కళ్లు తెరవకముందే ఎంత కష్టం
ఒంగోలు టౌన్: తల్లి వెచ్చని ఒడిలో సేదదీరాల్సిన శిశువు మరుగుదొడ్లో దయనీయ స్థితిలో ప్రత్యక్షమైంది. అప్పుడే పుట్టిన ఆడశిశువు కళ్లు కూడా తెరవలేని స్థితిలో పొత్తిగుడ్డల్లో పడి ఉంది. ఆ సమయంలో కాలకృత్యాలు తీర్చుకోడానికి అటువైపు వచ్చిన వ్యక్తి చూసి ఆసుపత్రి వర్గాలకు సమాచారమిచ్చాడు. ఈ విషయం జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థకు తెలియజేయడంతో ఐసీపీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ లీలావతి ఆదేశాల మేరకు ఐసీపీఎస్ డీసీపీఓ జ్యోతి సుప్రియ హుటాహుటిన అక్కడకు చేరుకొని శిశువును చేరదీశారు.
వివరాలు ఇలా ఉన్నాయి. ఒంగోలు ఆర్టీసీ బస్టాండుకు సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి గురువారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో దాదాపు 23 ఏళ్ల వయస్సున్న నిండు గర్భిణీ అక్కడకు వచ్చింది. ఆ యువతికి పెళ్లి కాలేదని తెలిసింది. వచ్చిన కొన్ని నిమిషాల్లోనే ఆడ బిడ్డను ప్రసవించి హడావుడిగా మరుగుదొడ్లో పడేసి వెళ్లిపోరుుంది. డీసీపీఓతోపాటు శిశుగృహ మేనేజర్ శ్రీలత, ఏఎన్‌ఎం సుశీలలు ఆ బిడ్డను పర్యవేక్షిస్తున్నారు.
ఉయ్యాల ఉన్నప్పటికీ...
ఆసుపత్రికి కొన్ని అడుగుల దూరంలోనే ఉన్న ఆర్టీసీ బస్టాండులో శిశువులను వదిలేసి వెళుతున్న వారికోసం మహిళా శిశు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉయ్యాల ఏర్పాటు చేసి ఉంది. ఆ ఉయ్యాలలో శిశువును వదిలి వెళ్లి ఉంటే బాగుండేది. వెంటనే చికిత్స అందేది. అరుుతే నిత్యం రద్దీగా ఉండే ఆర్టీసీ బస్టాండులో ఉన్న ఉయ్యాలలో శిశువును వదిలేసి వెళితే ఎవరైనా చూసి గుర్తిస్తారన్న భయంతోనే ఇలా వదిలి వెళ్లి ఉంటుందని భావిస్తున్నారు.
పసి కందులను వీధులపాలు చేయవద్దు...
బిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఆ బిడ్డను వద్దనుకుంటే తమకు సమాచారం అందించాలని, తాము ఆ బిడ్డను చేరదీసి, సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని ఐసీపీఎస్ డీసీపీఓ జ్యోతిసుప్రియ తెలిపారు. ఇలా పురిటి బిడ్డలను ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వెళ్లొద్దని కోరారు.