదస్సుకు వెళ్లకుండా తరగతి గదిలోనే ఏడుస్తూ ఉండిపోయారు. ఈ విషయాన్ని తెలుగు పండిట్ గడదాసు వెంకటేశ్వర్లు గుర్తించారు. తరగతి గదికి వెళ్లి విచారించారు. గీత తోటి విద్యార్థులతో కలిసి విలపిస్తూ తన పెళ్లి వ్యవహారాన్ని బహిర్గతం చేసింది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులకు తెలుగు పండిట్ విషయం చెప్పారు.ప్రభుత్వం స్పందించి గీతకు రక్షణ కల్పించి చదువు కొనసాగించేందుకు అవకాశం కల్పించాలని కోరారు.