చలనచిత్ర రంగంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు తమదైన ముద్ర వేశారు. నటులుగా, హాస్య నటులుగా, గాయకులుగా, దర్శక నిర్మాతలుగా గుర్తింపు పొందారు. నిర్మాతలుగా డి.ప్రభాకర్, దిల్ రాజు, నటులు, హాస్యనటులుగా నితిన్, అదితి, శ్రీముఖి, వెన్నెల కిషోర్, చమ్మక్‌చంద్ర.. ఇలా ఎందరో తెలుగు సినీ జగత్తులో సత్తా చాటి జిల్లాకు పేరు తెచ్చారు. సినిమాలలో సత్తా చాటుతున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులపై సండే స్పెషల్..
యాంకర్ నుంచి యాక్టర్ దాకా..
నిజామాబాద్ నగరానికి చెందిన శ్రీముఖి యాంకర్‌గా గుర్తింపు పొందారు. సినిమా, టీవీ ప్రోగ్రాములకు యాంకర్‌గా పనిచేస్తూ ఉన్నత స్థాయికి ఎదిగిన ఆమె.. సినిమాల్లోనూ రాణిస్తున్నారు. ఆమె కు టుంబ సభ్యులు నిజామాబాద్‌లో ఉండడంతో అప్పుడప్పుడు నిజామాబాద్ వచ్చి వెళ్తుంటుంది.
దిల్ రాజు..
నిజామాబాద్ నగరానికి సమీపంలోని నర్సింగ్‌పల్లికి చెందిన దిల్ రాజు.. నిర్మాతగా, డిస్టిబ్యూటర్‌గా సినీ ఇండస్ట్రీని శాసిస్తున్నారు. ఆయన ప్రముఖ నటీనటులందరితో ఎన్నో సినిమాలు తీశారు. ఆయన సొంతూరులో ఇందూరు తిరుమల పేరుతో భారీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు. నిర్మాతగా ఎందరినో సినిమా రంగంలోకి తీసుకువచ్చారు.
నవ్వుల రారాజు వెన్నెల కిషోర్
కామారెడ్డికి చెందిన కిషోర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా అమెరికాలో పనిచేశారు. అప్పట్లో వెన్నెల సినిమాలో నటించే అవకాశం రావడంతో ఆయన సినీరంగం వైపు మళ్లారు. వెన్నెల సినిమాలో నటించడంతో ఆయన పేరు వెన్నెల కిషోర్‌గా మారిపోయింది. హాస్యనటుడిగా కిషోర్ ఎంతో పేరు సంపాదించారు. ప్రస్తుతం దాదాపు అన్ని సినిమాల్లోనూ కిషోర్ పాత్ర ఉంటుండడం విశేషం. ఉత్తమ హాస్యనటుడిగా ఆయన నంది పురస్కారం కూడా అందుకున్నారు. అప్పుడప్పుడూ కామారెడ్డికి వచ్చి తన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులని కలిసి వెళ్తుంటారు.
నటీమణిగా ఎదుగుతున్న అదితి..
కామారెడ్డి పట్టణానికి చెందిన అదితి మ్యాకాల్.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆమె తండ్రి రాంచంద్రం హైదరాబాద్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. ఆమె అర్జున్‌రెడ్డి, జంటిల్‌మెన్, అమీతుమీ, షాదీ ముబారక్‌వంటి సినిమాల్లో నటించింది. అలాగే పాష్ పోరీస్, మాయాబజార్ వంటి వెబ్‌సిరీస్‌లలోనూ నటిస్తోంది. నటనతో పాటు కూచిపూడి నృత్యంలోనూ ఆమె రాణిస్తోంది.
టాప్ హీరోగా గుర్తింపు పొందిన నితిన్..
నిజామాబాద్‌కు చెందిన సినీ హీరో నితిన్ తొలి సినిమా ‘జయం’తోనే ప్రేక్షకులను మెప్పించారు. తన నటనతో ఇండస్ట్రీలో టాప్ స్టార్లలో ఒకరిగా ఎదిగారు. నితిన్ తండ్రి సుధాకర్‌రెడ్డి ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్నారు. అలాగే ప్రముఖ నిర్మాత దిల్‌రాజుకు నితిన్ దగ్గరి బంధువు. నితిన్ బందువులు చాలా మంది నిజామాబాద్‌లోనే ఉన్నారు.
హాస్యం పండించే చమ్మక్ చంద్ర
గాంధారి మండలం వెంకటాపూర్‌కు చెందిన గిరిజన బిడ్డ చమ్మక్ చంద్ర.. తన నటనతో హాస్యం పండిస్తూ అందరినీ మెప్పిస్తున్నారు. టీవీ చానళ్లలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందారు. సినిమాల్లోనూ హాస్య నటుడిగా రాణిస్తున్నారు. ఆయన తరచూ సొంతూరుకు వచ్చి వెళ్తుంటారు. వచ్చినప్పుడల్లా అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంటారు.
సినీ గాయకుడిగా విష్ణుకిషోర్
ఆర్మూర్ మండలం కోమన్‌పల్లికి చెందిన విష్ణుకిషోర్ జానపద గాయకుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టి సినీ గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఎదిగారు. సినిమాల్లోనూ నటిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యమ గీతాలు పాడిన విష్ణుకిషోర్.. ఉమ్మడి జిల్లాలో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీకేఆర్ స్టూడియోను స్థాపించారు. మ్యూజిక్ డైరెక్టర్‌గానూ రాణిస్తున్నారు.
భగవాన్ సినిమా నిర్మాత ప్రభాకర్
కామారెడ్డి పట్టణానికి చెందిన నిర్మాత దివంగత డి.ప్రభాకర్ ప్రియా ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రెబల్ స్టార్ కృష్ణంరాజు హీరోగా భగవాన్ సినిమాను నిర్మించారు. అప్పట్లో అది సూపర్‌హిట్ అయ్యింది. ఆ తర్వాత ఆయన నాయకురాలు, ప్లీజ్ నాకు పెళ్లయ్యింది వంటి సినిమాలకు ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. అలాగే డి్రస్టిబ్యూటర్‌గానూ పనిచేశారు. కామారెడ్డిలో ఆయన స్థాపించిన ప్రియా థియేటర్లు రెండు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కామారెడ్డి మున్సిపల్ కాకముందు ఆయన సర్పంచ్‌గానూ సేవలందించారు.
నిర్మాతగా రజిత్‌రావ్ అడుగులు..
ఆర్మూర్‌కు చెందిన వ్యాపారవేత్త బల్గూరి రజిత్‌రావ్ సినీరంగంలో అడుగుపెట్టారు. ఇటీవల ‘అన్‌స్టాపబుల్’ చిత్రాన్ని నిర్మించారు. చిన్ననాటి నుంచి సినిమాల మీద ఉన్న మోజుతో ఆయన సినీ నిర్మాణ రంగంలో అడుగుపెట్టి గుర్తింపు పొందారు. సినీ, రాజకీయ రంగ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్న రజిత్‌రావ్.. నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
గేయ రచయితగా రుద్రంగి రమేశ్
మద్నూర్ మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రుద్రంగి రమేశ్ అనేక సినిమాలకు పాటలు రాశారు. మాస్ పవర్, పోలీస్ పవర్, పోరాటం, మిస్టర్ ఐటం, సినిమా సినిమా, ప్రేమిస్తే చంపేస్తారా, నైజాం సర్కరోడా, రుద్రనాగు, హృదయం, దిల్లున్నోడు, నువ్వంటే ఇష్టం వంటి సినిమాలకు పాటలు రాశారు. అలాగే భక్తి గీతాలు కూడా ఎన్నో రచించారు.
Comments
Please login to add a commentAdd a comment