ఆడపిల్ల పుడితే 111 మొక్కలు నాటుతారు!
ఆదర్శం: కాలం మారిందంటాం. ఆడా మగా తేడాలు పోయాయంటాం. కానీ ఆడపిల్ల పుట్టిందని పురిట్లోనే చంపేశారనో, ముళ్లపొదల్లో ఆడ పసికందు మృతదేహమనో వార్తలు వింటూనే ఉంటాం. కానీ ఆడపిల్ల పుడితే ఊరంతా సంబరాలు చేసుకునే ఊరిని ఎక్కడైనా చూశామా? అమ్మాయికి గుర్తుగా 111 చెట్లు నాటి, వాటిని పెంచి పెద్దవి చేసే జనాల గురించి ఎక్కడైనా విన్నామా? అమ్మాయిని అమ్మలా భావించి కొలుస్తున్న ఊరి గురించి తెలుసుకుందాం రండి.
పట్టణాలకు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్‌లో పిప్లాంట్రి అనే గ్రామం గురించి కొన్నేళ్ల ముందు వరకు ఎవరికీ తెలియదు. ఆరేళ్ల క్రితం అన్నింటిలాగే అదీ. కానీ ఇప్పుడా గ్రామం పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ప్రపంచ మీడియా వేనోళ్ల పొగుడుతోంది. అందుక్కారణం... ఆడపిల్లను దేవతలా భావించి, ఆదరిస్తున్న ఆ ఊరి జనమే. ఆడపిల్ల పుట్టగానే అక్కడివారు దురదృష్టం అనుకోరు. సంతోషంగా సంబరాలు చేసుకుంటారు. వెంటనే మామిడి, నిమ్మ, ఉసిరి లాంటి రకరకాల చెట్లు 111 నాటుతారు. ఈ సంప్రదాయాన్ని ప్రస్తుత పిప్లాంట్రి గ్రామ సర్పంచి శ్యామ్‌సుందర్ పలివాల్ తన కూతుర్ని కోల్పోయిన కొన్ని నెలలకు మొదలుపెట్టారు.
గ్రామస్తులందరినీ సమావేశపరిచి, ఆడపిల్ల పుడితే చెట్లు నాటి, వాటిని పెంచి పెద్దచేద్దామన్న పలివాల్ ఆలోచనకు మొదట పెద్దగా స్పందన రాలేదు కానీ, ఒకరిద్దరు ఈ సంప్రదాయాన్ని పాటించాక, అందరూ అనుసరించారు. కేవలం చెట్లు నాటేయడంతో ఈ కథ ముగియదు. వాటిని పెంచి, పెద్ద చేసే బాధ్యత కూడా తీసుకుంటారు. అంతేకాదు... ఆడపిల్ల పుట్టిన కుటుంబ యజమానికి 10 వేల రూపాయలు పంచాయితీ ఇవ్వాలి. గ్రామస్తులంతా మరో రూ.21 వేలు చందా ఇస్తారు. మొత్తం 31 వేలను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తారు. 20 ఏళ్ల తర్వాత, ఆ ఎఫ్‌డీ అమ్మాయి చేతికందుతుంది. అది ఆమె భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. అమ్మాయి పెళ్లి, చదువు ఎవరికీ భారం కాకూడదనే ఉద్దేశంతో చేసిన ఏర్పాటిది. భవిష్యత్తుపై భరోసా ఉండటంతో ఆడపిల్లను కన్నామని ఎవరూ చింతించరిక్కడ.
అయితే అమ్మాయి భద్రత విషయంలో పిప్లాంట్రి పంచాయితీ అక్కడితో ఆగిపోవట్లేదు. 18 ఏళ్ల కంటే ముందు అమ్మాయికి పెళ్లి చేయబోమని, ఆమె చదువును ఆపబోమని, తనకోసం నాటిన చెట్లను కాపాడతామని పంచాయితీకి తల్లిదండ్రులు అఫిడవిట్ కూడా సమర్పించాలి. దీన్ని మీరితే గ్రామంలో ఎవ్వరూ ఆ కుటుంబానికి సహకరించరు. ఆడపిల్ల పుట్టినప్పుడే కాదు, ఎవరైనా చనిపోయినప్పుడు కూడా 11 చెట్లు నాటడం గ్రామంలో సంప్రదాయంగా మారింది.
ఆదర్శ గ్రామం
ఆడపిల్లల్ని కాపాడేందుకు పలివాల్ వేసిన ఒక ముందడుగు పిప్లాంటి గ్రామ రూపురేఖల్ని మార్చేసింది. ఒకమంచి పని అనేక మంచిపనులను చేయించింది. మార్బుల్ పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన పిప్లాంట్రి ఒకప్పటి పంచాయితీ అధికారులు డబ్బుకోసం ఇష్టానుసారం ఎన్వోసీలు (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌లు) ఇచ్చేశారు. దీంతో మైనింగ్ కాలుష్యం బాగా పెరిగిపోయింది. తాగడానికి నీరు కూడా దొరకని పరిస్థితికి చేరుకున్న దశలో పలివాల్ చేపట్టిన చెట్ల పెంపకం ఈ రోజు గ్రామాన్ని కాలుష్యం బారి నుండి బయటపడేలా చేయడమే కాదు, విప్లవాత్మకమైన మార్పులకూ కారణమైంది. గత కొన్నేళ్లలో పిప్లాంట్రి గ్రామస్తులు ఏకంగా రెండున్నర లక్షల చెట్లు నాటారు. ఆ చెట్ల వల్ల కాలుష్యం పూర్తిగా తగ్గడమే కాదు, వాటి ద్వారా వచ్చే ఆదాయం ఆ ఊరిని లగ్జరీగా తీర్చిదిద్దుకునేందుకు ఉపయోగపడింది. పండ్ల చెట్లకు చుట్టూ నాటే కలబంద చెట్ల ద్వారా కూడా ఆదాయం సమకూర్చుకుంటున్నారు. పంచాయితీ సహకారంతో అలోవీరా ఉత్పత్తులు తయారుచేసి అమ్ముతున్నారు. ఆ బ్రాండ్ పిప్లాంట్రి బ్రాండ్. మరోవైపు పంచాయితీ నిధులతో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని, స్వచ్ఛమైన నీళ్లు తాగుతున్నారు. ప్రభుత్వ నిధులకు గ్రామస్తుల సహకారం తోడై రోడ్లు, స్కూళ్లు నిర్మించుకున్నారు. 24 గంటల కరెంటు. పాడవని వీధి దీపాలు. ఆరోగ్య, విద్య సదుపాయలు.
వ్యాక్సినేషన్ వంటి ఖరీదైనవీ ఉచితంగా అందుబాటులో ఉంటాయక్కడ. మొత్తంగా ఈ గ్రామంలో లేని సౌకర్యమంటూ ఏదీ లేదు. 2006 వరకు రాజస్థాన్‌లో ఒక్క గ్రామం కూడా ‘నిర్మల్ ఆదర్శ గ్రామం’ పురస్కారానికి ఎంపిక కాలేదు. అయితే పిప్లాంట్రి ఆ ఘనత సాధించి మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది. ఈ ఊరు సొంతంగా ‘గ్రామ గీతం’ రూపొందించుకోవడమే కాక, వెబ్‌సైట్ కూడా తీర్చిదిద్దుకుంది. అన్నట్లు, పిప్లాంట్రి గ్రామంలో ఆల్కహాల్ నిషిద్ధం. జంతు వధ, చెట్లు నరకడం కూడా. గత ఏడెనిమిదేళ్లలో ఇక్కడ ఒక్క పోలీస్ కేసు కూడా లేదంటే ఆశ్చర్యపోవాల్సిందే.