కోర్టులు నోటీసులిస్తున్నా మెట్టుదిగని ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: అటు సుప్రీంకోర్టు, ఇటు హైకోర్టు అక్షింతలు వేస్తున్నా.. నోటీసులు జారీ చేస్తున్నా సంక్షేమ పథకాలకు ‘ఆధార్’ నిబంధనపై రాష్ట్ర ప్రభుత్వం బెట్టువీడట్లేదు. తాజాగా బంగారుతల్లికి ఆధార్ నిబంధనను పునరుద్ధరిస్తూ ప్రభుత్వం సవరణ ఉత్తర్వులు జారీచేసింది. ఈ పథకం కింద పేరు రిజిస్టర్ చేసుకు నేందుకు ‘బంగారుతల్లి’ తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుని ఆధార్ నెంబర్ ఇవ్వా ల్సిందేనని మంగళవారం సెర్ప్ అధికారులు పేర్కొన్నారు.
అయితే ఈ ఏడాది డిసెంబర్ 31 వరకూ రిజిస్టర్ చేసుకునే దరఖాస్తుదారులు ఆధార్ నెంబర్‌ను నమోదు చేసేందుకు 3 నెలల గడువు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్‌పీటర్ జారీ చేసిన సవరణ ఉత్తర్వుల ప్రకారం.. ఆడపిల్ల జన్మించినట్లయితే ఆ వివరాలను ఆన్‌లైన్‌లో ఉండే ఫాం-2లో గ్రామ/వార్డు స్థాయి అధీకృత సిబ్బంది ద్వారా నమోదు చేయించాలి. ఇందుకు జనన, మరణ రిజిస్ట్రార్ చేత గ్రామపంచాయతీ లేదా వార్డు స్థాయిలో జారీ చేసే జనన ధ్రువీకరణ పత్రం, పుట్టిన పాపతోపాటు తల్లి లేదా సంరక్షకుని ఫోటోను ఇవ్వాలి. పుట్టిన పాప తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుని ఆధార్ నెంబర్, రేషన్‌కార్డు, బ్యాంకు అకౌంట్ కాపీల్ని సమర్పించాలి. దరఖాస్తును ఆన్‌లైన్‌లో పరిశీలించి ఆమోదించాలి.