ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు.
కందుకూరు అర్బన్, న్యూస్‌లైన్ : ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. వివరాలు తెలుసుకునేందుకు వచ్చిన ప్రజలకు ముక్తసరిగా సమాధానం చెబుతూ కార్యాలయాల్లో ఉన్న బోర్డులు చూడమంటూ ఉచిత సలహా ఇస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బంగారు తల్లి పథకంలో పేరు నమోదు చేసుకోవాలనుకుంటున్న వారు మున్సిపల్ కార్యాలయానికి వెళ్తున్నారు. అక్కడ ఏసీ గదుల్లో కూర్చుని ఉన్న అధికారులు వెంటనే పేరు నమోదు చేసుకుంటారని అనుకుంటే పప్పులో కాలేసినట్లే.
కనీసం పథకం వివరాలైనా చెబుతారనుకుంటే అదీ పొరపాటే. బంగారు తల్లి పథకం గురించి తెలుసుకునేందుకు రాజేశ్వరి అనే మహిళ శనివారం మున్సిపల్ కార్యాలయానికి వెళ్లింది. అక్కడున్న అధికారులను బంగారు తల్లి పథకం వివరాలు అడిగింది. కార్యాలయం బయట అద్దం బాక్స్‌లో ఉన్న పథకానికి సంబంధించిన ప్రభుత్వ ప్రకటన చూపుతూ అదిగో.. బంగారు తల్లి పథకం అక్కడుంది.. వెళ్లి చదువుకో.. అని ముక్తసరిగా చెప్పడంతో అవాక్కవడం రాజేశ్వరి వంతైంది. ఇది ఎక్కడో కాదు.. స్వయంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి సొంత నియోజకవర్గంలోనే జరగడం గమనార్హం.
ఆడపిల్ల పుడితే భారమవుతుందని పురిటిలోనే ప్రాణాలు తీస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బంగారు తల్లి పథకాన్ని ప్రవేశపెట్టంది. కందుకూరు మున్సిపల్ అధికారుల నిర్వాకంతో ఆ పథకం అభాసుపాలవుతోంది. పథకాన్ని 2013 మే ఒకటో తేదీ నుంచి అమలులోకి తెచ్చారు. అప్పటి నుంచి ఇద్దరు కుమార్తెలు పుట్టినా.. లేక ఒక కుమార్తె, కుమారుడు పుట్టినా బంగారు తల్లి పథకానికి అర్హులు. 18 సంవత్సరాల వరకు ఆడపిల్లలకు చదువు ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. మొదటి, రెండో ఏడాది పుట్టిన రోజుకు వెయ్యి రూపాయలు చొప్పున ఇస్తారు. మూడో సంవత్సరం నుంచి ఐదో ఏడాది వరకు అంగన్‌వాడీల ద్యారా పుట్టిన రోజు జరుపుకునేందుకు రూ. 1500 చొప్పున ప్రభత్వం ఇస్తుంది.
6 నుంచి 10 సంవత్సరాలలోపు పిల్లలకు సంవత్సరానికి రెండు వేలు చొప్పున, 11 నుంచి 13 సంవత్సరాలలోపు పిల్లలకు రూ. 2500, 14 నుంచి 15 సంవత్సరాల పిల్లలకు రూ. 3500, 16 నుంచి 17 సంవత్సరాల పిల్లలకు సంవత్సరానికి రూ. 3500 చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. ఇంటర్మీడియెట్‌తో ఆడపిల్లలు చదువు మానితే రూ. 50 వేలు జమ చేస్తారు. 18 నుంచి 21 సంవత్సరం వచ్చే వరకు రూ. 4 వేలు చొప్పున పుట్టిన రోజు వేడుకలు జరుపుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. 21 సంవత్సరాల తర్వాత వివాహ ఖర్చులకు రూ. లక్ష ఇస్తారు. అంతటితో ఆ పథకం లక్ష్యం నెరవేరుతుంది. ప్రసవించిన వెంటనే ఆడబిడ్డ పుట్టిన తేదీ, తల్లి ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్లను మెప్మా కార్యాలయంలో నమోదు చేయించుకోవాలి. అలా నమోదు చేయించుకున్న వారికి వారం రోజులలోపు ప్రసవం ఖర్చుల కింద రూ. 2500 బ్యాంకు ఖాతాలో జమచేస్తారు.
ఇంత ప్రాముఖ్యత ఉన్న పథకంపై మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఉలవపాడు మండలం కరేడు గ్రామానికి చెందిన కామేశ్వరి కందుకూరు ప్రభుత్వ వైద్యశాలలో ప్రసవించింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బంగారు తల్లి పథకంలో పేరు నమోదు చేసుకునేందుకు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లగా దగ్గరలోని అద్దం బాక్స్‌లో ఉన్న ప్రభుత్వ ప్రకటన చూసుకోమని చెప్పడంతో ఆమె అవాక్కైంది.