ప్రాచీన చైనా యుద్ధ నిపుణుడు సన్ జూ శత్రువును గెలవడం ఎలాగో ‘యుద్ధ కళ’ అనే గ్రంథంలో వివరించాడు. శత్రువును గందరగోళ పరచడంలోనే విజయ రహస్యమంతా ఇమిడి ఉన్నదని, అలా గందరగోళపరిస్తే మన అసలు ఉద్దేశం గ్రహించలేని దుస్థితిలో శత్రువు పడతాడని అంటాడు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా తన జీవితంలో అత్యంత గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నానని, ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ అధికారం దక్కే అవకాశం లేదని చాన్నాళ్లక్రితమే స్పష్టంగా అర్ధమైన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సన్ జూ చెప్పిన ఈ సూత్రాన్ని బాగా ఒంటబట్టించుకు న్నారు. దాన్నే నమ్ముకుని రకరకాల టక్కుటమార విద్యలను ప్రదర్శిస్తున్నారు. బీజేపీపై ‘నకిలీ యుద్ధ భేరి’ మోగించి, కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి ధర్మపోరాట దీక్షలు సాగిస్తు న్నారు. తనను ఓడించడానికి ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలు ఒక్కటయ్యారంటూ ఎక్కడలేని హడావుడీ చేస్తున్నారు.
ఇవన్నీ జనం దృష్టి మళ్లించడానికి చేస్తున్న ప్రయత్నాలు. ఇదే సమయంలో ఆయన ‘సందట్లో సడేమియా’గా ఆంధ్రప్రదేశ్‌లోని మూడున్నర కోట్లమంది ఓటర్ల వ్యక్తిగత సమా చారం మొత్తాన్ని ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టారు. ఈ డేటాను కులాలవారీగా, మతాలవారీగా వర్గీకరించి... పోలింగ్ కేంద్రాలవారీగా విభజించి... వారిలో లబ్ధిదారులెవరో, కానివారెవరో తేల్చి.. వారు ఎవరికి ఓటేసే అవకాశమున్నదో అంచనా వేయడం ఆ సంస్థల పని. దాని సాయంతో వ్యతిరేకులని భావించినవారిని బెదిరించి దారికి తెచ్చుకోవడం లేదా వారి ఓట్లను తొలగించడం తెలుగుదేశం ఆంతర్యం. ఈ డేటా తెలుగుదేశం కార్యకర్తల ఫోన్లలో ‘సేవామిత్ర’ యాప్ కింద లభ్య మయ్యే ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం వ్యక్తిగత సమాచారం సమస్తం తెలుగుదేశం గుప్పెట్లోకి పోయింది. కేవలం ఎన్నికల సంఘం దగ్గర మాత్రమే ఉండాల్సిన ఓటర్ల కలర్ ఫొటోలతో కూడిన జాబితా అన్యుల చేతుల్లోకి పోవడమే కాక, ఆ జాబితాను ఆధార్ డేటాతో అనుసంధానించడంతో ఓటర్ల బ్యాంకు ఖాతాల లావాదేవీలు, వారి ఆస్తులు, అప్పుల వివరాలు సైతం ఇప్పుడు బజార్నపడ్డాయి. ఇటీవల నైజీరియా తదితర దేశాల ముఠాలు మన పౌరుల వ్యక్తి గత డేటా చౌర్యం చేసి వారి బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును సునాయాసంగా ఖాళీ చేస్తున్నాయి. ఇప్పుడు చంద్రబాబు కనుసన్నల్లో సాగిన ఈ డేటా చౌర్యం పర్యవసానంగా ఇదంతా ‘జాతీయం’ అయిన దాఖలాలు కనిపిస్తున్నాయి.
ఎన్‌టీ రామారావు నుంచి అధికారం గుంజుకున్న నాటినుంచీ బాబు ఇలాంటి పోకడలకే పోతు న్నారు. తన అధికారానికి అడ్డొస్తారని లేదా ముప్పు తెస్తారని భావించినవారిని ఆయన రాజకీయ ప్రత్యర్థులుగా చూడరు. శత్రువులుగా పరిగణిస్తారు. అది మొదలుకొని వారిని అణగదొక్కడానికి ఏం చేయాలో వ్యూహం రచిస్తారు. ఏడేళ్లక్రితం జగన్‌మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలతో కుమ్మక్కయి సీబీఐతో తప్పుడు కేసులు బనాయించడమైనా... గత అక్టోబర్‌లో విశాఖ విమా నాశ్రయంలో జగన్ మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరగడమైనా గమనిస్తే ఇదంతా అర్ధమ వుతుంది. దొంగే ‘దొంగ.. దొంగ’ అని అరిచినప్పుడు అసలు దొంగ ఎవరో అందరూ తెలుసుకోవడానికి కాస్త సమయం పడు తుంది. కన్నంలో దొంగ కన్నంలోనే పట్టుబడినప్పుడు అలాంటి గందరగోళానికి ఆస్కారం ఉండదు. కానీ అలా పట్టుబడినా బాబు ప్రజానీకాన్ని ఏమార్చే ప్రయత్నం చేస్తారు. తన అనుకూల మీడియా సాయంతో ప్రత్యర్థులపై తప్పుడు ఆరోపణలు కుమ్మరించి ప్రజల్ని పక్కదోవ పట్టించేం దుకు చూస్తారు.
గతంలో ‘ఓటుకు కోట్లు’ కేసు సందర్భంగా ఈ పనే చేశారు. ఇప్పుడు టీడీపీ ఓట్ల తొలగింపునకు భారీ కుట్ర జరుగుతోందంటూ కథనాలు వెలువడుతున్నాయి. నిజానికి టీడీపీ అక్రమాల నిడివెంతో, లోతెంతో మొదట్లో చాలా మందికి అవగాహన కాలేదు. తమ వ్యతిరేకుల ఓట్లు తొల గించడానికే చంద్రబాబు అండ్ కో ఇదంతా చేస్తున్నారని మొదట్లో అందరూ అనుకున్నారు. కానీ పలు మార్గాల్లో లక్షల సంఖ్యలో దొంగ ఓటర్లను కూడా సృష్టిస్తున్నారని తెలిసి ఆశ్చర్య పోయారు. ఈ అక్రమాలపై గత నెల 5న జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం కేంద్ర ఎన్నికల సంఘానికి సవివరమైన వినతిపత్రం సమర్పించింది. కానీ తాజాగా బద్దలైన స్కాం గమనిస్తే ఎలాంటివారైనా గుండెలు బాదుకోవాల్సిందే. తెలుగుదేశం చేసిన ఘనకార్యంతో మూడున్నర కోట్లమంది బ్యాంకు ఖాతాలు ప్రమాదంలో పడ్డాయి. వారు పాస్‌వర్డ్‌లు మార్చుకుంటే తప్ప వారి సొమ్ముకు గ్యారెంటీ లేని దుస్థితి ఏర్పడింది.
మాయల ఫకీర్ ప్రాణం చిలుకలో ఉన్నట్లు... హైదరాబాద్‌లో ఐటీ గ్రిడ్ కంపెనీ చేసిన డేటా చౌర్యం గురించి ఆరా తీస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లిలో సోమవారం జరిగిన సభలో చంద్ర బాబు తలా తోకా లేకుండా మాట్లాడిన తీరు చూస్తే ఆయనా, ఆయన పుత్రరత్నం లోకేష్ ఈ వ్యవహారంలో ఎంతగా కూరుకుపోయారో అర్ధమవుతుంది. చేసిన పనికి సరైన సంజాయిషీ ఇవ్వ కుండా ‘మూలాలు పెకిలిస్తా’, ‘తోకలు కత్తిరిస్తా’, ‘ఎక్కడా తిరగనివ్వను’, ‘ఖబడ్దార్ జాగ్రత్త’ వంటి బెదిరింపులతో దీన్నుంచి బయటపడదామని బాబు వృధా ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్‌కు ఏపీ పోలీసులను పంపి హడలెత్తించాలని చూస్తున్నారు. సామాజిక కార్యకర్త లోకేశ్వరరెడ్డి ఇంతటి భారీ స్కాంను బయటపెట్టి ప్రజానీకానికి ఎంతో మేలు చేశారు. ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేసి కారకులెంతటివారైనా పకడ్బందీ కేసులు పెట్టి తగిన శిక్షపడేలా చూడాల్సిన బాధ్యత తెలంగాణ పోలీసులపై ఉంది. అలాగే ఇంతవరకూ ఈ వ్యవహారంపై మౌనంగా ఉండిపోయిన ఎన్నికల సంఘం, ఆధార్ ప్రాధికార సంస్థలు సైతం నోరు విప్పి తమ వంతు చర్యలేమిటో చెప్పాలి. దేశంలో ప్రజాస్వామ్యం భ్రష్టు పట్టకుండా కాపాడాల్సిన బాధ్యత అన్ని వ్యవస్థలపైనా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment