ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : మహిళల చట్టబద్ధ వివాహానికి అర్హమైన వయసును పున:పరిశీలిస్తామని స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటనపై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం మహిళల వివాహానికి కనీస వయసు 18 సంవత్సరాలు కాగా తాజా ప్రతిపాదనను సమీక్షించేందుకు ప్రభుత్వం కసరత్తు సాగిస్తోంది. బాలికల్లో తల్లయ్యే సామర్థ్యం, వివాహ వయసు- శిశు జనన సంబంధ మరణాల నిష్పత్తి (ఎంఎంఆర్), సంతాన సాఫల్యం వంటి అంశాలను పరిశీలించేందుకు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఓ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. వివాహానికి కనీస వయసును పొడిగిస్తే బాలికలు తమ విద్యాభ్యాసాన్ని పూర్తిచేయడంతో పాటు వివాహం, పిల్లల బాధ్యతలను తలకెత్తుకునేందుకు శారీరకంగా, మానసికంగా సంసిద్ధమయ్యే వెసులుబాటు లభిస్తుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సైతం యోచిస్తోంది. చదవండి : డిజిటల్ హెల్త్ మంచిదే కానీ..
ఇక ఈ నిర్ణయంతో జనాభా పెరుగుదలనూ కట్టడి చేయవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది భవిష్యత్‌లో మహిళల ప్రసవంపై కూడా సానుకూల ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. సంతాన ప్రాధాన్యాలను, గర్భవతిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పిల్లల పెంపకంపై సాధికార నిర్ణయాలు తీసుకునే పరిణితి మహిళలకు సమకూరుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. చట్టబద్ధ వివాహ వయసును పెంచడం మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం, సాధికారతకు దారితీయడంతో పాటు సరైన జీవిత భాగస్వామిని ఎంచుకునే అవకాశం ఉంటుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఈ నిర్ణయం మహిళతో పాటు, పిల్లల ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుందని, మహిళల సామాజికార్థిక ఎదుగుదలకు దోహదం చేస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment