ఆస్పత్రిలో ‘అమ్మల’ వేదన..!
ఆస్పత్రిలో ‘అమ్మల’ వేదన..!
Published Mon, Jul 3 2017 3:10 AM | Last Updated on Tue, Sep 5 2017 3:02 PM
- పురిటినొప్పులతో వస్తే.. కాదు పొమ్మన్నారు..
- సిరిసిల్ల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సిబ్బంది తీరు
సిరిసిల్ల టౌన్: ఇద్దరు నిండు గర్భిణులు ప్రసవ వేదనతో ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లారు.. బెడ్స్ ఖాళీలేవని, అసలు గైనకాలజిస్టే అందుబాటులో లేరని వైద్యసిబ్బంది చెప్పి వారిని బయటకు పంపించారు.. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సర్కారు ఏరియా ఆస్పత్రిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గంభీరావుపేటకి చెందిన గంధాడపు మానస, తంగళ్లపల్లి మండలం నేరెళ్లకు చెందిన గాదగోని నవ్య పురిటినొప్పులతో బాధపడుతూ శనివారం రాత్రి 10 గంటలకు స్థానిక ఏరియా ఆస్పత్రికి వచ్చారు. రాత్రి 12 గంటల వరకూ వైద్యసేవలు అందించలేదు. బాధితుల బంధువులు ఇదేమిటని వైద్యసిబ్బందిని ప్రశ్నించగా.. ఆస్పత్రిలో మంచాలు ఖాళీ లేవని, ఎటైనా వెళ్లిపోవాలని సూచించారు. దీంతో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. విషయం మీడియాకు తెలియడంతో సూపరింటెండెంట్ తిరుపతి ఆస్పత్రికి చేరుకుని బాధితులను సముదాయించారు. దవాఖానాలో డెలివరీల సంఖ్య పెరిగి మంచాలు ఖాళీలేవని, గైనకాలజిస్టు కూడా ఒక్కరే ఉన్నారని, ఆమె సైతం ప్రస్తుతం విధుల్లో లేరన్నారు. చేసేదిలేక గర్భిణులను స్థానిక ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.
ఆదివారం రాలేనన్న వైద్యురాలు
ఆస్పత్రి ఎదుట నిండు చూలాలి విలవిల
పర్వతగిరి(వర్ధన్నపేట): ఓ పక్క ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని సీఎం కేసీఆర్, ఉన్నతాధికారులు చేస్తున్న సూచనలు కొందరు వైద్యులకు పట్టడం లేదు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరిలో ఆదివారం చోటు చేసుకున్న ఘటనను దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. పర్వతగిరికి చెందిన మిడుతూరి స్వప్న నిండు గర్భవతి. ఆమెకు ఆదివారం పురిటి నొప్పులు రాగా బంధువులు పర్వతగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రిలో వైద్యురాలు ప్రశాంతి లేకపోవడంతో సిబ్బంది ద్వారా ఆమెకు ఫోన్ చేయించారు. అయితే, ఆదివారం సెలవు కావడంతో తనకు రావడం కుదరదని వైద్యురాలు స్పష్టం చేసింది. దీంతో గర్భిణిని 108 వాహనంలో స్వప్నను ప్రసవం కోసం వరంగల్‌లోని సీకేఎం ఆస్పత్రికి తీసుకువెళ్లారు.
Advertisement
Advertisement