సాక్షి, నిజామాబాద్: ఉమ్మడి జిల్లాలో రెండ్రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్ధినిలు పాముకాటుకు గురయ్యారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మినీ గురుకల పాఠశాలలో ఓ విద్యార్థిని పాముకాటుకు గురైంది. బుధవారం పాఠశాల వరండాలో కూర్చుని చదువుకుంటున్న నాలుగో తరగితి విద్యార్థిని నిఖితను పాము కాటేసింది. దీంతో చిన్నారి భయంతో గట్టిగా కేకలు వేసింది. విషయం తెలుసుకున్న స్కూల్ ప్రిన్సిపాల్ చిన్నారికి ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరో నాలుగు పాములు
చిన్నారిని కాటేసిన పామును స్కూల్ సిబ్బంది చంపేయగా.. గురుకుల ఆవరణలో మరో నాలుగు పాములు ప్రత్యక్షమయ్యాయి. వీటిలో రెండు అక్కడి నుంచి వెళ్లిపోగా మిగతా రెండింటినీ గ్రామస్తులు చంపేశారు. ఇదిలా ఉండగా రెండ్రోజుల కిందట కూడా నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది.
రెండు రోజుల క్రితం మరో విద్యార్థినిని
పోతంగల్ మండలం జల్లాపల్లి ప్రభుత్వ పాఠశాలలో నందిని అనే విద్యార్థినిని పాటు కాటేసింది. కిటికీలో నుంచి పుస్తకం బయట పడటంతో తీసుకోవడానికి వెనకవైపు వెళ్లిన విద్యార్థినిని పాము కాటేసింది. ప్రస్తుతం ఇద్దరు విద్యార్థినిలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పాముల ఘటనలతో పాఠశాల, గురుకల పాఠశాల విద్యార్థులు భయంతో వణికిపోతున్నారు. స్కూల్ ఆవరణలో ఏ క్షణంలో ఎటువైపు నుంచి పాముల వచ్చి కాటేస్తాయోనని ఆందోళన చెందుతున్నారు.
తల్లిదండ్రుల ఆందోళన
విద్యార్థిని పాము కాటుకు గురికావటంపై చిన్నారుల తల్లిందండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. హుటాహుటిని ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే చిన్నారికి ఎలాంటి ప్రాణపాయం లేదని డాక్టర్లు చెప్పడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.అయితే పాఠశాలలు, గురుకులాల ఆవరణలు పిచ్చి మొక్కలతో అపరిశుభ్రంగా ఉండటంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అభిప్రయడుతున్నారు.ప్రభుత్వం వెంటనే స్కావెంజర్‌లను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.
చదవండి: తాటిచెట్టుపై విలవిల్లాడిన గీత కార్మికుడు.. ప్రాణాలకు తెగించి
Comments
Please login to add a commentAdd a comment