టేక్మాల్, న్యూస్‌లైన్: పుట్టిన 11 రోజులకే బావిలో శవమై తేలిన ఓ చిట్టి తల్లి హత్య కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఈ కేసులో పోలీసులు చిన్నారి తల్లిదండ్రులను అరెస్టు చేశారు. టేక్మాల్ పోలీసు స్టేషన్ లో స్థానిక సీఐ సైదానాయక్, ఎస్‌ఐ ప్రదీప్‌కుమార్‌లు బుధవారం విలేకరుల సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టి కేసు వివరాలను వెల్లడించారు. మండలంలోని ఎల్లంపల్లి పంచాయతీ బర్రెంకల్‌కుంట తండాకు చెందిన రవి, బ్రహ్మవత్ మమిత దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి సెప్టెంబర్ 6న ఐదో కాన్పులో ఆడ శిశువు జన్మించింది. 16వ తేదీ రాత్రి ఈ శిశువు గొంతు నులిమి చంపేసిన రవి, మమితలు గ్రామ శివారులో ఉన్న ఓ బావిలో పడేశారు.
అందరూ గాఢ నిద్రలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు తమ ఇంట్లో ప్రవేశించి శిశువును అపహరించుకుపోయారని, దా యాదులైన ఇద్దరు వ్యక్తులు, వారి భార్యలపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఆ ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా వీరికి ఎలాంటి సంబంధం లేదని తేలింది. దీంతో పోలీసులు శిశువు తల్లిదండ్రులపై అనుమానంతో ప్రశ్నించగా.. రెండు రోజుల్లో వచ్చి మళ్లీ కలుస్తామని చెప్పి ఫిర్యాదును వెనక్కి తీసుకుని వెళ్లిపోయారు. రెండు రోజుల తర్వాత (19వ తేదీన) శిశువు మృత దేహం వీరి ఇంటికి 50 అడుగుల దూరంలో ఉన్న వ్యవసాయ బావిలో లభ్యమైంది. వీఆర్వో ఫిర్యాదు చేయగా పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో నేరాన్ని ఒప్పుకున్నారు. తండాలో నివసిస్తున్న ఇద్దరు దాయాదులతో వీరికి పాత కక్షలు, భూ వివాదాలున్నాయి. ఈ నేపథ్యంలో చిన్నారిని చంపేసి ఈ నెపాన్ని వారిపై వేయడానికి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు నిందితులు వెల్లడించారు.
వీడిన ఆడశిశువు హత్య కేసు మిస్టరీ
Published Thu, Oct 10 2013 2:06 AM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM
Advertisement
Advertisement