ఉద్యోగాలిప్పిస్తానని దోపిడీ | if you have a job .. give the money | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలిప్పిస్తానని దోపిడీ

Published Sun, Mar 26 2017 10:49 AM | Last Updated on Tue, Sep 5 2017 7:09 AM

if you have a job ..  give the money

► నెల్లూరు పెద్దాస్పత్రిలో లంచాలకు  తెరలేపిన ఓ అధికారి
 
ఉద్యోగం పేరుతో ఆశలు రేపాడు. డబ్బులు ఇస్తే పని అవుతుందని నమ్మించాడు. పేదల నుంచి వసూళ్లు మొదలు పెట్టాడు. ఇదీ నెల్లూరు పెద్దాస్పత్రిలో ఓ అధికారి నిర్వాకం. ఈ విషయం తెలిసినప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి.
 
నెల్లూరు: నెల్లూరు పెద్దాస్పత్రి, మెడికల్‌ కళాశాలలో ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో జై బాలాజీ సంస్థ తరుఫున సెక్యూరిటీ గార్డులు 110 మంది, ఎ–1 కంపెనీ తరుఫున  శానిటరీ సిబ్బంది 140 మంది వరకు  పని చేస్తున్నారు. సిబ్బంది పనితీరును పర్యవేక్షించేందుకు సూపర్‌ వైజర్, మరో పది మంది వరకు పని చేస్తున్నారు. పెద్దాస్పత్రిలో పని కావాలని అభాగ్యులెవరైనా వస్తే అక్కడ పని చేసే ఓ అధికారి వారి అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్నారనే ప్రచారం ఉంది. తాను అధికారినని తనకు డబ్బులు ఇస్తే పని ఇప్పిస్తానని నమ్మబలుకుతున్నారు.

పెద్దాస్పత్రిలో ఏదో ఒక పని సంపాదించుకుంటే భవిష్యత్తులో  పర్మినెంట్‌ చేస్తారనే ఆశతో పేదలు కొంతమంది అప్పులు తెచ్చి ఆ అధికారికి ఇస్తున్నారు. వాస్తవానికి ఈ పోస్టులు పర్మినెంటు కావనే విషయం వారికి తెలియదు.పోస్టును బట్టి రేటు సూపర్‌వైజర్‌ పోస్టుకు రూ.40 వేల నుంచి రూ.50వేలు, సెక్యూరిటీ గార్డు, శానిటరీ వర్కర్‌ పోస్టులకు రూ.20 వేల నుంచి రూ.25 వేలు వసూలు చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. డబ్బులు తీసుకున్న అధికారి తాను చెప్పిన వారిని పనిలో చేర్పించుకోవాలని ఔట్‌ సోర్సింగ్‌ కంపెనీ ప్రతినిధులపై ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది.

తాను చెప్పిన  వారికి పని ఇవ్వకపోతే కంపెనీ పర్‌ఫార్మెన్స్‌ మార్కుల్లో కోత వేస్తానని బెదిరిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఐదు రోజుల క్రితం సూపర్‌ వైజర్‌ పోస్టుకు డబ్బులిచ్చిన ఓ వ్యక్తి తనకు ఉద్యోగం రాకపోవడంతో లంచం తీసుకున్న అధికారిని నిలదీసినట్టు తెలిసింది. ఈ విషయం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాధాకృష్ణరాజుకు చేరడంతో ఆయన విచారణ జరిపారు. ఈ విచారణలో ఆ అధికారి  డబ్బులు తీసుకున్నట్టు తేలిందని సమాచారం. ఆయన వెంటనే ‘బాధితుడికి డబ్బులు తిరిగి చెల్లించు.. లేదంటే శ్రీకాకుళంకు ట్రాన్స్‌ ఫర్‌ చేయిస్తా’ అని డబ్బులు తీసుకున్న ఆ అధికారితో అన్నట్లు ప్రచారం జరుగుతోంది. 
 
డబ్బులిచ్చి మోసపోవద్దు 
 
పెద్దాస్పత్రిలో, మెడికల్‌ కళాశాలలో శానిటరీ, సెక్యూరిటీ తదితర ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులకు  కొంతమంది డబ్బులు తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎవరైనా డబ్బులు అడిగితే నా దృష్టికి తీసుకురావాలి. డబ్బులు చెల్లించి మోసపోవద్దు.
                                                                                                                                  –చాట్ల నరసింహారావు, 
                                                                                                                         పెద్దాస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌ 
 
డబ్బులు తీసుకోలేదు 
 
ఉద్యోగాల పేరిట ఓ అధికారి డబ్బులు తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చింది వాస్తవమే. ఆ అధికారిపై విచారణ నిర్వహించా. ఎలాంటి డబ్బులు తీసుకోలేదని తేలింది. ఎవరో గిట్టని వారు పుకార్లు పుట్టించారు. నా పదవీ కాలంలో లంచం అనే మాటకు తావు లేకుండా పని చేస్తున్నాను. 
                                                                                                                                  –డాక్టర్‌ రాధాకృష్ణరాజు,
                                                                                                                                పెద్దాస్పత్రి సూపరింటెండెంట్‌ 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement