తినమంటే తినదు... ఏం చేయాలి?
కిడ్స్ మైండ్స్
మా బాబు మూడో తరగతి చదువుతున్నాడు. చాలా హుషారుగా ఉంటాడు. కానీ తరచుగా నిద్రలో లేచి ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు అని అడిగితే చెప్పడు. డాక్టర్‌కి చూపించాం. పీడకలలు వస్తున్నాయేమో సైకియాట్రిస్టుకు చూపించండి అన్నారు. ఇంత తరచుగా పీడకలలు వస్తాయా? సైకియాట్రిస్టుకి చూపించడం తప్ప మరో మార్గం లేదా?
- ఆర్.పరమేశ్వరి, సిరిపురం
బాబుకు పీడకలలు వస్తూ ఉండవచ్చు. లేదా నైట్ ట్సై కావచ్చు. పీడకలలు వచ్చినప్పుడు పిల్లలు చాలా భయపడినట్టుగా కనిపిస్తారు. కానీ వాళ్లను నిద్ర లేపడానికి అవకాశం ఉంటుంది. లేచిన తరువాత వాళ్లకు కల కొద్దిగా గుర్తు కూడా ఉంటుంది. నైట్ ట్సై కూడా నిద్రలో ఏదో భయం కలిగించే ఎక్స్‌పీరియెన్స్ వల్లనే వస్తాయి. పిల్లలను నైట్ ట్సై నుంచి లేపడం కష్టం. వాళ్లకు ఏమీ గుర్తు ఉండదు కూడా! ఏదైనా కూడా పెద్దయే కొద్దీ తగ్గుతూ వస్తాయి. కాబట్టి అంతగా భయపడాల్సిన అవసరం లేదు.
మా పాప వయసు ఎనిమిదేళ్లు. చాలా క్రమశిక్షణతో ఉంటుంది. బాగా చదువుతుంది కూడా. కానీ తిండి దగ్గర ముప్పు తిప్పలు పెడుతుంది. లంచ్‌బాక్స్ ఏ రోజూ ఖాళీగా తీసుకురాదు. ఇంట్లో కూడా సరిగ్గా తినదు. దానికిష్టమైన కూరలే వండుతాను. రకరకాల తినుబండారాలూ చేస్తుంటాను. అయినా కూడా పెద్దగా తినదు. చివరికి అందరు పిల్లల్లా చాక్లెట్లు, చిప్స్ లాంటివి కూడా తినదు. ఆకలి సమస్య ఏమైనా ఉందేమోనని డాక్టర్‌కి చూపించాం. కానీ పాప ఆరోగ్యంగానే ఉంది అన్నారు. మరి తను ఎందుకు తినడం లేదు?
- సుజాత, ఏలూరు
పాప హెల్దీగా ఉన్నంతకాలం పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. తన ఎత్తు, బరువు వయసుకు తగినట్టుగానే ఉంటే తనకు ఎంత తినాలనిపిస్తే అంతే తిననివ్వండి. పిల్లలకు ఎంత ఫుడ్ అవసరం అన్నదాంట్లో మనం చాలాసార్లు ఓవర్ ఎస్టిమేట్ చేస్తుంటాము. అందుకే వాళ్లు తక్కువ తింటున్నారని బాధపడిపోతూ ఉంటాం. పాప ఆరోగ్యంగానే ఉంది కదా! మరి ఇంకెందుకు బెంగ? తనకు కడుపు నిండినంతవరకూ తింటుంది కాబట్టి అంతే తిననివ్వండి.
ఆకలి తీరకపోతే తనే తింటుంది కదా! ఇక చిరు తిండ్లు తినకపోవడం అనేది మరీ మంచిది. తను తినేవాటిలో పండ్లు, కూరగాయలు వంటి ఆరోగ్యకరమైనవి ఎక్కువ ఉండేలా చూసుకుంటే... తక్కువే తిన్నా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. తనకి ఏ సమస్యా లేదు కాబట్టే డాక్టర్ కూడా అలా చెప్పారు. సో, మీరు కూడా ఎక్కువ దిగులు పడకుండా పాపని ఫ్రీగా వదిలేయండి.
మా బాబు ఏడో తరగతి చదువుతున్నాడు. చురుకైనవాడు. కానీ వాడితో ఒక్కటే సమస్య. వస్తువులు మర్చిపోతుంటాడు. స్కూల్‌లో బుక్స్, లంచ్‌బాక్స్ లాంటివి మర్చిపోయి వస్తాడు. ఏదైనా షాపుకి పంపిస్తే కొన్ని వస్తువులు తెచ్చి కొన్ని మర్చిపోతాడు. ఇంట్లో తన వస్తువులు తనే ఎక్కడో పెట్టి మర్చిపోతుంటాడు. పోనీ తర్వాతైనా గుర్తొస్తుందా అంటే రాదు. ఎంత ఆలోచించినా చెప్పలేడు ఎక్కడ పెట్టాడో. ఇంత చిన్న వయసులో ఇంత మతిమరుపేంటి? పైగా ఇది వస్తువుల విషయంలో మాత్రమే ఉంది. చదువు విషయంలో ఎప్పుడూ బెస్టే. ఎందుకిలా?
- గోవర్థన్, దోమగుండ
ఇలా మర్చిపోతున్నాడు అంటే బహుశా కాన్సన్‌ట్రేషన్ లోపం వల్ల కావచ్చు. కాన్సన్‌ట్రేషన్ తక్కువ ఉండటం వల్లే పిల్లలు ఏది ఎక్కడ పెడుతున్నారో చూసుకోరు. ఎక్కడ పెట్టాలనిపిస్తే అక్కడ పెట్టేస్తారు. ఆ తర్వాత దాన్ని అక్కడ పెట్టామని మర్చిపోతుంటారు. నిజానికిదంతా గుర్తు లేకపోవడం వల్ల కాదు. ఎక్కడ పెడుతున్నాం అన్నదాన్ని సరిగ్గా గమనించకపోవడం వల్ల. చదువులో సమస్య లేదంటున్నారు కాబట్టి మీ అబ్బాయిది కూడా ఇదే సమస్య అనుకుంటున్నాను. తనని కూర్చోబెట్టి, అన్నిటి మీదా ఎలా దృష్టి పెట్టాలి, ఎలా శ్రద్ధ చూపాలి అన్న విషయాలను వివరించండి. మరీ అవసరం అనుకుంటే ఓసారి సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లండి. వస్తువులు ఎక్కడ పెట్టాడో గుర్తు పెట్టుకోడానికి కొన్ని స్ట్రాటజీలు నేర్పించి, ప్రాక్టీస్ చేయిస్తారు. దానివల్ల మార్పు రావడానికి అవకాశం ఉంది.
- డా॥పద్మ పాల్వాయ్
చైల్డ్ - అడల్ట్ సైకియాట్రిస్ట్, రెయిన్‌బో హాస్పిటల్, హైదరాబాద్