పెగడపల్లి(కాల్వశ్రీరాంపూర్) : జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ ఆడ శిశువును కన్నతండ్రే విక్రయించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో ఓ ఆరోగ్యం కేంద్రం సిబ్బంది మధ్యవర్తిగా మారి రూ.ఐదు లక్షలకు బేరం కుదిర్చినట్లు సమాచారం. అయితే శిశువును కొన్నవారి నుంచి డబ్బు ఇప్పించడంలో వివాదం ఏర్పడి.. అది ముదరడంతో విషయం బయటకు పొక్కినట్లయ్యింది. కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లికి చెందిన ఓ వికలాంగుడు భార్య చనిపోతే సుల్తానాబాద్‌కు చెందిన మరో మహిళను కులాంతరం వివాహం చేసుకున్నాడు. ఆ మహిళ గర్భం దాల్చడంతో పురుడు కోసం ఇటీవల జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి వెళ్లింది.
అక్కడ ప్రసవం అయ్యాక అపస్మారక స్థితికి చేరింది. దీనిని అదునుగా భావించిన ఓ ఆరోగ్యకేంద్రం సిబ్బంది వికలాంగుడితో రూ.ఐదు లక్షలకు బేరం కుదుర్చుకుని.. రూ.25 వేలు అడ్వాన్సుగా ఇచ్చి పాపను తీసుకెళ్లినట్లు సమాచారం. పాప గురించి తల్లి ఆరా తీయగా.. ఐసీయూలో ఉందని నమ్మించి ఆమెను పుట్టినింటికి పంపారు. పాప తండ్రి మిగతా డబ్బుల కోసం దళారిని నిలదీశాడు. దీనికి దళారి పాప చనిపోయిందని, ఇక డబ్బులు ఇచ్చేది లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో వికలాంగుడు అతడితో వాగ్వావాదానికి దిగగా కొందరు పెద్దమనుషులు రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది.
ప్రభుత్వాసుపత్రిలో ఆడ శిశువు అమ్మకం?
Published Tue, Dec 23 2014 3:46 AM | Last Updated on Sat, Sep 2 2017 6:35 PM
Advertisement