Kids Minds
-
తినమంటే తినదు... ఏం చేయాలి?
కిడ్స్ మైండ్స్ మా బాబు మూడో తరగతి చదువుతున్నాడు. చాలా హుషారుగా ఉంటాడు. కానీ తరచుగా నిద్రలో లేచి ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు అని అడిగితే చెప్పడు. డాక్టర్‌కి చూపించాం. పీడకలలు వస్తున్నాయేమో సైకియాట్రిస్టుకు చూపించండి అన్నారు. ఇంత తరచుగా పీడకలలు వస్తాయా? సైకియాట్రిస్టుకి చూపించడం తప్ప మరో మార్గం లేదా? - ఆర్.పరమేశ్వరి, సిరిపురం బాబుకు పీడకలలు వస్తూ ఉండవచ్చు. లేదా నైట్ ట్సై కావచ్చు. పీడకలలు వచ్చినప్పుడు పిల్లలు చాలా భయపడినట్టుగా కనిపిస్తారు. కానీ వాళ్లను నిద్ర లేపడానికి అవకాశం ఉంటుంది. లేచిన తరువాత వాళ్లకు కల కొద్దిగా గుర్తు కూడా ఉంటుంది. నైట్ ట్సై కూడా నిద్రలో ఏదో భయం కలిగించే ఎక్స్‌పీరియెన్స్ వల్లనే వస్తాయి. పిల్లలను నైట్ ట్సై నుంచి లేపడం కష్టం. వాళ్లకు ఏమీ గుర్తు ఉండదు కూడా! ఏదైనా కూడా పెద్దయే కొద్దీ తగ్గుతూ వస్తాయి. కాబట్టి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. మా పాప వయసు ఎనిమిదేళ్లు. చాలా క్రమశిక్షణతో ఉంటుంది. బాగా చదువుతుంది కూడా. కానీ తిండి దగ్గర ముప్పు తిప్పలు పెడుతుంది. లంచ్‌బాక్స్ ఏ రోజూ ఖాళీగా తీసుకురాదు. ఇంట్లో కూడా సరిగ్గా తినదు. దానికిష్టమైన కూరలే వండుతాను. రకరకాల తినుబండారాలూ చేస్తుంటాను. అయినా కూడా పెద్దగా తినదు. చివరికి అందరు పిల్లల్లా చాక్లెట్లు, చిప్స్ లాంటివి కూడా తినదు. ఆకలి సమస్య ఏమైనా ఉందేమోనని డాక్టర్‌కి చూపించాం. కానీ పాప ఆరోగ్యంగానే ఉంది అన్నారు. మరి తను ఎందుకు తినడం లేదు? - సుజాత, ఏలూరు పాప హెల్దీగా ఉన్నంతకాలం పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. తన ఎత్తు, బరువు వయసుకు తగినట్టుగానే ఉంటే తనకు ఎంత తినాలనిపిస్తే అంతే తిననివ్వండి. పిల్లలకు ఎంత ఫుడ్ అవసరం అన్నదాంట్లో మనం చాలాసార్లు ఓవర్ ఎస్టిమేట్ చేస్తుంటాము. అందుకే వాళ్లు తక్కువ తింటున్నారని బాధపడిపోతూ ఉంటాం. పాప ఆరోగ్యంగానే ఉంది కదా! మరి ఇంకెందుకు బెంగ? తనకు కడుపు నిండినంతవరకూ తింటుంది కాబట్టి అంతే తిననివ్వండి. ఆకలి తీరకపోతే తనే తింటుంది కదా! ఇక చిరు తిండ్లు తినకపోవడం అనేది మరీ మంచిది. తను తినేవాటిలో పండ్లు, కూరగాయలు వంటి ఆరోగ్యకరమైనవి ఎక్కువ ఉండేలా చూసుకుంటే... తక్కువే తిన్నా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. తనకి ఏ సమస్యా లేదు కాబట్టే డాక్టర్ కూడా అలా చెప్పారు. సో, మీరు కూడా ఎక్కువ దిగులు పడకుండా పాపని ఫ్రీగా వదిలేయండి. మా బాబు ఏడో తరగతి చదువుతున్నాడు. చురుకైనవాడు. కానీ వాడితో ఒక్కటే సమస్య. వస్తువులు మర్చిపోతుంటాడు. స్కూల్లో బుక్స్, లంచ్‌బాక్స్ లాంటివి మర్చిపోయి వస్తాడు. ఏదైనా షాపుకి పంపిస్తే కొన్ని వస్తువులు తెచ్చి కొన్ని మర్చిపోతాడు. ఇంట్లో తన వస్తువులు తనే ఎక్కడో పెట్టి మర్చిపోతుంటాడు. పోనీ తర్వాతైనా గుర్తొస్తుందా అంటే రాదు. ఎంత ఆలోచించినా చెప్పలేడు ఎక్కడ పెట్టాడో. ఇంత చిన్న వయసులో ఇంత మతిమరుపేంటి? పైగా ఇది వస్తువుల విషయంలో మాత్రమే ఉంది. చదువు విషయంలో ఎప్పుడూ బెస్టే. ఎందుకిలా? - గోవర్థన్, దోమగుండ ఇలా మర్చిపోతున్నాడు అంటే బహుశా కాన్సన్ట్రేషన్ లోపం వల్ల కావచ్చు. కాన్సన్ట్రేషన్ తక్కువ ఉండటం వల్లే పిల్లలు ఏది ఎక్కడ పెడుతున్నారో చూసుకోరు. ఎక్కడ పెట్టాలనిపిస్తే అక్కడ పెట్టేస్తారు. ఆ తర్వాత దాన్ని అక్కడ పెట్టామని మర్చిపోతుంటారు. నిజానికిదంతా గుర్తు లేకపోవడం వల్ల కాదు. ఎక్కడ పెడుతున్నాం అన్నదాన్ని సరిగ్గా గమనించకపోవడం వల్ల. చదువులో సమస్య లేదంటున్నారు కాబట్టి మీ అబ్బాయిది కూడా ఇదే సమస్య అనుకుంటున్నాను. తనని కూర్చోబెట్టి, అన్నిటి మీదా ఎలా దృష్టి పెట్టాలి, ఎలా శ్రద్ధ చూపాలి అన్న విషయాలను వివరించండి. మరీ అవసరం అనుకుంటే ఓసారి సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లండి. వస్తువులు ఎక్కడ పెట్టాడో గుర్తు పెట్టుకోడానికి కొన్ని స్ట్రాటజీలు నేర్పించి, ప్రాక్టీస్ చేయిస్తారు. దానివల్ల మార్పు రావడానికి అవకాశం ఉంది. - డా॥పద్మ పాల్వాయ్ చైల్డ్ - అడల్ట్ సైకియాట్రిస్ట్, రెయిన్బో హాస్పిటల్, హైదరాబాద్ -
చదువుతాడు... మర్చిపోతాడు... ఎందుకని?
కిడ్స్ మైండ్స్ మా బాబు వయసు పద్నాలుగేళ్లు. చురుగ్గా ఉంటాడు. కానీ నన్ను వదిలి ఒక్కక్షణం ఉండడు. నేను, మావారు ఇద్దరం ప్రైవేటు ఉద్యోగులమే. దాంతో శెలవులు సరిగ్గా ఉండవు. బాబుకి శెలవులు ఉన్నప్పుడు వాణ్ని మా అమ్మవాళ్ల ఇంటికి పంపింద్దామనుకుంటే అస్సలు వెళ్లడు. వాళ్లు ఎంత బతిమిలాడినా పోనంటాడు. తన ఫ్రెండ్స్ బర్త్ డే ఫంక్షన్లకి కూడా నేనే తీసుకెళ్లాలి. నువ్వు వెళ్లు అంటే వినడు. తీసుకెళ్లకపోతే బెంగపడతాడని వాడి కోసం పని గట్టుకుని టైమ్ కేటాయించాల్సి వస్తోంది. ఇది నాకు చాలా ఇబ్బంది కలిగిస్తోంది. వాడినెలా మార్చాలి? - బి.విజయ, హైదరాబాద్ బాబు ఈ వయసులో మిమ్మల్ని వదిలి ఉండలేకపోవడం ఇబ్బందిగానే ఉంటుంది. చిన్నప్పట్నుంచీ తనకు మీరు లేకుండా బయటకు వెళ్లడం అలవాటు చేశారో లేదో మీరు చెప్పలేదు. చేసి వుండకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిం దని నేననుకుంటున్నాను. ఇలా ఉన్న ట్టుండి మిమ్మల్ని వదిలి వెళ్లడానికి బెంగగా ఉండివుంటుంది పాపం. ఒకవేళ తనకి మొదట్నుంచీ అలవాటు ఉండి ఇప్పుడు వెళ్లలేకపోతుంటే... తనకి మెల్లగా అల వాటు చేయడం మంచిది. ముందు ఫ్రెండ్స్ ఇళ్లకి పార్టీలకవీ పంపించండి. మీరు వెళ్లొద్దు. తనని వెళ్లమని పంపిం చండి. కొత్తలో సిగ్గుగానో భయంగానో ఫీలయినా తర్వాత అలవాటు పడతాడు. ఊళ్లో తనంత తాను తిరగడం అలవాటైన తర్వాత ఒకటి రెండు రోజుల కోసం ఎక్కడికైనా పంపడం మొదలుపెట్టండి. అది కూడా అలవాటయ్యాక ఎక్కువ రోజులు పంపించవచ్చు. ఇది సమస్యేమీ కాదు. ఎప్పుడూ మీతోనే ఉంటాడు కాబట్టి అమ్మ లేకపోతే ఎలా అని ఫీలవుతున్నట్టున్నాడు. మెల్లగా అలవాటు చేస్తే తనే దారికి వస్తాడు. మా బాబు ఐదో తరగతి చదువుతున్నాడు. చదువులో తను చాలా డల్. ఏ విషయమూ నాలుగైదుసార్లు చెబితేకానీ బుర్రకి ఎక్కదు. చదివిందే పదిసార్లు చదివినా కూడా మైండ్‌లో ఉండదు. అంతేకాదు... ఏదైనా పని చెప్పినా పక్క గదిలోకి వెళ్లేసరికి మర్చిపోతుంటాడు. తన వస్తువులు తనే ఎక్కడ పెట్టాడో గుర్తు లేదంటాడు. స్కూల్లో కూడా తన వస్తువులు మర్చిపోయి వచ్చేస్తుంటాడు. ఇంత చిన్న వయసులో ఇంత మతిమరుపు అసహజం కదా... ఇదేమైనా మానసిక సమస్యా? - సుదర్శన్, గుంతకల్లు చదువు అర్థం కావడం లేదు అంటే తనకి ఓసారి ఐక్యూ టెస్ట్ చేయించడం మంచిది. ఒక్కోసారి ఐక్యూ తక్కువ ఉండటం వల్ల కూడా పిల్లలకు పాఠాలు అర్థం కావు. అలాగే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ) ఉన్నా కూడా పిల్లలు చదువులో వెనక బడిపోతారు. అస్సలు శ్రద్ధ పెట్టలేక పోతారు. ఒకవేళ చదివినా మర్చి పోతుంటారు. కాబట్టి ముందు ఈ రెండిటిలో ఏ సమస్య అయినా బాబుకి ఉందేమో సైకి యాట్రిస్టుతో పరీక్ష చేయించండి. సమస్య ఉన్నా టెన్షన్ పడాల్సిన పని లేదు. వాటికి తగ్గ మంచి చికిత్సలు ఉన్నాయి. చేయిస్తే ఫలితం ఉంటుంది. ధైర్యంగా ఉండండి. మా పాప పదో తరగతి చదువుతోంది. వచ్చే యేడు ఇక్కడే ఏదైనా కాలేజీలో చేర్పించాలని అనుకుంటున్నాం. కానీ తను మాత్రం సిటీకి వెళ్లి ఒక మంచి కాలేజీలో చేరతానంటోంది. అంటే హాస్టల్లో ఉండాలి. అది నాకు ఇష్టం లేదు. రోజూ ఆడపిల్లల విషయంలో జరిగేవి వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అందుకే ఇప్పటివరకూ బయటికి వెళ్లని తనని ఒక్కసారిగా అంత దూరం పంపడానికి భయమేస్తోంది. నా భయం తనకి అర్థమయ్యేలా ఎలా చేయాలి? - యు.ఉషశ్రీ, బాపట్ల మీరు, మీవారు అన్నీ ఆలోచించిన తర్వాతే తనను ఇంటి దగ్గర కాలేజీలో చదవడం మంచిదని డిసైడ్ చేసి ఉంటే... అది తనకు వివరించి చెప్పండి. మీరు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, ఎందుకింత పంతం పడుతున్నారు అనేది తనకు అర్థమయ్యేలా చెప్పండి. తను వింటే సరే. వినకపోతే మంకుపట్టు పట్ట వచ్చు. అలాంటప్పుడు మీరు కాస్త కఠినంగానే మాట్లాడాల్సి ఉంటుంది. మీరు నిర్ణయం తీసేసుకున్నారని, ఇక మార్చుకునే వీలు లేదని చెప్పేయండి. అవసరం అయితే ఆపై చదువులకు పంపిస్తామని చెప్పండి. అయితే ఒకటి. ఇదంతా చేసేముందు ఒక్కసారి మీరు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో బాగా ఆలోచించండి. కేవలం భయంతోటే తీసుకుంటే మాత్రం మీ నిర్ణయం కరెక్ట్ కాదు. ఎందుకంటే సమస్యలు అన్నిచోట్లా ఉంటాయి. ప్రమాదాలు ఇంట్లో ఉన్నా ముంచుకొస్తాయి. అందుకని ఇలా ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉంచుకుంటాం అంటే కుదరదు కదా! రేపు ఏ విదేశీ యూనివర్శిటీలోనో తనకి సీటు వస్తే ఏం చేస్తారు? వదులుకోలేరు కదా! తప్పక పంపించాలి కదా! కాబట్టి వట్టి భయంతో తన ఆశల్ని చంపేయకండి. మీరు తీసుకున్న నిర్ణయం నూటికి నూరుపాళ్లూ పాపకి మంచిదని అనిపిస్తేనే దాన్ని అమలు చేయండి. - డా॥పద్మ పాల్వాయ్ చైల్డ్ - అడల్ట్ సైకియాట్రిస్ట్, రెయిన్బో హాస్పిటల్, హైదరాబాద్ -
బూతులు మాట్లాడుతున్నాడు... ఎలా మాన్పించాలి?
కిడ్స్ మైండ్స్ మా బాబు ఆరో తరగతి చదువుతున్నాడు. ఈ మధ్య తన మాట తీరులో చాలా తేడా వచ్చింది. ఏదైనా అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నాడు. పైగా కొన్ని సందర్భాల్లో బూతులు మాట్లాడటం విన్నాను. రెండు తగి లిస్తే ఇంకెప్పుడూ అలా మాట్లాడనన్నాడు. కానీ స్కూల్లో కూడా అలాగే మాట్లాడుతున్నాడని టీచర్ కంప్లయింట్ చేశారు. ఉన్నట్టుండి ఎందుకిలా అయ్యాడు? తననెలా మార్చాలి? - జె.సుధారాణి, తణుకు సాధారణంగా పిల్లలు టీనేజ్‌లో ఎదురు తిరుగుతారు తప్ప ఆరో తరగతిలోనే అలా చేయడం జరగదు. ఈ వయసులో ఇలాంటి మార్పు, అందు లోనూ సడెన్‌గా రావడం అనేది ఆలో చించాల్సిన విషయం. స్కూల్లోగానీ బయటగానీ ఎవరితోనైనా ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటున్నా డేమో చూడండి. ఆ ఫ్రెండ్ అలవాట్లను గమనించండి. తన వల్లే బాబులో ఈ మార్పు అనుకుంటే తనకి కాస్త దూరంగా పెట్టండి. అలాంటి కారణమేమీ కనిపించక పోతే... ఓసారి జాగ్రత్తగా లాలించి అడ గండి... ఎందుకిలా చేస్తున్నావని. అలా చేయడం వల్ల తనకెంత చెడ్డపేరొస్తుందో వివరించండి. మానుకుంటే మంచి గిఫ్ట్ ఇస్తానని చెప్పండి. మానకపోతే పని ష్మెంట్ ఉంటుందని కూడా చెప్పండి. అవసరమైతే ఇవ్వండి కూడా. సాధా రణంగా పరిసరాల్లో మార్పులు, కొత్త స్నేహాల వల్లే పిల్లల్లో ఈ మార్పు కనిపిస్తూ ఉంటుంది. సమస్య ఎందుకు వచ్చిందో పరిశీలిస్తే పరిష్కారం తెలుస్తుంది. మా అమ్మాయి ఈ మధ్యనే మెచ్యూర్ అయ్యింది. ఓ నెల రోజులు ఇంట్లోనే ఉంచి తర్వాత స్కూల్‌కి పంపించడం మొదలు పెట్టాం. అయితే తను ఇంతకుముందులా ఆటలు ఆడటం లేదని, ఎవరితోనూ సరదాగా గడపడం లేదని తన ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. ఇంట్లో కూడా హుషారుగా ఉండటం లేదు. డల్‌గా ఉండటం లేదు కానీ తన పని తాను సెలైంట్‌గా చేసుకుని పోతోంది. బయటికి రావడానికి ఇష్టపడటం లేదు. పైగా ఎవరితోనైనా మాట్లాడమన్నా, ఇంటికి ఎవరైనా వచ్చినా వాళ్లను చూసి ముడుచుకు పోతోంది. మెచ్యూర్ అవ్వడం వల్ల మాన సికంగా ఏదైనా సమస్య వచ్చిందా అని నాకు భయమేస్తోంది. ఇప్పుడేం చేయాలి? - అనిత, ఖమ్మం సమస్య ఏమిటని పాపనే అడిగి చూడాల్సింది. అది ఇప్పుడైనా చేయండి. ఇదేమీ మానసిక వ్యాధి కాదు. మెచ్యూర్ అవ్వడం వల్ల కూడా ఇలాంటి సమస్య రాదు. కాకపోతే దాని గురించి పాప ఆలోచించే విధానం వల్ల వచ్చి ఉండాలి. తను ఇంతవరకూ చిన్నపిల్ల. ఇప్పుడు సడెన్‌గా పెద్దదయ్యిందని అందరూ అని వుంటారు. దాంతో తను ఇంతకు ముందులా ఇంట్లోను, బయట ఉండలేను, ఆడుకోలేను అని ఆలోచిస్తూ ఉండవచ్చు. లేదంటే తాను పెద్దది అయ్యింది కాబట్టి కాస్త పద్ధతిగా ఉండాలి అన్న ఉద్దేశంతో మెచ్యూర్డ్‌గా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తూ ఉండొచ్చు. అదీ కాదంటే... మెచ్యూర్ అయినప్పుడు తనను అందరూ ప్రత్యేకంగా చూడటం వల్ల తనలో సిగ్గు పెరిగి ఉండవచ్చు. కారణం తెలియాలంటే తనతో మాట్లాడి తీరాల్సిందే. అది సిగ్గో భయమో మరేదైనా కారణమో తెలిస్తే దాన్ని పోగొట్టే ప్రయత్నం చేయవచ్చు. మా బాబు ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. చిన్నప్పట్నుంచీ చాలా అల్లరివాడు. ఇల్లు పీకి పందిరేసేవాడు. అయితే చదువులో ఎప్పుడూ ముందుండేవాడు కాబట్టి ఏమీ అనేవాళ్లం కాదు. అయితే ఏడో తరగతి పూర్తయ్యాక తనలో బాగా మార్పు వచ్చింది. ఒక్కసారిగా సెలైంట్ అయిపోయాడు. చదువు మీద కూడా అశ్రద్ధ కనిపిస్తోంది. ఏమైందని అడిగినా చెప్పడం లేదని డాక్టర్‌కి చూపించాం. ఏడీహెచ్‌డీ అన్నారు. నాకు తెలిసి ఆ సమస్య వచ్చిన పిల్లలు హైపర్‌గా ఉంటారు. కానీ వీడు డల్ ఎందుకయ్యాడు అని అడిగితే ఇలాక్కూడా జరుగుతుంది అన్నారు. అది నిజమేనా? వాడికిప్పుడు ఏ చికిత్స చేయాలి? - వి.రాజేంద్రప్రసాద్, సికింద్రాబాద్ ఏడీహెచ్‌డీ ఉన్న పిల్లలంతా హైపర్ యాక్టివ్‌గా ఉండాలని లేదు. కొంతమందికి కేవలం కాన్సన్ట్రేషన్ ప్రాబ్లెమ్ ఉంటుంది. వీళ్లు చిన్నప్పట్నుంచీ చదువు మీద శ్రద్ధ చూపలేక ఇబ్బంది పడుతుంటారు. కానీ హైపర్ యాక్టివ్‌గా ఉండరు. ఇంకొంతమంది పిల్లలు హైపర్ యాక్టివ్‌గా ఉంటారు. చదువు మీద కూడా శ్రద్ధ చూపలేరు. అయితే కొందరు పెద్దయ్యాక వాళ్లలో హైపర్ యాక్టివ్నెస్ తగ్గిపోతుంది. కాన్సన్ట్రేషన్ ప్రాబ్లెమ్ మాత్రమే మిగులుతుంది. అలాగే కొంతమంది పిల్లలకు చిన్నప్పుడు మంచి మార్కులే వస్తాయి. తర్వాత తగ్గిపోతాయి. కారణం... చిన్న క్లాసెస్‌లో ఎక్కువసేపు కూర్చుని చదవాల్సిన అవసరం ఉండదు కాబట్టి, పెద్ద క్లాసెస్‌కి వెళ్లేసరికి ఎక్కువసేపు కాన్సన్ట్రేట్ చేయలేక పోతుంటారు. అందుకే మార్కులు తగ్గుతాయి. కాబట్టి బాబును బద్ధకస్తుడనో మొద్దు అనో విసుక్కోవద్దు. చైల్డ్ సైకియాట్రిస్టుతో మందులు ఇప్పించండి. బిహేవియరల్ థెరపీ చేయించండి. తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. - డా॥పద్మ పాల్వాయ్ చైల్డ్ - అడల్ట్ సైకియాట్రిస్ట్, రెయిన్బో హాస్పిటల్, హైదరాబాద్ -
మందులంటే... మారాం చేస్తోందెలా?
కిడ్స్ మైండ్స్ మా పాప వయసు పదేళ్లు. సంవత్సరం క్రితం సడెన్‌గా అనారోగ్యం పాలయ్యింది. డాక్టర్‌కి చూపిస్తే ఓ చిన్న హార్ట్ ప్రాబ్లెమ్ ఉందని చెప్పారు. కొన్నాళ్ల పాటు మందులు వేస్తే సమస్య తీరిపోతుందన్నారు. అయితే పాపతో మందులు మింగించడం చాలా కష్టంగా ఉంటోంది. మందు అంటే చాలు అరిచి గీపెడుతుంది. తనని ఎలా డీల్ చేయాలో చెప్తారా? - కె.మనోజ్ఞ, హైదరాబాద్ పాప ఎందుకు మందు వేసుకోనం టోందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిం చండి. మందు చేదుగా ఉంటుందనా? మింగడం రాదా? లేక మందు ఎందుకు వేసుకోవాలి అనే మంకుపట్టా? ఎందుకు వేసుకోనంటోందో తెలిస్తే ఎలా కన్విన్స్ చేయాలో ఆలోచించవచ్చు. సాధారణంగా పిల్లలు భయంతో మందులు వేసుకోవ డానికి మారం చేస్తుంటారు. అలాం టప్పుడు జమ్స్ లాంటి చాకొలెట్స్తో ప్రాక్టీస్ చేయించాలి. అవి తియ్యగా ఉంటాయి కాబట్టి, వాళ్లకు నచ్చుతాయి కాబట్టి భయం పోతుంది. మందులు కూడా అలానే ఉంటాయి అని చెబితే, వేసుకోవడానికి సిద్ధపడతారు. లేదంటే నీతో పాటు నేను కూడా వేసుకుంటాను అని చెప్పి, మీరు కూడా కొన్ని రోజుల పాటు ఓ విటమిన్ మాత్ర మింగుతూ ఉండండి. అప్పుడు తనకీ ధైర్యం వస్తుంది. నాకు ఈ మధ్యనే ఓ పాప పుట్టింది. తను పుట్టినప్పట్నుంచీ మా పెద్దపాపలో (రెండో తరగతి చదువుతోంది) చాలా మార్పు వచ్చింది. చెప్పినమాట చక్కగా వినేది, ఇప్పుడు వినడం లేదు. చిన్న పాపకు స్నానం చేయి స్తున్నప్పుడో నిద్ర పుచ్చుతున్నప్పుడో ఏదో ఒకటి కావాలని అడుగుతుంది. ఆగమంటే ఆగదు. వెంటనే కావాలంటూ గొడవ గొడవ చేస్తుంది. నేను చిన్న పాపతో ఉన్న ప్రతిసారీ తను ఇలా కావాలనే చేస్తోందని అర్థమైంది. అలా అని తనని పట్టించుకోకపోవడం ఏమీ లేదు. మరి ఇంకెందుకింత అసూయ? - జ్యోతి, విశాఖపట్నం ఇంతవరకూ మీ పెద్ద పాప ఒక్కతే ఉంది కాబట్టి మీ అటెన్షన్ అంతా తనమీదే ఉండేది. ఇప్పుడు చిన్న పాప పుట్టడంతో ఆ అటెన్షన్ డివైడ్ అయ్యింది. దీన్ని చాలా మంది పిల్లలు తట్టుకోలేరు. అందుకే చెల్లి వచ్చినా తన స్థానం అలాగే ఉంది అనే ఫీలింగ్ పాపకు కలిగించాలి. రోజూ కొంత సేపు తనతో గడపండి. అప్పుడు చిన్న పాపను మీతో ఉంచుకోవద్దు. ఇంతకు ముందుకంటే ఎక్కువగా పాప పనుల్లో సాయం చేయండి. తనకు మీరిచ్చే ప్రాధా న్యత అర్థమవుతుంది. అలాగే చిన్నపాప పనుల్లో పెద్ద పాపను ఇన్వాల్వ్ చేయండి. పాపను తన ఒడిలో కూర్చోబెట్టండి. స్నానం చేయించేటప్పుడు తనను హెల్ప్ చేయమనండి. చెల్లికి ఏ బట్టలు వేయాలో నువ్వే సెలెక్ట్ చెయ్యి అని చెప్పండి. చెల్లిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి మీరు వేరే పనులు చేసుకుంటూ ఉండండి. దానివల్ల చెల్లెలి బాధ్యత తనకూ ఉందని తెలు స్తుంది. ప్రేమ పెరుగుతుంది. ఇంకొకరు వచ్చారు కాబట్టి తనను చూడరేమో అన్న భయం పిల్లల్ని ఇలా తయారు చేస్తుంది. కొన్ని రోజుల్లో తనే మారిపోతుందిలెండి. మా బాబు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. తెలివికి వంక పెట్టక్కర్లేదు. కాకపోతే వాడు ఈ మధ్య ఫ్యాషన్మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాడు. ఏదైనా డ్రెస్ కొంటే నాకు నచ్చలేదు, వేసుకోను అని చెప్పేస్తున్నాడు. వాడి డ్రెస్ వాడే సెలెక్ట్ చేసుకోవాలట. అలాగే చాలాసేపు తయారవుతున్నాడు. పదే పదే అద్దంలో చూసుకుంటున్నాడు. ఇంత చిన్న వయసులో ఇలా చేయడం కరెక్ట్ కాదేమో అనిపిస్తోంది. నా ఆలోచన కరెక్టేనా? - వి.పవన్‌కుమార్, రేణిగుంట తొమ్మిదో తరగతి అంటే 13-14 సంవత్సరాలు ఉండవచ్చేమో కదా! టీనేజీలో పిల్లలకు సహజంగానే అప్పియరెన్స్ మీద ఆసక్తి పెరుగుతుంది. అలాగే ఈ వయయసులో వాళ్లు తమ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది అవసరం కూడా. పెద్దయిన తర్వాత తమ నిర్ణయాలు తాము సొంతగా తీసుకునేందుకు ఇది సహాయపడుతుంది. తప్పు చేసినా పెద్దగా హాని చేయని నిర్ణయాలు తీసుకున్నప్పుడు మెచ్చుకోవాలే తప్ప కంగారు పడకూడదు. అలాంటి విషయాల్లో తనని అలా వదిలేయండి. మరీ ఇన్‌డీసెంట్‌గా ఉంటే చెప్పండి తప్ప... తన దుస్తులు, వాటి రంగులు, స్టయిల్స్ మీకు నచ్చకపోయినా పట్టించుకోకండి. తను సంతోషంగా ఉంటాడు కదా! అయితే ఏదైనా డ్యామేజ్ జరిగే నిర్ణయాలు తీసుకున్నప్పుడు మాత్రం అడ్డుకోండి. అలాగని తిట్టకూడదు. కూర్చోబెట్టి మాట్లాడి, అర్థమయ్యేలా వివరించాలి. అంటే తనకి ఫ్రీడమ్ ఇస్తూనే మంచి చెడులను కనుక్కోవాలన్నమాట. బట్టలు కూడా మీరు చెప్పినవే వేసుకునే వయసు కాదు తనది. అది మీరు అర్థం చేసుకోవాలి. - డా॥పద్మ పాల్వాయ్ చైల్డ్ - అడల్ట్ సైకియాట్రిస్ట్, రెయిన్బో హాస్పిటల్, హైదరాబాద్ -
తిరగేసి రాస్తున్నాడు... డిస్లెక్సియానా?
కిడ్స్ మైండ్స్ మా పాప ఎనిమిదో తరగతి చదువుతోంది. తెలివైనపిల్లే. కానీ చాలా కంగారు పడుతూ ఉంటుంది. పరీక్షలంటే టెన్షన్... సరిగ్గా రాయగలనో లేదో అని. రాసి వచ్చాక సరిగ్గా రాశానో లేదో అని కంగారు పడుతుంది. ప్రతిరోజూ తను చేసిన హోమ్‌వర్క్ కరెక్ట్‌గా ఉందో లేదో, టీచర్ ఏమంటుందో అని భయపడుతుంది. సైకిల్ నేర్చుకొమ్మంటే పడిపోతానేమో అంటుంది. ఇలా ప్రతిదానికీ భయపడుతూ, కంగారు పడిపోతూ ఉంటుంది. తనకి ధైర్యమెలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఇదేమైనా మానసిక సమస్యా? దీనికి పరిష్కారమేమిటి? - ఆర్.ప్రశాంతి, ఖమ్మం పాప కొంచెం నెర్వస్‌గా ఉన్నట్టుంది. సాధారణంగా భయం అన్నది మనం ఆ పని ఎక్కువగా చేస్తూ ఉంటే తగ్గుతుంది. ఉదాహరణకి తను సైకిల్ ఎక్కడానికి భయపడుతుంటే, కష్టమయినా సరే కాస్త బలవంతం చేసి ఎక్కించండి. అలా పదే పదే చేయడం వల్ల సైకిల్ అంటే ఉన్న భయం పోతుంది. హోమ్‌వర్క్ తప్పేమో, టీచర్ ఏమైనా అంటుందేమో అన్న భయాలను తను వ్యక్తం చేసినప్పుడు... నిజంగా తను తప్పు చేసినా, పర్యవసానం తను అనుకున్నంత భయంకరంగా ఉండదని సర్దిచెప్పండి. మీరు మాత్రం తను భయపడుతోంది కదా అని తనను ఎక్కువగా ప్రొటెక్ట్ చేయకండి. దానివల్ల భయం ఇంకా ఎక్కువవుతుంది. తనలో మార్పు రావడానికి సమయం పడుతుంది. ఒకవేళ మీరు నేను చెప్పినట్టు చేసినా తనలో మార్పు రాకపోతే ఓ మంచి కౌన్సెలర్ దగ్గరకు తీసుకెళ్లండి. కౌన్సెలింగ్‌తో కూడా తగ్గకపోతే ఈ సమస్యకి కొన్ని మందులు ఉన్నాయి. చైల్డ్ సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్తే, పాపని పరీక్షించి వాటిని సూచిస్తారు. మా బాబు మూడో తరగతి చదువు తున్నాడు. వాడికి చిన్నప్పట్నుంచీ ఓ విచిత్రమైన అలవాటు ఉంది. అక్షరాలు తిరగేసి రాస్తాడు. పుస్తకం చేతికిస్తే వెనుక పేజీ నుంచి చదవడం మొదలెడతాడు. అలా కాదు ఇలా అంటే సరి చేసుకుంటాడు. కానీ మళ్లీ మామూలే. అయితే వాడు ఎప్పుడూ ఇలానే చేయడం లేదు. మామూలుగా రాస్తూ రాస్తూ మధ్యలో ఉన్నట్టుండి తిరగేసి రాస్తాడు. ఇది కొంపదీసి డిస్లెక్సియా లక్షణం కాదు కదా? - వేణుమాధవ్, సంగారెడ్డి ఇలాంటి పనులు పిల్లలు చిన్నప్పుడే చేస్తుంటారు. ఏడు సంవత్సరాలు దాటిన తర్వాత ఇలా అక్షరాలు తిరగేసి రాయడం అనేది అరుదు. కాబట్టి బాబును వెంటనే ఓ సైకియాట్రిస్టుకు చూపించండి. వారు తనని పరీక్షిస్తారు. ఏదైనా లెర్నింగ్ డిఫికల్టీ కనుక ఉంటే ఈ వయసులోనే గుర్తించడం మంచిది. ఇది మీరు అనుమానపడినట్టు డిస్లెక్సియా అవడానికి కూడా అవకాశం ఉంది. అయితే నిర్ధారించడానికి బాబుని పరీక్షించడం అవసరం. కాబట్టి ఆలస్యం చేయకుండా బాబుని సైకియాట్రిస్టు దగ్గరకు తీసుకెళ్లండి. మాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్దోడు పదో తరగతి చదువుతున్నాడు. రెండోవాడు ఆరో తరగతి. పెద్దవాడు చాలా సెలైంట్. కానీ చిన్నవాడు మహా తుంటరి. అల్లరి వరకూ ఫర్వాలేదు కానీ వాడితో ఓ పెద్ద సమస్య వచ్చిపడింది. ప్రతిదానికీ వాళ్ల అన్నతో పోటీపడతాడు. వాడు పదో తరగతి కదా అని కాస్త ఎక్కువ శ్రద్ధ చూపిస్తాం. అది వీడికి నచ్చదు. తననే బాగా చూస్తున్నామంటాడు. వాడికేదైనా కొంటే వీడికీ కొనాలి. పైగా అలాంటిదే కొనాలి. లేదంటే గొడవ చేసేస్తాడు. అన్నయ్యకి అవసరం కదా, నీకు అవసరమైనప్పుడు నీకూ కొంటాం అంటే వినడు. ఈ నైజం వాడికి అన్న మీద ద్వేషం పెంచుతుందేమోనని భయంగా ఉంది. ఈ పరిస్థితిని ఎలా డీల్ చేయాలి? - ఎమ్.రాజ్యలక్ష్మి, శ్రీకాకుళం మీరు కేవలం పెద్ద బాబు చదువు మీద ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారా లేక అప్రయత్నంగా తనను ఎక్కువ గారాబం చేస్తున్నారా అనేది ఒక్కసారి పరిశీలించుకోండి. అటువంటిదేమీ లేకపోతే... వీలయినంతవరకూ చిన్న బాబుతో రోజూ కాసేపు గడపడానికి సమయం కేటాయించండి. తనతో కబుర్లు చెప్పడం, కలిసి ఆడటం వంటివి చేయండి. దానివల్ల తనని మీరు పట్టించుకోవడం లేదు, నిర్లక్ష్యం చేస్తున్నారు అన్న ఆలోచనలు తనలో ఉంటే పోతాయి. అలాగే తను కోరేవి న్యాయమైన కోరికలే అయితే... పెద్ద బాబుతో సమానంగా తీర్చండి. లేదు, అవి తీర్చాల్సినవి కావు అనుకుంటే తను ఎంత గొడవ చేసినా పట్టించుకోకండి. రెస్పాండ్ కాకపోతే అడిగి అడిగి తనే ఊరుకుంటాడు. లేదూ గొడవ చేస్తుంటే, కూర్చోబెట్టి మాట్లాడండి. మీరు ఎందుకు తనకి అది ఇవ్వడం లేదు అనే విషయాన్ని అర్థమయ్యేలా చెప్పండి. లేదా తను ఎవరి మాట అయినా వింటాడు అనుకుంటే వాళ్లతో చెప్పించండి. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు రావడం సహజమే. కొంచెం జాగ్రత్తగా ప్రయత్నిస్తే వీటిని పరిష్కరించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. -
మంచికే చెబుతున్నా... మొరాయిస్తే ఎలా?
కిడ్స్ మైండ్స్ మా బాబు పదో తరగతి చదువుతున్నాడు. మొన్నటి వరకూ బాగానే ఉండేవాడు. కానీ ఈ మధ్య వాడి ప్రవర్తనలో తేడా వస్తోంది. ఏదైనా సలహా ఇవ్వబోతే నాకు తెలుసులే అంటున్నాడు. నేనేం చిన్నపిల్లాడినా, వచ్చే యేడు కాలేజీకి కూడా వెళ్లబోతున్నా కదా అంటాడు. ఫ్రెండ్స్‌తో షికార్లు కూడా ఈ మధ్య ఎక్కువయ్యాయి. ఇంతకు ముందులా స్కూలు అవ్వగానే తిన్నగా ఇంటికి రావడం లేదు. సరదాగా ఎంజాయ్ చేయడంలో తప్పు లేదు. కానీ ఈ నిర్లక్ష్యం వాడి చదువు మీద ప్రభావం చూపుతుందేమోనని భయంగా ఉంది. అసలే పదో తరగతి కదా! ఇప్పుడేం చేయాలో సలహా ఇవ్వండి? - సంగీత, హైదరాబాద్ బాబు స్నేహితులలో మార్పేమైనా వచ్చిందేమో కనుక్కోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే కొత్త స్నేహితులు వచ్చినప్పుడు మన పిల్లల ప్రవర్తనపై వారి ప్రభావం కనిపిస్తుంది ఒక్కోసారి. అప్పుడప్పుడూ ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్లడం తప్పేమీ కాదు. కానీ మీతో చెప్పకుండా, స్కూలు నుంచి డెరైక్ట్‌గా వెళ్లిపోవడం మాత్రం తప్పు. ఈ వయసులో పిల్లలు కొద్దిగా స్వాతంత్య్రాన్ని కోరుకోవడం, తీసుకోవడం మొదలవుతుంది. పెద్దవాళ్లు అవుతున్నారు కాబట్టి ఇంతకు ముందులా ప్రతిదీ మీకు చెప్పి చేయరు, మీరు చెప్పింది వినరు. కానీ మరీ ఎక్కువ స్వేచ్ఛ తీసుకోవడం అంత మంచిది కాదు. ఏది సబబు, ఏది కాదు, ఏది చెయ్యొచ్చు, ఏది చెయ్యకూడదు అన్నది వాళ్లకి తెలియాలి. కాబట్టి ఓసారి కూర్చోబెట్టి బాబుతో వివరంగా మాట్లాడండి. మీ అనుమతి లేకుండా బయటకు వెళ్లకూడదని చెప్పండి. వెళ్తే ఎలాంటి సమస్యలు రావొచ్చో కూడా వివరించండి. అలా అని మరీ రిస్ట్రిక్ట్ చేయకుండా కాస్త ఫ్రీగా వదలండి. కాకపోతే ఏ రూల్స్ కచ్చితంగా పాటించి తీరాలన్నది తనకు స్పష్టం చేయండి. వాటి విషయంలో మీరు కూడా స్ట్రిక్ట్‌గా ఉండండి. మా బాబు వయసు ఎనిమిదేళ్లు. చాలా చలాకీగా ఉంటాడు. కానీ ఎందుకో మాటలే సరిగ్గా రావడం లేదనిపిస్తోంది. గడగడా మాట్లాడలేడు. ఆగి ఆగి మాట్లాడతాడు. ఏదో ఆచి తూచి మాట్లాడినట్లుగా మాట్లాడతాడు. కొన్ని పదాలు నత్తినత్తిగా పలుకుతాడు. తనకి ఏదైనా సమస్య ఉందంటారా? - వరప్రసాద్, ఏలూరు బాబుకి మాటలు ఇంకా పూర్తిగా వచ్చినట్టు లేదు. కొంతమంది పిల్లలకు మాటలు రావడం కాస్త ఆలస్యం కావొచ్చు. నత్తిగా మాట్లాడం కూడా స్పీచ్ ప్రాబ్లెమే. తనని ఓసారి స్పీచ్ థెరపిస్ట్ దగ్గరకు తీసుకు వెళ్లండి. వాళ్లు ఇచ్చే థెరపీ ద్వారా బాబుకి మాటలు బాగా వస్తాయి. నేను పెద్దగా చదువుకోలేదు. అందుకే మా బాబుని బాగా చదివించాలని అనుకుంటున్నాను. వాడిప్పుడు ఆరో తరగతి చదువుతున్నాడు. వాడిని మంచి స్థాయిలో చూడాలన్నది నా కల. అయితే మేము కాస్త వెనుకబడిన ప్రాంతంలో ఉంటున్నాం. అందుకే ఏడో తరగతికి తనని సిటీలోని ఓ మంచి స్కూల్లో చేర్చాలని నిర్ణయించుకున్నాను. కానీ హాస్టల్లో ఉండటానికి బాబు అస్సలు ఒప్పుకోవడం లేదు. ముందుగానే చెబితే తను ప్రిపేరవుతాడనుకున్నాను. కానీ చెప్పీ చెప్పడంతోనే వాడు బెంగ పెట్టేసుకున్నాడు. ఎట్టి పరిస్థితిల్లోనూ హాస్టల్‌కి వెళ్లనని, మమ్మల్నందరినీ వదిలి ఉండలేనని తెగేసి చెప్తున్నాడు. వాడికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? - వై.రాజేంద్ర, ఎస్.కోట బాబును బయటకు పంపడమే తన భవిష్యత్తుకు మంచిదని మీరు నమ్ముతుంటే... తను బాధపడినా కూడా వెనకడుగు వేయకండి. అసలు మీరు తన గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఎందుకు దూరంగా పంపాలనుకుంటున్నారు, అది తన భవిష్యత్తుకు ఎంత అవసరం అనేది వివరంగా చెప్పండి. తను ఇప్పటివరకూ ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి బాధపడటం, వెళ్లనని అనడం సహజం. అది చూసి మీకూ బాధ కలుగుతుంది. కానీ తప్పదు అనుకున్నప్పుడు ఏదో ఒకటి చేసి తనని కన్విన్స్ చేయాలి కదా! కాబట్టి మీరు కాస్త కఠినంగా వ్యవహరించి తనని హాస్టల్లో చేర్పించండి. కొత్తలో తరచూ ఫోన్లలో మాట్లాడితే దగ్గరగా ఉన్నట్లు ఫీలవుతాడు. మీరు వీలైనన్నిసార్లు వెళ్లి చూడటం, శెలవులు వచ్చినప్పుడు తనను ఇంటికి తీసుకు రావడం చేస్తుంటే... హాస్టల్లో ఉన్నా మీరందరూ తనను పట్టించు కుంటున్నారన్న ధైర్యం కలుగుతుంది తనకి. కాబట్టి తన బాధ చూసి సంశయించి మీరు వెనకడుగు వేయకుండా, తన భవిష్యత్తు కోసం మీ నిర్ణయాన్ని అమలు జరపండి. మొదట్లో కాస్త బెంగగా, బాధగా ఉంటాడు కానీ మెల్లగా అలవాటు పడిపోతాడు. - డా॥పద్మ పాల్వాయ్ చైల్డ్ - అడల్ట్ సైకియాట్రిస్ట్, రెయిన్బో హాస్పిటల్, హైదరాబాద్ -
అన్నీ ఇస్తున్నాం... అయినా ఎందుకిలా?!
కిడ్స్ మైండ్స్ మా బాబు ఏడో తరగతి చదువుతున్నాడు. తెలివైనవాడే. కానీ ఎందుకో పరీక్షల సమయం వచ్చేసరికి విపరీతంగా టెన్షన్ పడిపోతాడు. స్లిప్ టెస్టులకు కూడా ఫైనల్ ఎగ్జామ్స్లాగా కంగారు పడిపోతాడు. పరీక్ష అంటే చాలు జ్వరం వచ్చేస్తుంది. దాంతో ఎంత చదివినా సరిగ్గా రాయలేడు. ఎంత ధైర్యం చెప్పినా పరిస్థితి మారట్లేదు. కౌన్సెలింగ్ లాంటిదేమైనా ఇప్పిస్తే మంచిదంటారా? - రవికాంత్, ఆదిలాబాద్ పరీక్షలకు టెన్షన్ పడటం వల్ల పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. ఒకవేళ మీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయేమో చూసుకోండి. ఎందుకంటే చాలాసార్లు పెద్దవాళ్లు పిల్లలతో డెరైక్ట్‌గా ‘నీకెన్ని మార్కులు వచ్చినా ఫర్వాలేదు నాన్నా’ అంటారు. కానీ మార్కులు కాస్త తక్కువ వచ్చినా పెదవి విరవడం, ఫస్ట్ ర్యాంక్ కాకుండా సెకెండ్ ర్యాంక్ వచ్చినా... చూశావా, నేను చెప్పినట్టు ఆ రోజు చదివివుంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చేది అనడం చేస్తుంటారు. ఒక్కసారి ఇంట్లో కానీ, స్కూల్లో కానీ ఎవరైనా అతిగా ఒత్తిడి చేస్తున్నారేమో చూడండి. అలాంటి పరిస్థితి ఉంటే వెంటనే సరి చేయండి. అలాంటిదేమీ లేకపోతే బాబును తప్పకుండా కౌన్సెలింగుకు తీసుకు వెళ్లండి. బాబుది భయపడే మనస్తత్వం అయితే కనుక కౌన్సెలింగ్ తప్పకుండా పని చేస్తుంది. ఈ భయం ముందు ముందు వేరే భయాలకు దారి తీయకుండా ఉంటుంది. మా పాప ఎనిమిదో తరగతి చదువుతోంది. ఆరు నెలల క్రితం మెచ్యూర్ అయ్యింది. అయితే అప్పటి నుంచీ ఎందుకో చాలా సెలైంట్ అయిపోయింది. ఎవరితోనూ ఎక్కువ మాట్లాడటం లేదు. ముభావంగా ఉంటోంది. ఒంట్లో బాలేదా అంటే బాగానే ఉంది అంటోంది. కానీ డల్‌గానే కనిపిస్తోంది. ఎప్పుడూ హుషారుగా ఉండే తనలో ఈ మార్పు ఎందుకు వచ్చింది? - మధుమణి, రాజమండ్రి అసలు పాప మెచ్యూర్ అవ్వడానికి, ఈ బిహేవియర్‌కి సంబంధం ఉందా లేదా అన్నది ఆలోచించాలి. ఒకవేళ తన మనసులో ఏవైనా అనుమానాలు, సందేహాలు, భయాలు ఉన్నాయేమో కనుక్కోండి. తను మెచ్యూర్ అయినప్పుడు స్కూల్లో తన స్నేహితులు ఏమైనా చెప్పారేమో అడగండి. లేదా తనలో వచ్చిన ఈ కొత్త మార్పు వల్ల ఏవైనా అపోహలు తలెత్తాయా అన్నది కనుక్కోండి. కూల్‌గా మాట్లాడితే తన మనసులో మాట తెలుస్తుంది. తను చెప్పినదాన్ని బట్టి తన సందేహాలను తీర్చండి. భయాలుంటే పోగొట్టండి. ఒకవేళ మీరు ఎంత ప్రయత్నించినా తన మనసులో మాట మీతో చెప్పకపోతే కౌన్సెలర్ ఒకసారి దగ్గరకు తీసుకు వెళ్లండి. మాకు ఒక్కడే బాబు. రెండో తరగతి చదువు తున్నాడు. తనని మేం బాగా గారాబం చేస్తాం. అడిగినదల్లా ఇస్తాం. కానీ అదేంటో... తన దగ్గర ఎన్ని ఉన్నా, పక్క పిల్లల పెన్నులు, పెన్సిళ్లు తీసేసుకుంటున్నాడు. ఒక్కోసారి వాళ్లకు చెప్పకుండా కూడా తీసేసుకుంటున్నా డని తెలిసింది. ఈ మధ్యనే స్కూలు నుంచి కంప్లయింట్ వస్తే మేం షాకయ్యాం. ఎదుటి వాళ్ల వస్తువులు చెప్పకుండా తీసుకోకూడదని, దొంగతనం తప్పు అని ఎంత చెప్పినా అలా చేయడం మానట్లేదు. దీనికి కారణం ఏమై ఉంటుంది? ఇది మానసిక సమస్య కాదు కదా? - ఎస్.ప్రభాకర్, విశాఖపట్నం బాబు ఏదైనా వస్తువు తనకు నచ్చగానే తీసేసుకుంటున్నట్టున్నాడు. తనకేదైనా కావాలనుకుంటే ఆగలేక పోతున్నాడు. కాబట్టి ముందు మీరు చేయాల్సింది ఏంటంటే... ఏదైనా కావాలి అనుకున్న వెంటనే దొరకదని, దొరికే వరకూ ఆగాలని చెప్పాలి. ప్రతిదీ అడగ్గానే ఇవ్వకండి. ఏది ఇవ్వొచ్చో, ఏది ఇవ్వ కూడదో ఆలోచించండి. తనకేదైనా వస్తువు నచ్చి తీసేసుకున్నప్పుడు... ఆ వస్తువు ఎవరిదో వారి దగ్గరకు తీసుకెళ్లి, బాబుతోనే ఆ వస్తువు తిరిగి ఇప్పించి, క్షమాపణ చెప్పేలా చేయండి. అంటే దొంగిలించడం తప్పని, దొంగతనం చేయడం వల్ల తనకు ఎటువంటి లాభం చేకూరలేదనీ మీరు బాబుకి చెప్పినట్టు అవుతుంది. అయినా అలాగే చేస్తుంటే... తప్పు చేసిన ప్రతిసారీ ఖండించడం, తనకు నచ్చినవి ఇవ్వకపోవడం, టీవీ చూడనివ్వకపోవడం లాంటి చిన్న చిన్న పనిష్మెంట్లు ఇవ్వండి. అందరూ ఒకే మాట మీద ఉండాలి. ఒకళ్లు స్ట్రిక్ట్‌గా ఉండి మరొకరు ముద్దు చేస్తూ ఉంటే బాబు తన తప్పు తెలుసుకోడు. కాబట్టి అందరూ కలిసి బాబుకున్న ఈ చెడు అలవాటును మాన్పించండి. డా॥పద్మ పాల్వాయ్ చైల్డ్ - అడల్ట్ సైకియాట్రిస్ట్, రెయిన్బో హాస్పిటల్, హైదరాబాద్ -
చూడకూడనివి చూస్తున్నాడు... ఆపేదెలా?!
కిడ్స్ మైండ్స్ * మా బాబు వయసు ఏడేళ్లు. విపరీతమైన అల్లరి చేస్తున్నాడు. అల్లరంటే అరవడం, పరుగులు తీయడం కాదు. అన్నీ పగులగొట్టేస్తూ ఉంటాడు. ఆట బొమ్మలు, ఇంట్లోని ఇతరత్రా వస్తువులు నేలకేసి కొట్టడం వాడికి చాలా ఇష్టం. అంతవరకూ బానే ఉంటాడు. ఉన్నట్టుండి చేతిలో ఉన్నదాన్ని విసిరి కొడతాడు. తిట్టినా, కొట్టినా వినడం లేదు. ఈ అలవాటు ఎలా పోగొట్టాలి? - వాణి, పాలకొల్లు హైపర్ యాక్టివ్‌గా ఉన్న పిల్లలు విపరీతంగా అల్లరి చేస్తుంటారు. ఒక్క దగ్గర కూర్చోరు. పరుగులు తీస్తూనే ఉంటారు. అలాంటి పిల్లలు ఇలా చేసే అవకాశాలు ఎక్కువ. కాకపోతే బాబు మరే విధమైన అల్లరీ చేయకుండా కేవలం విసిరి కొట్టడం మాత్రమే చేస్తున్నాడు. బహుశా ఇలా చేయడాన్ని తను ఎక్కడైనా చూసి ఉండవచ్చు. లేదంటే తను అలా ఒకట్రెండుసార్లు చేసినప్పుడు అటెన్షన్ దొరకడం వల్ల అది తనకు అలవాటైపోయి ఉండవచ్చు. దీన్ని మాన్పించాలంటే మీరొక పని చేయండి. దేనినైనా పగులగొడితే ‘టైమ్ అవుట్’ ఇస్తానని క్లియర్‌గా చెప్పండి. ‘టైమ్ అవుట్’ అంటే... తప్పు చేసినప్పుడు తనని తీసుకెళ్లి ఓ మూలన కూర్చోబెట్టి, అక్కడి నుంచి లేస్తే ఆ రోజు టీవీ చూడనివ్వననో ఆడుకోనివ్వననో చెప్పడం. వినడానికి ఇది చాలా సింపుల్‌గా అనిపిస్తుంది కానీ చాలా మంచి ఫలితాలనిస్తుంది. మొదట్లో బాబు లైట్‌గా తీసుకున్నా, నాలుగైదుసార్లు అలా చేసేసరికి తాను ఏం మిస్ అవుతున్నాడో అర్థమవుతుంది. అలాగే మీరు ఇలా చేయడం ఎంత ముఖ్యమో... బాబు బుద్ధిగా ఉన్నప్పుడు మెచ్చుకోవడమూ అంతే ముఖ్యం. దానివల్ల మంచిగా ఉంటే మెప్పుకోలు వస్తుందన్న విషయం కూడా అర్థమై తనలో మార్పు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. * మా పాపకు ఎనిమిదేళ్లు. పెద్దగా అల్లరి చేయదు. బాగా చదువుతుంది కూడా. అయితే ఎందుకో ఈ మధ్య అబద్ధాలు ఆడుతోంది. హోమ్‌వర్క్ చేయకపోయినా చేశానంటుంది. టీచర్ ఏదైనా అన్నా, స్నేహితులతో గొడవ పడినా మాకు చెప్పడం లేదు. విషయం తెలిసి మేము నిలదీసినా ఏదేదో చెప్తోంది తప్ప నిజం చెప్పట్లేదు. పోనీ మేం తిడతామని భయపడుతోందా అంటే... నేను అస్సలు కోప్పడను. మావారు నాకంటే కూల్. అయినా ఎందుకిలా చేస్తోందంటారు? - మంజూష, చెన్నై మీది కోప్పడే తత్వం కాకపోయినా ఒక్కో సారి పిల్లలు నిజం చెప్పడానికి భయపడ వచ్చు. కాబట్టి తనను కూర్చోబెట్టి కూల్‌గా మాట్లాడండి. అబద్ధం చెప్పడం తప్పు, నిజమే చెప్పాలి అని చెప్పండి. మేమేమీ అనం, నువ్వు నిజాలే చెప్పు, అలా చెబితే మేం సంతోషపడతాము అంటూ వివరించండి. తను నిజం చెప్పినప్పుడు బాగా మెచ్చుకోండి. వీలైతే ఓ చిన్న గిఫ్ట్ ఇవ్వండి. అలాగే అబద్ధం చెప్పినప్పుడు చిన్న చిన్న పనిష్మెంట్స్ ఇవ్వండి. అలా చేయడం వల్ల తనకు మంచికుండే విలువ, చెడు వల్ల కలిగే ఫలితం అన్నీ స్పష్టంగా అర్థమవుతాయి. మీరు ఎన్ని చేసినా కూడా పాప మారకపోతే మాత్రం వెంటనే కౌన్సెలర్ దగ్గరకు తీసుకెళ్లండి. వాళ్లు తమదైన పద్ధతిలో పాప అలవాటును తప్పకుండా మార్చగలుగుతారు. * మా బాబు ఆరో తరగతి చదువుతున్నాడు. టీవీ విపరీతంగా చూస్తాడు. అయితే చదువులో, ఆటల్లో అన్నిట్లో ఫస్ట్ వస్తాడు. అందుకే ఎప్పుడూ ఏమీ అనం. కాకపోతే వాడు చిన్నపిల్లలు చూసేవేమీ చూడడు. డిస్కవరీ, కార్టూన్ చానెల్స్ పెట్టడు. క్రైమ్‌స్టోరీలు, హారర్ స్టోరీలు చూస్తుంటాడు. సినిమాలు చూసినా ఇంగ్లిష్ యాక్షన్ మూవీసే చూస్తాడు. ఇది వాడి మనసు మీద చెడు ప్రభావం చూపిస్తుందేమో నని భయమేస్తోంది. అయినా కానీ ఆ అలవాటు మాన్పించలేకపోతున్నాం. ఏదైనా సలహా చెప్పండి. - శ్రీనివాసరావు, నంద్యాల బాబు బాగా చదవడం సంతోష కరమైన విషయం. కానీ ఎంత బాగా చదివినా టీవీ ఎక్కువసేపు చూడడం మాత్రం మంచిది కాదు. దానివల్ల చాలా నష్టాలున్నాయి. ఫిజికల్ యాక్టివిటీ తగ్గి బరువు పెరుగుతారు. ఇతర పిల్లలతో ఆడడం తగ్గిపోయి, వయసుకు తగిన సోషల్ బిహేవియర్ నేర్చుకోలేరు. ఇంకా పెద్ద క్లాసులకు వెళ్లినప్పుడు చదువుపై కూడా ప్రభావం పడుతుంది. ఎంత మంచి ప్రోగ్రాములైనా సరే, ఒక గంటకు మించి స్క్రీన్ టైమ్ ఇవ్వకండి. అంటే.... టీవీ, ఐప్యాడ్, స్మార్ట్ ఫోన్, వీడియో గేమ్స్ వంటివి ఏవైనా కూడా గంటను మించి చూడనివ్వకండి. అలాగే మీ బాబు పెద్దవాళ్ల ప్రోగ్రాములు చూడటం కూడా మంచిది కాదు. కాబట్టి తను చూడకూడని చానెల్స్ని లాక్ చేసేయండి. ఆ సౌకర్యం టీవీల్లో ఉంటోంది. అన్నిటికంటే ముందు మీరు తను టీవీ చూసే టైమును స్ట్రిక్ట్‌గా తగ్గించేయండి. ఏడ్చినా, అరిచినా, ఎంత గోల చేసినా అందులో మార్పు చేయకండి. తర్వాత సమస్య దానికదే పరిష్కారమవుతుంది. - డా॥పద్మ పాల్వాయ్ చైల్డ్ - అడల్ట్ సైకియాట్రిస్ట్, రెయిన్బో హాస్పిటల్, హైదరాబాద్ -
చనిపోతానని బెదిరిస్తున్నాడు... ఎలా?
కిడ్స మైండ్‌స మా బాబు మూడో తరగతి చదువు తున్నాడు. చాలా తెలివైనవాడు. కాకపోతే చాలా తిక్క. చిన్న మాట అంటే చాలు... ఉక్రోషం వచ్చేస్తుంది. ఓ మూలకు పోయి ఏడుస్తుంటాడు. ఎంత బతిమాలినా ఆపడు. దగ్గరకు రాడు. మాట్లాడడు. తినమంటే తినడు. గంటల పాటు అలాగే బిగుసుకుపోతాడు. మళ్లీ తనంతట తను రావాలే తప్ప, మేం ఏం చేసినా మామూలవడు. ఈ పద్ధతి ఎలా మార్చాలో చెప్పండి ప్లీజ్. - సునంద, రైల్వే కోడూరు బాబు అలిగినప్పుడు బతిమాలడం బాగా అలవాటయినట్టుగా ఉంది. మీరు డిసిప్లిన్ నేర్పుతున్నప్పుడు తనకి ఇంత ఉక్రోషం రావడం మంచిది కాదు. ఇకపై కొన్నాళ్లు బతిమాలడం మానెయ్యండి. తను అలిగినప్పుడు ఇక చాలు రమ్మని పిలవండి. రాకపోతే మళ్లీ పిలవం అని కూడా చెప్పండి. అయినా తను అలానే ఉంటే... ఎవరూ తనని లక్ష్యపెట్టకుండా మీ పని మీరు చేసుకోండి. మొదట్లో మీరలా చేయడం చూసి ఇంకా ఎక్కువ అలగొచ్చు. ఎక్కువ బిగుసుకుపోవచ్చు. అయినా మీరు కంగారు పడకుండా అలాగే వదిలెయ్యండి. కొన్ని రోజులకు తనలో తప్పక మార్పు వస్తుంది. అలిగినా అటెన్షన్ దొరకదని అర్థమై నెమ్మదిగా మానేస్తాడు. ఇలా జరగడానికి ఒకట్రెండు నెలలు పట్టవచ్చు. కానీ మీరు ఓపిగ్గా ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది. మా పాప వయసు నాలుగేళ్లు. విపరీతమైన అల్లరి చేస్తోంది. ఆ వయసులో అల్లరి మామూలే కానీ తను చేసే పనులు మరీ ఇబ్బందికరంగా ఉంటున్నాయి. లేని పోని ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న కుర్చీ ఎక్కి, టేబుల్ మీద ఉన్న వంటకాల్లో అవీ ఇవీ కలిపేస్తుంది. కిందకి ఉన్న స్విచ్‌బోర్డుల దగ్గరకు వెళ్లి, ప్లగ్ హోల్స్‌లో వేళ్లు పెడుతుంది. మొన్న బొమ్మలో ఉండే చిన్న బ్యాటరీలు మింగేసింది. ఇంకోసారి మా అత్తయ్యగారి బీపీ ట్యాబ్లెట్ మింగేసింది. ఎంత జాగ్రత్తగా చూసినా ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. తనని ఎలా అదుపు చేయాలి? - కృష్ణజ్యోతి, రామచంద్రపురం పాప బాగా హైపర్ యాక్టివ్‌గా ఉంది. ముందు ఇంటిని చైల్డ్ ప్రూఫ్ చెయ్యడానికి ప్రయత్నించండి. ప్లగ్స్కి కవర్స్ దొరకుతాయి. వాటితో మూసేయండి. మందులు తనకు అందనత్త ఎత్తులో పెట్టండి. వీలైతే అల్మరాలో పెట్టి తాళం వేసేయండి. కత్తులు, చాకులు లాంటి పదునైన వస్తువుల్ని కూడా పైన ఎక్కడైనా పెట్టుకోండి. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి పిల్లలు వాటిని చేజిక్కించు కుంటారు. కాబట్టి తన మీద ఓ కన్నేసి ఉంచడం మంచిది. మరీ ఇబ్బందిగా, భయంగా ఉంటే... చైల్డ్ సైకియాట్రిస్తు దగ్గరకు తీసుకెళ్లండి. వాళ్లు కౌన్సెలింగ్ ఇస్తారు. తద్వారా తన యాక్టివిటీ నిదానంగా తగ్గుతుంది. అప్పటికీ తగ్గకపోతే కనుక, తనకి అటెన్షన్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ ఉందేమో పరీక్షించాల్సి ఉంటుంది. మా బాబు ఏడో తరగతి చదువుతున్నాడు. ఇంతకు ముందు చక్కగా చదివేవాడు. కానీ ఈమధ్య సరిగ్గా చదవడం లేదు. ఏమైనా అంటే ఇంట్లోంచి వెళ్లిపోతాను, చచ్చిపోతాను అని బెదిరిస్తున్నాడు. దాంతో చిన్నమాట అనాలన్నా భయమేస్తోంది. కూర్చోబెట్టి చాలాసార్లు కూల్‌గా మాట్లాడి చూశాను. అప్పుడు నువ్వు చెప్పినట్టే వింటానమ్మా అన్నాడు. కానీ మళ్లీ మామూలే. ఇంత చిన్న వయసులో బెదిరించాలన్న ఆలోచన వచ్చిందంటే, నిజంగానే ఏమైనా చేసుకుంటాడేమోనన్న భయం పీడిస్తోంది. ఇప్పుడు నేనేం చేయాలి? - మురళీశర్మ, బెంగళూరు పిల్లలు చదవలేదని కంగారు పడిపోతాం తప్ప దానికి కారణం ఏమిటో చాలాసార్లు ఆలోచించం. ఎప్పుడూ చదివే వాడు ఇప్పుడు సడెన్‌గా మానేశాడంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. స్కూల్లో టీచర్స్‌తో కానీ, ఫ్రెండ్స్‌తో కానీ ఏదైనా ఇబ్బంది ఉండవచ్చు. ఏదైనా ఒత్తిడి ఉండవచ్చు. లేదంటే క్లాస్ పెరిగింది కాబట్టి పాఠాలు కష్టంగా అనిపిస్తూ ఉండవచ్చు. కారణం తెలుసుకోకుండా ఫోర్స్ చేస్తే పిల్లలు మరింత ఒత్తిడికి లోనవుతారు. కాబట్టి ముందు కారణం తెలుసుకునే ప్రయత్నం చేయండి. తన సమస్యను తీరిస్తే బాగా చదువుకో గలుగుతాడు. ఇక బెదిరించడం గురించి. నిజంగా చనిపోవాలని ఉందా లేకపోతే కోపంలో తెలియకుండా ఆ మాట అనేస్తున్నావా అని ఓసారి తనని అడగండి. ఏం చెబుతాడో చూడండి. జవాబు ఏదైనా కూడా ఓసారి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే, తనలో సూసైడల్ టెండెన్సీ ఏమైనా ఉందేమో చూసి, అవసరమైతే కౌన్సెలింగ్ ఇస్తారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే తీసుకెళ్లండి. -
ఎక్కువ మాట్లాడడు... ఏదైనా సమస్యా?
కిడ్స్ మైండ్స్ మా బాబు రెండో తరగతి చదువుతున్నాడు. తెలివైనవాడే. కానీ ఎక్కువ మాట్లాడడు. అల్లరి కూడా చేయడు. ఈ రోజుల్లో తన వయసు పిల్లలు ఎలా ఉంటున్నారు! వాళ్లతో పోలిస్తే వీడు డల్‌గా ఉన్నాడేమిటా అనిపిస్తుంది. మా బాబుకి ఏదైనా సమస్య ఉందేమో అని కూడా అనిపిస్తోంది. నా అనుమానం నిజమేనా? - రాఘవ, భీమడోలు బాబు బాగా చదువుతాడంటున్నారు కదా! కొంచెం తక్కువ మాట్లాడినా ఫర్వా లేదు. కొంతమందికి ఎక్కువగా మాట్లా డని తత్వం ఉంటుంది. అదేం సమస్య కాదు. తక్కువ మాట్లాడినా, మిగతా పిల్లలతో స్నేహితులతో ఆడుకుంటూంటే ఫర్వాలేదు. అలా లేకపోతే మాత్రం మీరు తనపై కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టండి. అందరి తోనూ కలవాలంటూ ఎంకరేజ్ చేయండి. సాయంత్రం ఆడుకోవడానికి ఇతర పిల్లల దగ్గరకు పంపించండి. ఫంక్షన్స్‌కి తీసుకెళ్తూ ఉండండి. ఎప్పుడూ మీతోనే ఉంచుకో కుండా అప్పుడప్పుడూ మిగతావాళ్ల దగ్గర కాసేపు వదిలిపెడుతూ ఉంటే, అందరి తోనూ కలిసిపోవడం అలవాటవుతుంది. మా పాపకి పద్నాలుగేళ్లు. కానీ తన ప్రవర్తన మాత్రం పెద్దవాళ్లలా ఉంటుంది. చాలా మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేస్తుంది. నువ్వు చిన్న పిల్లవి కదమ్మా అంటే తనకి కోపమొచ్చేస్తుంది. నేనేం చిన్నపిల్లను కాదు, నాకు అన్నీ తెలుసు అంటుంది. పైగా ప్రతి విషయం గురించీ తర్కిస్తుంది. తనిలా పెద్దదానిలా ఫీలవడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి సమస్యలొస్తాయో అని భయం వేస్తోంది. నేనేం చేయాలి? - సుష్మ, మచిలీపట్నం పాప పెద్దవాళ్లలాగా బాధ్యతగా ఉంటే ఇబ్బందేమీ లేదు. కానీ తన వయసుకు మించి తర్కించినా, పెద్దవాళ్ల విషయాల్లో కల్పించుకుంటున్నా మాత్రం మంచిది కాదు. అలా చేసినప్పుడు మెల్లగా వారించండి. పిల్లలు కల్పించుకోకూడని విషయాలు ఉంటాయని నచ్చజెప్పండి. తనకి కోపం వచ్చినా చెప్పడం మానకండి. అలాగే తన వయసుకు తగ్గట్టుగా తను మెచ్యూర్డ్‌గా ఆలోచించి, రెస్పాన్సిబుల్‌గా ఉనప్పుడు తప్పక అప్రిషియేట్ చేయండి. పిల్లలు బాధ్యతగా ఉండటం మంచిదే. కాబట్టి కోప్పడకుండా తన పరిధి ఏంటో నెమ్మదిగా తనకు తెలియజేస్తే, మెచ్యూర్డ్‌గా ఆలోచించే పిల్ల కాబట్టి తనే అర్థం చేసుకుంటుంది. మా బాబుకి అయిదేళ్లు. వాడితో ఓ విచిత్రమైన సమస్య ఎదురవుతోంది నాకు. యూరిన్‌కి గానీ, మోషన్‌కి గానీ బాత్రూమ్కి వెళ్లడం ఇష్టముండదు వాడికి. బయటకు తీసుకెళ్లాలి. బాత్రూమ్కి తీసుకెళ్తే ఏడ్చేస్తాడు. వాడికి మూడో యేడు వచ్చినప్పట్నుంచీ ప్రయత్నిస్తున్నా నావల్ల కావడం లేదు. పరిష్కారం చెప్పండి. - మాళవిక, గండిపాలెం, నెల్లూరు జిల్లా తనకి అవసరమైనప్పుడే కాకుండా, ఏదో ఒక పని చెప్పి బాబుని బాత్రూమ్ లోకి పంపిస్తుండండి. మగ్ తెమ్మనో, మరే దైనా అక్కడ పెట్టి రమ్మనో... ఏదో ఒకటి చెప్పి పంపండి. తను ఆ పని చేసినప్పుడు మెచ్చుకోండి. దాంతో తనకి బాత్రూమ్ అంటే ఉన్న భయం, అయిష్టత పోతాయి. తర్వాత మెల్లగా తను బాత్రూమ్కి వెళ్లాల్సి వచ్చినప్పుడు తీసుకెళ్లడం మొదలెట్టండి. ఏడ్చినా పట్టించుకోకండి. తద్వారా మెల్లగా అలవాటు పడతాడు. ఏడుస్తు న్నాడు కదా అని బయటకు తీసుకెళ్తూనే ఉంటే ఆ అలవాటు ఎప్పటికీ పోదు. ఒకవేళ మీరు డీల్ చేయలేకపోతే కౌన్సెలర్ దగ్గరకు తీసుకెళ్లండి. వాళ్లే తనను ప్రిపేర్ చేస్తారు. మా అబ్బాయి నాలుగో తరగతి చదువుతున్నాడు. చాలా బాగా చదువు తాడని, క్రమశిక్షణతో ఉంటాడని వాళ్ల టీచర్లు కూడా చెబుతుంటారు. అయితే ఈ మధ్య నాకు వాడి ప్రవర్తనలో మార్పు కనిపిస్తోంది. వాళ్ల నాన్న జేబులోంచి అడక్కుండా డబ్బులు తీసుకున్నాడు. అది నేను చూశాను. మావారికి చెబితే, పోనీలే ఏదో అవసరం అయ్యుంటుంది అన్నారు. దాంతో వదిలేశాను. ఈ మధ్య నా పర్సులోంచి కూడా డబ్బులు తీసుకోవడం గమనించాను. అడుగుతానంటే మావారు ఒప్పుకోవడం లేదు. మన పిల్లాడే కదా, తప్పేముంది, పిల్లలకి ఆ మాత్రం ఫ్రీడమ్ ఉండాలి అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ ఈ అలవాటు మంచిది కాదని నా మనసు చెబుతోంది. ఈ అలవాటు వాణ్ని ఎలా తయారు చేస్తుందోనని భయం వేస్తోంది. ఏం చేయాలో చెప్పండి. - రాజ్యలక్ష్మి, తాటిపూడి తల్లిదండ్రుల్ని అడక్కుండా పిల్లలు డబ్బు తీయడం తప్పు. వాళ్లకు ఫ్రీడమ్ ఇవ్వాలి. కానీ ఆ వయసు వాళ్లకు మంచికీ చెడుకూ తేడా తెలియదు. వాళ్లు చేస్తోంది మంచా చెడా అన్నది గమనించి, తప్పులు సరిదిద్దడం తల్లిదండ్రుల బాధ్యత. డబ్బులు ఎందుకు తీశావని బాబును అడ గండి. కొట్టాల్సిన, తిట్టాల్సిన అవసరం లేదు. చెప్పకుండా డబ్బులు తీయడం తప్పని కూల్‌గానే చెప్పండి. మీరు, మీ వారు అనునయంగా చెబితే తప్పకుండా ఫలితం ఉంటుంది. ఒక్కసారి చేసినప్పుడు ఏ తప్పునైనా దిద్దడం సులభం. అలా దిద్దకుండా వదిలేస్తే వాళ్లు పదే పదే ఆ తప్పు చేస్తారు. దానికి అలవాటు పడి పోతారు. ఆ స్థితికి చేరుకున్నాక వాళ్లను మార్చడం అంత తేలిక కాదు. కాబట్టి బాబును ఇప్పుడే మార్చండి. - డా.పద్మ పాల్వాయ్ చైల్డ్ - అడల్ట్ సైకియాట్రిస్ట్, రెయిన్బో హాస్పిటల్, హైదరాబాద్ -
అరిచి గోల చేస్తోంది... ఆపేదెలా?
కిడ్స్ మైండ్స్ మా బాబు మూడో తరగతి చదువుతున్నాడు. తను అస్సలు కుదురుగా ఉండడు. ఎప్పుడూ పరుగులు తీస్తూ, గెంతుతూ ఉంటాడు. అవీ ఇవీ ఎక్కి దూకుతుంటాడు. చదువు మీద కాన్సన్ట్రేట్ చేయడు. స్కూల్లో కూడా పక్కనున్న పిల్లలతో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడని, తాము చెప్పేది వినడని టీచర్లు కంప్లయింట్ చేస్తున్నారు. వాణ్ని ఎలా దారిలో పెట్టాలో తెలియడం లేదు. సలహా ఇవ్వండి. - కావ్య, రఘునాథపల్లి కొంతమంది పిల్లలు అంతే. నిలకడగా కూర్చోరు. కాన్సన్ట్రేట్ చేయరు. ఇది కావాలని చేసేది కాదు. వాళ్లు నిజంగానే అలా ఉండలేరు, చేయలేరు. మీ అబ్బాయి మరీ ఎక్కువ అల్లరి చేస్తున్నాడంటే, తనకి అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ ఉందని నా అనుమానం. ఇది ఉన్నవాళ్లు ఉండాల్సిన దానికన్నా ఎక్కువ యాక్టివ్‌గా ఉంటారు. దేనిమీదా శ్రద్ధ పెట్టలేరు. ఓసారి బాబుని చైల్డ్ సైకాలజిస్టుకు చూపించండి. తనకి ఆ సమస్య ఉంటే బిహేవియరల్ థెరపీ చేస్తారు. అవసరమైతే మందులు కూడా సూచిస్తారు. మా పాప వయసు మూడేళ్లు. తను ఏదడిగితే అది ఇచ్చేయాలి. లేకపోతే గట్టిగా అరుస్తుంది. లేదంటే దొర్లి దొర్లి ఏడుస్తుంది. ఒక్కోసారి తిరగబడి కొడుతుంది కూడా. దాంతో అడిగిందల్లా ఇవ్వాల్సి వస్తోంది. స్కూల్లో టీచర్లు చెప్పింది చక్కగా వింటుందట. ఇంట్లోనే ఇలా. ఈ ప్రవర్తనని ఎలా మార్చాలి? - భవాని, విజయవాడ పిల్లలన్నాక ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. తల్లిదండ్రులు అవసరమైనవి ఇవ్వడం, అవసరం లేనివి ఇవ్వకుండా ఉండటం జరుగుతుంది. మంకుపట్టు పడితే మాత్రం ఒక్కోసారి బాధ కలిగో, విసుగొచ్చో ఇచ్చేస్తూ ఉంటారు. కానీ ప్రతిసారీ ఇలానే చేస్తూ ఉంటే వాళ్లకదే అలవాటైపోతుంది. ఏడిస్తే ఇచ్చేస్తారు కదా అని ప్రతిసారీ ఏడుస్తూంటారు. మీ అమ్మాయి విషయంలో అదే జరుగుతోంది. కాబట్టి తను అడిగింది ఇవ్వదగినది కాకపోతే కుదరదని కచ్చితంగా చెప్పండి. ఏడ్చినా చూడనట్టే ఉండండి. మొదట్లో గొడవ చేసినా మెల్లగా తనకు మీ ఉద్దేశం తెలుస్తుంది. ఎంత ఏడ్చినా మీరిక ఇవ్వరు అని అర్థమై, మెల్లగా ఏడ్చే అలవాటు పోతుంది. అయితే ఇది ఏ ఒక్కరో కాదు, ఇంట్లో పెద్దలందరూ చేయాలి. ఒకళ్లు పాటించి మరొకళ్లు పాటించకపోతే మీ పాపను మార్చడం కష్టం. మా బాబు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అదేమిటో, ఆరు నెలల నుంచి వాడికి శుభ్రం మరీ ఎక్కువైపోయింది. స్నానం గంటసేపు చేస్తున్నాడు. స్కూలుకు లేటయిపోతున్నా తెమల్చడు. చేతులు కూడా అస్తమానం కడుగుతూంటాడు. దాంతో చేతుల చర్మం పగిలిపోయింది కూడా. ఎందుకలా చేస్తున్నావంటే వాడికి కోపం వచ్చేస్తోంది. ఎందుకిలా? - రవి యాదవ్, భువనగిరి మీ బాబు అబ్సెసివ్ కంపల్సివ్ డిజా ర్డర్ బారిన పడ్డాడని అనిపిస్తోంది. ఇది ఉన్న పిల్లలు అతి శుభ్రతను పాటించడం, చేసిన పనినే మళ్లీ మళ్లీ చేయడం చేస్తారు. అలా చేయకుండా చేయకుండా ఉండాల్సిన పరిస్థితి వస్తే యాంగ్జయిటీ ఫీలవుతారు. టెన్షన్ పడిపోతారు. అందుకే మీరు వద్దని చెప్పినా మీ బాబు అలా చేయకుండా ఉండలేకపో తున్నాడు. తనను వెంటనే సైకియాట్రిస్టు దగ్గరకు తీసుకెళ్లండి. నిజంగానే ఈ డిజార్డర్ ఉంటే కనుక ఎక్స్పోజర్ రెస్పాన్స్ ప్రివెన్షన్ థెరపీ చేస్తారు. ఇది మంచి ఫలితాలనిస్తుంది. మా బాబు స్కూలుకు బాగానే వెళ్లేవాడు. కానీ ఈ మధ్య మాట్లాడితే కడుపునొప్పి అని తరచూ స్కూలు ఎగ్గొట్టేస్తున్నాడు. చాలామంది డాక్టర్లకు చూపించాం. ఏ సమస్యా లేదన్నారు. దాంతో స్కూలు ఎగ్గొట్టడానికి సాకు చెబుతున్నాడని అనిపిస్తోంది. నేనేం చేయాలి? - వసుంధర, కాకినాడ ఒక్కోసారి పిల్లలకు భయం వల్ల కానీ, బాధ వల్ల కానీ కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. పెద్దవాళ్లకు ఒత్తిడి ఎక్కువైతే తలనొప్పి వచ్చినట్టు, పిల్లలకూ అలాంటి శారీరక బాధలు కలుగుతాయన్నమాట. మీ అబ్బాయికి స్కూల్లో ఏదైనా ఇబ్బంది ఉందేమో, దేనివల్లనయినా ఒత్తిడికి లోనవుతున్నాడేమో అడిగి తెలుసుకోండి. తన టీచర్లు, స్నేహితులతో కూడా మాట్లాడండి. ఏదైనా ఇబ్బంది ఉంటే అది తొలగించండి. అప్పటికీ తను వెళ్లడానికి ఇష్టపడకపోతే, మెల్లగా స్కూలుని అలవాటు చేయండి. ఓ గంటసేపు స్కూల్లో ఉండి వచ్చేస్తే చాలని నచ్చజెప్పి పంపించండి. కొన్ని రోజులు అలా వెళ్లాక రెండు గంటలు అని చెప్పండి. అలా కొద్దికొద్దిగా సమయం పెంచుతూ పోతే, ఈలోపు బాబు భయం తగ్గుతుంది. కావాలంటే స్కూలువారి సాయం తీసుకోండి. మరీ అవసరమనుకుంటే కౌన్సెలర్ సలహా కూడా తీసుకోండి. డా॥పద్మ పాల్వాయ్ చైల్డ్ - అడల్ట్ సైకియాట్రిస్ట్, రెయిన్బో హాస్పిటల్,హైదరాబాద్