అమ్మేశారా.. చంపేశారా.
► ఆడ శిశువు అదృశ్యంపై అనుమానాలు
► మృతి చెందిందని చెబుతున్న శిశువు తల్లిదండ్రులు
► పోలీసులకు ఫిర్యాదు.. కేసు నమోదు
దేవరకొండ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడ పిల్లల సంరక్షణ కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతున్నా మారుమూల ప్రాంతాల్లో మాత్రం ఆడ పిల్లలపై వివక్షత రోజు రోజుకు పెరిగిపోతోంది. శిశు బ్రూణ హత్యలపై పోలీసులు ఎన్నో అవగాహన సదస్సులు చేపట్టినా ప్రయోజనం లేకపోయింది. నల్గొండలో శిశువు అదృష్యం కలకలం రేపుతోంది. శిశువును విక్రయించారా.. చంపేశారా అనేది తేలక సందిగ్ధం నెలకొంది. ఈ హృదయ విచారక ఘటన చందంపేట మండలం తిమ్మాపురంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తిరుపతికి చందంపేట మండలం గాగిళ్లాపురం పద్మలకు గత ఏడేళ్ల క్రితం వివాహం అయ్యింది.వీరికి మొదటి కాన్పులో ఆడపిల్ల, రెండో కాన్పులో మగబిడ్డ మూడో కాన్పులో ఆడబిడ్డలు జన్మించారు.
నాల్గో సంతానంగా ఈ నెల 5 న ఆడ శిశువు జన్మించింది. ఈ చిన్నారి వివరాలు స్థానిక అంగన్ వాడి సెంటర్లో నమోదయ్యాయి. ఆదివారం సెలవు దినం కావడంతో అంగన్‌వాడి టీచర్ బంధువుల ఇంటికి వెళ్లింది. సోమవారం ఆడ శిశువు కనిపించకపోవడంతో శిశువు తల్లి పద్మను ప్రశ్నించింది. ఆమె గత ఐదు రోజుల క్రితం మృతి చెందిదని చెప్పింది. భర్తను విచారించగా పదిహేను రోజుల క్రితం మరణించిందని పొంతనలేని సమాధానం చెప్పాడు. దీంతో అనుమానంతో అంగన్‌వాడి టీచర్ పై అధికారులకు సమాచారం ఇచ్చింది. సీడీపీవో సక్కుబాయి, స్థానిక సూపర్‌వైజర్ పద్మలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ సతీష్‌కుమార్ తెలిపారు.