ఎడారి కోకిల | Great Love Story | Sakshi
Sakshi News home page

ఎడారి కోకిల

Published Sat, Feb 20 2016 10:29 PM | Last Updated on Sun, Sep 3 2017 6:03 PM

ఎడారి కోకిల

ఎడారి కోకిల

గ్రేట్ లవ్‌స్టోరీ
భంబూర్ (సింధ్, పాకిస్థాన్) రాజావారు తీసుకున్న నిర్ణయం విని అంతఃపురం దిగ్భ్రాంతికి గురైంది. రాజుగారికి మతిగానీ చలించలేదు కదా! లేకపోతే ఏమిటి! పండంటి ఆడబిడ్డ కోసం కలలు కన్న రాజావారు... ఆ బిడ్డ పుట్టీ పుట్టగానే ఎందుకు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు? ముక్కు పచ్చలారని  పాప చేసిన నేరం ఏమిటి? అందరి మనసుల్లోనూ ఇవే ప్రశ్నలు. ఆ ప్రశ్నలు ఎందుకు పుట్టాయో తెలియా లంటే ముందు ఏం జరిగిందో చెప్పాలి.
 
‘‘నా బిడ్డ భవిష్యత్ చెప్పండి’’ అంటూ పాపను జ్యోతిష్యుడికి  చూపించాడు రాజు. ఆ జ్యోతిష్యుడు పాపను తీక్షణంగా చూసి...‘‘ఈ పాప మీ వంశ కీర్తికి అప్రతిష్ట తెస్తుంది’’ అని చెప్పాడు జ్యోతిష్యుడు. ‘‘ఈ పాపను ఒక చెక్కె పెట్టెలో పెట్టి సింధు నదిలో వదిలేయండి’’ అని భటులకు ఆజ్ఞాపించాడు. నదిలో బట్టలు ఉతుకుతున్న  ఒక రజకుడికి  ఈ పెట్టె దొరికింది. ‘‘ పిల్లలు లేని నాకు ఈ పాపను ఆ దేవుడే  కానుకగా ఇచ్చాడు’’ అనుకున్నాడు  రజకుడు.
   
సస్సి నవ యవ్వనశోభతో వెలిగి పోతోంది. ఆమె అందం గురించి పొరుగు రాజ్యం వరకు తెలిసిపోయింది. ఆమె అపురూప సౌందర్యం గురించి ఆ నోటా ఈ నోటా విన్న ఓ రాకుమారుడు పున్ను... భంభూర్ వచ్చాడు.
 ‘‘అయ్యా... ఏ పని మీద వచ్చారు?’’ అడిగాడు సస్సి తండ్రి. ‘‘మీ కుమార్తెను చూడడానికి వచ్చాను’’ అని చెప్పబోయి నాలిక కర్చుకున్నాడు. అంతలోనే సర్దుకొని ‘‘ఈ బట్టలు ఉతికించడానికి వచ్చాను’’ అన్నాడు తన దగ్గర ఉన్న జత బట్టలను అతడికి ఇస్తూ. ఆ సమయంలోనే ఇంటి బయటకు వచ్చింది సస్సి.

ఆమెను చూసీ చూడగానే ప్రేమలో పడిపోయాడు పున్ను. ‘‘ పెళ్లంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలి’’ అనుకున్నాడు. ఆ అమ్మాయి పరిస్థితి కూడా అంతే. పున్నును  చూసీ చూడగానే ప్రేమలో పడిపోయింది. ఒకరితో ఒకరికి మాటలు కలిశాయి. ఆ మాటలు ప్రేమపూలై వికసించాయి. కూతురు ప్రేమలో పడిన విషయం తండ్రికి మెల్లగా తెలిసి పోయింది. ‘‘ఎర్రగా బుర్రగా ఉంటేనే సరిపోదు. నా కూతురిని బాగా చూసు కోవాలంటే నాలాగే నువ్వూ  కష్టపడాలి.

నీకు చిన్న పరీక్ష పెట్టదలుచుకున్నాను. ఈ మూటలో ఉన్న బట్టలను  ఉతికి తీసుకురా. మల్లెపూవులా మెరిసిపోవాలి’’ అని పున్నును  ఆదేశించాడు సస్సి తండ్రి. ఆయన చెప్పినట్లే రేవుకెళ్లి బట్టలు ఉతికాడు పున్ను. అయితే అన్ని చొక్కాలూ చిరిగిపోయాయి. వాటిని చూసి నెత్తీ నోరూ బాదుకున్నాడు సస్సి తండ్రి. ‘‘మీరేమీ బాధపడకండి. ఇవి తీసుకోండి’’ అంటూ తాను చేసిన పనికి పరిహారంగా జేబులో నుంచి  బంగారు నాణేలు తీసి అతనికిచ్చాడు పున్ను.
 
పున్నులోని అమాయకత్వానికి ముచ్చటపడి ‘‘సరేనయ్యా...మా అమ్మాయిని నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను’’ అని   వరం ఇచ్చాడు  సస్సి తండ్రి. పున్ను  ఆకాశంలో తేలిపోయాడు. తన  కొడుకు ఒక రజకుడి కూతురిని పెళ్లాడబోతున్న విషయం తెలిసి మండిపడ్డాడు పున్ను  తండ్రి మీర్ హోత్‌ఖాన్. అతని సోదరులు ఉన్నపళంగా పున్ను దగ్గరికి  బయలు దేరారు.
 
‘‘సస్సితోనే నా జీవితం. ఆమె లేని జీవితం నాకు అక్కర్లేదు’’...  తెగేసి  చెప్పాడు పున్ను.  ఒకరికొకరు రహస్యంగా సైగ చేసుకున్నారు సోదరులు. ‘‘ఈ అమ్మా యినే పెళ్లిచేసుకుందావు గాని... ముందు ఇంటికి వెళదాం పద’’ అని మాయమాట లతో పున్ను, సస్సీలను తమతో తీసుకె ళ్లారు. మత్తుమందు కలిపిన ద్రవాన్ని పున్నుతో తాగించి, స్పృహ కోల్పోయేలా చేసి, ఒంటెపై కట్టేసి ఎడారిలో వదిలారు.
 
మరుసటి రోజు జరిగిన మోసాన్ని గ్రహించింది సస్సి. ఆమె గుండె దుఃఖనది అయ్యింది. ప్రియుడిని వెదుక్కుంటూ, ఎన్నో మైళ్ల దూరం ప్రయాణిస్తూ ఎడారిలో వెదుకులాట మొదలెట్టింది. అంతే... తర్వాత ఆమె జాడ తెలియలేదు. ఎడారిలో ఆ ఇద్దరూ ఏమైపోయారో ఎవరికీ తెలియదు. మౌఖిక  సాహిత్యం  నుంచి మాత్రం ఎన్నో కథలు పుట్టాయి. అందులో ముఖ్యమైనది... భూమి తనకు తానుగా చీలిపోయి, ఇద్దరు ప్రేమికులను తనలో దాచుకుందని. తన గుండెల్లో పెట్టుకుందని. ఇది అందమైన కల్పనే కావచ్చు. కానీ ఆ  ఇద్దరి ప్రేమ మాత్రం అజరామరమై నిలిచిపోయింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement