తిరగేసి రాస్తున్నాడు... డిస్‌లెక్సియానా?
కిడ్స్ మైండ్స్
మా పాప ఎనిమిదో తరగతి చదువుతోంది. తెలివైనపిల్లే. కానీ చాలా కంగారు పడుతూ ఉంటుంది. పరీక్షలంటే టెన్షన్... సరిగ్గా రాయగలనో లేదో అని. రాసి వచ్చాక సరిగ్గా రాశానో లేదో అని కంగారు పడుతుంది. ప్రతిరోజూ తను చేసిన హోమ్‌వర్క్ కరెక్ట్‌గా ఉందో లేదో, టీచర్ ఏమంటుందో అని భయపడుతుంది. సైకిల్ నేర్చుకొమ్మంటే పడిపోతానేమో అంటుంది. ఇలా ప్రతిదానికీ భయపడుతూ, కంగారు పడిపోతూ ఉంటుంది. తనకి ధైర్యమెలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఇదేమైనా మానసిక సమస్యా? దీనికి పరిష్కారమేమిటి?
- ఆర్.ప్రశాంతి, ఖమ్మం
పాప కొంచెం నెర్వస్‌గా ఉన్నట్టుంది. సాధారణంగా భయం అన్నది మనం ఆ పని ఎక్కువగా చేస్తూ ఉంటే తగ్గుతుంది. ఉదాహరణకి తను సైకిల్ ఎక్కడానికి భయపడుతుంటే, కష్టమయినా సరే కాస్త బలవంతం చేసి ఎక్కించండి. అలా పదే పదే చేయడం వల్ల సైకిల్ అంటే ఉన్న భయం పోతుంది. హోమ్‌వర్క్ తప్పేమో, టీచర్ ఏమైనా అంటుందేమో అన్న భయాలను తను వ్యక్తం చేసినప్పుడు... నిజంగా తను తప్పు చేసినా, పర్యవసానం తను అనుకున్నంత భయంకరంగా ఉండదని సర్దిచెప్పండి. మీరు మాత్రం తను భయపడుతోంది కదా అని తనను ఎక్కువగా ప్రొటెక్ట్ చేయకండి. దానివల్ల భయం ఇంకా ఎక్కువవుతుంది. తనలో మార్పు రావడానికి సమయం పడుతుంది. ఒకవేళ మీరు నేను చెప్పినట్టు చేసినా తనలో మార్పు రాకపోతే ఓ మంచి కౌన్సెలర్ దగ్గరకు తీసుకెళ్లండి. కౌన్సెలింగ్‌తో కూడా తగ్గకపోతే ఈ సమస్యకి కొన్ని మందులు ఉన్నాయి. చైల్డ్ సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్తే, పాపని పరీక్షించి వాటిని సూచిస్తారు.
మా బాబు మూడో తరగతి చదువు తున్నాడు. వాడికి చిన్నప్పట్నుంచీ ఓ విచిత్రమైన అలవాటు ఉంది. అక్షరాలు తిరగేసి రాస్తాడు. పుస్తకం చేతికిస్తే వెనుక పేజీ నుంచి చదవడం మొదలెడతాడు. అలా కాదు ఇలా అంటే సరి చేసుకుంటాడు. కానీ మళ్లీ మామూలే. అయితే వాడు ఎప్పుడూ ఇలానే చేయడం లేదు. మామూలుగా రాస్తూ రాస్తూ మధ్యలో ఉన్నట్టుండి తిరగేసి రాస్తాడు. ఇది కొంపదీసి డిస్‌లెక్సియా లక్షణం కాదు కదా?
- వేణుమాధవ్, సంగారెడ్డి
ఇలాంటి పనులు పిల్లలు చిన్నప్పుడే చేస్తుంటారు. ఏడు సంవత్సరాలు దాటిన తర్వాత ఇలా అక్షరాలు తిరగేసి రాయడం అనేది అరుదు. కాబట్టి బాబును వెంటనే ఓ సైకియాట్రిస్టుకు చూపించండి. వారు తనని పరీక్షిస్తారు. ఏదైనా లెర్నింగ్ డిఫికల్టీ కనుక ఉంటే ఈ వయసులోనే గుర్తించడం మంచిది. ఇది మీరు అనుమానపడినట్టు డిస్‌లెక్సియా అవడానికి కూడా అవకాశం ఉంది. అయితే నిర్ధారించడానికి బాబుని పరీక్షించడం అవసరం. కాబట్టి ఆలస్యం చేయకుండా బాబుని సైకియాట్రిస్టు దగ్గరకు తీసుకెళ్లండి.
మాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్దోడు పదో తరగతి చదువుతున్నాడు. రెండోవాడు ఆరో తరగతి. పెద్దవాడు చాలా సెలైంట్. కానీ చిన్నవాడు మహా తుంటరి. అల్లరి వరకూ ఫర్వాలేదు కానీ వాడితో ఓ పెద్ద సమస్య వచ్చిపడింది. ప్రతిదానికీ వాళ్ల అన్నతో పోటీపడతాడు. వాడు పదో తరగతి కదా అని కాస్త ఎక్కువ శ్రద్ధ చూపిస్తాం. అది వీడికి నచ్చదు. తననే బాగా చూస్తున్నామంటాడు. వాడికేదైనా కొంటే వీడికీ కొనాలి. పైగా అలాంటిదే కొనాలి. లేదంటే గొడవ చేసేస్తాడు. అన్నయ్యకి అవసరం కదా, నీకు అవసరమైనప్పుడు నీకూ కొంటాం అంటే వినడు. ఈ నైజం వాడికి అన్న మీద ద్వేషం పెంచుతుందేమోనని భయంగా ఉంది. ఈ పరిస్థితిని ఎలా డీల్ చేయాలి?
- ఎమ్.రాజ్యలక్ష్మి, శ్రీకాకుళం
మీరు కేవలం పెద్ద బాబు చదువు మీద ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారా లేక అప్రయత్నంగా తనను ఎక్కువ గారాబం చేస్తున్నారా అనేది ఒక్కసారి పరిశీలించుకోండి. అటువంటిదేమీ లేకపోతే... వీలయినంతవరకూ చిన్న బాబుతో రోజూ కాసేపు గడపడానికి సమయం కేటాయించండి. తనతో కబుర్లు చెప్పడం, కలిసి ఆడటం వంటివి చేయండి. దానివల్ల తనని మీరు పట్టించుకోవడం లేదు, నిర్లక్ష్యం చేస్తున్నారు అన్న ఆలోచనలు తనలో ఉంటే పోతాయి. అలాగే తను కోరేవి న్యాయమైన కోరికలే అయితే... పెద్ద బాబుతో సమానంగా తీర్చండి. లేదు, అవి తీర్చాల్సినవి కావు అనుకుంటే తను ఎంత గొడవ చేసినా పట్టించుకోకండి. రెస్పాండ్ కాకపోతే అడిగి అడిగి తనే ఊరుకుంటాడు. లేదూ గొడవ చేస్తుంటే, కూర్చోబెట్టి మాట్లాడండి. మీరు ఎందుకు తనకి అది ఇవ్వడం లేదు అనే విషయాన్ని అర్థమయ్యేలా చెప్పండి. లేదా తను ఎవరి మాట అయినా వింటాడు అనుకుంటే వాళ్లతో చెప్పించండి. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు రావడం సహజమే. కొంచెం జాగ్రత్తగా ప్రయత్నిస్తే వీటిని పరిష్కరించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.