‘బంగారు తల్లి’పై దుమారం
* పథకం కొనసాగింపుపై స్పష్టత కోరిన ప్రతిపక్షం
* ఇంకా దృష్టి పెట్టలేదని ఆర్థికమంత్రి సమాధానం.. కాంగ్రెస్ నిరసన
* ‘కళ్యాణ లక్ష్మి’ కింద పెళ్లి రోజే రూ. 51 వేలు అందిస్తామన్న ఈటెల
సాక్షి, హైదరాబాద్: మైనారిటీ తీరిన (18 ఏళ్లు నిండిన) ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువతులకు కళ్యాణ లక్ష్మి పథకం వర్తిస్తుందని, డిప్యూటీ తహసీల్దార్ ఇచ్చే కుల, ఆదాయ పరిమితి సర్టిఫికెట్ తో పెళ్లికి నెల రోజుల ముందు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఈ పథకానికి రూ. 2 లక్షల ఆదాయ పరిమితి విధించామని, దరఖాస్తు చేసుకున్న వారికి పెళ్లి రోజే కట్నంగా రూ. 51 వేలు అందజేస్తామని చెప్పారు.
అక్టోబర్ 2 నుంచే పథకాన్ని ప్రారంభించామని, ఇప్పటికే ప్రభుత్వానికి దరఖాస్తులు కూడా అందుతున్నాయని తెలిపారు. పథ కం కింద అర్హులైన వారు గుడిలో, చర్చిలో లేదా ఎక్కడపెళ్లి చేసుకున్నా పథకం వర్తిస్తుందన్నారు. అర్హత కలిగిన వధువు కులాంతర వివాహం చేసుకున్నా పథకం వర్తిస్తుందన్నారు. ప్రభుత్వం తరఫున సామూహికంగా వివాహాలు జరిపించే ఆలోచన ఉందన్నారు. మైనార్టీ జనాభాపై స్పష్టత వచ్చిన అనంతరం ఈ పథకాన్ని బీసీ, సంచార జాతులకు సైతం అమలు చేసే విషయమై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రి సహా ప్రజాప్రతినిధులందరూ పెళ్లి పందిట్లోకి వెళ్లి నేరుగా డబ్బును అందజేసేలా కార్యాచరణ ఉంటుందన్నారు. అంతకుముందు ఆడబిడ్డల సంక్షేమం కోసం కాంగ్రెస్ హయాం లో చేపట్టిన ‘బంగారుతల్లి’ పథకం కొనసాగింపుపై ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేసింది.
బంగారు తల్లి పథకం గత ప్రభుత్వం తోనే పోయిందని ఒకమారు, ఆ పథకంపై ప్రభుత్వం దృష్టి సారించలేదంటూ ఇంకోమారు ఆర్థిక మంత్రి ఇచ్చిన సమాధానంపై కాంగ్రెస్ నిరసన తెలియజేసింది. ఈ పథకంపై మరింత స్పష్టత ఇవ్వాలని, మార్గదర్శకాలను సరళీకృతం చేయాలని, కులాంతర వివాహాలకు ఎలాంటి ప్రోత్సాహం ఇస్తారో తెలియజేయాలని ఆపార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. కళ్యాణలక్ష్మి పథకానికి తాము మద్దతిస్తున్నామని, అయితే బాలికల అభివృద్ధి కోసం తెచ్చిన బంగారుతల్లి మాటేమిటని కాంగ్రె స్ ఎమ్మెల్యే డీకే అరుణ ప్రశ్నించారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని ప్రతిపక్షనేత జానారెడ్డి కోరా రు. కళ్యాణలక్ష్మి కన్నా బంగారు తల్లి మంచి పథకమని, దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఎర్రబెల్లి దయాకర్‌రావు(టీడీపీ) డిమాండ్ చేశారు.
దీనికి ఈటెల సమాధానమిస్తూ.. ‘బంగారు తల్లి పథకంపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. అది కొనసాగుతున్నట్లుగా ఉంది. అలా ఏమైనా ఉంటే దాన్ని మరింత మెరుగ్గా అమలు చేస్తాం’ అని చెప్పారు. మంత్రి సమాధానం అసంబద్ధంగా ఉందని ప్రతిపక్షాలు ఆరోపించడంతో మంత్రి హరీశ్‌రావు స్పందించారు. ఈ అంశంపై చర్చకు సిద్ధంగా ఉన్నామని, ఇప్పటికిప్పుడే సమాధానం చెప్పడమంటే సాధ్యం కాదని అన్నారు. దీనికి జానారెడ్డి స్పందిస్తూ.. ‘కళ్యాణలక్ష్మి పథ కం పెట్టి బంగారుతల్లి పథకాన్ని తొలగిస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు. ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వనందుకు మా నిరసన తెలుపుతున్నాం. ఈఅంశాన్ని మరోరూపంలో ప్రస్తావి స్తాం’ అని చెప్పారు. కాంగ్రెస్ నిరసనపై మంత్రి హరీశ్‌రావు, ఈటెల తమ అభ్యంతరాన్ని తెలియజేశారు.