విస్తరణ బాటలో రెయిన్‌బో పిల్లల ఆసుపత్రి | The expansion process of the Rainbow Children's Hospital | Sakshi
Sakshi News home page

విస్తరణ బాటలో రెయిన్‌బో పిల్లల ఆసుపత్రి

Published Fri, Jun 26 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 4:21 AM

విస్తరణ బాటలో రెయిన్‌బో పిల్లల ఆసుపత్రి

విస్తరణ బాటలో రెయిన్‌బో పిల్లల ఆసుపత్రి

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న రెయిన్‌బో పిల్లల ఆసుపత్రి విస్తరణ బాటపట్టింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరుల్లో కలిపి మొత్తం 700-800 పడకలున్న రెయిన్ బో.. తన మూడేళ్ల భవిష్యత్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. తొలి విడతగా ఈ ఏడాది ముగింపు నాటికి విశాఖపట్నం, పూణె నగరాల్లో ఆసుపత్రులను ప్రారంభించనున్నట్లు రెయిన్‌బో చిల్డ్రన్స్ మెడికే ర్ సీఎండీ డాక్టర్ రమేష్ కంచర్ల చెప్పారు. రెండో విడతగా మూడేళ్లలో చెన్నై, జైపూర్లలో రెయిన్‌బో పిల్లల ఆసుపత్రి సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

రెయిన్‌బో పిల్లల ఆసుపత్రి ప్రచారకర్తగా సూపర్‌స్టార్ మహేశ్‌బాబును నియమించుకున్నారు. ఈ సందర్భంగా గురువారమిక్కడ జరిగిన కార్యక్రమంలో ఆసుపత్రి డెరైక్టర్ డాక్టర్. దినేష్ కుమార్ చిర్లతో కలిసి ఆయన మాట్లాడారు. బెంగళూరులో ఉన్న 200 పడకల ఆసుపత్రిని అవసరమైతే విస్తరిస్తామన్నారు. చాలా వరకు దక్షిణాది రాష్ట్రాల్లోని ఆసుపత్రులు తమ రాష్ట్రంలో జాయింట్ వెంచర్లుగా రెయిన్‌బో ఆసుపత్రులను ప్రారంభిద్దామని అడుగుతున్నాయని.. కానీ, తామే నిరాకరిస్తున్నామని రమేష్ పేర్కొన్నారు.

పిల్లల సమస్యలు, వ్యాధులు పిల్లల వైద్యులకే సరిగ్గా తెలుస్తాయని.. అందుకే 20-25 లక్షల జనాభా ఉన్న ప్రతి పట్టణంలోనూ పిల్లల కోసం ప్రత్యేక ఆసుపత్రి ఉండాలని ఆయన సూచించారు. యూకేలో పిల్లల కోసం 12-18 ఆసుపత్రులున్నాయని ఉదాహరణగా పేర్కొన్నారు.

 నా తర్వాత నా కొడుకే బ్రాండ్ అంబాసిడర్
 ‘‘ప్రస్తుతం రెయిన్‌బో పిల్లల ఆసుపత్రికి నేను ప్రచారకర్త. నా తర్వాత నా కొడుకు గౌతమ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటాడని’’ ప్రిన్స్ మహేశ్‌బాబుపేర్కొన్నారు. రెయిన్‌బో ఆసుపత్రితో తనది ఎనిమిదేళ్ల పరిచయమని,  గౌతమ్ బాగోగులన్నీ ఈ ఆసుపత్రి వైద్యులే చూస్తుంటారని తెలిపారు. మానవ శరీరంలోని ప్రతి భాగానికో స్పెషల్ డాక్టర్ ఉన్నట్టే పిల్లల కోసం కూడా ప్రత్యేకంగా ఆసుపత్రులుండాలని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement