సాక్షి, హైదరాబాద్: వైద్యరంగంలో మరో అద్భుతాన్ని ఆవిష్కరించారు నగరంలోని రెయిన్‌బో చిల్డ్రన్స్ ఆస్పత్రి వైద్యులు. నెలలు నిండక ముందే తక్కువ బరువు(కేవలం 375 గ్రాముల బరువు)తో జన్మించిన ఆడశిశువు(చెర్రి)కు పునర్జన్మ ప్రసాదించారు. అబార్షన్ వల్ల ఇప్పటికే నాలుగుసార్లు పిల్లలకు దూరమైన ఆ దంపతుల జీవితాల్లో ఆనందం నింపారు.
ప్రస్తుతం శిశువు ఎత్తు, బరువు పెరగడంతోపాటు ఆరోగ్యంగా ఉండటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ మేరకు గురువారం బంజారాహిల్స్‌లోని ఓ హోటల్లో విలేకరుల సమావేశంలో రెయిన్‌బో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ రమేశ్ కంచెర్ల, ఇంటెన్సివ్‌కేర్ యూనిట్ డైరెక్టర్ డాక్టర్ దినేశ్ కుమార్ చికిత్స వివరాలు వెల్లడించారు.
వైద్యులకు కలసి వచ్చిన గత అనుభవం
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సౌరభ్ భార్య నిఖితకు గర్భం దాల్చిన 24 వారాల తర్వాత స్థానిక ఆస్పత్రిలో అల్ట్రాసౌండ్ నిర్వహించారు. ఉమ్మనీరు తగ్గడంతో కడుపులోని బిడ్డకు ఆక్సిజన్ సరిగా అందడంలేదని వైద్యులు నిర్ధారించారు. తల్లి నుంచి రక్తప్రసరణ కూడా నిలిచిపోయింది. బిడ్డను కాపాడుకునేందుకు అనేకమంది వైద్యులను సంప్రదించగా అబార్షన్ చేయడమే పరిష్కారమని చెప్పారు. చివరకు ఆ దంపతులు హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు.
అప్పటికే 449 గ్రాముల శిశువును రక్షించిన అనుభవం ఈ ఆస్పత్రి వైద్యులకు ఉంది. ఫిబ్రవరి 27న నిఖితకు సిజేరియన్ చేసి కడుపులోని ఆడబిడ్డ(చెర్రి)ను బయటికి తీశారు. అప్పుడు బిడ్డ బరువు కేవలం 375 గ్రాములు. 26 సెంటీమీటర్ల పొడవు మాత్రమే. సాధారణంగా ప్రసవ సమయంలో ఆరోగ్యవంతమైన బిడ్డ బరువు 2.8 కేజీల నుంచి మూడు కేజీల వరకు ఉంటుంది.
అనేక సవాళ్లను అధిగమించి..
శిశువుకు ఆక్సిజన్ అందకపోవడం, బీపీ తక్కువగా నమోదు కావడం వైద్యులకు పెద్ద సవాల్‌గా మారింది. పుట్టిన వెంటనే వెంటిలేటర్‌పైకి చేర్చి వైద్యం అందించారు. ఎప్పటికప్పుడు మెదడు, గుండె, మూత్రపిండాల పనితీరును పరీక్షిస్తూ ప్రత్యేక మందులతోపాటు న్యూట్రిషన్‌ను కూడా అందించారు. 128 రోజులపాటు ఐసీయూలో ప్రత్యేక వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందించారు. 105 రోజులు వెంటిలేటర్‌పై ఉంచారు. ప్రస్తుతం శిశువు బరువు 2.45 కేజీలకు, ఎత్తు 46 సెంటిమీటర్లకు చేరుకుంది.
ఆగ్నేయాసియాలోనే తొలి కేసు
నెలలు నిండక ముందే తక్కువ బరువుతో పుట్టిన శిశువుకు పునర్జన్మ ప్రసాదించడం ఆగ్నేయాసియా వైద్య చరిత్రలోనే ఇది మొదటిది. గతంలో 449 గ్రాముల బరువుతో పుట్టిన శిశువును కాపాడిన అనుభవం ఉండటం వల్లే ఇది మాకు సాధ్యమైంది. అత్యాధునిక ఐసీయూ, వెంటిలేటర్ సపోర్టు, వైద్యపరంగా ఉన్న అనుభవం ఇందుకు తోడయ్యాయి.
- డాక్టర్ దినేష్‌కుమార్, రెయిన్‌బో ఆస్పత్రి
ఆశలు వదులుకున్నాం
నాలుగు సార్లు అబార్షన్ కావడం, ఐదోసారి కూడా అదే పరిస్థితి తలెత్తడంతో చాలా ఆందోళన చెందాం. ఇక పిల్లలపై ఆశలు వదులుకున్నాం. చివరి ప్రయత్నంలో భాగంగా రెయిన్‌బోకు వచ్చాం. అదృష్టవశాత్తూ మా బిడ్డ మాకు దక్కింది. చాలా సంతోషంగా ఉంది. పునర్జన్మ ప్రసాదించిన వైద్యులకు ధన్యవాదాలు. – నిఖిత, సౌరభ్
Comments
Please login to add a commentAdd a comment