కంటే కూతుర్నే కనాలి
భారం కాదు.. మహాభాగ్యం
ఆడపిల్ల భారం అనుకున్నది ఒకప్పుడు. ఇప్పుడు అమ్మాయే ‘మా ఇంటి మహాలక్ష్మి.’ అంటున్నారు నేటితరం తల్లిదండ్రులు. అబ్బాయి అయినా..అమ్మాయి అయినా మాకు ఒక్కటే. ఎలాంటి వివక్ష లేకుండా ఆడపిల్లను పెంచుతున్నాం అని ధీమాగా చెబుతున్నారు. అంతేకాదు..కూతుర్ని కన్నాక.. కుమారుడి కోసం ఎదురు చూడడం లేదు. వారసుడు కావాలంటూ ఆరాటపడడం లేదు. ఆడైనా..మగైనా ఒక్కరు ఉంటే చాలు మాకు అంటూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంతోషంగా కూతురి గురించి..ఆమె భవిష్యత్తు గురించి కలలు కంటున్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా నగరంలో ఒక్క ఆడ కూతురుతోనే సంతోషంగా జీవిస్తున్న కొన్ని జంటల గురించి ....
మాకు అబ్బాయి కావాలన్న కోరిక ఎప్పుడూ కలగలేదు. ఆ లోటూ కనిపించలేదు. మా పాప స్నిగ్ధకు నాణ్యమైన చదువులు చెప్పించాలన్నది మా లక్ష్యం. మేం ఇద్దరం ప్రైవేటు ఉద్యోగులం. ఉన్నంతలోనే జీవితాన్ని గడుపుతూ.. మా పాపకు మెరుగైన జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాం. ఆప్యాయంగా మాట్లాడడంలోనూ, ప్రేమను పంచడంలోనూ అమ్మాయిలకు మించిన వారు లేరు. ఎంత మంది ఆడబిడ్డలు పుట్టినా.. అబ్బాయి కోసం ఎదురుచూసే పరిస్థితులు గతంలో ఉండేవి. ఇప్పుడు అందరి ఆలోచనా తీరు, జీవన విధానం, సమాజ అవసరాలు మారాయి. కొడుకులు లేకున్నా సరే.. అమ్మాయిలు ఉంటే చాలని అందరూ బలంగా ఆకాంక్షిస్తున్నారు. మేం ఇదే కోవకు చెందిన వాళ్లం. అన్ని రంగాల్లో మహిళల పాత్ర పెరిగింది. మలి దశలో కొడుకులు చేదోడు వాదోడుగా ఉంటారని ఎందరో తల్లిదండ్రులు ఆశించడం సహజం. కానీ వారి ఆశలు పూర్తిస్థాయిలో నెరవేరడం లేదు. క ళ్ల ముందు ఉండి మాట్లాడని, కనీసం ఒక్క పూట అన్నం పెట్టని కొడుకుల కంటే.. దూరంగా ఉన్న అమ్మాయిలు ఆప్యాయంగా పలకరించి.. తిన్నావా అమ్మ అంటే కడుపు నిండినంత హాయి కలుగుతుంది. అమ్మానాన్నలను భారం అనుకునే వారికంటే.. బాధ్యతగా చూసుకునే ఆడబిడ్డలు నయం. పెళ్లి సంబంధం కోసం మొన్నటి వరకు ఆస్తి, అంతస్తు, హోదాను బట్టి అమ్మాయిలను వెతికేవారు. కాని ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి. చదువుకున్న అమ్మాయి అయితే చాలు.. అదే మహాభాగ్యం అని కళ్లకు అద్దుకుని సంబంధాలు కుదుర్చుకుంటున్నారు. అమ్మానాన్నలకు ఇంతకు మించిన సంతోషం ఇంకేముంటుంది. ఇంట్లో ఆడపిల్ల ఉంటే.. మరో అమ్మతో సమానం! - వంగాల కవితా శ్రీధర్‌రెడ్డి, దంపతులు
కూతురే మా ప్రపంచం
మాకు 1992లో వివాహం అయింది. 1993లో పాప జన్మించింది. పాపైనా..బాబైనా ఒక్కరితోనే సరిపెట్టుకోవాలని ముందే అనుకున్నాం. అలాగే చేశాం. మా కూతురు గ్రీష్మే మా ప్రపంచం ఇప్పుడు. ఆమెకు బంగారు భవిష్యత్తు ఇచ్చేందుకు ఇద్దరం పాటుపడుతున్నాం. ప్రస్తుతం పాప బీటెక్ పూర్తిచేసింది. మొదట కూతురు పుట్టినప్పుడు కు.ని ఆపరేషన్ చేయించుకుంటామంటే చాలా మంది వద్దన్నారు. కొడుకు ఉండాలన్నారు. మేం వారి మాటలను పట్టించుకోలేదు. మాకు కూతురైనా..కొడుకైనా ఒక్కటే గట్టిగా చెప్పాం. ప్రస్తుతం హైటెక్ యుగంలో ఉన్నాం మనం. ఇంకా ఆడ, మగ వివక్షలు విభేదాలు చూపడం తగదు. మహిళలు అన్నిరంగాల్లోనూ రాణిస్తున్నారు. కాబట్టి ఆడపిల్లైనా మగపిల్లాడైనా ఒక్కటే అని అందరూ భావించాలి. అప్పుడే సమాజం బాగుంటుంది. - ముప్పిడి సీతారాంరెడ్డి, శోభ, కందికల్ గేట్
బెంగ లేదు..భారం కాదు...
కొడుకైనా... కూతురైనా ఒక్కటే. అందుకే ఒక్క కూతురితోనే సరిపెట్టుకున్నాం. మా పాప పేరు మహేశ్వరి. ఇంటర్ చదివింది. వారసుడు లేడన్న వెలితి, బెంగ మాకు ఎప్పుడూ లేదు. కూతురు భారం...కుమారుడే ముఖ్యమనే రోజులు పోయాయి. ఇప్పుడు అందరూ సమానమే. పాపను ఉన్నత చదువులు చదివించాలనేది మా లక్ష్యం. అందుకోసం శ్రమిస్తున్నాం. పాపకు ఇష్టమైన రంగాన్నే ఎంచుకోమని చెప్పాం. పూర్తి స్వేచ్ఛగా వ్యవహరిస్తాం. దీంతో మా ఇంట్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి. ఈ సంతోషంలో అన్నీ మర్చిపోతాం. మా పాపే మాకు సర్వస్వం. - పోచబోయిన శ్రీనివాస్‌యాదవ్, మంగమ్మ- సాయినగర్
పాప భవిష్యత్తే ముఖ్యం...
బాబు...పాప అనేది కాదు. ఎవరైనా వారికి బంగారు భవిష్యత్తు కల్పించడమే ముఖ్యం. మాకు ఒక్కతే అమ్మాయి. పేరు. సాయి కీర్తి. ప్రస్తుతం 9వ తరగతి చదువుతోంది. పాపను బాగా చదివించి ప్రభుత్వ ఉ ద్యోగం చేయించాలనేది మా కల. మా కలను నెరవేర్చుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తాం. ఒకప్పుడు ఆడపిల్ల అంటే భయపడేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. వివక్ష తొలగింది. అసలు ఆడపిల్లతో అనుబంధం ఎం తో గొప్పది. అది మాటల్లో చెప్పడానికి వీలుకాదు. మా అమ్మాయికి చాలా కోరికలున్నాయి. వాటన్నింటిని నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఒక కుటుంబంలో ఏకైక సంతానంగా ఆడపిల్ల ఉన్నవారికి చదువుల్లో, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. - భార్గవి, చంద్రశేఖర్, ఖాజాగూడ
ఎవరైనా ఒక్కటే...
మాకు అన్నీ మా మనీషానే. కూతురు, కొడుకు అనే తారతమ్యం లేదు. అందరినీ ఆమెలోనే చూసుకుంటున్నాం. నేను ప్రైవేటు స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్నాను. మా వారు చిరుద్యోగి. మాది పేదకుటుంబం అయినప్పటికీ ఉన్నంతో మా పాపను బాగా చదివించాలని నిర్ణయించాం. పాప ఉన్నత స్థానంలో ఉండాలనేది మా కోరిక. పేద కుటుంబాల్లో పిల్లల చదువులు కొంత భారంగా మారాయి. ఈ విషయంలో ప్రభుత్వం కొంత ఆలోచించి ఏదైనా పథకం పెడితే బావుంటుంది. ఇంట్లో ఏకైక సంతానంగా ఆడపిల్ల ఉన్న కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. మా పాప ఇప్పుడు ఇంటర్ చదువుతోంది. ఆమె ఎంతవరకు చదివితే అంతవరకు చదివిస్తాం.
- లతా శ్రీనివాస్, ఖాజాగూడ
గర్వంగా ఫీలవుతున్నాం
మాది ప్రేమవివాహం. మాకు ఒక్కతే పాప. పేరు జాహ్నవి నాల్గవ తరగతి చదువుతున్నది. మేం ఏనాడూ మగ పిల్లాడు లేడని బాధపడలేదు. ఆడకూతురు ఉన్నందుకు గర్వంగా ఫీలవుతున్నాం. మా వారు సాప్ట్‌వేర్ ఉద్యోగి. నేను ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్నాను. పాపే మాకు ప్రాణం. ఆమెకు ఎలాంటి లోటు రాకుండా ఇద్దరమూ బాధ్యత తీసుకొని పెంచుతున్నాం. ఇప్పుడు సమాజంలో చాలా మార్పు వచ్చింది. ఆడపిల్ల అంటే చులకన భావం పోయింది. అమ్మాయి అయినా..అబ్బాయి అయినా పిల్లల భవిష్యత్తు ముఖ్యం. వారిని సమాన దృష్టితో చూస్తూ బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడమే పేరెంట్స్‌గా మా బాధ్యత. దాన్ని సంపూర్ణంగా నెరవేరుస్తున్నాం. - సలోమి, మల్లికార్జున్