Rainbow Childrens Hospital
-
ఐపీవోకు 2 కంపెనీలు రెడీ
న్యూఢిల్లీ: కొత్తగా రెండు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు రానున్నాయి. జాబితాలో మల్టీ స్పెషాలిటీ పిడియాట్రిక్ ఆసుపత్రుల చైన్ రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ లిమిటెడ్, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ సర్వీసుల సంస్థ ఈముద్ర చేరాయి. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి తాజాగా అనుమతులు పొందాయి. ఐపీవో చేపట్టేందుకు వీలుగా గతేడాది చివర్లో రెండు కంపెనీలు సెబీకి ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. ఇతర వివరాలు చూద్దాం.. రెయిన్బో చిల్డ్రన్స్ ఐపీవోలో భాగంగా హైదరాబాద్ సంస్థ రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ రూ. 280 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 2.4 కోట్ల షేర్లను వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 2,000 కోట్లకుపైగా సమకూర్చుకునే వీలుంది. యూకేకు చెందిన సీడీసీ గ్రూప్ తొలుత 1999లో చిన్నపిల్లలకు ప్రత్యేకించిన రెయిన్బో ఆసుపత్రిని హైదరాబాద్‌లో నెలకొల్పింది. ఈ ఆసుపత్రి 50 పడకలతో ఏర్పాటుకాగా.. తదుపరి కంపెనీ విస్తరణ బాటలో సాగింది. దీంతో 2021 సెప్టెంబర్‌కల్లా 1500 పడకలతో కూడిన 14 ఆసుపత్రులు, మూడు క్లినిక్‌లకు విస్తరించింది. ఈముద్ర దేశీయంగా అధికారిక సర్టిఫైయింగ్ లైసెన్స్ కలిగిన అతిపెద్ద సంస్థగా ఈముద్ర నిలుస్తోంది. 2021 మార్చికల్లా డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ మార్కెట్లో వాటాను 37.9 శాతానికి పెంచుకుంది. 2020 మార్చికల్లా ఈ వాటా 36.5 శాతంగా నమోదైంది. కాగా.. పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, పరికరాల కొనుగోలు, డేటా సెంటర్ల ఏర్పాటు వ్యయాలు తదితరాల కోసం వెచ్చించనుంది. -
కేటీఆర్ సీఎం కానున్నారు.. ప్రకటనల కోసం డబ్బులివ్వండి
సాక్షి, బంజారాహిల్స్: మంత్రి కేటీఆర్ పీఏనని ప్రచారం చేసుకుంటూ డబ్బు వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీకాకుళం జిల్లా పోలంకి మండలం ఎవ్వారిపేట గ్రామానికి చెందిన బుడుమూరు నాగరాజు (25) మాజీ రంజీ క్రికెట్ ప్లేయర్. గత కొంతకాలంగా జల్సాలకు అలవాటుపడ్డ నాగరాజు తేలికగా డబ్బులు సంపాదించే వ్యవహారాలపై దృష్టి సారించాడు. తాను కేటీఆర్ పీఏనని పరిచయం చేసుకుని, ఈ నెల 15వ తేదీన సాయంత్రం 5.30 గంటలకు బంజారాహిల్స్‌లోని రెయిన్బో పిల్లల ఆస్పత్రి ల్యాండ్‌లైన్‌కు ఫోన్ చేశాడు. ఎండీ డాక్టర్ కంచర్ల రమేశ్ ఫోన్ నంబర్ అడిగి తీసుకున్నాడు. తరువాత డాక్టర్ రమేశ్‌కు ఫోన్ చేసి తాను కేటీఆర్ పీఏ తిరుపతిరెడ్డిని మాట్లాడుతున్నానని, ఎల్బీ స్టేడియంలో ఈ నెల 25న కేటీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పారు. మీడియాలో ప్రకటనలిచ్చేందుకుగాను 50 లక్షలు సమకూర్చాలని తెలిపారు. అయితే అనుమానం వచ్చిన డాక్టర్ రమేశ్ ఆరా తీయగా ఆ నంబర్ తిరుపతిరెడ్డిది కాదని తేలింది. వెంటనే ఆస్పత్రి సీనియర్ మేనేజర్ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నిందితుడు నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. నిందితుడు గతంలో కూడా ప్రముఖులకు ఫోన్లు చేసి డబ్బులు డిమాండ్ చేసినట్లుగా తేలింది. జూబ్లీహిల్స్, ఓయూ, సైబర్ క్రైం పోలీసులు గతంలోనూ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
చెర్రి.. పండులా మారింది!
సాక్షి, హైదరాబాద్: వైద్యరంగంలో మరో అద్భుతాన్ని ఆవిష్కరించారు నగరంలోని రెయిన్బో చిల్డ్రన్స్ ఆస్పత్రి వైద్యులు. నెలలు నిండక ముందే తక్కువ బరువు(కేవలం 375 గ్రాముల బరువు)తో జన్మించిన ఆడశిశువు(చెర్రి)కు పునర్జన్మ ప్రసాదించారు. అబార్షన్ వల్ల ఇప్పటికే నాలుగుసార్లు పిల్లలకు దూరమైన ఆ దంపతుల జీవితాల్లో ఆనందం నింపారు. ప్రస్తుతం శిశువు ఎత్తు, బరువు పెరగడంతోపాటు ఆరోగ్యంగా ఉండటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ మేరకు గురువారం బంజారాహిల్స్‌లోని ఓ హోటల్లో విలేకరుల సమావేశంలో రెయిన్బో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ రమేశ్ కంచెర్ల, ఇంటెన్సివ్‌కేర్ యూనిట్ డైరెక్టర్ డాక్టర్ దినేశ్ కుమార్ చికిత్స వివరాలు వెల్లడించారు. వైద్యులకు కలసి వచ్చిన గత అనుభవం ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సౌరభ్ భార్య నిఖితకు గర్భం దాల్చిన 24 వారాల తర్వాత స్థానిక ఆస్పత్రిలో అల్ట్రాసౌండ్ నిర్వహించారు. ఉమ్మనీరు తగ్గడంతో కడుపులోని బిడ్డకు ఆక్సిజన్ సరిగా అందడంలేదని వైద్యులు నిర్ధారించారు. తల్లి నుంచి రక్తప్రసరణ కూడా నిలిచిపోయింది. బిడ్డను కాపాడుకునేందుకు అనేకమంది వైద్యులను సంప్రదించగా అబార్షన్ చేయడమే పరిష్కారమని చెప్పారు. చివరకు ఆ దంపతులు హైదరాబాద్‌లోని రెయిన్బో ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు. అప్పటికే 449 గ్రాముల శిశువును రక్షించిన అనుభవం ఈ ఆస్పత్రి వైద్యులకు ఉంది. ఫిబ్రవరి 27న నిఖితకు సిజేరియన్ చేసి కడుపులోని ఆడబిడ్డ(చెర్రి)ను బయటికి తీశారు. అప్పుడు బిడ్డ బరువు కేవలం 375 గ్రాములు. 26 సెంటీమీటర్ల పొడవు మాత్రమే. సాధారణంగా ప్రసవ సమయంలో ఆరోగ్యవంతమైన బిడ్డ బరువు 2.8 కేజీల నుంచి మూడు కేజీల వరకు ఉంటుంది. అనేక సవాళ్లను అధిగమించి.. శిశువుకు ఆక్సిజన్ అందకపోవడం, బీపీ తక్కువగా నమోదు కావడం వైద్యులకు పెద్ద సవాల్‌గా మారింది. పుట్టిన వెంటనే వెంటిలేటర్‌పైకి చేర్చి వైద్యం అందించారు. ఎప్పటికప్పుడు మెదడు, గుండె, మూత్రపిండాల పనితీరును పరీక్షిస్తూ ప్రత్యేక మందులతోపాటు న్యూట్రిషన్‌ను కూడా అందించారు. 128 రోజులపాటు ఐసీయూలో ప్రత్యేక వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందించారు. 105 రోజులు వెంటిలేటర్‌పై ఉంచారు. ప్రస్తుతం శిశువు బరువు 2.45 కేజీలకు, ఎత్తు 46 సెంటిమీటర్లకు చేరుకుంది. ఆగ్నేయాసియాలోనే తొలి కేసు నెలలు నిండక ముందే తక్కువ బరువుతో పుట్టిన శిశువుకు పునర్జన్మ ప్రసాదించడం ఆగ్నేయాసియా వైద్య చరిత్రలోనే ఇది మొదటిది. గతంలో 449 గ్రాముల బరువుతో పుట్టిన శిశువును కాపాడిన అనుభవం ఉండటం వల్లే ఇది మాకు సాధ్యమైంది. అత్యాధునిక ఐసీయూ, వెంటిలేటర్ సపోర్టు, వైద్యపరంగా ఉన్న అనుభవం ఇందుకు తోడయ్యాయి. - డాక్టర్ దినేష్‌కుమార్, రెయిన్బో ఆస్పత్రి ఆశలు వదులుకున్నాం నాలుగు సార్లు అబార్షన్ కావడం, ఐదోసారి కూడా అదే పరిస్థితి తలెత్తడంతో చాలా ఆందోళన చెందాం. ఇక పిల్లలపై ఆశలు వదులుకున్నాం. చివరి ప్రయత్నంలో భాగంగా రెయిన్‌బోకు వచ్చాం. అదృష్టవశాత్తూ మా బిడ్డ మాకు దక్కింది. చాలా సంతోషంగా ఉంది. పునర్జన్మ ప్రసాదించిన వైద్యులకు ధన్యవాదాలు. – నిఖిత, సౌరభ్ -
విస్తరణ బాటలో రెయిన్బో పిల్లల ఆసుపత్రి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న రెయిన్బో పిల్లల ఆసుపత్రి విస్తరణ బాటపట్టింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరుల్లో కలిపి మొత్తం 700-800 పడకలున్న రెయిన్ బో.. తన మూడేళ్ల భవిష్యత్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. తొలి విడతగా ఈ ఏడాది ముగింపు నాటికి విశాఖపట్నం, పూణె నగరాల్లో ఆసుపత్రులను ప్రారంభించనున్నట్లు రెయిన్బో చిల్డ్రన్స్ మెడికే ర్ సీఎండీ డాక్టర్ రమేష్ కంచర్ల చెప్పారు. రెండో విడతగా మూడేళ్లలో చెన్నై, జైపూర్లలో రెయిన్బో పిల్లల ఆసుపత్రి సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రెయిన్బో పిల్లల ఆసుపత్రి ప్రచారకర్తగా సూపర్‌స్టార్ మహేశ్‌బాబును నియమించుకున్నారు. ఈ సందర్భంగా గురువారమిక్కడ జరిగిన కార్యక్రమంలో ఆసుపత్రి డెరైక్టర్ డాక్టర్. దినేష్ కుమార్ చిర్లతో కలిసి ఆయన మాట్లాడారు. బెంగళూరులో ఉన్న 200 పడకల ఆసుపత్రిని అవసరమైతే విస్తరిస్తామన్నారు. చాలా వరకు దక్షిణాది రాష్ట్రాల్లోని ఆసుపత్రులు తమ రాష్ట్రంలో జాయింట్ వెంచర్లుగా రెయిన్బో ఆసుపత్రులను ప్రారంభిద్దామని అడుగుతున్నాయని.. కానీ, తామే నిరాకరిస్తున్నామని రమేష్ పేర్కొన్నారు. పిల్లల సమస్యలు, వ్యాధులు పిల్లల వైద్యులకే సరిగ్గా తెలుస్తాయని.. అందుకే 20-25 లక్షల జనాభా ఉన్న ప్రతి పట్టణంలోనూ పిల్లల కోసం ప్రత్యేక ఆసుపత్రి ఉండాలని ఆయన సూచించారు. యూకేలో పిల్లల కోసం 12-18 ఆసుపత్రులున్నాయని ఉదాహరణగా పేర్కొన్నారు. నా తర్వాత నా కొడుకే బ్రాండ్ అంబాసిడర్ ‘‘ప్రస్తుతం రెయిన్బో పిల్లల ఆసుపత్రికి నేను ప్రచారకర్త. నా తర్వాత నా కొడుకు గౌతమ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటాడని’’ ప్రిన్స్ మహేశ్బాబుపేర్కొన్నారు. రెయిన్బో ఆసుపత్రితో తనది ఎనిమిదేళ్ల పరిచయమని, గౌతమ్ బాగోగులన్నీ ఈ ఆసుపత్రి వైద్యులే చూస్తుంటారని తెలిపారు. మానవ శరీరంలోని ప్రతి భాగానికో స్పెషల్ డాక్టర్ ఉన్నట్టే పిల్లల కోసం కూడా ప్రత్యేకంగా ఆసుపత్రులుండాలని చెప్పారు. -
నూటికి నూరుపాళ్లు నేరమే!
కౌన్సెలింగ్ భార్యను భర్త కొట్టడం అనేది మనదేశంలో కొన్ని ప్రాంతాల్లో చాలా చిన్న సమస్య. మొన్నీమధ్యనే ఈ సమస్య గురించి కౌన్సెలింగ్ తీసుకోడానికి ఓ ఇద్దరు దంపతులు నా దగ్గరకు వచ్చారు. మొదట ఆమె తన సమస్యను చెప్పింది. ‘‘ఏదైనా సమస్య గురించి మాట్లాడితే సరిగ్గా సమాధానం చెప్పకపోగా...చేయి చేసుకుంటున్నారండీ’’ కంట నీరుతో ఆమె చెప్పింది. ఆమె మాటను ఖండిస్తూ...‘‘నోటికొచ్చినట్టు మాట్లాడితే...ఒళ్లు మండుతుంది మేడమ్! ఆ సమయంలో ఏ మగాడైనా చేసే పని అదే కదండీ! రెచ్చగొట్టే మాటలు మానుకుంటే మా ఇద్దరీ మధ్యా ఎలాంటి సమస్యా ఉండదండీ!’’ కరాఖండిగా చెప్పాడు భర్త. విషయం ఏమిటంటే...భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్థులే. ఆయన ఉద్యోగం మాత్రమే చేస్తాడు. ఆమె ఉద్యోగంతో పాటు అన్ని పనులూ చేస్తుంది. ‘‘మా అమ్మ ఎంచక్కా...బోలెడన్ని వెరైటీ కూరలు వండేది. ఇంటికి రాగానే మా నాన్నకు ఎన్ని సేవలు చేసేదో. ఒక్కరోజు కూడా మా అమ్మ నాన్నకు ఎదురు సమాధానం చెప్పడం నేనెరుగను’’ అంటూ సందు దొరికినపుడల్లా భర్త అనే మాటలు ఆమెను ఎంత వేధించాలో అంత వేధించేవి. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులుగా ఉన్న మధ్యతరగతి కుటుంబాల్లో ఈ సమస్య సర్వసాధారణమైపోయింది. ‘‘మీ అమ్మగారు ఏరోజైనా మార్కెట్‌కి వెళ్లి కూరగాయలు తెచ్చారా... పోనీ మిమ్మల్ని స్కూల్లో దిగబెట్టడం, పేరెంట్స్ మీటింగ్‌కి హాజరవ్వడం, షాపింగ్‌లు... వంటివి చేసేవారా...’’ అని అడుగుతుంటే... ‘‘ఆ రోజుల్లో ఆడవాళ్లకి ఆ పనులన్నీ చేసే అవకాశం ఎక్కడిదండీ!’’ అన్నాడు. ‘‘అవకాశమేంటి? ఆ పనులన్నీ చేయడం అవసరం కదా!’’ అన్నాను. అతనికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. అంటే అతని ఉద్దేశం...అలాంటి పనులన్నీ చేయడం మహిళలకు కలిగిన అవకాశంగా భావిస్తున్నాడు కానీ, తప్పక చేస్తున్నట్టు అతను గ్రహించడంలేదు. ఇలా కొంత చర్చ నడిచాక...ఆడవాళ్లకుండే సమస్యలు, పని ఒత్తిడి వల్ల వారు పడే మానసిక వేదన గురించి వివరంగా చెబితే మౌనంగా ఆలకించాడు. ఇంటి పనుల్లో భార్యకు సాయంగా ఉండడమంటే గిన్నెలు కడగడం, వంట చేయడం, ఇల్లు శుభ్రం చేయడం అని అర్థం కాదు. బయట చక్కబెట్టాల్సిన చాలాపనుల్లో భర్త సాయం చేయాలి. అలా చేయడం కుదరనప్పుడు తన పని కూడా భార్య చేస్తోందని గుర్తించాలి. ఇక చేయి చేసుకోవడం అంటారా అది నూటికి నూరుపాళ్లు నేరమే! నేరస్థుడికి ప్రేమను పొందే హక్కు ఉండదు. - పద్మా పాల్వాయి, సైకియాట్రిస్టు, రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పటల్