Manjula Vani
-
పశువులకూ ‘ఆధార్’!
మొయినాబాద్(చేవెళ్ల): ఇకనుంచి పశువుల ఆరోగ్య వివరాలు ఆన్లైన్లో పొందుపరుస్తామని.. ప్రతి పశువుకు 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య(ఆధార్ వంటిది), హెల్త్ కార్డులు ఇవ్వనున్నట్లు రాష్ట్ర పశు గణాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి డాక్టర్ జి.మంజులవాణి వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల కేంద్రంలోని పశువైద్య కేంద్రాన్ని బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలో పశుగణన తీరు, వేసవిలో పశువుల పరిస్థితి , గొర్రెల పంపిణీ పథకం అమలు ఎలా ఉందనే విషయాలను మండల పశువైద్యాధికారి శ్రీలతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. రైతుల వద్ద ఉన్న పశువుల సమగ్ర వివరాలు సేకరించి ఆన్లైన్లో పొందుపరుస్తున్నామని అన్నారు. ప్రతి పశువుకు ఆధార్ నంబర్ మాదిరిగా 12 అంకెల గుర్తింపు సంఖ్యను కేటాయిస్తున్నామని.. గుర్తింపు సంఖ్య ఉన్న పోగును పశువుల చెవులకు వేస్తున్నట్లు వివరించారు. ప్రత్యేక గుర్తింపు సంఖ్యతోపాటు రైతు వివరాలు కూడా ఫీడ్ చేస్తామన్నారు. పశువు వివరాలతోపాటు దాని ఆరోగ్య పరిస్థితిని నమోదు చేస్తున్నామని తెలిపారు. వాటికి హెల్త్‌కార్డులు సైతం ఇవ్వనున్నట్లు చెప్పారు. పశు సంపదను పెంచే చర్యలు ముమ్మరం చేసినట్లు తద్వారా పాలఉత్పత్తి పెంచి రైతుల ఆదాయం పెంచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం సత్ఫలితాలు ఇస్తున్నట్లు చెప్పారు. గొర్రెల పంపిణీ పథకం కింద అందజేసిన జీవాల ద్వారా రాష్ట్రంలో 50 లక్షల గొర్రెపిల్లలు ఉత్పత్తి అయ్యాయన్నారు. రెండో విడత పంపిణీ త్వరలోనే మొదలవుతుందని చెప్పారు. అనంతరం శ్రీరాంనగర్ గ్రామాన్ని సందర్శించి దూడలను పరిశీలించారు. కార్యక్రమంలో డీఎల్డీఓ ఈఓ కె.సింహరావు, పశువైద్యులు దేవేందర్‌రెడ్డి, శ్రీలత, గోపాలమిత్రలు శ్రీనివాస్, బాలకిష్టయ్య తదితరులు ఉన్నారు. -
బాలారిష్టాల్లో ‘బంగారు తల్లి’
చేవెళ్ల రూరల్: బాలికలపై వివక్ష, భ్రూణ హత్యలను నివారించి బాలికాభివృద్ధికి కృషి చేయాలనే లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బంగారు తల్లి పథకం ఆది నుంచీ బాలారిష్టాలనే ఎదుర్కొంటోంది. గతంలో ఉన్న బాలికా శిశు సంరక్షణ పథకాన్ని మరిపించేలా 2013 జూలైలో చట్టబద్ధత కల్పిస్తూ ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. 2013 మే నుంచి పుట్టిన ప్రతి ఆడబిడ్డకూ ఈ పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. పథకం ఏర్పాటులో ఆశయాలు గొప్పగానే ఉన్నా ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. వందలాది మంది లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకుంటున్నా.. లబ్ధి పొందుతున్న వారు మాత్రం పదుల సంఖ్యలో ఉంటున్నారు. ఈ పథకంలో ఆడపిల్ల పుట్టిన వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రూ.2500 వారి ఖాతాలో జమ చేస్తారు. ఆ తర్వాత విడతల వారీగా ప్రతి ఏటా ఆడపిల్ల చదువుకు నిధులు కేటాయించాలనేది దీని లక్ష్యం. మొత్తం రెండు లక్షల 16వేల రూపాయలు బంగారుతల్లి పథకం కింద లబ్ధి చేకూరుతుంది. మండలంలో మొత్తం 30 గ్రామ పంచాయతీల్లో ఎంతో మంది ఆడబిడ్డలు జన్మించారు. కాగా వారిలో ఇప్పటివరకు దాదాపు 438 మంది వరకు లబ్ధిదారులు బంగారుతల్లి పథకానికి దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో ఇప్పటి వరకు కేవలం 180 మందికి మాత్రమే పథకం మొదటి సంవత్సరం కింద నిధులను మంజూరు చేశారు. వీరికి రెండో విడత నిధులు మాత్రం ఇప్పటికీ ఊసేలేదు. మిగిలిన వారు దరఖాస్తులు చేసుకోగా.. ఆన్లైన్లో నమోదు చేసి ఏడాది గడిచినా బంగారు తల్లి పథకం భరోసా కల్పించటం లేదు. నిధులు లేమి కారణంతో ఏ ఒక్క లబ్ధిదారుకూ ప్రయోజనం చేకూరడంలేదు. ఆడపిల్లలను కన్నవారు బంగారు తల్లి పథకానికి దరఖాస్తులు చేసుకునేందుకు వెలుగు కార్యాలయానికి వస్తూనే ఉన్నారు. పథకం అమలు ద్వారా ఎంతో విశ్వాసంతో బంగారు తల్లుల భవిష్యత్‌పై భరోసా ఏర్పడుతుందని భావించిన తల్లిదండ్రులకు నిరాశే మిగులుతోంది. ఇదిలా ఉంటే.. నిధుల లేమి పేరుతో అర్హులైన దరఖాస్తుదారులకు చాలామందికి మొదటి విడత నిధులు అందకపోవడంతో పాటు మొదటి విడత ప్రయోజం పొందిన కొంతమందికి రెండో విడుత నిధుల మంజూరు ఆచూకే లేకుండా పోయింది. బంగారు తల్లి పథకం అమలుతో గతంలోని బాలికా సంరక్షణ పథకం కూడా లేకపోవటంతో పేద, మధ్యతరగతికి చెందిన ఆడపిల్లల తల్లిదండ్రులు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని బంగారుతల్లి పథకం లబ్ధిదారులు కోరుతున్నారు. రిజిస్ట్రేషన్లు చేస్తూనే ఉన్నాం... బంగారు తల్లి పథకానికి సంబంధించిన దరఖాస్తులు వస్తున్నాయి. వాటిని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు చేస్తూనే ఉన్నాం. నిధుల విషయం ప్రభుత్వానికే తెలుసు. ఇప్పటివరకు 438 మంది లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకోగా.. వాటిలో 180 వరకు గ్రౌండింగ్ అయ్యాయి. నిధులు వచ్చిన వెంటనే లబ్ధిదారుల అకౌంట్లలో నేరుగా జమ చేస్తాం. - మంజులవాణి, ఏపీఎం, చేవెళ్ల