20 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆధార్ ప్రత్యేక క్యాంపులు
సాక్షి, అమరావతి: ఇప్పటికే ఆధార్ కార్డు ఉన్నప్పటికీ.. కొత్త నిబంధనల ప్రకారం రాష్ట్రంలో 1,83,74,720 మంది తమ వివరాలను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉందని యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండియా తేల్చింది. చిన్న వయసులో ఆధార్ కార్డు పొందిన వారు అప్పట్లో నమోదు చేసుకున్న వేలిముద్రలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉండటంతో అలాంటి వారు 18 ఏళ్ల వయసు దాటిన అనంతరం మరోసారి కొత్తగా తమ వేలిముద్రలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉందని స్పష్టం చేసింది.
అలాంటి వారు 48,63,137 మంది ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంది. దీనికి తోడు.. ఎవరైనా ఆధార్‌కార్డు పొందిన తర్వాత పదేళ్ల కాలంలో కనీసం ఒక్కసారైనా ఆధార్‌లో అంతకు ముందు పేర్కొన్న అడ్రస్‌తో పాటు ఫొటోలను తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాల్సి ఉండగా.. ఆ కేటగిరిలో 1,35,07,583 మంది వివరాలను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంది.
ఐదు రోజులపాటు ఆధార్ ప్రత్యేక క్యాంపులు
ఇటీవల జన్మించిన వారికి తొలిసారి ఆధార్‌కార్డుల జారీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా గతంలో ఆధార్ కార్డులు తీసుకుని నిబంధనల ప్రకారం తమ వివరాలను మరోసారి తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాల్సిన 1.83 కోట్ల మంది కోసం ఈ నెల 20 నుంచి ఐదు రోజుల పాటు ప్రభుత్వం మరోసారి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనుంది.
దేశవ్యాప్తంగా ఆధార్ జారీచేసే యూఐడీఏఐ సంస్థ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం గతరెండేళ్లుగా ప్రతినెలా గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆ«ధ్వర్యంలో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తుంది. ఆగస్టులో ఆధార్ ప్రత్యేక క్యాంపుల నిర్వహణకు సంబంధించి గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
అవసరమైనచోట కాలేజీలు, పాఠశాలలతోపాటు అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ ప్రత్యేక క్యాంపుల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని.. తగిన ప్రచారం కల్పించడానికి కలెక్టర్లు చర్యలు చేపట్టాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment