బాలారిష్టాల్లో ‘బంగారు తల్లి’ | bangaru talli scheme applications are coming | Sakshi
Sakshi News home page

బాలారిష్టాల్లో ‘బంగారు తల్లి’

Published Thu, Oct 9 2014 11:32 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM

బాలారిష్టాల్లో ‘బంగారు తల్లి’ - Sakshi

బాలారిష్టాల్లో ‘బంగారు తల్లి’

చేవెళ్ల రూరల్: బాలికలపై వివక్ష, భ్రూణ హత్యలను నివారించి బాలికాభివృద్ధికి కృషి చేయాలనే లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బంగారు తల్లి పథకం ఆది నుంచీ బాలారిష్టాలనే ఎదుర్కొంటోంది. గతంలో ఉన్న బాలికా శిశు సంరక్షణ పథకాన్ని మరిపించేలా 2013 జూలైలో చట్టబద్ధత కల్పిస్తూ ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. 2013 మే నుంచి పుట్టిన ప్రతి ఆడబిడ్డకూ ఈ పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. పథకం ఏర్పాటులో ఆశయాలు గొప్పగానే ఉన్నా ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. వందలాది మంది లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకుంటున్నా.. లబ్ధి పొందుతున్న వారు మాత్రం పదుల సంఖ్యలో ఉంటున్నారు.

ఈ పథకంలో ఆడపిల్ల పుట్టిన వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రూ.2500 వారి ఖాతాలో జమ చేస్తారు. ఆ తర్వాత విడతల వారీగా ప్రతి ఏటా ఆడపిల్ల చదువుకు నిధులు కేటాయించాలనేది దీని లక్ష్యం. మొత్తం రెండు లక్షల 16వేల రూపాయలు బంగారుతల్లి పథకం కింద లబ్ధి చేకూరుతుంది. మండలంలో మొత్తం 30 గ్రామ పంచాయతీల్లో ఎంతో మంది ఆడబిడ్డలు జన్మించారు. కాగా వారిలో ఇప్పటివరకు  దాదాపు 438  మంది వరకు లబ్ధిదారులు బంగారుతల్లి పథకానికి దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో ఇప్పటి వరకు కేవలం 180 మందికి మాత్రమే పథకం మొదటి సంవత్సరం కింద నిధులను మంజూరు చేశారు. వీరికి రెండో విడత నిధులు మాత్రం ఇప్పటికీ ఊసేలేదు. మిగిలిన వారు దరఖాస్తులు చేసుకోగా.. ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఏడాది గడిచినా బంగారు తల్లి పథకం భరోసా కల్పించటం లేదు.

నిధులు లేమి కారణంతో ఏ ఒక్క లబ్ధిదారుకూ ప్రయోజనం చేకూరడంలేదు. ఆడపిల్లలను కన్నవారు బంగారు తల్లి పథకానికి దరఖాస్తులు చేసుకునేందుకు వెలుగు కార్యాలయానికి వస్తూనే ఉన్నారు. పథకం అమలు ద్వారా ఎంతో విశ్వాసంతో బంగారు తల్లుల భవిష్యత్‌పై భరోసా ఏర్పడుతుందని భావించిన తల్లిదండ్రులకు నిరాశే మిగులుతోంది. ఇదిలా ఉంటే.. నిధుల లేమి పేరుతో అర్హులైన దరఖాస్తుదారులకు చాలామందికి మొదటి విడత నిధులు అందకపోవడంతో పాటు మొదటి విడత ప్రయోజం పొందిన కొంతమందికి రెండో విడుత నిధుల మంజూరు ఆచూకే లేకుండా పోయింది. బంగారు తల్లి పథకం అమలుతో గతంలోని బాలికా సంరక్షణ పథకం కూడా లేకపోవటంతో పేద, మధ్యతరగతికి చెందిన ఆడపిల్లల తల్లిదండ్రులు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని బంగారుతల్లి పథకం లబ్ధిదారులు కోరుతున్నారు.
 
రిజిస్ట్రేషన్లు చేస్తూనే ఉన్నాం...
బంగారు తల్లి పథకానికి సంబంధించిన దరఖాస్తులు వస్తున్నాయి. వాటిని ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌లు చేస్తూనే ఉన్నాం. నిధుల విషయం ప్రభుత్వానికే తెలుసు. ఇప్పటివరకు 438 మంది లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకోగా.. వాటిలో 180 వరకు గ్రౌండింగ్ అయ్యాయి. నిధులు వచ్చిన వెంటనే లబ్ధిదారుల అకౌంట్లలో నేరుగా జమ చేస్తాం.  

- మంజులవాణి, ఏపీఎం, చేవెళ్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement