‘పెళ్లి’.. ప్రోత్సాహమేదీ?
సాక్షి, ఖమ్మం: దివ్యాంగులను వివిధ రంగాల్లో ప్రోత్సహించేందుకు.. వారు స్వయం శక్తితో ఎదిగేందుకు.. ఆర్థిక సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నా.. అవి పూర్తిస్థాయిలో అందడం లేదు. ఎవరైనా సకలాంగులు దివ్యాంగులను వివాహం చేసుకుంటే.. వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. అయితే ప్రభుత్వం నిధులు సకాలంలో విడుదల చేయకపోవడంతో లబ్ధిదారులు ప్రోత్సాహకాల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది.
జిల్లాలో సుమారు 30వేలకు పైగా వికలాంగులు ఉన్నారు. వీరిని ఆర్థికంగా ప్రోత్సహించడంతోపాటు వికలాంగులను సకలాంగులు పెళ్లి చేసుకుంటే ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. అయితే కొన్నేళ్లుగా వికలాంగులకు సబ్సిడీ రుణాలతోపాటు వివాహ ప్రోత్సాహకాలు సక్రమంగా అందడం లేదు. దీంతో ప్రభుత్వ సహాయం కోసం దివ్యాంగులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కాగా.. ఈ ఏడాది రూ.61లక్షలు విడుదలయ్యాయని, వాటిని త్వరలోనే అందిస్తామని అధికారులు పేర్కొంటున్నారు.
ఎదురుచూపులు..
శారీరకంగా అంగవైకల్యం ఉన్నా ప్రతిభ కనబరుస్తూ పలు రంగాల్లో దూసుకుపోతున్న దివ్యాంగులకు ప్రభుత్వం నుంచి అందే సాయం కోసం మాత్రం ఎదురుచూపులు తప్పడం లేదు. అంగవైకల్యం ఉన్నా.. వారితో జీవితం పంచుకునేందుకు సకలాంగులు ముందుకొచ్చి వారిని వివాహం చేసుకుంటున్నారు. వీరిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాల పేరుతో ఆర్థికంగా ఆదుకుంటూ వస్తోంది.
అయితే మూడేళ్లుగా దివ్యాంగులను వివాహం చేసుకున్న సకలాంగులను ప్రోత్సహించేందుకు అందించే ప్రోత్సాహక నిధులను మాత్రం సక్రమంగా అందించడం లేదు. ఈ నిధులను రెట్టింపు చేసిన ప్రభుత్వం వాటిని విడుదల చేయకపోవడంతో జిల్లాలో 156 మంది అర్హులు ప్రోత్సాహకాల కోసం ఎదురుచూస్తున్నారు.
బకాయిలు ఇలా..
వికలాంగులను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. సబ్సిడీ రుణాలతోపాటు వికలాంగులను ఎవరైనా సకలాంగులు పెళ్లి చేసుకుంటే వారికి ప్రోత్సాహకాలను అందిస్తూ వచ్చింది. దీంతో వికలాంగులకు కూడా ఒక అండ దొరికినట్లయ్యేది. 2018 మార్చి నెలకు ముందు వరకు ప్రభుత్వం వికలాంగులను వివాహం చేసుకున్న సకలాంగులకు రూ.50వేల వరకు ప్రోత్సాహకాన్ని అందించేది.
అయితే 2018 మార్చి 28వ తేదీ నుంచి వికలాంగులను పెళ్లి చేసుకున్న సకలాంగులకు ప్రోత్సాహకం కింద రూ.లక్ష చొప్పున అందించాలని నిర్ణయించింది. అయితే ప్రోత్సాహకాలను పెంచినప్పటికీ వాటిని అందించకపోవడంతో ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికి ఎదురుచూపులు తప్పడం లేదు. 2018–19లో బడ్జెట్ ప్రీజింగ్లో పెట్టారనే కారణంతో ఒక్కరికి కూడా ప్రోత్సాహకం అందించలేదు. 2018 మార్చి నెలకు ముందు దరఖాస్తు చేసుకున్న వారిలో 122 మందికి ప్రోత్సాహకాలు అందించాల్సి ఉండగా.. 2018 మార్చి తర్వాత ఇప్పటివరకు 34 మంది ప్రోత్సాహకాల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ఐదేళ్ల నుంచి ప్రోత్సాహకాలు ఇలా..
జిల్లాలో దివ్యాంగులను వివాహం చేసుకున్న సకలాంగులను ప్రోత్సహిస్తూ.. అర్హులను గుర్తించి అధికారులు నిధులు అందిస్తున్నారు. 2015–16లో 59 మందికి రూ.29.50లక్షలను అధికారులు ప్రోత్సాహకాల కింద అందించారు. 2016–17లో 63 మందికి రూ.31.50లక్షలు, 2017–18లో 36 మందికి రూ.18లక్షలు అందించారు. 2018–19లో బడ్జెట్ ప్రీజింగ్లో ఉందని అర్హులైన లబ్ధిదారులకు నిధులు అందించలేదు. 2019–20లో 8 మందికి రూ.4 లక్షలు అందించారు. ఇంకా రూ.50వేల ప్రోత్సాహకాలకు దరఖాస్తు చేసుకున్నవారు 122 మంది అర్హులుగా ఉండగా.. రూ.లక్ష ప్రోత్సాహకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు 34 మంది ఉన్నారు.
సకాలంలో అందిస్తాం..
సకలాంగులను వివాహం చేసుకున్న దివ్యాంగులకు అందించే ప్రోత్సాహకాలు కొంత కాలంగా పెండింగ్లో ఉన్నాయి. సకాలంలో నిధులు విడుదల కాక ప్రోత్సాహకాలు అందించలేకపోయాం. ఇటీవల రూ.61లక్షల నిధులు విడుదలయ్యాయి. త్వరలోనే దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు వాటిని పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతున్నాం.
– సబిత, జిల్లా సంక్షేమాధికారి