పనుల్లేవ్.. డబ్బుల్లేవ్..! | no work.. no money..! | Sakshi
Sakshi News home page

పనుల్లేవ్.. డబ్బుల్లేవ్..!

Published Thu, Jan 22 2015 3:16 AM | Last Updated on Sat, Sep 2 2017 8:02 PM

పనుల్లేవ్..  డబ్బుల్లేవ్..!

పనుల్లేవ్.. డబ్బుల్లేవ్..!

ఉపాధి కూలీలకు 3 నెలలుగా వేతనాలు లేవు!
 
సాక్షి ప్రతినిధి, కర్నూలు :  కూలి డబ్బుల కోసం ఉపాధి హామీ కూలీలు మూడు నెలలుగా ఎదురుచూస్తున్నారు. చేసిన పనికి కూలి లభించక అల్లాడుతున్నారు. చేతిలో పైసలు లేక అర్ధాకలితో అలమటించాల్సి వస్తోంది. వేతనం కోసం ప్రతీరోజూ పోస్టాఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. ఉపాధి హామీ చట్టం ప్రకారం 14 రోజుల్లోగా వేతనాలు చెల్లించాల్సి ఉంది. దీనిని ఎవరూ పట్టించుకున్న పాపాన పోవడం లేదు.

ఏడాదికి 100 రోజుల పనిదినాలు కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యమూ జిల్లాలో అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పటివరకు కేవలం 7,300 మందికి మాత్రమే 100 రోజుల పనిదినాలను కల్పించారు. మరోవైపు కనీస సగటు వేతనం కూడా రూ. 110కి మించడం లేదు. సగటు వేతనం అందకపోవడంతో బతకడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న జిల్లా ప్రజలు.. వలస బాట పడుతున్నారు. ఇప్పటివరకు ఏకంగా 2 లక్షల మంది ప్రజలు వలస బాట పట్టి ఉంటారని ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి.
 
మూడు నెలలుగా ఇదే పరిస్థితి..!
జిల్లాలో కుటుంబానికి ఒకటి చొప్పున మొత్తం 7 లక్షల 28 వేల మందికి జాబ్ కార్డులను ఇచ్చారు. వీరు చేసిన పనులకు గత మూడు నెలలుగా వేతనాలు అందడం లేదు. వాస్తవానికి ఉపాధి కూలీల వేతనాలను ఇచ్చేందుకు యాక్సెస్ బ్యాంకుతో ఒప్పందం ఉంది. అయితే, ఈ బాధ్యతల నుంచి యాక్సెస్ బ్యాంక్ మూడు నెలల కిందట తప్పుకుంది. ఈ నేపథ్యంలో తపాలా శాఖ ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించారు. అయితే, ఇప్పటివరకు ఈ ప్రక్రియ ఇంకా పూర్తిస్థాయిలో పట్టాలు ఎక్కలేదు.

దీంతో అనేక మంది ఉపాధి కూలీలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉపాధి కూలీల కింద గత మూడు నెలలకుగానూ (అక్టోబరు, నవంబరు, డిసెంబరు) మొత్తం రూ. 2.84 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే, ఇప్పటివరకు కేవలం కోటి 10 లక్షల రూపాయలు మాత్రమే కూలీలకు వేతనాల కింద చెల్లించారు. ఇంకా కోటి 74 లక్షల రూపాయలను చెల్లించాల్సి ఉంది. చేసిన పనికి వేతనం రాక కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతీ రోజూ పోస్టాఫీసు చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

14 రోజులలోగా వేతనాలివ్వాల్సిందే..!
వాస్తవానికి మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎంఎన్‌ఆర్‌జీఎస్) చట్టం ప్రకారం కూలీ చేసిన 14 రోజుల్లోగా వేతనాలను అందజేయాలి. ప్రతీ అధికారి ఎన్ని రోజుల్లోగా వేతనాల మంజూరుకు అనుమతి ఇవ్వాలనే నిబంధన కూడా ఉంది. ఉదాహరణకు ఈసీ-2 రోజులు, ప్రోగ్రామ్ ఆఫీసర్స్-2 రోజుల్లోగా అనుమతి ఇవ్వాల్సిందే.

ఏ ఒక్కరికీ వేతనం చెల్లింపు ఆలస్యం జరిగినా.. అధికారుల టీఏలతో పాటు జీతాలు ఇచ్చే ఏజెన్సీ(సంస్థ)కి చెల్లించే సర్వీసు చార్జీల్లో నుంచి 0.1 శాతం రికవరీ చేసి.. ఈ మొత్తాన్ని నేరుగా సంబంధిత కూలీ ఖాతాలోకే జమ చేయాలని చట్టం చెబుతోంది. అయితే, ఇప్పుడు యాక్సెస్ బ్యాంక్ తప్పుకుందనే సాంకేతిక సమస్యను కారణంగా చూపి తప్పించుకునేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలున్నాయి.
 
సగటు వేతనమూ తక్కువే..
వాస్తవానికి ఉపాధి హామీ చట్టం మేరకు సగటు వేతనం రూ. 160 మేరకు ఉండాలి. అయితే, జిల్లాలో ఇప్పటివరకు కల్పించిన పనిదినాల ప్రకారం కూలీలు అందుకున్న సగటు వేతనం కేవలం రూ. 110 మాత్రమే. సగటు వేతనం లభించక కూలీలు ఉపాధి హామీ పథకానికి కాకుండా ఇతర పనులకు వెళుతున్నారు.
 
పనిదినాలూ లేవు..!
2014-15 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి కూలీలకు మొత్తం కోటి 75 లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. అయితే, ఇప్పటివరకు కేవలం 70 లక్షల పనిదినాలను మాత్రమే కల్పించారు. ఉదాహరణకు ఆదోని మండలంలో మొత్తం సుమారు 8 లక్షల పనిదినాలు కల్పించాల్సి ఉండగా... ఇప్పటివరకు కేవలం 2 లక్షల పనిదినాలు మాత్రమే కల్పించారు. ఇక వలసలు ఎక్కువగా ఉండే ఆలూరు మండలంలో 3.70 లక్షల పనిదినాలకుగానూ కేవలం లక్ష పనిదినాలు మాత్రమే కల్పించారు.

చట్టం మేరకు ఏడాదిలో 100 రోజులు పని కల్పించిన కుటుంబాల సంఖ్య కూడా కేవలం 10 శాతానికి మించకపోవడం జిల్లాలో అమలవుతున్న ఉపాధి హామీ పథకం తీరుకు అద్దం పడుతోంది. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 7.28 లక్షల జాబ్ కార్డులు ఉండగా... ఇందులో కేవలం 7,300 జాబ్‌కార్డు హోల్డర్స్‌కు మాత్రమే 100 రోజుల పనిదినాలు కల్పించారు. మొత్తం మీద చేసిన పనికి సకాలంలో వేతనం రాకపోవడం, వచ్చిన వేతనం కూడా సగటు వేతనం మేరకు లేకపోవడం... తదితర కారణాల వల్ల జిల్లాలో వలసలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement