గద్దె నెక్కిస్తే చోరీ చేస్తారా? | Ap people fire on cm chandrababu for Bank accounts and aadhaar details abduction | Sakshi
Sakshi News home page

గద్దె నెక్కిస్తే చోరీ చేస్తారా?

Published Fri, Mar 8 2019 2:11 AM | Last Updated on Thu, Mar 28 2019 5:27 PM

Ap people fire on cm chandrababu for Bank accounts and aadhaar details abduction - Sakshi

►ముఖ్యమంత్రి ఎవరు? నా బ్యాంకు ఖాతాల వివరాలను దొంగిలించడానికి? వాటినిప్రైవేటు వ్యక్తులకు అందించడానికి?

►ముఖ్యమంత్రి ఎవరు?  నా ఆధార్‌ కార్డు వివరాలు దొంగతనం చేయడానికి? వాటిని టీడీపీకి యాప్‌ను తయారుచేసిన ఐటీ కంపెనీకి ఇవ్వడానికి? 

►ముఖ్యమంత్రి ఎవరు?  భారతీయ ఎన్నికల సంఘం వద్ద రహస్యంగా ఉండాల్సిన కలర్‌ ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితా తస్కరించడానికి? తన పార్టీ అవసరాల కోసం ఒక ప్రైవేటు ఐటీ కంపెనీకి ఇవ్వడానికి?

సాక్షి, అమరావతి: ఇప్పుడు రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజలు సంధిస్తున్న ప్రశ్నలివి? తమ వ్యక్తిగత సమాచారం పోయిందన్న ఆందోళన, ఆగ్రహంతో వేస్తున్న ప్రశ్నలివి. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన బ్యాంకు ఖాతాల సమాచారంతో పాటు పూర్తి వ్యక్తిగత సమాచారం ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లడం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టిస్తోంది. తాము ఎన్నుకున్న ప్రభుత్వం తమకు ధర్మకర్తగా ఉండాల్సింది పోయి తమకు సంబంధించిన పూర్తి వ్యక్తిగత సమాచారం ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం ధర్మమా? అని యావత్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం  ప్రశ్నిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన బ్యాంకు ఖాతాల వివరాలు, వ్యక్తిగత సమాచారం ఒక ప్రైవేటు కంపెనీ కలిగి ఉన్నందుకు, ఆ కంపెనీపై అందిన ఫిర్యాదు మేరకు తెలంగాణ ప్రభుత్వం కేసు నమోదు చేస దర్యాప్తు కోసం సిట్‌ను వేసిన సంగతి తెలిసిందే. తమ ప్రజల సమాచార భద్రతకు సంబంధించిన ఇటువంటి కేసుల్లో తన వంతు ధర్మంగా సహకరించాల్సిన ఏపీ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఎదురుదాడి చేయడం విస్మయం కలిగిస్తోంది. అసలు కీలకమైన డేటాను ఎలా దొంగిలించారు? దీనికి బాధ్యులు ఎవరు? కేసులేమిటి అనేది ఒకసారి పరిశీలిస్తే.. 

ప్రైవేటు చేతిలో రెండు రాష్ట్రాల డేటా  
ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆధార్, బ్యాంకు అకౌంట్ల వివరాలతో పాటు పల్స్‌ సర్వే, ఆర్టీజీఎస్‌ వివరాలు, కులం, మతం, ప్రభుత్వ పథకాల ద్వారా అందిన లబ్ధి, రాజకీయ పార్టీలపై అభిప్రాయం ఇలా పలు అంశాలతో కూడిన డేటాను ఐటీ గ్రిడ్స్‌ అనే ప్రైవేటు కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించడం, అవి తెలుగుదేశం పార్టీకి చెందిన సేవామిత్ర యాప్‌లో కూడా ఉండటం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తమకు అందిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌లోని ఈ ఐటీ గ్రిడ్స్‌లో తెలంగాణ పోలీసులు సోదాలు నిర్వహించగా విస్తుగొలిపే అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రత్యర్థి పార్టీల ఓట్లను తొలగించడానికి, ఓటర్లను పెద్ద ఎత్తున ప్రలోభ పెట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలుగుదేశం పార్టీ చాలా పెద్ద ప్రణాళికతోనే ఈ వ్యవహారాన్ని చాపకింద నీరులా నడిపించినట్లు పోలీసులు విచారణలో తేలుతోంది. అలాగే చంద్రబాబు డేటా చోరీ వ్యవహారం ఒక్క ఆంధ్రప్రదేశ్‌ ప్రజల వరకే పరిమితం కాలేదని, తెలంగాణ రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారం కూడా దొంగిలించినట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలుతుండడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా నివ్వెరపోతోంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లోనూ ఫలితాలను తారుమారు చేయించడానికి చంద్రబాబునాయుడు, తెలుగుదేశం పార్టీ భారీ కుట్రకు ప్రయత్నించారని అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ డేటా చోరీ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ చేసి దోషులెవరో తేల్చాలని నిర్ణయించింది. 

పల్స్‌ సర్వే పేరుతో స్మార్ట్‌గా కోట్టేశారు.. 
2014 ఎన్నికల సమయంలోనే చంద్రబాబునాయుడు అడ్డదారుల్లో ప్రత్యర్థి పార్టీ ఓట్ల తొలగింపు ప్రణాళికను రూపొందించినట్లు తెలుస్తోంది. సరిగ్గా తాను అధికారం చేపట్టే నాటికే తనకు కావలసిన ఐటీ కంపెనీలను సిద్ధం చేయించుకొని తెలుగుదేశం వ్యతిరేక ఓటర్లను తొలగించే ప్రణాళికను అమల్లోకి తెచ్చినట్లు అనుమానిస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే చేసిన పనులు గమనిస్తే అవన్నీ నిజమేననిపిస్తాయి. ఆ పనులేంటంటే..  

►అధికారంలోకి రాగానే చంద్రబాబు ప్రజాసాధికార సర్వేను ప్రభుత్వం ద్వారా చేయించారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ప్రభుత్వ సిబ్బందిని పంపి వారి వ్యక్తిగత వివరాలన్నీ సేకరించారు. కులం, మతం, ఆర్థిక స్థితిగతులు, పిల్లలు, వారు చేస్తున్న ఉద్యోగాలు, ఆధార్, బ్యాంకు ఖాతాల సమాచారం, అందిన ప్రభుత్వ పథకాలు, వారికి రాజకీయంగా ఉన్న సంబంధ బాంధవ్యాలు.. ఇలా అన్ని రకాల వివరాలను సేకరింపజేసింది.  

►వీటిని స్టేట్‌ రెసిడెంట్స్‌ డేటా (రాష్ట్రంలో నివసించేవారి సమాచారం) హబ్‌లో నిక్షిప్తం చేసింది. రియల్‌ టైమ్‌ గవర్నెన్సు (ఆర్టీజీఎస్‌) సర్వర్లలో భద్రపరిచింది.  

►ఈ ఆర్టీజీఎస్‌ సీఈఓగా ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు అత్యంత నమ్మకస్తుడైన అహ్మద్‌ బాబును నియమించుకున్నారు. ప్రజాసాధికార సర్వే సమాచారం ఆధారంగా ఆర్టీజీఎస్‌ మళ్లీ ఆయా ప్రజానీకానికి ఫోన్లు చేసి పథకాల అమలు తీరు, ప్రభుత్వంపై వారికి ఉన్న సంతృప్తి, అసంతృప్తి తదితర వివరాలను సేకరించింది. 
బ్లూ ఫ్రాగ్‌ చేతిలో 27 ప్రభుత్వ శాఖల సమాచారం 

►ప్రజాసాధికార సర్వే సమాచారాన్ని, తాను ఫోన్ల ద్వారా సాగించిన సర్వే వివరాలతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని కూడా ఆర్టీజీఎస్‌ సమీకరించి బ్లూ ఫ్రాగ్‌ సంస్థకు అందించింది. దాదాపు 27 రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో బ్లూ ఫ్రాగ్‌ సేవలు కొనసాగుతున్నాయి. 

►ప్రజాసాధికార సర్వే, ఆర్టీజీఎస్‌ నిర్వహించిన సర్వే వివరాలతో పాటు దాదాపు 27 శాఖల సమాచారం ఈ బ్లూ ఫ్రాగ్‌ సంస్థ చేతుల్లో ప్రభుత్వం పెట్టింది.  

►ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌లు తమకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న దాకవరపు అశోక్‌ ద్వారా ఐటీ గ్రిడ్స్‌ సంస్థను ఏర్పాటు చేయించి దానికి బ్లూ ఫ్రాగ్‌ సంస్థ ద్వారా ప్రభుత్వ సమాచారం యావత్తూ తరలింపజేశారు. అలాగే ఎన్నికల సంఘం వద్ద మాత్రమే ఉండాల్సిన కలర్‌ ఫొటోలతో కూడిన ఓటరు జాబితాను కూడా ఐటీ గ్రిడ్స్‌ సంస్థకు తరలింపజేశారు. 
సేవామిత్ర యాప్‌తో అభిప్రాయ సేకరణ 

►ఐటీ గ్రిడ్స్‌ సంస్థ తెలుగుదేశానికి సేవామిత్ర యాప్‌ను రూపొందించి సర్వేలు చేయిస్తోంది. తమకు ఆర్టీజీఎస్‌ ద్వారా అందిన సమాచారం ఆధారంగా ఫోన్లు చేసి ప్రజలనుంచి పలు అంశాలపై వారి అభిప్రాయాలను సేకరించింది. దాన్ని రాష్ట్రంలో తెలుగుదేశం ఏర్పాటు చేయించిన సేవామిత్రులకు పంపి ప్రజలనుంచి నేరుగా ఆయా అంశాలపై అభిప్రాయ సేకరణ జరిపించింది.  

►సేవా మిత్రులనుంచి వచ్చిన సమాచారాన్ని ఐటీ గ్రిడ్స్‌ సంస్థ లోతుగా విశ్లేషించి వారిలో ప్రభుత్వ అనుకూలురు ఎవరు? ప్రతికూలురు ఎవరు? అన్న సమాచారాన్ని బూత్‌ స్థాయిలోని టీడీపీ ముఖ్య నాయకులకు అందజేసింది. 

ఓట్లు ఇలా తొలగించేశారు.. 
టీడీపీ ముఖ్యనేతలు ఎక్కడికక్కడ టీడీపీ ప్రతికూల ఓట్లను తొలగించేలా జిల్లా స్థాయిలోని ఎన్నికల అధికారులకు అభ్యర్థనలు అందించారు. వీటి పరిశీలనకు బూత్‌ స్థాయిలో పరిశీలకులుగా తామే కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో నియమించిన అంగన్‌వాడీలు, ఆశావర్కర్లు, ఇతర సిబ్బందిని వినియోగించుకోవడం ద్వారా తప్పుడు నివేదికలు రూపొందింపచేశారు. ఎమ్మార్వోల అనుమతితో తమ ప్రతికూల ఓటర్ల పేర్లను జాబితానుంచి తొలగిస్తూ వచ్చారు. ఈ ప్రక్రియను చంద్రబాబునాయడు, ఆయన బృందం గతకొన్నేళ్లుగా ఒక పథకం ప్రకారం కొనసాగించి లక్షలాది టీడీపీ ప్రతికూల ఓట్లను గల్లంతు చేయించింది. 

కలర్‌ ఫోటోలతో కూడిన జాబితా ఎలా వచ్చింది? 
మీరెప్పుడైనా ఓటర్ల జాబితాలో కలర్‌ ఫోటోలను చూశారా?  కేవలం కేంద్ర ఎన్నికల సంఘం మాస్టర్‌ డేటాలో మాత్రమే ఈ కలర్‌ ఫోటో ఉంటుంది. మిగతా ఎవరి దగ్గరైనా బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటోతో కూడిన ఓటరు జాబితా మాత్రమే ఉంటుంది. మరి ప్రైవేటు సంస్థలైన బ్లూ ఫ్రాగ్, ఐటీ గ్రిడ్స్‌ సంస్థలకు కలర్‌ ఫోటోలతో కూడిన ఓటరు జాబితా ఎలా వచ్చింది? అనేది తేలాల్సి ఉంది. 

ప్రతిపక్షానికి సాధ్యమా? 
ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం రెండూ కూడా తాము ఇవ్వలేదని చెప్పాయి. మరి ఐటీ కంపెనీలకు ఈ జాబితా ఎవరు ఇచ్చారు? ప్రతిపక్ష పార్టీలు దగ్గర ఈ సమాచారం ఉండే అవకాశమే లేదు. దీనినబట్టి చూస్తే అధికార తెలుగుదేశం పార్టీనే ఈ డేటాను చోరీ చేసిందని తెలుస్తూనే ఉంది. ఈ ముఖ్య విషయంతో పాటు ఐటీ గ్రిడ్స్, బ్లూ ఫ్రాగ్, జన్మభూమి కమిటీలు, అంగన్‌వాడీ వర్కర్లు, సేవామిత్రల పాత్ర దర్యాప్తులో తేలాల్సి ఉంది.  

అడ్డంగా దొరికి ఎదురుదాడి 
చంద్రబాబునాయుడు, ఆయన బృందం సైబర్‌ నేరానికి పాల్పడినట్లు తేటతెల్లమవుతున్నా మళ్లీ ఎప్పటిలాగే బుకాయింపు మాటలు మాట్లాడుతున్నారు. దీనిని తెలంగాణ, ఏపీ మధ్య వివాదంగా సృష్టిస్తున్నారు. తమ డేటా పోలేదని ఒకసారి, దొంగిలించారని మరోసారి, అది పార్టీకి చెందిన 65 లక్షల మంది డేటా అని ఇంకోసారి ప్రకటనలు చేస్తూ చివరకు మంత్రులతో ఎదురు కేసు పెట్టించారు. నిజానికి పార్టీ డేటా పోతే ఆ డేటాను ఎవరికి అప్పగించారో ఆ ఐటీ గ్రిడ్స్‌ సంస్థపై, ఆ సంస్థ ఎమ్‌డీ దాకవరపు అశోక్‌పై వారు కేసు పెట్టాలి. ఆ సంస్థ హైదరాబాద్‌లో ఉంది కనుక హైదరాబాద్‌లో కేసు నమోదు చేయించాలి. చంద్రబాబు అలా చేయకుండా గుంటూరులో కేసు పెట్టించారు. ఐటీ గ్రిడ్స్‌ సంస్థలో ఆ చోరీ జరిగి ఉంటే అశోక్‌ చేత హైదరాబాద్‌లో పోలీసు కేసు పెట్టించాలి. అదేమీ చేయకుండా అశోక్‌ను చంద్రబాబునాయుడు ఎందుకు వెనకేసుకు వస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే. పైగా పార్టీ సమాచారం పోయిందని చెబుతున్న చంద్రబాబునాయుడు ఆ ప్రైవేటు సమాచారంపై ప్రభుత్వం ద్వారా అత్యున్నత స్థాయిలో సిట్‌లు ఏర్పాటుచేయడం చూసి జనం విస్తుపోతున్నారు. పోలీసు శాఖను తెలుగుదేశం పార్టీ జేబు సంస్థగా బాబు మార్చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

ప్రజలకు భరోసా ఇవ్వకుండా.. 
తమ వ్యక్తిగత సమచారం పోయిందని ప్రజల మనసుల్లో ఉన్న ఆందోళన, భయాన్ని తొలగించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు అవేమీ చేయకుండా తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత జగన్, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యంగా ఆరోపణలు చేస్తూ కాలక్షేపం చేయడం గర్హనీయం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement