మృతదేహాన్ని కాల్చి, గోనె సంచిలో దాచిన బిహార్ మహిళ
బక్సర్ (బిహార్): ఎనిమిదేళ్ల సవతి కూతురిని అత్యంత కిరాతకంగా హత్య చేసింది బిహార్‌కు చెందిన ఓ మహిళ. శనివారం రాత్రి మృతురాలి అవశేషాలను గుర్తించిన పోలీసులు మహిళను అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బక్సర్ జిల్లాలోని డుమ్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నయా భోజ్‌పూర్ ప్రాంతంలో ఓ మహళకు సవతి కూతురు ఎనిమిదేళ్ల ఆంచల్ కుమారి ఉంది. ఆమె తండ్రి ఢిల్లీలో ఉంటున్నారు. మహిల సవతి కూతురుతోపాటు భోజ్‌పూర్‌లో ఉంటోంది. కూతురిని గొంతు నులిమి చంపింది.
ఆ తరువాత మృతదేహానికి నిప్పంటించింది. కాలిపోయిన మృతదేహాన్ని గోనె సంచిలో నింపి చెక్కపెట్టెలో దాచి పెట్టింది. ఆంచల్ కనిపించకపోవడంతో ఇతర కుటుంబ సభ్యులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు ఇంటిని తనిఖీ చేయగా.. గోనె సంచిలో పెట్టిన చెక్కపెట్టెలో దాచిన మృతదేహం బయటపడింది. నేరం చేసినట్లు సవతి తల్లి అంగీకరించింది. సంఘటనా స్థలం నుంచి సేకరించిన సాక్ష్యాల ఆధారంగా పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఈ దారుణానికి ఒడిగట్టడానికి గల కారణాలు మాత్రం ఆమె పోలీసులకు వెల్లడించలేదు.
Comments
Please login to add a commentAdd a comment