ఎందుకీ వివక్ష.. ప్లీజ్‌ నన్ను బతకనివ్వండి | Number Of Female Births Declining In Kamareddy | Sakshi
Sakshi News home page

ఎందుకీ వివక్ష.. ప్లీజ్‌ నన్ను బతకనివ్వండి

Published Fri, Sep 3 2021 12:03 PM | Last Updated on Fri, Sep 3 2021 12:40 PM

Number Of Female Births Declining In Kamareddy - Sakshi

ఫైల్‌ ఫోటో

స్త్రీ లేకపోతే జననం లేదు. గమనం లేదు. సృష్టిలో జీవం లేదు. అసలు సృష్టే లేదు. అలాంటిది కొందరు గర్భంలో పెరుగుతున్నది ఆడపిల్ల అని తెలిస్తే చాలు కడుపులోనే తుంచేస్తున్నారు. గతంలో ఆడపిల్ల పుట్టిందంటే చాలు ఇంటికి లక్ష్మి వచ్చిందని మురిసిపోయేవారు. జిల్లా మొత్తం జనాభాలో ఆడవాళ్లే ఎక్కువ ఉండడానికి అదే కారణం. అయితే మగబిడ్డ అయితేనే వారసుడనే భావన ఏర్పడడం, ఆడపిల్ల పెళ్లికి వరకటా్నలు అడ్డగోలుగా పెరగడం తదితర కారణాలతో ఆడపిల్లలు వద్దనుకునేవారి సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది.

సాక్షి, కామారెడ్డి: జిల్లాలో ఆడబిడ్డల జననాల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కొందరు స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులు డబ్బుల కోసం కడుపులో పెరిగేది ఆడనో, మగనో చెప్పేస్తున్నారు. ఆడబిడ్డ అని తెలిస్తే చాలు అబార్షన్లు చేస్తున్నారు. ఫలితంగా ఆడపిల్లల సంఖ్య తగ్గుతూ వస్తోంది. కామారెడ్డి జిల్లా ఏర్పడిన తరువాత జిల్లాలో జననాల సంఖ్యను పరిశీలిస్తే ఆడబిడ్డల సంఖ్య తగ్గుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మగవారికి ధీటుగా ప్రతి రంగంలోనూ ఆడబిడ్డలు తమ ప్రతిభను కనబరుస్తున్నారు.

అయినప్పటికీ ఆడపిల్లల మీద వివక్ష పోవడం లేదు. జిల్లాలో కీలకమైన విభాగాలకు అధిపతులుగా మహిళలు ఉన్నా వారిని చూసైనా తల్లిదండ్రులు ఆలోచించడం లేదు. తమకు పుట్టేది ఆడబిడ్డ అయితే వాళ్లలా ఉన్నతంగా ఎదుగుతుందన్న ఆశలు పెంచుకోవడం లేదు. దీంతో ఆడబిడ్డలను కడుపులోనే కడతేరుస్తున్నారు. గత ఆరేళ్ల కాలంలో జిల్లాలో జననాల లెక్కలను పరిశీలిస్తే ప్రతి సంవత్సరం మగపిల్లల కన్నా ఆడపిల్లల సంఖ్య తక్కువగా ఉండడానికి కారణం విచ్చలవిడిగా అబార్షన్లు చేయడమేననేది స్పష్టమవుతోంది.
చదవండి: కువైట్‌ ప్రయాణం చాలా ఖరీదు.. 15 వేల నుంచి 1.35 లక్షలు

ఆగని భ్రూణ హత్యలు 
కడుపులో పెరుగుతున్నది ఆడపిల్ల అని తెలిస్తే చాలు కడుపులోనే తుంచేస్తున్నారు. కామారెడ్డి పట్టణంలో ఇటీవల రాజ్యలక్ష్మి నర్సింగ్‌హోంలో విచ్చలవిడిగా గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంతో పాటు అబార్షన్లు చేస్తున్న విషయంలో వివిధ శాఖల అధికారులు దాడులు నిర్వహించి ఆస్పత్రిని సీజ్‌ చేశారు. చట్టంలో ఉన్న లొసుగులను ఆసరా చేసుకుని ఆస్పత్రి నిర్వాహకుడు సులువుగా బెయిల్‌ సంపాదించి బయటకు వచ్చాడు. తిరిగి ఆస్పత్రిని తెరిపించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది.

కేసు విషయంలో ఆలస్యమైతే మరో పేరుతో ఆస్పత్రిని తెరి చేందుకు ప్రయతి్నస్తున్నారు. లింగనిర్ధారణ పరీక్ష లు, అబార్షన్లు నిర్వహించడం అనేది చట్టరీత్యా నేరమైనప్పటికీ జిల్లా కేంద్రంలో యథేచ్ఛగా జరుగు తున్నా ఇంతకాలం అధికారులు పట్టించుకోకపోవ డం గమనార్హం. అలాగే మరికొన్ని ఆస్పత్రుల్లోనూ లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు నిర్వహిస్తున్నా రు. అయినా తమ దగ్గర పర్యవేక్షణకు అవసరమైన టీం లేదని చెబుతూ వైద్యఆరోగ్య శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ఇష్టారాజ్యంగా లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు జరుగుతున్నాయి.  
చదవండి: రంగారెడ్డి జిల్లాలో మళ్లీ ఊపందుకున్న రియల్‌ రంగం

జననాల్లో ఆడపిల్లలే తక్కువ 
ఆరేళ్లుగా జిల్లాలో జననాల లెక్కలను పరిశీలిస్తే ఆడపిల్లల జననాల సంఖ్య తక్కువగా ఉంటోంది. దీనికి కారణం భ్రూణ హత్యలే అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి సంవత్సరం మగ పిల్లల కన్నా ఆడపిల్లలు 4 వందల నుంచి 5 వందల వరకు తక్కువగా ఉంటున్నారు. ఈ ఏడాది అంటే ఏప్రిల్‌ 1 నుంచి జూలై 30 వరకు  నాలుగు నెలల్లో జిల్లాలో 4,366 మంది జన్మిస్తే అందులో మగ పిల్లలు 2,366 మంది కాగా, ఆడపిల్లలు 2 వేల మంది. అంటే తేడా 366 మంది ఉన్నారు. ప్రతిఏడాది ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే మగపిల్లలకు ఆడపిల్లలు కరువై చాలా మంది పెళ్లికాని ప్రసాద్‌లుగా ఉంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తు తరాలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు
కడుపులో పెరుగుతున్నది ఆడ, మగ అనేది నిర్ధారించడం చట్ట విరుద్ధం. జిల్లాలో అనుమతి లేకుండా ఉన్న స్కానింగ్‌ సెంటర్‌ను ఇటీవలే మూసి వేయడం జరిగింది. ఎక్కడైనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం అందితే చర్యలు తీసుకుంటాం. ఆడపిల్లల నిష్పత్తి తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. తల్లిదండ్రులు, సమాజం అందరూ ఆలోచించాలి.
– చంద్రశేఖర్, డీఎంహెచ్‌వో, కామారెడ్డి

అవగాహన కార్యక్రమాలు చేపడతాం
ఆడపిల్ల లేనిది సృష్టి లేదు. జిల్లా జనాభాలో ఆడవాళ్ల జనాభా ఎక్కువగానే ఉంది. కానీ పిల్లల దగ్గరకు వచ్చేసరికి ఆడపిల్లల జనాభా తగ్గిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాగే ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ప్రభుత్వాలు ఆడపిల్లల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నా యి. అయినా తల్లిదండ్రులు మగబిడ్డపై మమకారంతో ఆడపిల్లలు వద్దనుకోవడం సరికాదు. దీనిపై అవగాహన కార్యక్రమాలు చేపడతాం.
– సరస్వతి, జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి, కామారెడ్డి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement