బిడ్డను చంపేయమంటున్నాడు..
పుట్టి పట్టుమని నాలుగు రోజులూ నిండలేదు..
పేగు పుండు ఆరనూ లేదు..
మమకారంతో పెంచాల్సిన తండ్రే వద్దనుకున్నాడు..
ఆ..డ బిడ్డ అని తెలిసి..
పురిటిలోనే తుంచేయాలని భార్యను ఆజ్ఞాపించాడు..
లేకుంటే ఇంటికే రావద్దని ఆదేశించాడు..
భర్త మాట జవదాటలేక..
పేగుబంధాన్ని తెంచేయలేక..
పుట్టెడు దుఃఖంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది ఓ బాలింత..
ఈ ఘటన శనివారం మదనపల్లెలో సంచలనం రేపింది.
మదనపల్లె రూరల్ : మదనపల్లె పట్టణంలోని నీరుగట్టువారిపల్లె మాయాబజార్‌లో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ సలీమ్ గురుకుల పాఠశాల సమీపంలో నివాసం ఉంటున్న రమణమ్మ కుమార్తె దేవదానమ్మ(23)ను ఏడాది క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దేవదానమ్మ నాలుగు రోజుల క్రితం స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. విషయం తెలుసుకున్న భర్త సలీమ్ ఆడబిడ్డ అని మండిపడ్డాడు. ఆ బిడ్డను ఇంటికి తీసుకురావద్దు... చంపేసి ఇంటికిరా అంటూ హుకుం జారీచేశాడు. భయాందోళనకు గురైన దేవదానమ్మ స్థానిక టూటౌన్‌లోని మహిళా జ్యువినల్‌వింగ్ కోఆర్డినేటర్ రమాదేవిని ఆశ్రయించింది. స్పందించిన ఆమె తల్లీబిడ్డకు రక్షణ కల్పిస్తూ సలీమ్‌పై తదుపరి చర్యలకు ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం షీటీమ్ పోలీసుల సంరక్షణలో తల్లీబిడ్డ ఉన్నారు.