పొత్తిళ్లలోనే అమ్మకానికి
♦ అంగడి సరుకుగా ఆడ శిశువులు
♦ కళ్లు తెరవకుండానే అమ్మఒడిని వదులుతూ..
♦ రెండేళ్లలో నలుగురి విక్రయం
♦ తాజాగా మరో చిన్నారి...
♦ ఆలస్యంగా వెలుగు చూసిన మెట్టుగడ్డ తండా ఘటన
మెదక్: పొత్తిళ్లలోని ఆడశిశువులు అంగడి సరుకుగా మారుతున్నారు. పేదరికం ఓ వైపు... వంశోద్ధారకుడు కావాలనే ఆశ మరోవైపు.. ఫలి తంగా గిరిజనుల కడుపున పుట్టిన ఆడశిశువులు కళ్లు తెరవకుండానే అమ్మను వదిలి పెంపుడు తల్లులు ఒడికి చేరుతున్నారు. మెదక్ మండలంలో రెండేళ్లకాలంగా నలుగురు చిన్నారుల క్రయవిక్రయాలు జరిగాయి. తాజాగా మరో చిన్నారిని విక్రయించిన ఘటన సోమవారం వెలుగు చూసింది.
మెదక్ మండలం వాడి పంచాయతీలోని మెట్టుగడ్డ తండాకు చెందిన లంబాడి స్రవంతి, గణేశ్ దంపతులు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు కాగా ఆమె మళ్లీ గర్భందాల్చింది. రెండెకరాల్లో పంటలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఓ బోరు కాస్త ఎండిపోయింది. సాగునీటికోసం తలకుమించిన అప్పులుచేసి మరో నాలుగు బోర్లు వేశారు. ఎందులోనూ చుక్కనీరు రాలేదు. బతుకుదెరువు లేక.. అప్పుల వారికి ముఖం చూపించలేకపోయాడు గణేశ్. ఉన్న బంగారం అమ్మి, అందులోకి మరిన్ని అప్పులు చేసి గణేశ్ ఆరునెలలక్రితం దుబాయ్‌కి వలస వెళ్లాడు. ఆయన దుబాయ్ వెళ్లిన మూడు నెలలకు స్రవంతికి మూడో కాన్పులోనూ ఆడపిల్లే జన్మించింది.
ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉండగా, మూడో కాన్పులోనూ ఆడబిడ్డ పుట్టడంతో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఉపాధి కరువై భర్త పొట్టచేత పట్టుకుని దుబాయ్‌కి పోగా, పిల్లలను పోషించ లేక స్రవంతి తల్లడిల్లిపోయింది. ఈ క్రమంలో చంటిపిల్లను పోషించే స్థోమత లేక రెండు నెలల క్రితం నిజామాబాద్ జిల్లా లింగంపల్లి మండలం సురాయిపల్లి తండాకు చెందిన పీర్యా-సంతు దంపతులకు రూ.10 వేలకు విక్రయించింది. విషయం తెలుసుకున్న అంగన్‌వాడీ, ఐసీడీఎస్ అధికారులు పసికందు గురించి ఆరాతీయగా, చనిపోయిందని ఓసారి, పెంచుకునేందుకు బంధువులు ఇచ్చామని మరోసారి చెప్పింది స్రవంతి. సర్పంచ్‌తోపాటు ఐసీడీఎస్, అంగన్‌వాడీ అధికారులు సోమవారం స్రవంతి ఇంటికి వెళ్లగా ఆమె అప్పటికే ఊరెళ్లినట్లు తెలిసింది. పసికందును కొనుగోలు చేసిన సంతు దంపతులను గ్రామపెద్దలు పిలిపించి కొనుగోలుచేసిన పాప భవిష్యత్తుపై చర్చించారు.
ఆగని శిశువిక్రయాలు...
⇒ఒక్క మెదక్ మండలంలోనే రెండేళ్ల కాలంలో ఇప్పటివరకు ఐదుగురు ఆడశిశువుల విక్రయాలు జరిగాయి. ఆడశిశువులను విక్రయించిన వారంతా మగబిడ్డకోసం ఎదురుచూసి, మళ్లీ ఆడశిశువు జన్మించడంతో విక్రయించినట్లు తెలుస్తోంది.
⇒ మెదక్ మండలం వాడి పంచాయతీ మెట్టుతండాకు చెందిన రవి-అనిత దంపతులకు మూడోసంతానంలోనూ ఆడకూతురే పుట్టడంతో కౌడిపల్లికి చెందిన ఓ మహిళకు రెండేళ్ల క్రితం రూ.10 వేలకు విక్రయించారు. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు ఆ పసికందును సంగారెడ్డిలోని శిశుసంక్షేమశాఖకు తరలించారు.
⇒కప్రాయిపల్లి తండాకు చెందిన లఖావత్‌ఫిర్యా-విజ్జి దంపతులకు మూడో సంతానంలోనూ ఆడశిశువే జన్మించడంతో విక్రయానికి పెట్టారు. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు ఆ శిశువును సంగారెడ్డికి తరలించారు.
⇒ఇదే తండాకు చెందిన బానోత్ పెంట్యా-సరిత దంపతులకు మూడో సంతానంలో ఆడపిల్ల జన్మించడంతో నిజామాబాద్ జిల్లాలోని ఓ గిరిజన తండాకు చెందిన మహిళకు విక్రయించారు. విషయం తెలుసుకున్న అధికారులు ఆ శిశువును స్వాధీనం చేసుకొని నిజామాబాద్ ఐసీడీఎస్‌కు తరలించారు.
⇒ ఇలా ఇప్పటివరకు గడిచిన రెండేళ్లలో నలుగురు ఆడశిశువుల విక్రయం జరిగింది. జిల్లా వ్యాప్తంగా చూస్తే 50మందికిపై చిలుకే శిశు విక్రయాలు జరిగి ఉంటాయని జిల్లాకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు.
⇒ సమాజంలో ఆడపిల్లలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. కొడుకే వంశోద్ధారకుడని భావిస్తున్నారు. కూతురును వరకట్న బాధితురాలిగా భావిస్తున్నారు.