psikiyatrist
-
నీడలు మాట్లాడుతున్నాయి!
మైండ్ ఏమైనా రేడియో స్టేషనా మాటలు వినపడటానికి? లేదంటే పాత యాంటిన్నా ఉన్న టీవీనా బొమ్మలు నాట్యమాడటానికి? ఎగ్జాట్లీ! నిజానికి మైండ్ బ్రాడ్కాస్ట్, టెలికాస్ట్ స్టేషనే కాదు... ఒక ప్రొజెక్షన్ మెషిన్లా కూడా పనిచేస్తుంది. మనసులో ఉన్న ఆలోచనలు, అనుమానాలను పరిసరాలపై, పరిసరాల్లో ఉన్న మనుషులపై ప్రొజెక్ట్ చేస్తుంది. వాటినే మనం భ్రమలు అంటాం. తొలగిపోతాయిలే అని ఆశిస్తాం. కానీ... ఇదొక రుగ్మత. స్కీజోఫ్రీనియా...! ఇట్ నీడ్స్ ట్రీట్మెంట్!! లక్ష్మి ఈమధ్యే పెళ్లిచేసుకొని అత్తగారింట్లో అడుగుపెట్టింది. అత్తింటి వాళ్లకు ఊళ్లో కాస్త మంచి పేరే ఉంది. గౌరవప్రదమైన వ్యక్తులు, సాత్వికులూ అనే ప్రతీతీ ఉంది. అందుకే వారికి పిల్లనిచ్చినందుకు లక్ష్మి వాళ్ల పుట్టింటివాళ్లూ చాలా ఆనందంగా ఉన్నారు. అయితే పెళ్లయిన కొద్దిరోజుల్లోనే లక్ష్మి తన అత్తింటివారి మీద ఆరోపణలు మొదలుపెట్టింది. తన అత్త, ఆడపడుచూ, భర్త కలిసి తనను వేధిస్తున్నారనీ, తనను వదిలించుకోడానికి కుట్రలు పన్నుతున్నారంటూ పోలీసులను ఆశ్రయించింది. ఊళ్లోవాళ్లూ చాలా ఆశ్చర్యపోయారు... లక్ష్మి అత్తింటివాళ్లు ఇలాంటివారా అని! పరువూ, ప్రతిష్టా దెబ్బతినడంతో లక్ష్మి భర్త తరఫువారు బాగా కుంగిపోయారు. వాళ్లకు కాస్తోకూస్తో పలుకుబడి ఉండటంతో తాము ఒత్తిడికి లొంగిపోయామనే అపవాదు రాకుండా ఉండేందుకు పోలీసులు నిందితుల పట్ల చాలా కఠినంగానే వ్యవహరించారు. చాలా పకడ్బందీగా దర్యాప్తు జరిపారు. కానీ ఎంతగా ప్రయత్నించినా లక్ష్మి ఆరోపణలకు ఎలాంటి సాక్ష్యాధారాలూ దొరకలేదు. దర్యాప్తు అధికారి అయిన సీఐ రవికి సైకాలజీలో పీజీ ఉంది.అన్ని రకాల దర్యాప్తులూ అయిన తర్వాత సీఐ రవి తన ఫ్రెండ్ అయిన సైకియాట్రిస్టును లక్ష్మితో మాట్లాడించాడు. రవి అనుమానమే నిజమైంది. లక్ష్మి ఒక మానసిక వ్యాధితో బాధపడుతోంది. లక్ష్మికి ఉన్న మానసిక సమస్య కారణంగా ఆమె కొన్ని భ్రాంతులకు లోనవుతోంది. ఆ భ్రాంతులను కల్పించే ఆ విచిత్రమైన వ్యాధి పేరు... స్కీజోఫ్రీనియా. స్కీజోఫ్రీనియా అంటే... అంతకు మునుపు సాధారణ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి ప్రవర్తన అకస్మాత్తుగా అంతుపట్టని విధంగా మారిపోతుంది. భ్రాంతులకు లోనవుతూ ఉంటాడు. పొంతన లేని ఆలోచనలు వేధిస్తుంటాయి. తార్కికతకు అందని ఊహలు చేస్తుంటాడు. ఆలోచనల్లో అన్వయం ఉండదు. ఈ స్థితి కనీసం నాలుగువారాలు కొనసాగుతుంది. ఇది స్త్రీపురుషులిద్దరిలోనూ సమానంగా కనిపిస్తుంది. అయితే వ్యాధి వచ్చే వయసు మాత్రమే వేరుగా ఉంటుంది. పురుషుల్లో అది 16 నుంచి 21 ఏళ్ల మధ్య వస్తే... మహిళల్లో 21 నుంచి 23 ఏళ్లలో సాధారణంగా కనిపిస్తుంది. చాలామంది దీన్ని కొంత అసాధారణమైన వ్యాధి అనుకుంటారు. కానీ ప్రతి 100 మందిలో దాదాపు నలుగురు స్కీజోఫ్రీనియా రోగులు ఉంటారని ఒక అంచనా. అంత సాధారణమైనదీ వ్యాధి. లక్షణాలు : ఈ కింది లక్షణాలు కనీసం నెల రోజులపాటు ఉంటే... అవి స్కీజోఫ్రీనియా అనే వ్యాధి కారణంగా కలుగుతున్నవని భావించవచ్చు. డెల్యూజన్స్ (అవాస్తవికమైన నమ్మకాలు) : ఈ వ్యాధి ఉన్నవారు కొన్ని వాస్తవం కాని వాటిని నమ్ముతుంటారు. మిగతావారు ఎంత నచ్చచెప్పడానికి ప్రయత్నించినా, ఎన్ని రుజువులు చూపినా తమ నమ్మకాలను వారు విడువరు. అయితే ఆరోగ్యవంతులకు అవి భ్రాంతులన్న మాట ఎంత వాస్తవమో... మెదడులో వచ్చే మార్పుల కారణంగా వ్యాధిగ్రస్తులకు అవి వాస్తవమని నమ్మేలా ఉండటమూ అంతే వాస్తవం. అందుకే వ్యాధిగ్రస్తుల వాదనను ఓపికగా అంగీకరించాలి తప్ప... మనదే వాస్తవం అనే ధోరణితో వారి భ్రాంతులను కొట్టిపారేయకూడదు. వాళ్ల నమ్మకాలు సైతం చాలా రకాలుగా ఉంటాయి. ఉదాహరణకు వాటిలో కొన్ని... ∙తన భర్త లేదా తన భార్య వేరొక వ్యక్తితో సంబంధం కలిగి ఉన్నట్లు నమ్ముతుంటారు. దీన్నే డెల్యూజన్ ఆఫ్ ఇన్ఫిడిలిటీ అంటారు. ∙కొంతమంది వ్యక్తులు తనకు హాని కల్పించడానికో లేదా చంపడానికో ప్రయత్నిస్తున్నారని నమ్ముతుంటారు. (ఉదాహరణకు తన అత్తింటివారు తన కాపురం చెడగొట్టడానికీ, తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారని లక్ష్మి నమ్మినట్లుగా). ఈ భ్రాంతిని డెబ్యూజన్ ఆఫ్ పెర్స్కూజన్ అంటారు. ∙తనను చాలా చెడ్డగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారనీ, తన ప్రతిష్టను దిగజార్చడానికి, తనను ఉద్దేశించే అందరూ మాట్లాడుకుంటున్నారని భ్రాంతి చెందడాన్ని డెల్యూజన్ ఆఫ్ రిఫరెన్స్ అంటారు. ∙ఇక కొందరి భ్రాంతులు మరీ విచిత్రంగా ఉంటాయి. కొందరు చిప్స్ వంటి ఉపకరణాల ద్వారా లేదా కొన్ని యంత్రాల ద్వారా తన ఆలోచనలను తెలుసుకుంటున్నారనీ, రేడియోలోలా తన ఆలోచనలు వారికి ప్రసారమవుతున్నాయనే భ్రాంతితో ఉంటారు. దీన్ని ‘థాట్ బ్రాడ్కాస్ట్’ అంటారు. అయితే ఈ భ్రాంతి రెండు విధాలుగా ఉంటుంది. తన ఆలోచనలను తన మెదడు నుంచి తీసేస్తున్నారని భ్రాంతి చెందడాన్ని ‘థాట్ విత్‌డ్రావల్’ గా పేర్కొంటారు. వేరే వ్యక్తుల ఆలోచనలను తన మెదడులో పెడుతున్నారని భ్రాంతి చెందడాన్ని ‘థాట్ ఇన్సెర్షన్’ అంటారు. సాధారణంగా ఒకరి ఆలోచనలు మరొకరికి చెబితే గానీ (కమ్యూనికేట్ చేస్తేగానీ) తెలియవు. అలా తెలిసిపోతున్నట్లు భావించడాన్ని ‘లాస్ ఆఫ్ ఇగో బౌండరీస్’ అని వ్యవహరిస్తారు. పైన పేర్కొన్న లక్షణాల్లో ఏది ఉన్నా... వాటి ఆధారంగా ఒక వ్యక్తి స్కీజోఫ్రీనియా తో బాధపడుతున్నాడని నిర్ధారణ చేయవచ్చు. ∙మరికొందరైతే తమను చంపడానికి ఎవరో చేతబడి చేస్తున్నట్లు బలంగా నమ్ముతుంటారు. ఇలాంటి నమ్మకాలతో పల్లెల్లో ఎందరిపైనో అభియోగాలు మోపి, కొందరిని మంత్రగాళ్లుగా చెప్పి వారి పళ్లు పీకేయడం, ఒక్కోసారి చంపేయడం జరుగుతుంటుంది. ∙తాను మనిషి రూపం నుంచి జంతువుగా మారిపోతున్నట్లు ఇంకొందరు భ్రాంతి చెందుతారు. ఇలాంటి భ్రాంతులను ఇంగ్లిష్‌లో హేల్యూసినేషన్స్ అంటారు. ఇలాంటి హేల్యూసినేషన్స్ కొందరిలో మరికొన్ని రూపాల్లోనూ కనిపిస్తుంటాయి. అవి... ∙తన చుట్టూ ఎవరూ లేకపోయినా... రోగికి కొందరు మనుషులు కనిపిస్తుంటారు. అలా ఎవరైనా లేదా ఏదైనా కనిపించడాన్ని విజువల్ హేల్యూసినేషన్స్ అంటారు. అదే ఎవరికీ వినిపించని మాటలు తమకే వినిపించడాన్ని ఆడిటరీ హేల్యూసినేషన్స్ అంటారు. ఎవరికి తెలియని వాసనలు తమకే తెలియడాన్ని ఆల్ఫాక్టరీ హేల్యూసినేషన్స్ అంటారు. ∙కొందరు రోగుల్లోనైతే... ఇతరులను కొట్టమనీ లేదా తమను తాము హింసించుకొమ్మని లేదా ఆత్మహత్య చేసుకొమ్మనే మాటలు తమను శాసిస్తున్నట్లుగా వినిపిస్తాయి. కాబట్టి వాటిని కమాండింగ్ హేల్యూసినేషన్స్ అంటారు. ఇలాంటి ఎడతెగని ఆలోచనలు భ్రాంతులతో రోగి భావోద్వేగాలలో/ప్రవర్తనలో మార్పులు వస్తాయి. ఎంతో భయపడడం, ఏడ్వడం, కారణం లేకుండానే నవ్వడం, ఒక్కసారిగా కోపం రావడం, చిరాకు పడడం వంటివి చూస్తాం. ఇలాంటి వ్యక్తులు ఆత్మహత్యకు యత్నించవచ్చు లేదా ఇతరులకూ హాని కల్పించవచ్చు. అందుకే వీరికి తక్షణ చికిత్స అవసరం. ఎందుకు వస్తుందీ వ్యాధి... స్కీజోఫ్రీనియా వ్యాధి మెదడులోని కొన్ని రసాయనాల్లో మార్పుల కారణంగా వస్తుందని పరిశోధనలు పేర్కొంటున్నాయి. ఇందుకోసం స్కాన్ వంటి పరీక్షలు నిర్వహిస్తే... మెదడులో ఎలాంటి మార్పులూ కనిపించకపోవచ్చు. అయితే వ్యాధి రావడానికి మరికొన్ని అంశాలూ దోహదం చేయవచ్చు. జన్యుపరమైన అంశాలు ఈ వ్యాధి వచ్చేలా ప్రభావితం చేస్తాయని కొందరి ప్రతిపాదన. అయితే ఈ హైపోథెసిస్ను బలపరిచే ‘స్కీజోఫ్రీనియా జీన్’ని ఇంతవరకూ ఎవరూ గుర్తించలేదు. కాకపోతే అనువంశీకంగా కనిపించవచ్చు. అదెలాగంటే... తాత–ముత్తాతల్లో ఎవరికైనా ఈ వ్యాధి ఉన్నప్పుడు... ఇది వచ్చే రిస్క్ 3 శాతం ఉంటుంది. తల్లిదండ్రులిద్దరిలో ఏ ఒక్కరికైనా ఇది ఉంటే... వారి సంతానానికి ఇది వచ్చే రిస్క్ 10 శాతం ఉంటుంది. తల్లిదండ్రులిద్దరికీ ఈ వ్యాధి ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం 40 శాతం ఉంటుంది. ఇక దీనితో పాటు గర్భధారణ, ప్రసవం వంటి సందర్భాల్లో ఏవైనా అవాంతరాలు (కాంప్లికేషన్లు) వచ్చినవారిలోనూ, బాల్యంలో పిల్లల వికాసంలో లోపాలు ఉన్నప్పుడు ఇది వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఇక జీవితంలో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొనే వారు, మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డవారిలో ఆయా అంశాలు ఈ వ్యాధిని ప్రేరేపించవచ్చు. అయితే అంత మాత్రాననే దగ్గరివారిలో లేదా తల్లిదండ్రులలో ఈ వ్యాధి ఉంటే అది తప్పక రావాలనే నియమమేదీ లేదు. కాకపోతే వచ్చే అవకాశాలు కొంత ఎక్కువ. చికిత్స వ్యాధి ఎంతవరకూ నయం అవుతుందనే విషయం రోగి వయసు, అతడిలో వచ్చే ప్రతికూల ఆలోచనలు, కుటుంబం ఎంతమేర సపోర్ట్‌గా నిలుస్తోంది వంటి అంశాలతో పాటు ‘రోగికి లక్షణాలు కనిపించిన తరువాత ఎంత కాలంలోపు వైద్య చికిత్సకు తీసుకువెళ్లారు’ అన్న అంశంపై ఆధారపడి ఉంటుంది. వ్యాధి కలిగిన తొలి దశలోనే (నెల నుండి సంవత్సరంలోపు) వైద్యుని సంప్రదించినప్పుడు వ్యాధి నయమయ్యే అవకాశం బాగుంటుంది. అంటే ఎంత త్వరగా వైద్యుణ్ణి కలిస్తే బాగయ్యే అవకాశాలు అంత ఎక్కువ అన్నమాట. కాబట్టి వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుని సంప్రదించాలి. మందులు క్రమం తప్పక వాడాలి : సైకియాట్రిస్ట్ చెప్పేవరకు రోగి మందుల్ని క్రమం తప్పక వాడటం ముఖ్యం. సాధారణంగా వ్యాధి లక్షణాలు మొదటిసారి కలిగినప్పుడు 9 నెలల వరకూ మందులు వాడతారు. ఎందుకంటే మొదటి 6 నెలల్లో మందులు వాడనప్పుడు వ్యాధి తిరగబెట్టే అవకాశం 70 శాతం వరకు ఉంటుంది. ఎక్కువ సంవత్సరాలు ఈ వ్యాధి ఉన్నవారిలో మాత్రం కనీసం 5 సంవత్సరాల నుంచి జీవితకాలం వరకు మందులు వాడవలసి ఉంటుంది. మందులకు సైడ్ ఎఫెక్ట్స్ కలిగితే వైద్యుని సంప్రదిస్తే వాటిని మారుస్తారు.. ఈ వ్యాధి కోసం వాడే మందులు నిద్రమాత్రలు కావు అన్న విషయాన్ని అందరూ గ్రహించాలి. ఎందుకంటే సాధారణంగా ఇలాంటి జబ్బులకు సైకియాట్రీలో నిద్రమాత్రలు వాడుతుంటారని చాలామంది అపోహ పడుతుంటారు. అందుకే కొందరు ఇలాంటి లక్షణాలు కనిపించినా తమ అపోహలతో చికిత్స అందించరు. దాంతో అలా వైద్యం చేయకుండా విడిచిపెడితే వ్యాధి లక్షణాలు మెరుగుపడకపోగా, ఎక్కువకాలం వ్యాధితో బాధపడటం వలన మెదడులోని కణాలు నష్టపోయే అవకాశం ఉంది. అప్పుడు వైద్యంతో వ్యాధి నయం కావడం కష్టమవుతుంది. ఎలా గుర్తుపట్టాలంటే... ∙వ్యక్తిగత ప్రవర్తనలో/వ్యక్తిత్వంలో మార్పులు కనిపిస్తే ∙తనను నిత్యం ఎవరో గమనిస్తున్నట్లుగా ఫీలవుతుంటే ఎవరికీ వినపడని శబ్దాలు, సంగీతం తమకు వినిపిస్తున్నట్లుగా చెబుతుంటే ఎవరికీ కనిపించని దృశ్యాలు తమకు కనిపిస్తున్నాయంటూ చెబుతుంటే ∙అర్థం లేని పదాలను ఉచ్చరిస్తుంటే ∙తమకు ఇష్టమైన వారిని సందర్భం లేకుండా కోప్పడటం, వారిని అసహ్యించుకోవడం చేస్తుంటే ∙నిద్రలేకుండా గడపుతుండటం లేదా విపరీతంగా ఆవేశపడుతుంటే. డాక్టర్ ఐ. భరత్‌కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, అపోలో హాస్పిటల్స్, హైదర్‌గూడ, హైదరాబాద్ -
తినమంటే తినదు... ఏం చేయాలి?
కిడ్స్ మైండ్స్ మా బాబు మూడో తరగతి చదువుతున్నాడు. చాలా హుషారుగా ఉంటాడు. కానీ తరచుగా నిద్రలో లేచి ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు అని అడిగితే చెప్పడు. డాక్టర్‌కి చూపించాం. పీడకలలు వస్తున్నాయేమో సైకియాట్రిస్టుకు చూపించండి అన్నారు. ఇంత తరచుగా పీడకలలు వస్తాయా? సైకియాట్రిస్టుకి చూపించడం తప్ప మరో మార్గం లేదా? - ఆర్.పరమేశ్వరి, సిరిపురం బాబుకు పీడకలలు వస్తూ ఉండవచ్చు. లేదా నైట్ ట్సై కావచ్చు. పీడకలలు వచ్చినప్పుడు పిల్లలు చాలా భయపడినట్టుగా కనిపిస్తారు. కానీ వాళ్లను నిద్ర లేపడానికి అవకాశం ఉంటుంది. లేచిన తరువాత వాళ్లకు కల కొద్దిగా గుర్తు కూడా ఉంటుంది. నైట్ ట్సై కూడా నిద్రలో ఏదో భయం కలిగించే ఎక్స్‌పీరియెన్స్ వల్లనే వస్తాయి. పిల్లలను నైట్ ట్సై నుంచి లేపడం కష్టం. వాళ్లకు ఏమీ గుర్తు ఉండదు కూడా! ఏదైనా కూడా పెద్దయే కొద్దీ తగ్గుతూ వస్తాయి. కాబట్టి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. మా పాప వయసు ఎనిమిదేళ్లు. చాలా క్రమశిక్షణతో ఉంటుంది. బాగా చదువుతుంది కూడా. కానీ తిండి దగ్గర ముప్పు తిప్పలు పెడుతుంది. లంచ్‌బాక్స్ ఏ రోజూ ఖాళీగా తీసుకురాదు. ఇంట్లో కూడా సరిగ్గా తినదు. దానికిష్టమైన కూరలే వండుతాను. రకరకాల తినుబండారాలూ చేస్తుంటాను. అయినా కూడా పెద్దగా తినదు. చివరికి అందరు పిల్లల్లా చాక్లెట్లు, చిప్స్ లాంటివి కూడా తినదు. ఆకలి సమస్య ఏమైనా ఉందేమోనని డాక్టర్‌కి చూపించాం. కానీ పాప ఆరోగ్యంగానే ఉంది అన్నారు. మరి తను ఎందుకు తినడం లేదు? - సుజాత, ఏలూరు పాప హెల్దీగా ఉన్నంతకాలం పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. తన ఎత్తు, బరువు వయసుకు తగినట్టుగానే ఉంటే తనకు ఎంత తినాలనిపిస్తే అంతే తిననివ్వండి. పిల్లలకు ఎంత ఫుడ్ అవసరం అన్నదాంట్లో మనం చాలాసార్లు ఓవర్ ఎస్టిమేట్ చేస్తుంటాము. అందుకే వాళ్లు తక్కువ తింటున్నారని బాధపడిపోతూ ఉంటాం. పాప ఆరోగ్యంగానే ఉంది కదా! మరి ఇంకెందుకు బెంగ? తనకు కడుపు నిండినంతవరకూ తింటుంది కాబట్టి అంతే తిననివ్వండి. ఆకలి తీరకపోతే తనే తింటుంది కదా! ఇక చిరు తిండ్లు తినకపోవడం అనేది మరీ మంచిది. తను తినేవాటిలో పండ్లు, కూరగాయలు వంటి ఆరోగ్యకరమైనవి ఎక్కువ ఉండేలా చూసుకుంటే... తక్కువే తిన్నా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. తనకి ఏ సమస్యా లేదు కాబట్టే డాక్టర్ కూడా అలా చెప్పారు. సో, మీరు కూడా ఎక్కువ దిగులు పడకుండా పాపని ఫ్రీగా వదిలేయండి. మా బాబు ఏడో తరగతి చదువుతున్నాడు. చురుకైనవాడు. కానీ వాడితో ఒక్కటే సమస్య. వస్తువులు మర్చిపోతుంటాడు. స్కూల్లో బుక్స్, లంచ్‌బాక్స్ లాంటివి మర్చిపోయి వస్తాడు. ఏదైనా షాపుకి పంపిస్తే కొన్ని వస్తువులు తెచ్చి కొన్ని మర్చిపోతాడు. ఇంట్లో తన వస్తువులు తనే ఎక్కడో పెట్టి మర్చిపోతుంటాడు. పోనీ తర్వాతైనా గుర్తొస్తుందా అంటే రాదు. ఎంత ఆలోచించినా చెప్పలేడు ఎక్కడ పెట్టాడో. ఇంత చిన్న వయసులో ఇంత మతిమరుపేంటి? పైగా ఇది వస్తువుల విషయంలో మాత్రమే ఉంది. చదువు విషయంలో ఎప్పుడూ బెస్టే. ఎందుకిలా? - గోవర్థన్, దోమగుండ ఇలా మర్చిపోతున్నాడు అంటే బహుశా కాన్సన్ట్రేషన్ లోపం వల్ల కావచ్చు. కాన్సన్ట్రేషన్ తక్కువ ఉండటం వల్లే పిల్లలు ఏది ఎక్కడ పెడుతున్నారో చూసుకోరు. ఎక్కడ పెట్టాలనిపిస్తే అక్కడ పెట్టేస్తారు. ఆ తర్వాత దాన్ని అక్కడ పెట్టామని మర్చిపోతుంటారు. నిజానికిదంతా గుర్తు లేకపోవడం వల్ల కాదు. ఎక్కడ పెడుతున్నాం అన్నదాన్ని సరిగ్గా గమనించకపోవడం వల్ల. చదువులో సమస్య లేదంటున్నారు కాబట్టి మీ అబ్బాయిది కూడా ఇదే సమస్య అనుకుంటున్నాను. తనని కూర్చోబెట్టి, అన్నిటి మీదా ఎలా దృష్టి పెట్టాలి, ఎలా శ్రద్ధ చూపాలి అన్న విషయాలను వివరించండి. మరీ అవసరం అనుకుంటే ఓసారి సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లండి. వస్తువులు ఎక్కడ పెట్టాడో గుర్తు పెట్టుకోడానికి కొన్ని స్ట్రాటజీలు నేర్పించి, ప్రాక్టీస్ చేయిస్తారు. దానివల్ల మార్పు రావడానికి అవకాశం ఉంది. - డా॥పద్మ పాల్వాయ్ చైల్డ్ - అడల్ట్ సైకియాట్రిస్ట్, రెయిన్బో హాస్పిటల్, హైదరాబాద్ -
...కంట్రోల్ కంట్రోల్...
జీవితంలో మనం ఏది చేసినా దాని వల్ల మనకి మన కుటుంబానికి మన పరిసరాలకి ఉపయోగపడేలా ఉండాలి... కోపం ఎందుకూ పనికి రాదు. కొంతమంది కోపం వస్తే ఊగిపోతారు. కొందరు గోడకు నెత్తి బాదుకుంటారట. ఇంకొందరు ఏకంగా జుట్టే పీకేసుకుంటారట.గోడు చెప్పుకుంటే పోలా... గోడకు బాదుకోవాలా? పంచుకుంటే పోలా... పీక్కోవాలా? నవ గ్రహాలకు కోపం వస్తే పండితులు పరిహారం చెబుతారు. దశ ఆగ్రహాలు వస్తే ఎలా మేనేజ్ చేసుకోవాలి సైకియాట్రిస్ట్‌లు చెబుతున్నారు. 1. గొంతు చిరుగుద్ది: గాండ్రింపు, గర్జన, ఘీంకారం... అడవి జంతువుల ఆగ్రహ ప్రదర్శన మార్గం. అర్థంలేని ధ్వనులవి. కొందరికి కోపం వస్తే, అర్థం లేకుండా గొంతు చించుకుంటారు. దీనివల్ల స్వరపేటిక దెబ్బతిని, గొంతు బొంగురుపోవడం తప్ప ఉపయోగమేమీ ఉండదు. ఇలా గొంతు చించుకోవడాన్నే వైద్య పరిభాషలో ‘షౌటింగ్ స్పెల్స్’ అంటారు. 2. తలకు తప్పని బొప్పి: కోపతాపాలు తలకెక్కినప్పుడు కొందరు అదేపనిగా గోడకేసి తలబాదేసుకుంటారు. దీవార్తో వారు చేసే వార్ ఎలా ఉంటుందంటే, చెవులే లేని గోడ ముందు నెత్తితో శంఖం ఊదడంలా ఉంటుంది. గొంతు చించుకున్నా, కోపం చల్లారకుంటే కొందరు ఇలాగే తమ కోపాన్ని ప్రదర్శిస్తారు. ఫలితంగా తలకు బొప్పి కట్టించుకుని, తర్వాత తాపీగా బాధపడతారు. 3. అర్థంలేని ఆత్మహాని: కోపానికి కాళ్లు మొలిసన్తే అది దేన్ని తంతోందో దానికే తెలియదు. ఉదాహరణకు బైక్ మీద వెళ్తూ... గుండ్రటి రాయి తగిలి కిందపడిపోయారని అనుకుందాం. లేవగానే మొదట చేసే పని ఆ రాయిని కాలితో తంతారు. రాయిని తంతే గాయమయ్యేది కాలికే గానీ, రాతికి కాదనే ఇంగితం ఆ క్షణాన పనిచేయదు. దీన్నే వైద్యులు ‘డెలిబరేట్ సెల్ఫ్ హార్మ్’ (డీఎస్‌హెచ్) అంటారు. 4. వస్తువులపై ప్రతాపం: కోపం కట్టలు తెంచుకున్నప్పుడు కొందరు అందుబాటులో ఉన్న వస్తువులపై ప్రతాపం చూపిస్తారు. చేతిలో ఉన్న వస్తువులను బలంగా విసిరి కొడతారు. గోడకు ఆనుకున్న టీవీ లాంటి వస్తువులను సైతం నేలకేసి కొడతారు. ఇలాంటి చర్యల వల్ల ఆర్థికనష్టం, ఆపై మనస్తాపం తప్ప ఒరిగేదేమీ ఉండదు. 5. మాడిపోతారు: ఆగ్రహజ్వాలల్లో తమను తామే మాడ్చేసుకుంటారు కొందరు. నిస్సహాయ పరిస్థితులు ఎదురైనప్పుడు బాహాటంగా కోపతాపాలను ప్రదర్శించలేని సందర్భాల్లో, ఆ కోపాన్ని తమపైకే మళ్లించుకుంటారు. తిండి మీద అలిగి, పేగులను మాడ్చేసుకుంటారు. 6. కునుకుపై కోపం: కోపతాపాలు మనసును దహిస్తున్నప్పుడు కొందరు నిద్రకు దూరమవుతారు. నిద్ర ముంచుకొస్తున్నా, రేగుతున్న కోపాన్ని జోగనివ్వకుండా ఉండేందుకు తమను తామే హింసించుకుంటారు. దీనినే వైద్య పరిభాషలో ‘డెలిబరేట్ ఇన్సోమ్నియా’ అంటారు. 7. సహాయ నిరాకరణ: ఇది గాంధీ మార్గం. నిస్సహాయులు చేసే అసహన ప్రదర్శన. కోపం తలకెక్కినప్పుడు... తమకు తాము హాని చేసుకునేంతగా నియంత్రణ కోల్పోని సంయమనశీలురు పనిపాట్లపై ప్రతాపాన్ని చూపిస్తారు. స్కూలుకెళ్లే పిల్లలైతే, బడికి డుమ్మా కొట్టేస్తారు. ఉద్యోగులైతే ఆఫీసుకు ఎగనామం పెడతారు. బాస్ పిలిచినా మీటింగ్‌కు ముఖం చాటేస్తారు. ఇలాంటి సహాయ నిరాకరణనే ‘డెలిబరేట్ నాన్ కోఆపరేషన్’ అంటారు. 8. మౌన పోరాటం: కోపంతో గొంతుచించుకునే లక్షణం కొందరిలో ఉంటే, ఇంకొందరు నోరువిప్పకుండానే సాధిస్తారు. ఎవరితోనూ మాట్లాడకుండా మౌనపోరాటం సాగిస్తారు. కోప శిఖరాన్ని ఆరోహించిన వారు ఎప్పటికో గానీ, దిగిరారు. 9. స్వీయ హింసాత్మకం: నిప్పంటితే చాలు... చప్పున చెయ్యి వెనక్కు లాక్కుంటాం. కానీ కోపం తెచ్చే ముప్పు నిప్పులా మండుతుంది. కోపంతో భగ్గుమనే అగ్గిరాముళ్లు కోపం తలకెక్కినప్పుడు తమ శరీరాన్ని తామే సిగరెట్స్‌తో కాల్చుకోవడం, వాతలు పెట్టుకోవడం వంటి చేష్టలకు దిగుతారు. 10. జుట్టు పీక్కుంటారు: ఏదో మాట వరసకు కాదు, కోపం కంట్రోల్ తప్పినప్పుడు కొందరు నిజంగానే జుట్టు పీకేసుకుంటారు. నెత్తిపైన చేతికి అందే జుట్టు మాత్రమే కాదు.. కోపంతో వారు పెకలించే కేశాలు కనురెప్పలవీ కావచ్చు.. దేహసర్వస్వం నుంచి కేశసర్వస్వాన్నీ పీకి పారేసుకునే ఈ ఉన్మాదాన్ని వైద్య పరిభాషలో ‘ట్రైకోటిల్లోమేనియా’ అంటారు. కోపానికి కళ్లాలిలా... కోపం సహజ సహజాతం. దాన్ని అదుపు చేసే మార్గాలు ఆరోగ్యకరంగా ఉండాలి. స్వయంగా నియంత్రించుకోవాలి. అలా చేసేందుకు పది మార్గాలివి... 1. కోపంతో ఏ పనికీ పూనుకోవద్దు. అలాంటప్పుడు కోపానికి దారితీసిన పరిసరాల నుంచి దూరంగా వెళ్లాలి. చేయబోయే పని మంచిచెడులను కూల్‌గా ఆలోచించాలి. వీలుంటే ఎవరితోనైనా సంప్రదించాలి. 2. జీవితంలో అన్నీ మామూలు పరిణామాలే. కోపం ఒక ఉద్వేగం. ఆ స్థితి దాటిన తర్వాత పరిస్థితి మామూలైపోతుంది అని గ్రహించాలి. 3. ప్రతిసారీ మనదే గెలుపు కాదు. కొన్నిసార్లు అవతలి వాళ్లూ గెలవవచ్చు. ఇది చాలా సహజం. క్రీడాస్ఫూర్తితో ఈ సత్యాన్ని ఆమోదించాలి. 4. కోపం తలకెక్కినప్పుడు కాస్త అదుపులోకి తెచ్చుకుని, మిమ్మల్ని చల్లబరచేవారి మాటలను వినండి. వారి మాటలు ఎంతగా వింటుంటే, అంతగా మీ కోపం తగ్గుతుంది. 5. జీవితంలో ప్రతిదీ మీకు తెలిసి ఉండాలనే లేదు. మీకు తెలియని అంశాలూ ఉండవచ్చు. అందుకు చిన్నబుచ్చుకోవడం, కోపం తెచ్చుకోవడం తగదు. 6. కోపతాపాలతో అర్థంలేని ఆత్మహాని మార్గాలకు దిగకుండా కాస్త రిలాక్స్ అవ్వండి. విశ్రాంతి తీసుకోవడం, నిద్రపోవడం ద్వారా ప్రశాంతత కలుగుతుంది. 7. మీ కోపాన్ని అదుపు చేయగలవారు అని మీరు నమ్మిన వ్యక్తులను రోల్‌మోడల్‌గా ఎంచుకోండి. వీలున్నప్పుడల్లా వారితో కొద్దిసేపు గడపండి. వాళ్లను అనుసరించే ప్రయత్నం చేయండి. 8. మీకు కోపం వచ్చినప్పుడు మీ కుటుంబ సభ్యులను భయభ్రాంతులను చేయడం ద్వారా మీరు గెలవవచ్చు. కానీ మీ కుటుంబ సభ్యులు ఓడిపోతుంటారన్న విషయాన్ని గ్రహించండి. 9. మీ మాట నెగ్గుతోందా, మీ పంతం నెరవేరుతోందా, లేక మీరు గెలుస్తున్నారా అన్న అంశంపై స్పష్టత తెచ్చుకోండి. 10. ఏయే సమయాల్లో మీకు కోపం వస్తుందో గ్రహించి, మీ వృత్తి బాధ్యతలలో కోసం వల్ల మీరేమి కోల్పోతున్నారో, దానిని అధిగమించడం వల్ల మీరు గెలవగలిగేదేమిటో రాసుకొండి. దాన్ని మాటిమాటికీ చదువుకోండి. పైన పేర్కొన్నవి కోపం వచ్చినప్పుడు చేసే పనులు. అవిగాక మామూలుగా ఉన్నప్పుడూ రోజూ ధ్యానం లాంటి మార్గాలు అనుసరించండి. దాంతో కోపాన్ని నివారించుకోవడం వీలవుతుంది. అప్పటికీ సాధ్యం కాకపోతే, ముక్కు చివరనే అది తిష్ఠ వేస్తే... సైకియాట్రిస్ట్‌ను సంప్రదించాలి. తగిన చికిత్స తీసుకోవాలి. ఇన్పుట్స్: డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ లూసిడ్ డయాగ్నస్టిక్, బంజారాహిల్స్, హైదరాబాద్ కోపలాభాలు ఆగ్రహం అనర్థదాయకమే అయినా, అదుపు తప్పనివ్వకుంటే, దానిని సానుకూలంగానూ వినియోగించుకోవచ్చు. కోపతాపాలను సద్వినియోగం చేసుకోగల పది మార్గాలు ఇవే... 1. మీరు ఒక మంచి వ్యాపకాన్ని ఎంచుకోండి. మీకు కోపం వచ్చినప్పుడల్లా ఆగ్రహాన్ని ఆ వ్యాపకంలో ప్రదర్శించండి. 2. ఏదైనా ఒక ఆటను ప్రాక్టీస్ చేయండి. ఆగ్రహ సమయంలో మీకు ఇష్టమైన ఆట ఆడండి. 3. వేర్వేరు రంగాలకు చెందిన అనేక రకాల వ్యక్తులతో సత్సంబంధాలు ఉండేలా చూసుకోండి. కోపం రాగానే, మీరున్న చోటి నుంచి పక్కకు వెళ్లి, మీ స్నేహితులను కలవండి. 4. కోపాన్ని నియంత్రించుకోవడంలో ఇతరులకు శిక్షణ ఇవ్వండి. ఇలాంటప్పుడు ఇతరులకు బోధించే మీరే... కోపాన్ని నివారించుకోవాలన్న స్పృహను అభివృద్ధి చేసుకుంటారు. 5. మానవాళికి మేలు చేసే అంశాల గురించి ఆలోచించండి. సేవా కార్యకలాపాల్లో ఉన్నప్పుడు కోపం కలగదు సరికదా... సంతోషం ఎక్కువవుతుంది. 6. మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇతరులు మిమ్మల్ని ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నిస్తే వాళ్లను ముందుగా వెళ్లనీయండి. వెళ్లనిచ్చేలా మనసుకు శిక్షణ ఇచ్చుకోండి. 7. మంచి సంగీతం, పాటలూ మిమ్మల్ని ఆహ్లాదరపరుస్తాయి. 8. కోపం వచ్చినప్పుడల్లా మరిన్ని అదనపు బాధ్యతలు తీసుకోండి. 9. కొత్త పుస్తకం ప్రత్యేకంగా మనస్తత్వ శాస్త్రానికి చెందినది వెతకి మరీ చదవండి. 10. హాస్య సంఘటనలను నెమరు వేసుకోండి. హ్యూమర్ వీడియోలు, కార్టూన్లు, కామెడీ సినిమాలు చూడండి. -
నూటికి నూరుపాళ్లు నేరమే!
కౌన్సెలింగ్ భార్యను భర్త కొట్టడం అనేది మనదేశంలో కొన్ని ప్రాంతాల్లో చాలా చిన్న సమస్య. మొన్నీమధ్యనే ఈ సమస్య గురించి కౌన్సెలింగ్ తీసుకోడానికి ఓ ఇద్దరు దంపతులు నా దగ్గరకు వచ్చారు. మొదట ఆమె తన సమస్యను చెప్పింది. ‘‘ఏదైనా సమస్య గురించి మాట్లాడితే సరిగ్గా సమాధానం చెప్పకపోగా...చేయి చేసుకుంటున్నారండీ’’ కంట నీరుతో ఆమె చెప్పింది. ఆమె మాటను ఖండిస్తూ...‘‘నోటికొచ్చినట్టు మాట్లాడితే...ఒళ్లు మండుతుంది మేడమ్! ఆ సమయంలో ఏ మగాడైనా చేసే పని అదే కదండీ! రెచ్చగొట్టే మాటలు మానుకుంటే మా ఇద్దరీ మధ్యా ఎలాంటి సమస్యా ఉండదండీ!’’ కరాఖండిగా చెప్పాడు భర్త. విషయం ఏమిటంటే...భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్థులే. ఆయన ఉద్యోగం మాత్రమే చేస్తాడు. ఆమె ఉద్యోగంతో పాటు అన్ని పనులూ చేస్తుంది. ‘‘మా అమ్మ ఎంచక్కా...బోలెడన్ని వెరైటీ కూరలు వండేది. ఇంటికి రాగానే మా నాన్నకు ఎన్ని సేవలు చేసేదో. ఒక్కరోజు కూడా మా అమ్మ నాన్నకు ఎదురు సమాధానం చెప్పడం నేనెరుగను’’ అంటూ సందు దొరికినపుడల్లా భర్త అనే మాటలు ఆమెను ఎంత వేధించాలో అంత వేధించేవి. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులుగా ఉన్న మధ్యతరగతి కుటుంబాల్లో ఈ సమస్య సర్వసాధారణమైపోయింది. ‘‘మీ అమ్మగారు ఏరోజైనా మార్కెట్‌కి వెళ్లి కూరగాయలు తెచ్చారా... పోనీ మిమ్మల్ని స్కూల్లో దిగబెట్టడం, పేరెంట్స్ మీటింగ్‌కి హాజరవ్వడం, షాపింగ్‌లు... వంటివి చేసేవారా...’’ అని అడుగుతుంటే... ‘‘ఆ రోజుల్లో ఆడవాళ్లకి ఆ పనులన్నీ చేసే అవకాశం ఎక్కడిదండీ!’’ అన్నాడు. ‘‘అవకాశమేంటి? ఆ పనులన్నీ చేయడం అవసరం కదా!’’ అన్నాను. అతనికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. అంటే అతని ఉద్దేశం...అలాంటి పనులన్నీ చేయడం మహిళలకు కలిగిన అవకాశంగా భావిస్తున్నాడు కానీ, తప్పక చేస్తున్నట్టు అతను గ్రహించడంలేదు. ఇలా కొంత చర్చ నడిచాక...ఆడవాళ్లకుండే సమస్యలు, పని ఒత్తిడి వల్ల వారు పడే మానసిక వేదన గురించి వివరంగా చెబితే మౌనంగా ఆలకించాడు. ఇంటి పనుల్లో భార్యకు సాయంగా ఉండడమంటే గిన్నెలు కడగడం, వంట చేయడం, ఇల్లు శుభ్రం చేయడం అని అర్థం కాదు. బయట చక్కబెట్టాల్సిన చాలాపనుల్లో భర్త సాయం చేయాలి. అలా చేయడం కుదరనప్పుడు తన పని కూడా భార్య చేస్తోందని గుర్తించాలి. ఇక చేయి చేసుకోవడం అంటారా అది నూటికి నూరుపాళ్లు నేరమే! నేరస్థుడికి ప్రేమను పొందే హక్కు ఉండదు. - పద్మా పాల్వాయి, సైకియాట్రిస్టు, రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పటల్