బంగారుతల్లికి భరోసా ఏదీ?
►ఖాతాల్లో జమ కాని డ బ్బులు
►దరఖాస్తు చేసుకున్నా కొందరికే బాండ్లు
►ఆందోళనలో లబ్ధిదారులు..
మంచిర్యాల టౌన్ : ‘బంగారుతల్లి’కి భరోసా కరువైంది. ఆడపిల్లలపై వివక్షను రూపుమాపేందుకు ఆర్భాటంగా ప్రవేశపెట్టిన బంగారుతల్లి పథకం సక్రమంగా అమలు కావడం లేదు. లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదు. లబ్ధిదారులను మున్సిపాల్టీల వారీగా ఎంపిక చేయడంతోపాటు జిల్లాలోని మండలాలను ఆదిలాబాద్, ఉట్నూర్ డివిజన్లుగా విభజించారు. ఆదిలాబాద్ రూరల్ పరిధిలో 32 మండలాలు, ఉట్నూర్ పరిధిలో 20 మండలాలు చేర్చి లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. జిల్లాలోని ఆదిలాబాద్, బెల్లంపల్లి, భైంసా, కాగజ్‌నగర్, మంచిర్యాల, మందమర్రి, నిర్మల్ మున్సిపాల్టీల పరిధిలో బంగారుతల్లి పథకం కోసం 2,355 మంది ఐకేపీ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకున్నారు.
వీరందరినీ అర్హులుగా గుర్తించారు. గత ఏడాది జూలై నుంచి ఇప్పటివరకు అర్హుల్లో 761 మందికి మాత్రమే బాండ్లు అందాయి. వీరిలో సుమారు 400 మంది ఖాతాల్లోనే మొదటి దఫా నగదు జమ అయింది. మిగితా వారు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వస్తోంది. అయినా ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఈ పథకంలో పేరు నమోదు చేసుకుని ఏడాది గడుస్తున్నా 1,594 మందికి బాండ్లు అందకపోవడం గమనార్హం. 361మంది ఖాతాల్లో నగదు జమ కాకపోవడంతో పథకంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆదిలాబాద్ రూరల్ పరిధిలోని మండలాల్లో 7,082 మంది దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 3,858 మంది లబ్ధిపొందారు. మిగితా వారు లబ్ధి కోసం ఎదురు చూస్తున్నారు. ఉట్నూర్ రూరల్ పరిధిలో 5,193 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,427 మందికి బాండ్లు అందాయి. 2,766 మందికి ఎదురుచూపులే మిగిలాయి. మంచిర్యాల పట్టణంలో 184 మంది దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ కాలేదు. దీంతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఖాతాల్లో డబ్బు జమ చేయాలని కోరుతున్నారు.
పథకం అమలు తీరు ఇలా..
జననీ సురక్ష యోజన, సుఖీభవ, రాజీవ్ విద్యాదీవెన వంటి పథకాలతో ఎలాంటి సంబంధం లేకుండా బంగారుతల్లి పథకాన్ని రూపొందించారు. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారికి నెల రోజుల వ్యవధిలో రూ.2,500 అందించాలి. బాలిక మొదటి పుట్టిన రోజు తర్వాత టీకాల ఖర్చుల కోసం రూ.వెయ్యి అందజేయాలి. మూడు నుంచి ఐదేళ్ల వరకు అంగన్‌వాడీ కేంద్రంలో చేరే వారికి ఏటా రూ.1,500 చొప్పున, ఆరు నుంచి పదేళ్ల వరకు ఏటా రూ.2,500, 14ఏళ్ల నుంచి 17ఏళ్ల వరకు ఏటా రూ.3,500, 18ఏళ్ల నుంచి 21ఏళ్ల వరకు ఏటా రూ.4వేలు అందిస్తారు. ఇలా 21ఏళ్లు నిండేసరికి ఒక్కొక్కరికి రూ.1.55లక్షలు ఆర్థికసాయం అందుతుంది.