నూటికి నూరుపాళ్లు నేరమే! | hundred percent it is crime | Sakshi
Sakshi News home page

నూటికి నూరుపాళ్లు నేరమే!

Published Tue, May 27 2014 11:03 PM | Last Updated on Sat, Sep 2 2017 7:56 AM

నూటికి నూరుపాళ్లు నేరమే!

నూటికి నూరుపాళ్లు నేరమే!

కౌన్సెలింగ్
 
భార్యను భర్త కొట్టడం అనేది మనదేశంలో కొన్ని ప్రాంతాల్లో చాలా చిన్న సమస్య.  మొన్నీమధ్యనే ఈ సమస్య గురించి కౌన్సెలింగ్ తీసుకోడానికి ఓ ఇద్దరు దంపతులు నా దగ్గరకు వచ్చారు. మొదట ఆమె తన సమస్యను చెప్పింది. ‘‘ఏదైనా సమస్య గురించి మాట్లాడితే సరిగ్గా సమాధానం చెప్పకపోగా...చేయి చేసుకుంటున్నారండీ’’ కంట నీరుతో ఆమె చెప్పింది.

ఆమె మాటను ఖండిస్తూ...‘‘నోటికొచ్చినట్టు మాట్లాడితే...ఒళ్లు మండుతుంది మేడమ్! ఆ సమయంలో ఏ మగాడైనా చేసే పని అదే కదండీ! రెచ్చగొట్టే మాటలు మానుకుంటే మా ఇద్దరీ మధ్యా ఎలాంటి సమస్యా ఉండదండీ!’’ కరాఖండిగా చెప్పాడు భర్త. విషయం ఏమిటంటే...భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్థులే. ఆయన ఉద్యోగం మాత్రమే చేస్తాడు. ఆమె ఉద్యోగంతో పాటు అన్ని పనులూ చేస్తుంది.
 
‘‘మా అమ్మ ఎంచక్కా...బోలెడన్ని వెరైటీ కూరలు వండేది. ఇంటికి రాగానే మా నాన్నకు ఎన్ని సేవలు చేసేదో. ఒక్కరోజు కూడా మా అమ్మ నాన్నకు ఎదురు సమాధానం చెప్పడం నేనెరుగను’’ అంటూ సందు దొరికినపుడల్లా భర్త అనే మాటలు ఆమెను ఎంత వేధించాలో అంత వేధించేవి.  భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులుగా ఉన్న మధ్యతరగతి కుటుంబాల్లో ఈ సమస్య సర్వసాధారణమైపోయింది. ‘‘మీ అమ్మగారు ఏరోజైనా మార్కెట్‌కి వెళ్లి కూరగాయలు తెచ్చారా... పోనీ మిమ్మల్ని స్కూల్లో దిగబెట్టడం, పేరెంట్స్ మీటింగ్‌కి హాజరవ్వడం, షాపింగ్‌లు... వంటివి చేసేవారా...’’ అని అడుగుతుంటే... ‘‘ఆ రోజుల్లో ఆడవాళ్లకి ఆ పనులన్నీ చేసే అవకాశం ఎక్కడిదండీ!’’ అన్నాడు. ‘‘అవకాశమేంటి? ఆ పనులన్నీ చేయడం అవసరం కదా!’’ అన్నాను. అతనికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు.

అంటే అతని ఉద్దేశం...అలాంటి పనులన్నీ చేయడం మహిళలకు కలిగిన అవకాశంగా భావిస్తున్నాడు కానీ, తప్పక చేస్తున్నట్టు అతను గ్రహించడంలేదు. ఇలా కొంత చర్చ నడిచాక...ఆడవాళ్లకుండే సమస్యలు, పని ఒత్తిడి వల్ల వారు పడే మానసిక వేదన గురించి వివరంగా చెబితే మౌనంగా ఆలకించాడు. ఇంటి పనుల్లో భార్యకు సాయంగా ఉండడమంటే గిన్నెలు కడగడం, వంట చేయడం, ఇల్లు శుభ్రం చేయడం అని అర్థం కాదు. బయట చక్కబెట్టాల్సిన చాలాపనుల్లో భర్త సాయం చేయాలి. అలా చేయడం కుదరనప్పుడు తన పని కూడా భార్య చేస్తోందని గుర్తించాలి. ఇక చేయి చేసుకోవడం అంటారా అది నూటికి నూరుపాళ్లు నేరమే! నేరస్థుడికి ప్రేమను పొందే హక్కు ఉండదు.
 - పద్మా పాల్వాయి, సైకియాట్రిస్టు, రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పటల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement