కరీంనగర్: బీసీ వర్గానికి చెందిన నిరుపేద ఆడబిడ్డల వివాహానికి కల్యాణలక్ష్మి పథకాన్ని వర్తింపజేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో శనివారం జరిగిన తెలంగాణ అవతరణ ఉత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు కల్యాణలక్ష్మి, మైనారిటీలకు షాదీ ముబారక్ పేరిట రూ.51 వేలు పెళ్లి ఖర్చులకు ఇస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. బీసీ వర్గంలోని కులాల్లో కూడా చాలా మంది నిరుపేదలు ఉన్నారని, ఇలాంటి వారి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. వారికి కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.