Female baby
-
ఎందుకీ వివక్ష.. ప్లీజ్ నన్ను బతకనివ్వండి
స్త్రీ లేకపోతే జననం లేదు. గమనం లేదు. సృష్టిలో జీవం లేదు. అసలు సృష్టే లేదు. అలాంటిది కొందరు గర్భంలో పెరుగుతున్నది ఆడపిల్ల అని తెలిస్తే చాలు కడుపులోనే తుంచేస్తున్నారు. గతంలో ఆడపిల్ల పుట్టిందంటే చాలు ఇంటికి లక్ష్మి వచ్చిందని మురిసిపోయేవారు. జిల్లా మొత్తం జనాభాలో ఆడవాళ్లే ఎక్కువ ఉండడానికి అదే కారణం. అయితే మగబిడ్డ అయితేనే వారసుడనే భావన ఏర్పడడం, ఆడపిల్ల పెళ్లికి వరకటా్నలు అడ్డగోలుగా పెరగడం తదితర కారణాలతో ఆడపిల్లలు వద్దనుకునేవారి సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది. సాక్షి, కామారెడ్డి: జిల్లాలో ఆడబిడ్డల జననాల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కొందరు స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు డబ్బుల కోసం కడుపులో పెరిగేది ఆడనో, మగనో చెప్పేస్తున్నారు. ఆడబిడ్డ అని తెలిస్తే చాలు అబార్షన్లు చేస్తున్నారు. ఫలితంగా ఆడపిల్లల సంఖ్య తగ్గుతూ వస్తోంది. కామారెడ్డి జిల్లా ఏర్పడిన తరువాత జిల్లాలో జననాల సంఖ్యను పరిశీలిస్తే ఆడబిడ్డల సంఖ్య తగ్గుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మగవారికి ధీటుగా ప్రతి రంగంలోనూ ఆడబిడ్డలు తమ ప్రతిభను కనబరుస్తున్నారు. అయినప్పటికీ ఆడపిల్లల మీద వివక్ష పోవడం లేదు. జిల్లాలో కీలకమైన విభాగాలకు అధిపతులుగా మహిళలు ఉన్నా వారిని చూసైనా తల్లిదండ్రులు ఆలోచించడం లేదు. తమకు పుట్టేది ఆడబిడ్డ అయితే వాళ్లలా ఉన్నతంగా ఎదుగుతుందన్న ఆశలు పెంచుకోవడం లేదు. దీంతో ఆడబిడ్డలను కడుపులోనే కడతేరుస్తున్నారు. గత ఆరేళ్ల కాలంలో జిల్లాలో జననాల లెక్కలను పరిశీలిస్తే ప్రతి సంవత్సరం మగపిల్లల కన్నా ఆడపిల్లల సంఖ్య తక్కువగా ఉండడానికి కారణం విచ్చలవిడిగా అబార్షన్లు చేయడమేననేది స్పష్టమవుతోంది. చదవండి: కువైట్ ప్రయాణం చాలా ఖరీదు.. 15 వేల నుంచి 1.35 లక్షలు ఆగని భ్రూణ హత్యలు కడుపులో పెరుగుతున్నది ఆడపిల్ల అని తెలిస్తే చాలు కడుపులోనే తుంచేస్తున్నారు. కామారెడ్డి పట్టణంలో ఇటీవల రాజ్యలక్ష్మి నర్సింగ్‌హోంలో విచ్చలవిడిగా గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంతో పాటు అబార్షన్లు చేస్తున్న విషయంలో వివిధ శాఖల అధికారులు దాడులు నిర్వహించి ఆస్పత్రిని సీజ్ చేశారు. చట్టంలో ఉన్న లొసుగులను ఆసరా చేసుకుని ఆస్పత్రి నిర్వాహకుడు సులువుగా బెయిల్ సంపాదించి బయటకు వచ్చాడు. తిరిగి ఆస్పత్రిని తెరిపించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. కేసు విషయంలో ఆలస్యమైతే మరో పేరుతో ఆస్పత్రిని తెరి చేందుకు ప్రయతి్నస్తున్నారు. లింగనిర్ధారణ పరీక్ష లు, అబార్షన్లు నిర్వహించడం అనేది చట్టరీత్యా నేరమైనప్పటికీ జిల్లా కేంద్రంలో యథేచ్ఛగా జరుగు తున్నా ఇంతకాలం అధికారులు పట్టించుకోకపోవ డం గమనార్హం. అలాగే మరికొన్ని ఆస్పత్రుల్లోనూ లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు నిర్వహిస్తున్నా రు. అయినా తమ దగ్గర పర్యవేక్షణకు అవసరమైన టీం లేదని చెబుతూ వైద్యఆరోగ్య శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ఇష్టారాజ్యంగా లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు జరుగుతున్నాయి. చదవండి: రంగారెడ్డి జిల్లాలో మళ్లీ ఊపందుకున్న రియల్ రంగం జననాల్లో ఆడపిల్లలే తక్కువ ఆరేళ్లుగా జిల్లాలో జననాల లెక్కలను పరిశీలిస్తే ఆడపిల్లల జననాల సంఖ్య తక్కువగా ఉంటోంది. దీనికి కారణం భ్రూణ హత్యలే అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి సంవత్సరం మగ పిల్లల కన్నా ఆడపిల్లలు 4 వందల నుంచి 5 వందల వరకు తక్కువగా ఉంటున్నారు. ఈ ఏడాది అంటే ఏప్రిల్ 1 నుంచి జూలై 30 వరకు నాలుగు నెలల్లో జిల్లాలో 4,366 మంది జన్మిస్తే అందులో మగ పిల్లలు 2,366 మంది కాగా, ఆడపిల్లలు 2 వేల మంది. అంటే తేడా 366 మంది ఉన్నారు. ప్రతిఏడాది ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే మగపిల్లలకు ఆడపిల్లలు కరువై చాలా మంది పెళ్లికాని ప్రసాద్‌లుగా ఉంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తు తరాలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు కడుపులో పెరుగుతున్నది ఆడ, మగ అనేది నిర్ధారించడం చట్ట విరుద్ధం. జిల్లాలో అనుమతి లేకుండా ఉన్న స్కానింగ్ సెంటర్‌ను ఇటీవలే మూసి వేయడం జరిగింది. ఎక్కడైనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం అందితే చర్యలు తీసుకుంటాం. ఆడపిల్లల నిష్పత్తి తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. తల్లిదండ్రులు, సమాజం అందరూ ఆలోచించాలి. – చంద్రశేఖర్, డీఎంహెచ్‌వో, కామారెడ్డి అవగాహన కార్యక్రమాలు చేపడతాం ఆడపిల్ల లేనిది సృష్టి లేదు. జిల్లా జనాభాలో ఆడవాళ్ల జనాభా ఎక్కువగానే ఉంది. కానీ పిల్లల దగ్గరకు వచ్చేసరికి ఆడపిల్లల జనాభా తగ్గిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాగే ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ప్రభుత్వాలు ఆడపిల్లల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నా యి. అయినా తల్లిదండ్రులు మగబిడ్డపై మమకారంతో ఆడపిల్లలు వద్దనుకోవడం సరికాదు. దీనిపై అవగాహన కార్యక్రమాలు చేపడతాం. – సరస్వతి, జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి, కామారెడ్డి -
చెర్రి.. పండులా మారింది!
సాక్షి, హైదరాబాద్: వైద్యరంగంలో మరో అద్భుతాన్ని ఆవిష్కరించారు నగరంలోని రెయిన్బో చిల్డ్రన్స్ ఆస్పత్రి వైద్యులు. నెలలు నిండక ముందే తక్కువ బరువు(కేవలం 375 గ్రాముల బరువు)తో జన్మించిన ఆడశిశువు(చెర్రి)కు పునర్జన్మ ప్రసాదించారు. అబార్షన్ వల్ల ఇప్పటికే నాలుగుసార్లు పిల్లలకు దూరమైన ఆ దంపతుల జీవితాల్లో ఆనందం నింపారు. ప్రస్తుతం శిశువు ఎత్తు, బరువు పెరగడంతోపాటు ఆరోగ్యంగా ఉండటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ మేరకు గురువారం బంజారాహిల్స్‌లోని ఓ హోటల్లో విలేకరుల సమావేశంలో రెయిన్బో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ రమేశ్ కంచెర్ల, ఇంటెన్సివ్‌కేర్ యూనిట్ డైరెక్టర్ డాక్టర్ దినేశ్ కుమార్ చికిత్స వివరాలు వెల్లడించారు. వైద్యులకు కలసి వచ్చిన గత అనుభవం ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సౌరభ్ భార్య నిఖితకు గర్భం దాల్చిన 24 వారాల తర్వాత స్థానిక ఆస్పత్రిలో అల్ట్రాసౌండ్ నిర్వహించారు. ఉమ్మనీరు తగ్గడంతో కడుపులోని బిడ్డకు ఆక్సిజన్ సరిగా అందడంలేదని వైద్యులు నిర్ధారించారు. తల్లి నుంచి రక్తప్రసరణ కూడా నిలిచిపోయింది. బిడ్డను కాపాడుకునేందుకు అనేకమంది వైద్యులను సంప్రదించగా అబార్షన్ చేయడమే పరిష్కారమని చెప్పారు. చివరకు ఆ దంపతులు హైదరాబాద్‌లోని రెయిన్బో ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు. అప్పటికే 449 గ్రాముల శిశువును రక్షించిన అనుభవం ఈ ఆస్పత్రి వైద్యులకు ఉంది. ఫిబ్రవరి 27న నిఖితకు సిజేరియన్ చేసి కడుపులోని ఆడబిడ్డ(చెర్రి)ను బయటికి తీశారు. అప్పుడు బిడ్డ బరువు కేవలం 375 గ్రాములు. 26 సెంటీమీటర్ల పొడవు మాత్రమే. సాధారణంగా ప్రసవ సమయంలో ఆరోగ్యవంతమైన బిడ్డ బరువు 2.8 కేజీల నుంచి మూడు కేజీల వరకు ఉంటుంది. అనేక సవాళ్లను అధిగమించి.. శిశువుకు ఆక్సిజన్ అందకపోవడం, బీపీ తక్కువగా నమోదు కావడం వైద్యులకు పెద్ద సవాల్‌గా మారింది. పుట్టిన వెంటనే వెంటిలేటర్‌పైకి చేర్చి వైద్యం అందించారు. ఎప్పటికప్పుడు మెదడు, గుండె, మూత్రపిండాల పనితీరును పరీక్షిస్తూ ప్రత్యేక మందులతోపాటు న్యూట్రిషన్‌ను కూడా అందించారు. 128 రోజులపాటు ఐసీయూలో ప్రత్యేక వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందించారు. 105 రోజులు వెంటిలేటర్‌పై ఉంచారు. ప్రస్తుతం శిశువు బరువు 2.45 కేజీలకు, ఎత్తు 46 సెంటిమీటర్లకు చేరుకుంది. ఆగ్నేయాసియాలోనే తొలి కేసు నెలలు నిండక ముందే తక్కువ బరువుతో పుట్టిన శిశువుకు పునర్జన్మ ప్రసాదించడం ఆగ్నేయాసియా వైద్య చరిత్రలోనే ఇది మొదటిది. గతంలో 449 గ్రాముల బరువుతో పుట్టిన శిశువును కాపాడిన అనుభవం ఉండటం వల్లే ఇది మాకు సాధ్యమైంది. అత్యాధునిక ఐసీయూ, వెంటిలేటర్ సపోర్టు, వైద్యపరంగా ఉన్న అనుభవం ఇందుకు తోడయ్యాయి. - డాక్టర్ దినేష్‌కుమార్, రెయిన్బో ఆస్పత్రి ఆశలు వదులుకున్నాం నాలుగు సార్లు అబార్షన్ కావడం, ఐదోసారి కూడా అదే పరిస్థితి తలెత్తడంతో చాలా ఆందోళన చెందాం. ఇక పిల్లలపై ఆశలు వదులుకున్నాం. చివరి ప్రయత్నంలో భాగంగా రెయిన్‌బోకు వచ్చాం. అదృష్టవశాత్తూ మా బిడ్డ మాకు దక్కింది. చాలా సంతోషంగా ఉంది. పునర్జన్మ ప్రసాదించిన వైద్యులకు ధన్యవాదాలు. – నిఖిత, సౌరభ్ -
అమ్మేశారా.. చంపేశారా.
► ఆడ శిశువు అదృశ్యంపై అనుమానాలు ► మృతి చెందిందని చెబుతున్న శిశువు తల్లిదండ్రులు ► పోలీసులకు ఫిర్యాదు.. కేసు నమోదు దేవరకొండ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడ పిల్లల సంరక్షణ కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతున్నా మారుమూల ప్రాంతాల్లో మాత్రం ఆడ పిల్లలపై వివక్షత రోజు రోజుకు పెరిగిపోతోంది. శిశు బ్రూణ హత్యలపై పోలీసులు ఎన్నో అవగాహన సదస్సులు చేపట్టినా ప్రయోజనం లేకపోయింది. నల్గొండలో శిశువు అదృష్యం కలకలం రేపుతోంది. శిశువును విక్రయించారా.. చంపేశారా అనేది తేలక సందిగ్ధం నెలకొంది. ఈ హృదయ విచారక ఘటన చందంపేట మండలం తిమ్మాపురంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తిరుపతికి చందంపేట మండలం గాగిళ్లాపురం పద్మలకు గత ఏడేళ్ల క్రితం వివాహం అయ్యింది.వీరికి మొదటి కాన్పులో ఆడపిల్ల, రెండో కాన్పులో మగబిడ్డ మూడో కాన్పులో ఆడబిడ్డలు జన్మించారు. నాల్గో సంతానంగా ఈ నెల 5 న ఆడ శిశువు జన్మించింది. ఈ చిన్నారి వివరాలు స్థానిక అంగన్ వాడి సెంటర్లో నమోదయ్యాయి. ఆదివారం సెలవు దినం కావడంతో అంగన్వాడి టీచర్ బంధువుల ఇంటికి వెళ్లింది. సోమవారం ఆడ శిశువు కనిపించకపోవడంతో శిశువు తల్లి పద్మను ప్రశ్నించింది. ఆమె గత ఐదు రోజుల క్రితం మృతి చెందిదని చెప్పింది. భర్తను విచారించగా పదిహేను రోజుల క్రితం మరణించిందని పొంతనలేని సమాధానం చెప్పాడు. దీంతో అనుమానంతో అంగన్వాడి టీచర్ పై అధికారులకు సమాచారం ఇచ్చింది. సీడీపీవో సక్కుబాయి, స్థానిక సూపర్వైజర్ పద్మలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ సతీష్‌కుమార్ తెలిపారు. -
ఆడ బిడ్డకు జన్మనిచ్చిందని వివక్ష
కట్నం కోసం వేధింపులు పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు రొంపిచెర్ల: ఆడబిడ్డకు జన్మనిచ్చాననే వివక్ష చూపడమే కాకుండా అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధిస్తున్నారని మహిళా దినోత్సవం రోజే ఓ మహిళ బుధవారం రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి కథనం మేరకు.. రొంపిచెర్ల గ్రామ పంచాయతీ లక్ష్మీనారాయణకాలనీకి చెందిన టిప్పుసుల్తాన్‌తో 2016 ఫిబ్రవరి 4న చిన్న మసీదువీధికి చెందిన హసీనాకు (21) పెద్దల సమక్షంలో నిఖా (వివాహం) చేశారు. వివాహ సమయంలో 80 గ్రాముల బంగారు నగలు, రూ.20 వేలు కట్న కానుకల కింద హసీనా కుటుంబ సభ్యులు ఇచ్చా రు. వివాహమైన మూడు నెలలకే ఆమె గర్భం దాల్చడంతో వేధింపులు ఎక్కువయ్యాయి. వివాహేతర సంబంధం అంటగట్టి, వేధింపులకు తెరతీశారు. సీమంతం సమయంలో అదనంగా 80 గ్రాముల బంగారు నగలు ఇవ్వాలని పట్టుబట్టారు. హసీనా ఆడబిడ్డకు జన్మనివ్వడంతో ఈ వేధింపులు మరింత తీవ్రమయ్యాయి. ఆడ బిడ్డకు జన్మనిచ్చావంటూ హసీనాను తూలనాడారు. అంతేకాకుండా తన భర్తకు మరో వివాహం చేస్తానంటూ అత్త బెదిరించేందని, తన భర్త సైతం రెండో వివాహానికి సిద్ధపడ్డాడని, తాను ఇక పుట్టింటిలోనే ఉండాలంటూ అత్తింటివారు ఆంక్షలు విధించారని హసీనా వాపోయింది. తాను ప్రసవించి 4 నెలలైనా పుట్టింటిలోనే ఉన్నానని గోడు వెళ్లగక్కింది. అంతేకాకుండా దుల్హన్ పథకం ద్వారా ముస్లింలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.50వేలను కూడా తనను మభ్యపెట్టి మొత్తం డబ్బును అత్తింటి వారు కాజేశారని తెలిపింది. అత్త అయిషా, చిన్న మామ బావాజీ, తాత అల్లాబ„Š , తన భర్త అదనపు కట్నం కోసం వేధించారని, పోలీసులే తనకు న్యాయం చేయాలని వేడుకుంది. -
ఆడ శిశువు మృతదేహం లభ్యం
కణేకల్లు: కణేకల్లు–ఎర్రగుంట మార్గమధ్యంలోని కల్వర్టు వద్ద ఆదివారం ఓ ఆడశిశువు మృతదేహం లభ్యమైంది. అటువైపు బైక్‌పై వెళ్తున్న కొందరికి కల్వర్టు వద్ద కుక్కలుండటం గమనించారు. దగ్గరకెళ్లి కుక్కలను తరిమేయగా వారికి మృతశిశువు కనిపించింది. వెంటనే పైన పేర్కొన్న గ్రామాల వారికి విషయం తెలిపారు. వారొచ్చి మృత శిశువును చూసి కంటతడి పెట్టారు. బతికుండగా పడేసి వెళ్లారో, లేక చనిపోయాక ఖననం చేయకుండా వదిలేసి వెళ్లారో అంతుబట్టడం లేదు. పసికందును అలా పడేయటానికి వారికి మనసెలా వచ్చిందోనంటూ శాపనార్థాలు పెట్టారు. -
ఆడబిడ్డ పుట్టిందని..
తిరుమల: తిరుమలలో దారుణం చోటు చేసుకుంది. ఆడబిడ్డ పుట్టిందని ఓ మహిళను అత్తింటి వారు ఇంటి నుంచి గెంటేశారు. దీంతో ఆ మహిళ న్యాయం కోసం ధర్నాకు దిగింది. ఈ సంఘటన తిరుమల బాలాజీనగర్‌లో శుక్రవారం జరిగింది. స్థానికంగా నివాసముంటున్న విజయలక్ష్మీకి ఇటీవల ఆడబిడ్డ పుట్టింది. దీంతో భర్తింటి వారు ఆమెను ఇంటి నుంచి గెంటేశారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు ఈ రోజు భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. -
పొత్తిళ్లలోనే అమ్మకానికి
♦ అంగడి సరుకుగా ఆడ శిశువులు ♦ కళ్లు తెరవకుండానే అమ్మఒడిని వదులుతూ.. ♦ రెండేళ్లలో నలుగురి విక్రయం ♦ తాజాగా మరో చిన్నారి... ♦ ఆలస్యంగా వెలుగు చూసిన మెట్టుగడ్డ తండా ఘటన మెదక్: పొత్తిళ్లలోని ఆడశిశువులు అంగడి సరుకుగా మారుతున్నారు. పేదరికం ఓ వైపు... వంశోద్ధారకుడు కావాలనే ఆశ మరోవైపు.. ఫలి తంగా గిరిజనుల కడుపున పుట్టిన ఆడశిశువులు కళ్లు తెరవకుండానే అమ్మను వదిలి పెంపుడు తల్లులు ఒడికి చేరుతున్నారు. మెదక్ మండలంలో రెండేళ్లకాలంగా నలుగురు చిన్నారుల క్రయవిక్రయాలు జరిగాయి. తాజాగా మరో చిన్నారిని విక్రయించిన ఘటన సోమవారం వెలుగు చూసింది. మెదక్ మండలం వాడి పంచాయతీలోని మెట్టుగడ్డ తండాకు చెందిన లంబాడి స్రవంతి, గణేశ్ దంపతులు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు కాగా ఆమె మళ్లీ గర్భందాల్చింది. రెండెకరాల్లో పంటలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఓ బోరు కాస్త ఎండిపోయింది. సాగునీటికోసం తలకుమించిన అప్పులుచేసి మరో నాలుగు బోర్లు వేశారు. ఎందులోనూ చుక్కనీరు రాలేదు. బతుకుదెరువు లేక.. అప్పుల వారికి ముఖం చూపించలేకపోయాడు గణేశ్. ఉన్న బంగారం అమ్మి, అందులోకి మరిన్ని అప్పులు చేసి గణేశ్ ఆరునెలలక్రితం దుబాయ్‌కి వలస వెళ్లాడు. ఆయన దుబాయ్ వెళ్లిన మూడు నెలలకు స్రవంతికి మూడో కాన్పులోనూ ఆడపిల్లే జన్మించింది. ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉండగా, మూడో కాన్పులోనూ ఆడబిడ్డ పుట్టడంతో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఉపాధి కరువై భర్త పొట్టచేత పట్టుకుని దుబాయ్‌కి పోగా, పిల్లలను పోషించ లేక స్రవంతి తల్లడిల్లిపోయింది. ఈ క్రమంలో చంటిపిల్లను పోషించే స్థోమత లేక రెండు నెలల క్రితం నిజామాబాద్ జిల్లా లింగంపల్లి మండలం సురాయిపల్లి తండాకు చెందిన పీర్యా-సంతు దంపతులకు రూ.10 వేలకు విక్రయించింది. విషయం తెలుసుకున్న అంగన్వాడీ, ఐసీడీఎస్ అధికారులు పసికందు గురించి ఆరాతీయగా, చనిపోయిందని ఓసారి, పెంచుకునేందుకు బంధువులు ఇచ్చామని మరోసారి చెప్పింది స్రవంతి. సర్పంచ్‌తోపాటు ఐసీడీఎస్, అంగన్వాడీ అధికారులు సోమవారం స్రవంతి ఇంటికి వెళ్లగా ఆమె అప్పటికే ఊరెళ్లినట్లు తెలిసింది. పసికందును కొనుగోలు చేసిన సంతు దంపతులను గ్రామపెద్దలు పిలిపించి కొనుగోలుచేసిన పాప భవిష్యత్తుపై చర్చించారు. ఆగని శిశువిక్రయాలు... ⇒ఒక్క మెదక్ మండలంలోనే రెండేళ్ల కాలంలో ఇప్పటివరకు ఐదుగురు ఆడశిశువుల విక్రయాలు జరిగాయి. ఆడశిశువులను విక్రయించిన వారంతా మగబిడ్డకోసం ఎదురుచూసి, మళ్లీ ఆడశిశువు జన్మించడంతో విక్రయించినట్లు తెలుస్తోంది. ⇒ మెదక్ మండలం వాడి పంచాయతీ మెట్టుతండాకు చెందిన రవి-అనిత దంపతులకు మూడోసంతానంలోనూ ఆడకూతురే పుట్టడంతో కౌడిపల్లికి చెందిన ఓ మహిళకు రెండేళ్ల క్రితం రూ.10 వేలకు విక్రయించారు. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు ఆ పసికందును సంగారెడ్డిలోని శిశుసంక్షేమశాఖకు తరలించారు. ⇒కప్రాయిపల్లి తండాకు చెందిన లఖావత్ఫిర్యా-విజ్జి దంపతులకు మూడో సంతానంలోనూ ఆడశిశువే జన్మించడంతో విక్రయానికి పెట్టారు. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు ఆ శిశువును సంగారెడ్డికి తరలించారు. ⇒ఇదే తండాకు చెందిన బానోత్ పెంట్యా-సరిత దంపతులకు మూడో సంతానంలో ఆడపిల్ల జన్మించడంతో నిజామాబాద్ జిల్లాలోని ఓ గిరిజన తండాకు చెందిన మహిళకు విక్రయించారు. విషయం తెలుసుకున్న అధికారులు ఆ శిశువును స్వాధీనం చేసుకొని నిజామాబాద్ ఐసీడీఎస్‌కు తరలించారు. ⇒ ఇలా ఇప్పటివరకు గడిచిన రెండేళ్లలో నలుగురు ఆడశిశువుల విక్రయం జరిగింది. జిల్లా వ్యాప్తంగా చూస్తే 50మందికిపై చిలుకే శిశు విక్రయాలు జరిగి ఉంటాయని జిల్లాకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. ⇒ సమాజంలో ఆడపిల్లలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. కొడుకే వంశోద్ధారకుడని భావిస్తున్నారు. కూతురును వరకట్న బాధితురాలిగా భావిస్తున్నారు. -
ఏ తల్లి కన్నబిడ్డో..!
ఆమదాలవలస : నవమాసాలు మోసి కన్న ఆడశిశువును పాలిథిన్ కవర్లో పెట్టి వదిలి వెళ్లిపోయింది ఓ తల్లి. సంచలనం రేకెత్తించిన ఈ ఘటన బుధవారం ఆమదాలవలసలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి అధికారులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డు వెంగళరావు కాలనీలో రైల్వే ట్రాకు పక్కన ఉన్న పొట్నూరు కృష్ణ ఇంటి వద్ద బాత్రూంలో ముక్కుపచ్చలారని పసికందును బుధవారం తెల్లవారుజామును గుర్తు తెలియని మహిళ విడిచి పెట్టివెళ్లిపోయింది. కృష్ణ భార్య ఉదయాన్నే బాత్ రూం తలుపు తీయగా పసికందు కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులకు, ఇరుగు పొరుగు వారికి విషయం చెప్పి పాపకు స్నానం చేయించింది. తర్వాత వార్డు కౌన్సిలర్ రెడ్డి గౌరి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లగా వెంగళరావు కాలనీకి చెందిన కోటేశ్వరరావు, ఇందిర దంపతులకు పిల్లలు లేరని వారు పెంచుకుంటామని ముందుకొచ్చారు. దీంతో వారికి పసికందును అప్పగించారు. వారు శిశువును శ్రీకాకుళంలో ఒక ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం అందించి తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. ఇంతలో 1098కు గుర్తు తెలియని వ్యక్తులు సమాచారం అందిచడంతో ఐసీడీఎస్, చైల్డ్ లైన్, బాలల సంరక్షణ కార్యాలయాల నుంచి అధికారులు, సిబ్బంది కాలనీకి చేరుకున్నారు. పసి పాపను శిశుగృహకు అప్పగించాలని, లేకుంటే కేసు పెట్టాల్సి వస్తుందని జిల్లా బాలల సంరక్షణాధికారి కె.వి.రమణ హెచ్చరించారు. దీనికి వారు ససేమిరా అనడంతో పోలీసులకు సమాచారం అందించారు. వారి సహాయంతో శిశువును శ్రీకాకుళం శిశుగృహకు తీసుకు వెళ్లిపోయారు. బిడ్డకు రక్షణ కల్పిస్తాం.. బిడ్డకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తామని బాలల సంరక్షణాధికారి తెలిపారు. పిల్లల కోసం శిశుగృహకు దరఖాస్తు చేసుకున్నవారికి బిడ్డను అందిస్తామని పేర్కొన్నారు. పసికందు కన్న తల్లిదండ్రులు పూర్తి ఆధారాలతో వస్తే సమగ్ర దర్యాప్తు జరిపి వారికే అందిస్తామని తెలిపారు. ఆయనతో పాటు ఐసీడీఎస్ సూపర్వైజర్ జె.విజయేశ్వరి, శిశుగృహ మేనేజర్ కె.నరేష్, చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ ఎం. సంతోష్, సిబ్బంది పాల్గొన్నారు. -
రోడ్డుపైనే శిశువును వదిలేశారు..
* రోడ్డు పక్కన ఎండలో 2 నెలల చిన్నారి * నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఘటన మిర్యాలగూడ టౌన్: ఎర్రగా బొద్దుగా ఉంది.. నుదుట బొట్టు.. బుగ్గపై కాటుక చుక్క.. పక్కన పాల పీక.. చూస్తేనే ఎంత ముద్దొస్తుందో.. ఎర్రటి ఎండలో రోడ్డుపక్కన గుక్కపెట్టి ఏడుస్తోందా పసికందు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రాంనగర్ బంధం సమీపంలో గురువారం చోటుచేసుకుంది. మిర్యాలగూడ నుంచి నేరేడుచర్ల వైపు వెళ్తున్న ఓ ఆటోలో నుంచి మహిళ కిందికి దిగి చిన్నారి నోట్లో పాలపీకను పెట్టి ఖమ్మం రోడ్డులోగల రాంనగర్బంధంసమీపంలో రోడ్డు పక్కన వదిలి వెళ్లింది. నోట్లో నుంచి పాల పీక కిందపడిపోవడంతో ఆ చిన్నారి ఎండలో గుక్కపెట్టి ఏడుస్తోంది. మిర్యాలగూడ నుంచి గరిడేపల్లికి వెళ్తున్న పాస్టర్ల ఫెలోషిప్ అధ్యక్షుడు, ఫెయిత్ బంజారా ఆశ్రమ నిర్వాహకుడు డి.హన్యానాయక్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాజుల లింగయ్యగౌడ్ ఘటన స్థలం వద్దకు వెళ్లి ఆ చిన్నారిని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించారు. సీఐ భిక్షపతి చిన్నారిని సీడీపీవో విశ్వజకి అప్పగించగా నల్లగొండలోని శిశు భవన్‌కు పనికందును తరలించారు. -
ఆస్పత్రి ఆవరణలో పసికందు
నూజివీడు: కృష్ణా జిల్లా నూజివీడు ఏరియా ఆస్పత్రిలో పదిహేను రోజుల పసికందును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఆస్పత్రి ఆవరణలో ఏడుస్తున్న ఆడ శిశువును సిబ్బంది గుర్తించారు. ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. శిశువును శిశు సంరక్షణ కమిటీకి అప్పగించాలని అధికారులు నిర్ణయించారు. -
కళ్లు తెరవకముందే ఎంత కష్టం
ఒంగోలు టౌన్: తల్లి వెచ్చని ఒడిలో సేదదీరాల్సిన శిశువు మరుగుదొడ్లో దయనీయ స్థితిలో ప్రత్యక్షమైంది. అప్పుడే పుట్టిన ఆడశిశువు కళ్లు కూడా తెరవలేని స్థితిలో పొత్తిగుడ్డల్లో పడి ఉంది. ఆ సమయంలో కాలకృత్యాలు తీర్చుకోడానికి అటువైపు వచ్చిన వ్యక్తి చూసి ఆసుపత్రి వర్గాలకు సమాచారమిచ్చాడు. ఈ విషయం జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థకు తెలియజేయడంతో ఐసీపీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ లీలావతి ఆదేశాల మేరకు ఐసీపీఎస్ డీసీపీఓ జ్యోతి సుప్రియ హుటాహుటిన అక్కడకు చేరుకొని శిశువును చేరదీశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఒంగోలు ఆర్టీసీ బస్టాండుకు సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి గురువారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో దాదాపు 23 ఏళ్ల వయస్సున్న నిండు గర్భిణీ అక్కడకు వచ్చింది. ఆ యువతికి పెళ్లి కాలేదని తెలిసింది. వచ్చిన కొన్ని నిమిషాల్లోనే ఆడ బిడ్డను ప్రసవించి హడావుడిగా మరుగుదొడ్లో పడేసి వెళ్లిపోరుుంది. డీసీపీఓతోపాటు శిశుగృహ మేనేజర్ శ్రీలత, ఏఎన్ఎం సుశీలలు ఆ బిడ్డను పర్యవేక్షిస్తున్నారు. ఉయ్యాల ఉన్నప్పటికీ... ఆసుపత్రికి కొన్ని అడుగుల దూరంలోనే ఉన్న ఆర్టీసీ బస్టాండులో శిశువులను వదిలేసి వెళుతున్న వారికోసం మహిళా శిశు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉయ్యాల ఏర్పాటు చేసి ఉంది. ఆ ఉయ్యాలలో శిశువును వదిలి వెళ్లి ఉంటే బాగుండేది. వెంటనే చికిత్స అందేది. అరుుతే నిత్యం రద్దీగా ఉండే ఆర్టీసీ బస్టాండులో ఉన్న ఉయ్యాలలో శిశువును వదిలేసి వెళితే ఎవరైనా చూసి గుర్తిస్తారన్న భయంతోనే ఇలా వదిలి వెళ్లి ఉంటుందని భావిస్తున్నారు. పసి కందులను వీధులపాలు చేయవద్దు... బిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఆ బిడ్డను వద్దనుకుంటే తమకు సమాచారం అందించాలని, తాము ఆ బిడ్డను చేరదీసి, సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని ఐసీపీఎస్ డీసీపీఓ జ్యోతిసుప్రియ తెలిపారు. ఇలా పురిటి బిడ్డలను ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వెళ్లొద్దని కోరారు. -
కంటే కూతుర్నే కనాలి
భారం కాదు.. మహాభాగ్యం ఆడపిల్ల భారం అనుకున్నది ఒకప్పుడు. ఇప్పుడు అమ్మాయే ‘మా ఇంటి మహాలక్ష్మి.’ అంటున్నారు నేటితరం తల్లిదండ్రులు. అబ్బాయి అయినా..అమ్మాయి అయినా మాకు ఒక్కటే. ఎలాంటి వివక్ష లేకుండా ఆడపిల్లను పెంచుతున్నాం అని ధీమాగా చెబుతున్నారు. అంతేకాదు..కూతుర్ని కన్నాక.. కుమారుడి కోసం ఎదురు చూడడం లేదు. వారసుడు కావాలంటూ ఆరాటపడడం లేదు. ఆడైనా..మగైనా ఒక్కరు ఉంటే చాలు మాకు అంటూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంతోషంగా కూతురి గురించి..ఆమె భవిష్యత్తు గురించి కలలు కంటున్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా నగరంలో ఒక్క ఆడ కూతురుతోనే సంతోషంగా జీవిస్తున్న కొన్ని జంటల గురించి .... మాకు అబ్బాయి కావాలన్న కోరిక ఎప్పుడూ కలగలేదు. ఆ లోటూ కనిపించలేదు. మా పాప స్నిగ్ధకు నాణ్యమైన చదువులు చెప్పించాలన్నది మా లక్ష్యం. మేం ఇద్దరం ప్రైవేటు ఉద్యోగులం. ఉన్నంతలోనే జీవితాన్ని గడుపుతూ.. మా పాపకు మెరుగైన జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాం. ఆప్యాయంగా మాట్లాడడంలోనూ, ప్రేమను పంచడంలోనూ అమ్మాయిలకు మించిన వారు లేరు. ఎంత మంది ఆడబిడ్డలు పుట్టినా.. అబ్బాయి కోసం ఎదురుచూసే పరిస్థితులు గతంలో ఉండేవి. ఇప్పుడు అందరి ఆలోచనా తీరు, జీవన విధానం, సమాజ అవసరాలు మారాయి. కొడుకులు లేకున్నా సరే.. అమ్మాయిలు ఉంటే చాలని అందరూ బలంగా ఆకాంక్షిస్తున్నారు. మేం ఇదే కోవకు చెందిన వాళ్లం. అన్ని రంగాల్లో మహిళల పాత్ర పెరిగింది. మలి దశలో కొడుకులు చేదోడు వాదోడుగా ఉంటారని ఎందరో తల్లిదండ్రులు ఆశించడం సహజం. కానీ వారి ఆశలు పూర్తిస్థాయిలో నెరవేరడం లేదు. క ళ్ల ముందు ఉండి మాట్లాడని, కనీసం ఒక్క పూట అన్నం పెట్టని కొడుకుల కంటే.. దూరంగా ఉన్న అమ్మాయిలు ఆప్యాయంగా పలకరించి.. తిన్నావా అమ్మ అంటే కడుపు నిండినంత హాయి కలుగుతుంది. అమ్మానాన్నలను భారం అనుకునే వారికంటే.. బాధ్యతగా చూసుకునే ఆడబిడ్డలు నయం. పెళ్లి సంబంధం కోసం మొన్నటి వరకు ఆస్తి, అంతస్తు, హోదాను బట్టి అమ్మాయిలను వెతికేవారు. కాని ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి. చదువుకున్న అమ్మాయి అయితే చాలు.. అదే మహాభాగ్యం అని కళ్లకు అద్దుకుని సంబంధాలు కుదుర్చుకుంటున్నారు. అమ్మానాన్నలకు ఇంతకు మించిన సంతోషం ఇంకేముంటుంది. ఇంట్లో ఆడపిల్ల ఉంటే.. మరో అమ్మతో సమానం! - వంగాల కవితా శ్రీధర్‌రెడ్డి, దంపతులు కూతురే మా ప్రపంచం మాకు 1992లో వివాహం అయింది. 1993లో పాప జన్మించింది. పాపైనా..బాబైనా ఒక్కరితోనే సరిపెట్టుకోవాలని ముందే అనుకున్నాం. అలాగే చేశాం. మా కూతురు గ్రీష్మే మా ప్రపంచం ఇప్పుడు. ఆమెకు బంగారు భవిష్యత్తు ఇచ్చేందుకు ఇద్దరం పాటుపడుతున్నాం. ప్రస్తుతం పాప బీటెక్ పూర్తిచేసింది. మొదట కూతురు పుట్టినప్పుడు కు.ని ఆపరేషన్ చేయించుకుంటామంటే చాలా మంది వద్దన్నారు. కొడుకు ఉండాలన్నారు. మేం వారి మాటలను పట్టించుకోలేదు. మాకు కూతురైనా..కొడుకైనా ఒక్కటే గట్టిగా చెప్పాం. ప్రస్తుతం హైటెక్ యుగంలో ఉన్నాం మనం. ఇంకా ఆడ, మగ వివక్షలు విభేదాలు చూపడం తగదు. మహిళలు అన్నిరంగాల్లోనూ రాణిస్తున్నారు. కాబట్టి ఆడపిల్లైనా మగపిల్లాడైనా ఒక్కటే అని అందరూ భావించాలి. అప్పుడే సమాజం బాగుంటుంది. - ముప్పిడి సీతారాంరెడ్డి, శోభ, కందికల్ గేట్ బెంగ లేదు..భారం కాదు... కొడుకైనా... కూతురైనా ఒక్కటే. అందుకే ఒక్క కూతురితోనే సరిపెట్టుకున్నాం. మా పాప పేరు మహేశ్వరి. ఇంటర్ చదివింది. వారసుడు లేడన్న వెలితి, బెంగ మాకు ఎప్పుడూ లేదు. కూతురు భారం...కుమారుడే ముఖ్యమనే రోజులు పోయాయి. ఇప్పుడు అందరూ సమానమే. పాపను ఉన్నత చదువులు చదివించాలనేది మా లక్ష్యం. అందుకోసం శ్రమిస్తున్నాం. పాపకు ఇష్టమైన రంగాన్నే ఎంచుకోమని చెప్పాం. పూర్తి స్వేచ్ఛగా వ్యవహరిస్తాం. దీంతో మా ఇంట్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి. ఈ సంతోషంలో అన్నీ మర్చిపోతాం. మా పాపే మాకు సర్వస్వం. - పోచబోయిన శ్రీనివాస్‌యాదవ్, మంగమ్మ- సాయినగర్ పాప భవిష్యత్తే ముఖ్యం... బాబు...పాప అనేది కాదు. ఎవరైనా వారికి బంగారు భవిష్యత్తు కల్పించడమే ముఖ్యం. మాకు ఒక్కతే అమ్మాయి. పేరు. సాయి కీర్తి. ప్రస్తుతం 9వ తరగతి చదువుతోంది. పాపను బాగా చదివించి ప్రభుత్వ ఉ ద్యోగం చేయించాలనేది మా కల. మా కలను నెరవేర్చుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తాం. ఒకప్పుడు ఆడపిల్ల అంటే భయపడేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. వివక్ష తొలగింది. అసలు ఆడపిల్లతో అనుబంధం ఎం తో గొప్పది. అది మాటల్లో చెప్పడానికి వీలుకాదు. మా అమ్మాయికి చాలా కోరికలున్నాయి. వాటన్నింటిని నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఒక కుటుంబంలో ఏకైక సంతానంగా ఆడపిల్ల ఉన్నవారికి చదువుల్లో, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. - భార్గవి, చంద్రశేఖర్, ఖాజాగూడ ఎవరైనా ఒక్కటే... మాకు అన్నీ మా మనీషానే. కూతురు, కొడుకు అనే తారతమ్యం లేదు. అందరినీ ఆమెలోనే చూసుకుంటున్నాం. నేను ప్రైవేటు స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్నాను. మా వారు చిరుద్యోగి. మాది పేదకుటుంబం అయినప్పటికీ ఉన్నంతో మా పాపను బాగా చదివించాలని నిర్ణయించాం. పాప ఉన్నత స్థానంలో ఉండాలనేది మా కోరిక. పేద కుటుంబాల్లో పిల్లల చదువులు కొంత భారంగా మారాయి. ఈ విషయంలో ప్రభుత్వం కొంత ఆలోచించి ఏదైనా పథకం పెడితే బావుంటుంది. ఇంట్లో ఏకైక సంతానంగా ఆడపిల్ల ఉన్న కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. మా పాప ఇప్పుడు ఇంటర్ చదువుతోంది. ఆమె ఎంతవరకు చదివితే అంతవరకు చదివిస్తాం. - లతా శ్రీనివాస్, ఖాజాగూడ గర్వంగా ఫీలవుతున్నాం మాది ప్రేమవివాహం. మాకు ఒక్కతే పాప. పేరు జాహ్నవి నాల్గవ తరగతి చదువుతున్నది. మేం ఏనాడూ మగ పిల్లాడు లేడని బాధపడలేదు. ఆడకూతురు ఉన్నందుకు గర్వంగా ఫీలవుతున్నాం. మా వారు సాప్ట్వేర్ ఉద్యోగి. నేను ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్నాను. పాపే మాకు ప్రాణం. ఆమెకు ఎలాంటి లోటు రాకుండా ఇద్దరమూ బాధ్యత తీసుకొని పెంచుతున్నాం. ఇప్పుడు సమాజంలో చాలా మార్పు వచ్చింది. ఆడపిల్ల అంటే చులకన భావం పోయింది. అమ్మాయి అయినా..అబ్బాయి అయినా పిల్లల భవిష్యత్తు ముఖ్యం. వారిని సమాన దృష్టితో చూస్తూ బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడమే పేరెంట్స్‌గా మా బాధ్యత. దాన్ని సంపూర్ణంగా నెరవేరుస్తున్నాం. - సలోమి, మల్లికార్జున్ -
ఎడారి కోకిల
గ్రేట్ లవ్‌స్టోరీ భంబూర్ (సింధ్, పాకిస్థాన్) రాజావారు తీసుకున్న నిర్ణయం విని అంతఃపురం దిగ్భ్రాంతికి గురైంది. రాజుగారికి మతిగానీ చలించలేదు కదా! లేకపోతే ఏమిటి! పండంటి ఆడబిడ్డ కోసం కలలు కన్న రాజావారు... ఆ బిడ్డ పుట్టీ పుట్టగానే ఎందుకు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు? ముక్కు పచ్చలారని పాప చేసిన నేరం ఏమిటి? అందరి మనసుల్లోనూ ఇవే ప్రశ్నలు. ఆ ప్రశ్నలు ఎందుకు పుట్టాయో తెలియా లంటే ముందు ఏం జరిగిందో చెప్పాలి. ‘‘నా బిడ్డ భవిష్యత్ చెప్పండి’’ అంటూ పాపను జ్యోతిష్యుడికి చూపించాడు రాజు. ఆ జ్యోతిష్యుడు పాపను తీక్షణంగా చూసి...‘‘ఈ పాప మీ వంశ కీర్తికి అప్రతిష్ట తెస్తుంది’’ అని చెప్పాడు జ్యోతిష్యుడు. ‘‘ఈ పాపను ఒక చెక్కె పెట్టెలో పెట్టి సింధు నదిలో వదిలేయండి’’ అని భటులకు ఆజ్ఞాపించాడు. నదిలో బట్టలు ఉతుకుతున్న ఒక రజకుడికి ఈ పెట్టె దొరికింది. ‘‘ పిల్లలు లేని నాకు ఈ పాపను ఆ దేవుడే కానుకగా ఇచ్చాడు’’ అనుకున్నాడు రజకుడు. సస్సి నవ యవ్వనశోభతో వెలిగి పోతోంది. ఆమె అందం గురించి పొరుగు రాజ్యం వరకు తెలిసిపోయింది. ఆమె అపురూప సౌందర్యం గురించి ఆ నోటా ఈ నోటా విన్న ఓ రాకుమారుడు పున్ను... భంభూర్ వచ్చాడు. ‘‘అయ్యా... ఏ పని మీద వచ్చారు?’’ అడిగాడు సస్సి తండ్రి. ‘‘మీ కుమార్తెను చూడడానికి వచ్చాను’’ అని చెప్పబోయి నాలిక కర్చుకున్నాడు. అంతలోనే సర్దుకొని ‘‘ఈ బట్టలు ఉతికించడానికి వచ్చాను’’ అన్నాడు తన దగ్గర ఉన్న జత బట్టలను అతడికి ఇస్తూ. ఆ సమయంలోనే ఇంటి బయటకు వచ్చింది సస్సి. ఆమెను చూసీ చూడగానే ప్రేమలో పడిపోయాడు పున్ను. ‘‘ పెళ్లంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలి’’ అనుకున్నాడు. ఆ అమ్మాయి పరిస్థితి కూడా అంతే. పున్నును చూసీ చూడగానే ప్రేమలో పడిపోయింది. ఒకరితో ఒకరికి మాటలు కలిశాయి. ఆ మాటలు ప్రేమపూలై వికసించాయి. కూతురు ప్రేమలో పడిన విషయం తండ్రికి మెల్లగా తెలిసి పోయింది. ‘‘ఎర్రగా బుర్రగా ఉంటేనే సరిపోదు. నా కూతురిని బాగా చూసు కోవాలంటే నాలాగే నువ్వూ కష్టపడాలి. నీకు చిన్న పరీక్ష పెట్టదలుచుకున్నాను. ఈ మూటలో ఉన్న బట్టలను ఉతికి తీసుకురా. మల్లెపూవులా మెరిసిపోవాలి’’ అని పున్నును ఆదేశించాడు సస్సి తండ్రి. ఆయన చెప్పినట్లే రేవుకెళ్లి బట్టలు ఉతికాడు పున్ను. అయితే అన్ని చొక్కాలూ చిరిగిపోయాయి. వాటిని చూసి నెత్తీ నోరూ బాదుకున్నాడు సస్సి తండ్రి. ‘‘మీరేమీ బాధపడకండి. ఇవి తీసుకోండి’’ అంటూ తాను చేసిన పనికి పరిహారంగా జేబులో నుంచి బంగారు నాణేలు తీసి అతనికిచ్చాడు పున్ను. పున్నులోని అమాయకత్వానికి ముచ్చటపడి ‘‘సరేనయ్యా...మా అమ్మాయిని నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను’’ అని వరం ఇచ్చాడు సస్సి తండ్రి. పున్ను ఆకాశంలో తేలిపోయాడు. తన కొడుకు ఒక రజకుడి కూతురిని పెళ్లాడబోతున్న విషయం తెలిసి మండిపడ్డాడు పున్ను తండ్రి మీర్ హోత్ఖాన్. అతని సోదరులు ఉన్నపళంగా పున్ను దగ్గరికి బయలు దేరారు. ‘‘సస్సితోనే నా జీవితం. ఆమె లేని జీవితం నాకు అక్కర్లేదు’’... తెగేసి చెప్పాడు పున్ను. ఒకరికొకరు రహస్యంగా సైగ చేసుకున్నారు సోదరులు. ‘‘ఈ అమ్మా యినే పెళ్లిచేసుకుందావు గాని... ముందు ఇంటికి వెళదాం పద’’ అని మాయమాట లతో పున్ను, సస్సీలను తమతో తీసుకె ళ్లారు. మత్తుమందు కలిపిన ద్రవాన్ని పున్నుతో తాగించి, స్పృహ కోల్పోయేలా చేసి, ఒంటెపై కట్టేసి ఎడారిలో వదిలారు. మరుసటి రోజు జరిగిన మోసాన్ని గ్రహించింది సస్సి. ఆమె గుండె దుఃఖనది అయ్యింది. ప్రియుడిని వెదుక్కుంటూ, ఎన్నో మైళ్ల దూరం ప్రయాణిస్తూ ఎడారిలో వెదుకులాట మొదలెట్టింది. అంతే... తర్వాత ఆమె జాడ తెలియలేదు. ఎడారిలో ఆ ఇద్దరూ ఏమైపోయారో ఎవరికీ తెలియదు. మౌఖిక సాహిత్యం నుంచి మాత్రం ఎన్నో కథలు పుట్టాయి. అందులో ముఖ్యమైనది... భూమి తనకు తానుగా చీలిపోయి, ఇద్దరు ప్రేమికులను తనలో దాచుకుందని. తన గుండెల్లో పెట్టుకుందని. ఇది అందమైన కల్పనే కావచ్చు. కానీ ఆ ఇద్దరి ప్రేమ మాత్రం అజరామరమై నిలిచిపోయింది! -
ఆడశిశువును పీక్కుతిన్న పందులు
హన్మకొండ: వరంగల్ జిల్లాలో హన్మకొండలోని పద్మాక్షి కాలనీలో గురువారం ఓ ఘోరం వెలుగుచూసింది. ఆడపిల్ల తమకు భారమనుకున్నారో లేక అధిక కట్నాలిచ్చి పెళ్లి చేయలేమని భావించారో తెలియదు కానీ ముక్కుపచ్చలారని ఓ పసికందును వీధిపాలుచేశారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆ పసిగొడ్డును వీధిలోని చెత్తకుండిలో విసిరేయడంతో పందులు పీక్కుని తిన్నాయి. రోడ్డుపక్కన నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసిన పసిగుడ్డును పందులు పీక్కుతింటుండగా స్థానికులు చూశారు. పందులను అక్కడినుంచి తరిమేసి చూడగా అప్పటికే శిశువు చనిపోయి ఉంది. దాంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. -
పసిగుడ్డును వదిలేశారు..
వనస్థలిపురం పరిధిలోని సాగర్‌రోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తులు పసికందును వదిలేశారు. శనివారం ఉదయం అటుగా వెళ్లే ఆటో డ్రైవర్లు చిన్నారి ఏడుపు విని.. చుట్టు పక్కల గమనించగా.. బ్యాగ్ లో ఉంచిన ఆడ శిశువు కనిపించింది. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు శిశువును సమీపంలోని శిశువిహార్ లో అప్పగించారు. శిశువు మూడు, నాలుగు రోజుల క్రితం జన్మించి ఉంటుందని భావిస్తున్నారు. -
ఆడ పిల్ల అని వదిలేశారు
ఆడపిల్ల పుట్టిందని వదిలేసి వెళ్లిపోయారు ఆ తల్లిదండ్రులు.. కరీంనగర్ జిల్లా మెట్ పల్లి సమీపంలోని చెరువు వద్ద సోమవారం ఉదయం పసిపాప ఆరుపులు వినిపించాయి. స్థానికులు అరుపులు గమనించి.. వెళ్లి చూస్తే.. అప్పుడే పుట్టిన ఆడ శిశువు కనిపించింది.. దీంతో పసిబిడ్డను ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. -
ఆడపిల్ల పుట్టిందని..
ఆడ పిల్ల పుట్టిందని వదిలేసి వెళ్లిన ఘటన నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట సుందరయ్యనగర్‌లోని నిర్మానుష్య ప్రదేశంలో అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తు తెలియని మహిళ వదిలి వెళ్లింది. పసికందు ఏడుపు విని స్థానిక మహిళలు అక్కడికి చేరుకుని 108కు సమాచారం ఇచ్చారు. స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనారోగ్యంతో ఉన్న శిశువుకు చికిత్సలు అందిస్తున్నారు. -
బిడ్డను చంపేయమంటున్నాడు..
పుట్టి పట్టుమని నాలుగు రోజులూ నిండలేదు.. పేగు పుండు ఆరనూ లేదు.. మమకారంతో పెంచాల్సిన తండ్రే వద్దనుకున్నాడు.. ఆ..డ బిడ్డ అని తెలిసి.. పురిటిలోనే తుంచేయాలని భార్యను ఆజ్ఞాపించాడు.. లేకుంటే ఇంటికే రావద్దని ఆదేశించాడు.. భర్త మాట జవదాటలేక.. పేగుబంధాన్ని తెంచేయలేక.. పుట్టెడు దుఃఖంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది ఓ బాలింత.. ఈ ఘటన శనివారం మదనపల్లెలో సంచలనం రేపింది. మదనపల్లె రూరల్ : మదనపల్లె పట్టణంలోని నీరుగట్టువారిపల్లె మాయాబజార్లో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ సలీమ్ గురుకుల పాఠశాల సమీపంలో నివాసం ఉంటున్న రమణమ్మ కుమార్తె దేవదానమ్మ(23)ను ఏడాది క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దేవదానమ్మ నాలుగు రోజుల క్రితం స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. విషయం తెలుసుకున్న భర్త సలీమ్ ఆడబిడ్డ అని మండిపడ్డాడు. ఆ బిడ్డను ఇంటికి తీసుకురావద్దు... చంపేసి ఇంటికిరా అంటూ హుకుం జారీచేశాడు. భయాందోళనకు గురైన దేవదానమ్మ స్థానిక టూటౌన్‌లోని మహిళా జ్యువినల్వింగ్ కోఆర్డినేటర్ రమాదేవిని ఆశ్రయించింది. స్పందించిన ఆమె తల్లీబిడ్డకు రక్షణ కల్పిస్తూ సలీమ్‌పై తదుపరి చర్యలకు ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం షీటీమ్ పోలీసుల సంరక్షణలో తల్లీబిడ్డ ఉన్నారు. -
26 వేళ్లతో ఆడ శిశువు జననం
ఆదిలాబాద్ జిల్లా భైంసా ఏరియా ఆస్పత్రిలో సోమవారం 26 వేళ్లతో ఆడ శిశువు జన్మించింది. పట్టణంలోని రాజీవ్‌నగర్‌కు చెందిన అజయ్, శ్రావణి దంపతుల మొదటి సంతానంగా పుట్టిన ఈ శిశువు ఒక్కో చేతికి ఏడు వేళ్ల చొప్పున ఉండగా, కాళ్లకు ఆరు చొప్పున ఉన్నాయి. మొత్తంగా 26 వేళ్లతో చిన్నారి జన్మించింది. శిశువు ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. - భైంసా రూరల్ -
పుట్టినది ఆడబిడ్డ అయితే చాలు...
తిరుపతి: పుట్టిన బిడ్డ ఆడ అని తెలియగానే నిర్ధాక్షణ్యంగా చంపివేయడం, పారవేయడం వంటి సంఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తిరుపతిలో ఈ రోజు అటువంటి సంఘటనే ఒకటి జరిగింది. బీటీఆర్ కాలనీలో గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన ఆడబిడ్డను ముళ్లపొదల్లో పడవేశారు. అది చూసిన స్థానికులు వెంటనే అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పసికందు కొన ఊపితో ఉంది. వెంటనే ఆ బిడ్డను మెటర్నిటీ ఆస్పత్రికి తరలించారు. ఆ బిడ్డను ఎవరు పారవేశాలో తెలుసుకునేందుకు పోలీలు దర్యాప్తు మొదలుపెట్టారు. -
ప్రభుత్వాసుపత్రిలో ఆడ శిశువు అమ్మకం?
పెగడపల్లి(కాల్వశ్రీరాంపూర్) : జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ ఆడ శిశువును కన్నతండ్రే విక్రయించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో ఓ ఆరోగ్యం కేంద్రం సిబ్బంది మధ్యవర్తిగా మారి రూ.ఐదు లక్షలకు బేరం కుదిర్చినట్లు సమాచారం. అయితే శిశువును కొన్నవారి నుంచి డబ్బు ఇప్పించడంలో వివాదం ఏర్పడి.. అది ముదరడంతో విషయం బయటకు పొక్కినట్లయ్యింది. కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లికి చెందిన ఓ వికలాంగుడు భార్య చనిపోతే సుల్తానాబాద్‌కు చెందిన మరో మహిళను కులాంతరం వివాహం చేసుకున్నాడు. ఆ మహిళ గర్భం దాల్చడంతో పురుడు కోసం ఇటీవల జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ ప్రసవం అయ్యాక అపస్మారక స్థితికి చేరింది. దీనిని అదునుగా భావించిన ఓ ఆరోగ్యకేంద్రం సిబ్బంది వికలాంగుడితో రూ.ఐదు లక్షలకు బేరం కుదుర్చుకుని.. రూ.25 వేలు అడ్వాన్సుగా ఇచ్చి పాపను తీసుకెళ్లినట్లు సమాచారం. పాప గురించి తల్లి ఆరా తీయగా.. ఐసీయూలో ఉందని నమ్మించి ఆమెను పుట్టినింటికి పంపారు. పాప తండ్రి మిగతా డబ్బుల కోసం దళారిని నిలదీశాడు. దీనికి దళారి పాప చనిపోయిందని, ఇక డబ్బులు ఇచ్చేది లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో వికలాంగుడు అతడితో వాగ్వావాదానికి దిగగా కొందరు పెద్దమనుషులు రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. -
బాలారిష్టాల్లో ‘బంగారు తల్లి’
చేవెళ్ల రూరల్: బాలికలపై వివక్ష, భ్రూణ హత్యలను నివారించి బాలికాభివృద్ధికి కృషి చేయాలనే లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బంగారు తల్లి పథకం ఆది నుంచీ బాలారిష్టాలనే ఎదుర్కొంటోంది. గతంలో ఉన్న బాలికా శిశు సంరక్షణ పథకాన్ని మరిపించేలా 2013 జూలైలో చట్టబద్ధత కల్పిస్తూ ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. 2013 మే నుంచి పుట్టిన ప్రతి ఆడబిడ్డకూ ఈ పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. పథకం ఏర్పాటులో ఆశయాలు గొప్పగానే ఉన్నా ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. వందలాది మంది లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకుంటున్నా.. లబ్ధి పొందుతున్న వారు మాత్రం పదుల సంఖ్యలో ఉంటున్నారు. ఈ పథకంలో ఆడపిల్ల పుట్టిన వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రూ.2500 వారి ఖాతాలో జమ చేస్తారు. ఆ తర్వాత విడతల వారీగా ప్రతి ఏటా ఆడపిల్ల చదువుకు నిధులు కేటాయించాలనేది దీని లక్ష్యం. మొత్తం రెండు లక్షల 16వేల రూపాయలు బంగారుతల్లి పథకం కింద లబ్ధి చేకూరుతుంది. మండలంలో మొత్తం 30 గ్రామ పంచాయతీల్లో ఎంతో మంది ఆడబిడ్డలు జన్మించారు. కాగా వారిలో ఇప్పటివరకు దాదాపు 438 మంది వరకు లబ్ధిదారులు బంగారుతల్లి పథకానికి దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో ఇప్పటి వరకు కేవలం 180 మందికి మాత్రమే పథకం మొదటి సంవత్సరం కింద నిధులను మంజూరు చేశారు. వీరికి రెండో విడత నిధులు మాత్రం ఇప్పటికీ ఊసేలేదు. మిగిలిన వారు దరఖాస్తులు చేసుకోగా.. ఆన్లైన్లో నమోదు చేసి ఏడాది గడిచినా బంగారు తల్లి పథకం భరోసా కల్పించటం లేదు. నిధులు లేమి కారణంతో ఏ ఒక్క లబ్ధిదారుకూ ప్రయోజనం చేకూరడంలేదు. ఆడపిల్లలను కన్నవారు బంగారు తల్లి పథకానికి దరఖాస్తులు చేసుకునేందుకు వెలుగు కార్యాలయానికి వస్తూనే ఉన్నారు. పథకం అమలు ద్వారా ఎంతో విశ్వాసంతో బంగారు తల్లుల భవిష్యత్‌పై భరోసా ఏర్పడుతుందని భావించిన తల్లిదండ్రులకు నిరాశే మిగులుతోంది. ఇదిలా ఉంటే.. నిధుల లేమి పేరుతో అర్హులైన దరఖాస్తుదారులకు చాలామందికి మొదటి విడత నిధులు అందకపోవడంతో పాటు మొదటి విడత ప్రయోజం పొందిన కొంతమందికి రెండో విడుత నిధుల మంజూరు ఆచూకే లేకుండా పోయింది. బంగారు తల్లి పథకం అమలుతో గతంలోని బాలికా సంరక్షణ పథకం కూడా లేకపోవటంతో పేద, మధ్యతరగతికి చెందిన ఆడపిల్లల తల్లిదండ్రులు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని బంగారుతల్లి పథకం లబ్ధిదారులు కోరుతున్నారు. రిజిస్ట్రేషన్లు చేస్తూనే ఉన్నాం... బంగారు తల్లి పథకానికి సంబంధించిన దరఖాస్తులు వస్తున్నాయి. వాటిని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు చేస్తూనే ఉన్నాం. నిధుల విషయం ప్రభుత్వానికే తెలుసు. ఇప్పటివరకు 438 మంది లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకోగా.. వాటిలో 180 వరకు గ్రౌండింగ్ అయ్యాయి. నిధులు వచ్చిన వెంటనే లబ్ధిదారుల అకౌంట్లలో నేరుగా జమ చేస్తాం. - మంజులవాణి, ఏపీఎం, చేవెళ్ల -
సరొగసీలోనూ.. అమ్మాయి వద్దు!!
వాళ్లు ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉంటారు. తమకు ఒక బిడ్డే ఉండటంతో సరొగసీ పద్ధతి ద్వారా మరోబిడ్డ కావాలనుకున్నారు. భారతదేశంలో అయితే చవగ్గా వీలవుతుందని భావించి.. ఇక్కడకు వచ్చారు. సరొగేట్ తల్లికి ఇద్దరు పండంటి బిడ్డలు పుట్టారు. వాళ్లలో ఒకళ్లు బాబు, మరొకళ్లు పాప. అయితే ఆస్ట్రేలియన్ జంట మాత్రం తమకు అమ్మాయి వద్దు, అబ్బాయి మాత్రమే కావాలని మంకుపట్టు పట్టారు. పిల్లలిద్దరినీ తీసుకెళ్లాలని భారతదేశంలో ఉన్న ఆస్ట్రేలియా రాయబార కార్యాలయం అధికారులు వాళ్లకు ఎంతగా చెప్పినా కూడా వినిపించుకోలేదు. కేవలం లింగ వివక్ష కారణంగానే ఆ జంట తమ సరొగేట్ పాపను భారతదేశంలో వదిలిపెట్టేసినట్లు ఆస్ట్రేలియన్ హై కమిషన్ ఆ దేశంలోని ఫ్యామిలీ కోర్టుకు తెలిపింది. పిల్లలిద్దరినీ స్వదేశానికి తీసుకెళ్లాలని చెప్పి.. కొన్నాళ్లు వీసా ఇవ్వడం కూడా ఆలస్యం చేసినా ఫలితం దక్కలేదు. ఆ జంటకు అప్పటికే ఒక బిడ్డ ఉంది. మరో బిడ్డ కావాలని సరొగసీ కోసం వచ్చారు. కానీ పుట్టిన ఇద్దరు పిల్లల్లో కేవలం మగ పిల్లాడిని మాత్రమే తీసుకుని వెళ్లిపోయారు. దీంతో ఇలాంటి కేసులపై గట్టి విచారణ జరిపించాలని ఆస్ట్రేలియాలోని ఫ్యామిలీ కోర్టు నిర్ణయించింది. అయితే ఆస్ట్రేలియన్ జంట మాత్రం.. తాము ఒక బిడ్డ సరిపోతుందని అనుకున్నామని, కానీ కవలలు పుట్టడంతో తమకు ఒకళ్లు చాలనుకుని మగ పిల్లాడిని తీసుకెళ్లామని అంటున్నారు. అప్పటికే తమకు ఒక పాప ఉండటంతో బాబును తీసుకెళ్లామన్నారు. -
ఆడపిల్ల పుడితే 111 మొక్కలు నాటుతారు!
ఆదర్శం: కాలం మారిందంటాం. ఆడా మగా తేడాలు పోయాయంటాం. కానీ ఆడపిల్ల పుట్టిందని పురిట్లోనే చంపేశారనో, ముళ్లపొదల్లో ఆడ పసికందు మృతదేహమనో వార్తలు వింటూనే ఉంటాం. కానీ ఆడపిల్ల పుడితే ఊరంతా సంబరాలు చేసుకునే ఊరిని ఎక్కడైనా చూశామా? అమ్మాయికి గుర్తుగా 111 చెట్లు నాటి, వాటిని పెంచి పెద్దవి చేసే జనాల గురించి ఎక్కడైనా విన్నామా? అమ్మాయిని అమ్మలా భావించి కొలుస్తున్న ఊరి గురించి తెలుసుకుందాం రండి. పట్టణాలకు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్‌లో పిప్లాంట్రి అనే గ్రామం గురించి కొన్నేళ్ల ముందు వరకు ఎవరికీ తెలియదు. ఆరేళ్ల క్రితం అన్నింటిలాగే అదీ. కానీ ఇప్పుడా గ్రామం పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ప్రపంచ మీడియా వేనోళ్ల పొగుడుతోంది. అందుక్కారణం... ఆడపిల్లను దేవతలా భావించి, ఆదరిస్తున్న ఆ ఊరి జనమే. ఆడపిల్ల పుట్టగానే అక్కడివారు దురదృష్టం అనుకోరు. సంతోషంగా సంబరాలు చేసుకుంటారు. వెంటనే మామిడి, నిమ్మ, ఉసిరి లాంటి రకరకాల చెట్లు 111 నాటుతారు. ఈ సంప్రదాయాన్ని ప్రస్తుత పిప్లాంట్రి గ్రామ సర్పంచి శ్యామ్‌సుందర్ పలివాల్ తన కూతుర్ని కోల్పోయిన కొన్ని నెలలకు మొదలుపెట్టారు. గ్రామస్తులందరినీ సమావేశపరిచి, ఆడపిల్ల పుడితే చెట్లు నాటి, వాటిని పెంచి పెద్దచేద్దామన్న పలివాల్ ఆలోచనకు మొదట పెద్దగా స్పందన రాలేదు కానీ, ఒకరిద్దరు ఈ సంప్రదాయాన్ని పాటించాక, అందరూ అనుసరించారు. కేవలం చెట్లు నాటేయడంతో ఈ కథ ముగియదు. వాటిని పెంచి, పెద్ద చేసే బాధ్యత కూడా తీసుకుంటారు. అంతేకాదు... ఆడపిల్ల పుట్టిన కుటుంబ యజమానికి 10 వేల రూపాయలు పంచాయితీ ఇవ్వాలి. గ్రామస్తులంతా మరో రూ.21 వేలు చందా ఇస్తారు. మొత్తం 31 వేలను ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. 20 ఏళ్ల తర్వాత, ఆ ఎఫ్డీ అమ్మాయి చేతికందుతుంది. అది ఆమె భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. అమ్మాయి పెళ్లి, చదువు ఎవరికీ భారం కాకూడదనే ఉద్దేశంతో చేసిన ఏర్పాటిది. భవిష్యత్తుపై భరోసా ఉండటంతో ఆడపిల్లను కన్నామని ఎవరూ చింతించరిక్కడ. అయితే అమ్మాయి భద్రత విషయంలో పిప్లాంట్రి పంచాయితీ అక్కడితో ఆగిపోవట్లేదు. 18 ఏళ్ల కంటే ముందు అమ్మాయికి పెళ్లి చేయబోమని, ఆమె చదువును ఆపబోమని, తనకోసం నాటిన చెట్లను కాపాడతామని పంచాయితీకి తల్లిదండ్రులు అఫిడవిట్ కూడా సమర్పించాలి. దీన్ని మీరితే గ్రామంలో ఎవ్వరూ ఆ కుటుంబానికి సహకరించరు. ఆడపిల్ల పుట్టినప్పుడే కాదు, ఎవరైనా చనిపోయినప్పుడు కూడా 11 చెట్లు నాటడం గ్రామంలో సంప్రదాయంగా మారింది. ఆదర్శ గ్రామం ఆడపిల్లల్ని కాపాడేందుకు పలివాల్ వేసిన ఒక ముందడుగు పిప్లాంటి గ్రామ రూపురేఖల్ని మార్చేసింది. ఒకమంచి పని అనేక మంచిపనులను చేయించింది. మార్బుల్ పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన పిప్లాంట్రి ఒకప్పటి పంచాయితీ అధికారులు డబ్బుకోసం ఇష్టానుసారం ఎన్వోసీలు (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు) ఇచ్చేశారు. దీంతో మైనింగ్ కాలుష్యం బాగా పెరిగిపోయింది. తాగడానికి నీరు కూడా దొరకని పరిస్థితికి చేరుకున్న దశలో పలివాల్ చేపట్టిన చెట్ల పెంపకం ఈ రోజు గ్రామాన్ని కాలుష్యం బారి నుండి బయటపడేలా చేయడమే కాదు, విప్లవాత్మకమైన మార్పులకూ కారణమైంది. గత కొన్నేళ్లలో పిప్లాంట్రి గ్రామస్తులు ఏకంగా రెండున్నర లక్షల చెట్లు నాటారు. ఆ చెట్ల వల్ల కాలుష్యం పూర్తిగా తగ్గడమే కాదు, వాటి ద్వారా వచ్చే ఆదాయం ఆ ఊరిని లగ్జరీగా తీర్చిదిద్దుకునేందుకు ఉపయోగపడింది. పండ్ల చెట్లకు చుట్టూ నాటే కలబంద చెట్ల ద్వారా కూడా ఆదాయం సమకూర్చుకుంటున్నారు. పంచాయితీ సహకారంతో అలోవీరా ఉత్పత్తులు తయారుచేసి అమ్ముతున్నారు. ఆ బ్రాండ్ పిప్లాంట్రి బ్రాండ్. మరోవైపు పంచాయితీ నిధులతో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని, స్వచ్ఛమైన నీళ్లు తాగుతున్నారు. ప్రభుత్వ నిధులకు గ్రామస్తుల సహకారం తోడై రోడ్లు, స్కూళ్లు నిర్మించుకున్నారు. 24 గంటల కరెంటు. పాడవని వీధి దీపాలు. ఆరోగ్య, విద్య సదుపాయలు. వ్యాక్సినేషన్ వంటి ఖరీదైనవీ ఉచితంగా అందుబాటులో ఉంటాయక్కడ. మొత్తంగా ఈ గ్రామంలో లేని సౌకర్యమంటూ ఏదీ లేదు. 2006 వరకు రాజస్థాన్‌లో ఒక్క గ్రామం కూడా ‘నిర్మల్ ఆదర్శ గ్రామం’ పురస్కారానికి ఎంపిక కాలేదు. అయితే పిప్లాంట్రి ఆ ఘనత సాధించి మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది. ఈ ఊరు సొంతంగా ‘గ్రామ గీతం’ రూపొందించుకోవడమే కాక, వెబ్సైట్ కూడా తీర్చిదిద్దుకుంది. అన్నట్లు, పిప్లాంట్రి గ్రామంలో ఆల్కహాల్ నిషిద్ధం. జంతు వధ, చెట్లు నరకడం కూడా. గత ఏడెనిమిదేళ్లలో ఇక్కడ ఒక్క పోలీస్ కేసు కూడా లేదంటే ఆశ్చర్యపోవాల్సిందే. -
అమ్మకానికి ఆడశిశువు
రూ.15 వేలకు కుదిరిన బేరం విశ్వసనీయ సమాచారంతో అడ్డుకున్న పోలీసులు.. కేసు నమోదు కొండమల్లేపల్లి : అంగట్లో ఆడశిశువును అమ్ముకునే దుస్థితి, పరిస్థితి గిరిజన తండాల్లో ఇంకా మారడం లేదు. ఓ వైపు మగసంతానంపై ఆసక్తి, మరోవైపు అధిక సంతానాన్ని పెంచలేని పేదరికంతో ఆడశిశువులను అంగట్లో పెట్టి అమ్మేస్తున్నారు. తాజాగా దేవరకొండ మండలం కొండమల్లేపల్లిలో రూ.15వేలకు ఆడశిశువును విక్రయిస్తుండగా విశ్వసనీయ సమాచారంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. చందంపేట మండలం పోలేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఫకీర్‌నాయక్ తండాకు చెందిన మూడావత్ బాలు, కుమారీలకు ఇప్పటికే ఇద్దరు ఆడసంతానం. పదిహేను రోజుల క్రితం మూడవ కాన్పులో మళ్లీ ఆడపిల్లే జన్మించడంతో భారంగా భావించిన తల్లిదండ్రులు ఆ శిశువును అమ్మకానికి పెట్టారు. అదే తండాకు చెందిన మూడావత్ భారతి అనే మహిళ మధ్యవర్తిత్వం నెరిపింది. హైదరాబాద్‌లోని విప్రో కంపెనీలో పనిచేస్తున్న పి.కుమార్ అనే వ్యక్తికి రూ.15 వేలకు అమ్మడానికి బేరం కుదిరింది. ఈ నేపథ్యంలో శిశువును శుక్రవారం వారికి అప్పగించడానికి ప్రయత్నిస్తుండగా సమాచారం బయటకు పొక్కడంతో వీఆర్ఓ వెంకటేశ్వర్లు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సీఐ భాస్కర్ వారిని కొండమల్లేపల్లిలో పట్టుకొని కేసు నమోదు చేశారు. శిశువును విక్రయించడానికి ప్రయత్నించిన తల్లిదండ్రులు, కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన పి.కుమార్, మధ్యవర్తి భారతిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. శిశువును దేవరకొండ శిశుగృహకు తరలించారు.