డేటా దొంగలకు ఢిల్లీ లింక్‌! | Delhi link to data thieves | Sakshi
Sakshi News home page

డేటా దొంగలకు ఢిల్లీ లింక్‌!

Published Thu, Apr 18 2019 3:52 AM | Last Updated on Thu, Apr 18 2019 8:31 AM

Delhi link to data thieves - Sakshi

సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో కోట్ల మంది ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. 2019 ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు దీర్ఘకాలిక పన్నాగాన్ని పక్కాగా అమలు చేసినట్లు అధికార వర్గాలు గుర్తించాయి. సీఎం చంద్రబాబు ఢిల్లీ స్థాయిలో ఏకంగా ఆధార్‌ అథారిటీ నుంచే కథ నడిపించినట్లు విశ్వసనీయ సమాచారం. అందువల్లే రెండు తెలుగు రాష్ట్రాల్లోని 7.82 కోట్ల మంది ప్రజల సమాచారాన్ని అంత పక్కాగా తస్కరించగలిగారని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

2015 నుంచే పన్నాగం...
2019 ఎన్నికలే లక్ష్యంగా ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం టీడీపీ గుప్పిట్లోకి వచ్చేలా 2015లోనే చంద్రబాబు పథక రచన చేశారు. ముందస్తు వ్యూహంతోనే ఆధార్‌ అథారిటీ ఛైర్మన్‌గా ఉన్న జె.సత్యనారాయణను రాష్ట్ర ప్రభుత్వ ఈ–గవర్నెన్స్, ఐటీ సలహాదారుగా నియమించడం గమనార్హం. ఇలా జోడు పదవుల్లో ఉండటం పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందని పలువురు అభ్యంతరం వ్యక్తం చేసినా చంద్రబాబు లెక్క చేయలేదు. 

టీడీపీ కార్యాలయానికి కోట్ల మంది వ్యక్తిగత వివరాలు..
రాష్ట్ర ప్రభుత్వం 2016లో ప్రజాసాధికార సర్వే నిర్వహించి ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించింది. దాన్ని రియల్‌ టైమ్‌ గుడ్‌ గవర్నెన్స్‌(ఆర్టీజీఎస్‌) ద్వారా టీడీపీకి అనుబంధంగా పని చేస్తున్న ఐటీ గ్రిడ్స్‌ సంస్థకు చేరవేసింది. సాధికారిక సర్వేలో సేకరించిన సమాచారాన్ని మించి ప్రజల వ్యక్తిగత వివరాలు తమ గుప్పిట్లో పెట్టుకోవడం ద్వారా 2019 ఎన్నికల్లో ఓటరు జాబితాలో అక్రమాలకు పాల్పడేందుకు వ్యూహం రచించింది. తెలంగాణ ప్రజల సమాచారం ఏపీ ప్రభుత్వం వద్ద లేకపోవడంతో ఏకంగా ఆధార్‌ అథారిటీ నుంచే కథ నడిపించాలని చంద్రబాబు నిర్ణయించారు. అనుకున్న విధంగానే ఢిల్లీలోని ఆధార్‌  అథారిటీ నుంచి టీడీపీకి పూర్తి స్థాయిలో సహకారం లభించినట్లు  సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 7.82 కోట్ల మంది ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని గుట్టుచప్పుడు కాకుండా టీడీపీకి చేరవేశారు. పేర్లు, చిరునామా, బ్యాంకు ఖాతాలు, ఓటరు కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్, పాన్‌ కార్డ్, కుటుంబ సభ్యుల వివరాలు ఇలా మొత్తం వ్యక్తిగత సమాచారం అనధికారికంగా టీడీపీ కార్యాలయానికి చేరిపోయింది. 

సైబర్‌ నేరాలకు ఊతం
తెలుగు రాష్ట్రాల్లోని 7.82 కోట్ల మంది ప్రజల వ్యక్తిగత సమాచారం నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు సంస్థలకు చేరడంపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. వీరిలో శాస్త్రవేత్తలు, రక్షణ పరిశోధనా సంస్థలు, త్రివిధ దళాల అధికారులు, సిబ్బంది వివరాలు కూడా ఉండటంతో ఈ వ్యవహారం అత్యంత సున్నితంగా మారింది. ఇది సైబర్‌ నేరాలకు ఊతమివ్వడంతోపాటు దేశ రక్షణకు ప్రమాదకరంగా మారిందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. శత్రు దేశాలకు ఈ సమాచారం చేరితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. 


మంత్రి లోకేష్‌తో అశోక్‌ (ఫైల్‌) 

ఇంటి దొంగల హస్తం! 
ప్రజల వ్యక్తిగత సమాచారం అనధికారిక వ్యక్తుల చేతికి చిక్కడం అంటే పార్లమెంటులో చేసిన ఆధార్‌ చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. ఆధార్‌ సమాచారం బయటకు పొక్కడంపై ఇప్పటికే సుప్రీం కోర్టులో పలు వ్యాజ్యాలు విచారణలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆధార్‌ అథారిటీ రంగంలోకి దిగి కోట్ల మంది వ్యక్తిగత వివరాలు ప్రైవేట్‌ సంస్థల చేతుల్లోకి ఎలా వెళ్లాయనే అంశాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. దీని వెనుక ఇంటి దొంగల హస్తం ఉండవచ్చని అంచనా వేస్తోంది. ఇందుకు బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఆధార్‌ అథారిటీ డేటా చోరీపై ఇటీవల హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు అంతర్గత విచారణ కూడా చేపట్టినట్లు తెలుస్తోంది. 

దర్యాప్తు వేగవంతం..
డేటా చోరీపై తెలంగాణా పోలీసుల దర్యాప్తుతోపాటు ఆధార్‌ అథారిటీ అంతర్గత విచారణ కూడా ముమ్మరంగా సాగుతోంది. దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కేంద్ర హోంశాఖ పట్టుదలతో ఉంది. కొద్ది రోజుల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటాయని ఆధార్‌ అథారిటీ, పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి.

డేటా తస్కరించిన పార్టీపై కఠిన చర్యలు తీసుకోవాలి
–  ఈఏఎస్‌ శర్మ,, కేంద్ర ఇంధన శాఖ రిటైర్డ్‌ కార్యదర్శి
తెలుగు రాష్ట్రాల్లోని 7.82 కోట్ల మంది వ్యక్తిగత సమాచారం ఐటీ గ్రిడ్స్‌ సంస్థకు చేరడం వెనుక ఆధార్‌ అథారిటీ పెద్దల పాత్ర  కచ్చితంగా ఉంటుందని కేంద్ర ఇంధన శాఖ రిటైర్డ్‌ కార్యదర్శి ఈఏఎస్‌ శర్మ పేర్కొన్నారు. ఆధార్‌ అథారిటీ అధికారుల పాత్ర లేకుండా కీలక సమాచారం అనధికారిక వ్యక్తుల చేతుల్లోకి చేరడం అసంభవమని అభిప్రాయపడ్డారు. ఈమేరకు ఆయన కేంద్ర ఐటీ శాఖకు ఓ లేఖ రాశారు. ఆధార్‌ అథారిటీ చైర్మన్‌గా ఉన్న జె.సత్యనారాయణను ఏపీ ప్రభుత్వ ఐటీ సలహాదారుగా నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తాను గతంలోనే కేంద్ర ఐటీ శాఖకు లేఖ రాసినట్లు గుర్తు చేశారు. అయినప్పటికీ సత్యనారాయణ నియామకాన్ని పునఃసమీక్షించకపోవడాన్ని తప్పుబట్టారు. ఐటీ గ్రిడ్స్‌తోపాటు ఆధార్‌ అథారిటీ అధికారుల పాత్రపైనా విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించిన రాజకీయ పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం, ఆధార్‌ అథారిటీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

మా సర్వర్లు భద్రం: యూఐడీఏఐ
తమ సర్వర్లు పూర్తి భద్రంగానే ఉన్నాయని ఆధార్‌ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యూఐడీఏఐ బుధవారం ‘పీటీఐ’ వార్తా సంస్థకు విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. సెంట్రల్‌ ఐడెంటిటీస్‌ డేటా రిపోసిటరీ (సీఐడీఆర్‌), ఇతర సర్వర్లు సురక్షితంగానే ఉన్నాయని తెలిపింది. తమ సర్వర్ల నుంచి ఎలాంటి డేటా చౌర్యానికి గురి కాలేదని అందులో పేర్కొంది. 

ఐటీ గ్రిడ్స్‌ అశోక్‌కు టీడీపీ సర్కార్‌ షెల్టర్‌
డేటా చోరీ కేసులో టీడీపీ సేవామిత్ర యాప్‌ను నిర్వహించే ఐటీ గ్రిడ్స్‌ సంస్థపై ఉచ్చు బిగుస్తోంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌ ప్రక్రియ ముగియడంతో డేటా చోరీ కేసులో దర్యాప్తును తెలంగాణ పోలీసులు ముమ్మరం చేశారు. ఐటీ గ్రిడ్స్‌ ఎండీ డి.అశోక్‌ కుమార్‌తోపాటు తెరవెనుక సూత్రధారులపై తెలంగాణ సిట్‌ దృష్టి సారించింది. ఆధార్‌తోపాటు మరో 17 రకాల వ్యక్తిగత సమాచారం చోరీకి గురైనట్లు కొద్ది రోజుల క్రితం ఆధార్‌ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్‌ భవానీప్రసాద్‌ మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆధార్‌తోపాటు ప్రజల వ్యక్తిగత సమాచారం కూడా చోరీకి గురైనట్టు ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ (ఎఫ్‌ఎస్‌ఎల్‌) నిగ్గు తేల్చి ఇప్పటికే ప్రాథమిక నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో పక్కా ఆధారాలతో అశోక్‌ కోసం తెలంగాణ పోలీసులు అన్వేషిస్తున్నారు. ఇప్పటికే మూడు సార్లు నోటీసులు ఇచ్చినా అశోక్‌ లొంగిపోకపోవడంతో అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైంది. అశోక్‌తోపాటు ఆయనకు సహకరించిన మరికొంత మందిని కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. 

ఏబీ పర్యవేక్షణలోనే ఆశ్రయం!
మరోవైపు అశోక్‌ తెలంగాణ పోలీసులకు చిక్కితే తమ బండారం బయటపడుతుందనే భయంతో ఆయన్ను టీడీపీ సర్కారే కాపాడుతోందనే అనుమానాలు బలపడుతున్నాయి. ప్రభుత్వం వద్ద ఉండాల్సిన ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం  సేవామిత్ర యాప్‌ కోసం తరలించి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేశ్‌ దోషులుగా నిలబడే పరిస్థితి రావడంతో అశోక్‌ను రహస్య ప్రదేశంలో దాచినట్లు చెబుతున్నారు. ఎన్నికల ముందు వరకు ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలోనే అశోక్‌కు ప్రభుత్వం షెల్టర్‌ ఇచ్చినట్టు ఆరోపణలున్నాయి. సీఎం సామాజిక వర్గానికి చెందిన విజయవాడ వ్యక్తి మేఘాలయ యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌గా ఉండటంతో ఆయన పర్యవేక్షణలో తొలుత అశోక్‌ను ఉంచినట్టు ప్రచారం జరిగింది. అనంతరం విజయవాడ గొల్లపూడిలోని ఇంటెలిజెన్స్‌ అతిధిగృహంలో అశోక్‌ను పోలీసుల రక్షణ నడుమ కొద్ది రోజులు దాచినట్టు తెలిసింది. తరువాత ఏపీఎస్‌పీ 6వ బెటాలియన్‌లో అశోక్‌కు షెల్టర్‌ ఇచ్చినట్టు పోలీసు వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన తరువాత నిఘా చీఫ్‌గా ఏబీ వెంకటేశ్వరరావును తప్పించినా చంద్రబాబు కోసం అశోక్‌ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని షెల్టర్‌ ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది. 

పోలింగ్‌కు ముందు రోజు సేవామిత్రతో సూచనలు 
డేటా స్కామ్‌ బయట పడిన మరుక్షణమే మూసివేసిన టీడీపీ సేవామిత్ర యాప్‌ను పోలింగ్‌కు ఒక రోజు ముందు మళ్లీ పని చేయించడం గమనార్హం. టీడీపీ కార్యకర్తలు, బూత్‌ కన్వీనర్లకు ఓటింగ్‌పై సూచనలు ఇచ్చేందుకు సేవామిత్ర యాప్‌ను వినియోగంలోకి తెచ్చారు. అజ్ఞాతంలో ఉన్న అశోక్‌ డైరెక్షన్‌లోనే మళ్లీ సేవామిత్ర యాప్‌ సేవలను అందుబాటులోకి తెచ్చినట్టు తెలంగాణ పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. గత నాలుగు రోజులుగా అశోక్‌ను ఎక్కడకు తరలించారనే అంశంపై తెలంగాణ పోలీసు ప్రత్యేక బృందాలు దృష్టి సారించినట్టు తెలిసింది. ఈ కేసులో కీలకంగా మారిన అశోక్‌ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, ఆయన స్వచ్ఛందంగా లొంగిపోతే మంచిదనే చర్చ ఏపీ పోలీసు వర్గాల్లోనే జరుగుతోంది.

ఇతర రాష్ట్రాల డేటా సైతం చోరీ
సాక్షి, హైదరాబాద్‌: డేటా చౌర్యం కేసులో ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ (ఎఫ్‌ఎస్‌ఎల్‌) ఇచ్చిన నివేదికలో ఏపీ, తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల ఆధార్‌ వివరాలు కూడా ఉన్నట్లు తెలంగాణ సిట్‌ బృందం గుర్తించింది. దీంతో ఇన్నాళ్లూ భావించినట్లుగా ఇది కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాలకు  చెందిన డేటా కూడా ఉండటంతో కేసు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నేరస్థుల గాలింపు కోసం పలు జాతీయ  దర్యాప్తు సంస్థలు ఆధార్‌ వివరాలు కోరినా యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) అంగీకరించలేదు. నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో ఆఫ్‌ రికార్డ్స్‌ (ఎన్‌సీఆర్‌బీ) కూడా దాదాపుగా ఇలాంటి విజ్ఞప్తే చేసినా నిరాకరించింది. ఆధార్‌ సెక్షన్‌ 29 ప్రకారం పౌరుల వేలిముద్రలు, వ్యక్తిగత వివరాలు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే అత్యంత అరుదైన కేసుల్లో సెక్షన్‌ 33 ప్రకారం మాత్రమే పరిమిత సమాచారం ఇస్తామని పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement