చూడకూడనివి చూస్తున్నాడు... ఆపేదెలా?! | how to stop a child's attitude! | Sakshi
Sakshi News home page

చూడకూడనివి చూస్తున్నాడు... ఆపేదెలా?!

Published Sat, Nov 28 2015 11:15 PM | Last Updated on Sun, Sep 3 2017 1:10 PM

చూడకూడనివి చూస్తున్నాడు... ఆపేదెలా?!

చూడకూడనివి చూస్తున్నాడు... ఆపేదెలా?!

కిడ్స్ మైండ్స్
* మా బాబు వయసు ఏడేళ్లు. విపరీతమైన అల్లరి చేస్తున్నాడు. అల్లరంటే అరవడం, పరుగులు తీయడం కాదు. అన్నీ పగులగొట్టేస్తూ ఉంటాడు. ఆట బొమ్మలు, ఇంట్లోని ఇతరత్రా వస్తువులు నేలకేసి కొట్టడం వాడికి చాలా ఇష్టం. అంతవరకూ బానే ఉంటాడు. ఉన్నట్టుండి చేతిలో ఉన్నదాన్ని విసిరి కొడతాడు. తిట్టినా, కొట్టినా వినడం లేదు. ఈ అలవాటు ఎలా పోగొట్టాలి?
 - వాణి, పాలకొల్లు

 
హైపర్ యాక్టివ్‌గా ఉన్న పిల్లలు విపరీతంగా అల్లరి చేస్తుంటారు. ఒక్క దగ్గర కూర్చోరు. పరుగులు తీస్తూనే ఉంటారు. అలాంటి పిల్లలు ఇలా చేసే అవకాశాలు ఎక్కువ. కాకపోతే బాబు మరే విధమైన అల్లరీ చేయకుండా కేవలం విసిరి కొట్టడం మాత్రమే చేస్తున్నాడు. బహుశా ఇలా చేయడాన్ని తను ఎక్కడైనా చూసి ఉండవచ్చు. లేదంటే తను అలా ఒకట్రెండుసార్లు చేసినప్పుడు అటెన్షన్ దొరకడం వల్ల అది తనకు అలవాటైపోయి ఉండవచ్చు.

దీన్ని మాన్పించాలంటే మీరొక పని చేయండి. దేనినైనా పగులగొడితే ‘టైమ్ అవుట్’ ఇస్తానని క్లియర్‌గా చెప్పండి. ‘టైమ్ అవుట్’ అంటే... తప్పు చేసినప్పుడు తనని తీసుకెళ్లి ఓ మూలన కూర్చోబెట్టి, అక్కడి నుంచి లేస్తే ఆ రోజు టీవీ చూడనివ్వననో ఆడుకోనివ్వననో చెప్పడం. వినడానికి ఇది చాలా సింపుల్‌గా అనిపిస్తుంది కానీ చాలా మంచి ఫలితాలనిస్తుంది. మొదట్లో బాబు లైట్‌గా తీసుకున్నా, నాలుగైదుసార్లు అలా చేసేసరికి తాను ఏం మిస్ అవుతున్నాడో అర్థమవుతుంది.

అలాగే మీరు ఇలా చేయడం ఎంత ముఖ్యమో... బాబు బుద్ధిగా ఉన్నప్పుడు మెచ్చుకోవడమూ అంతే ముఖ్యం. దానివల్ల మంచిగా ఉంటే మెప్పుకోలు వస్తుందన్న విషయం కూడా అర్థమై తనలో మార్పు రావడానికి అవకాశం ఏర్పడుతుంది.
 
* మా పాపకు ఎనిమిదేళ్లు. పెద్దగా అల్లరి చేయదు. బాగా చదువుతుంది కూడా. అయితే ఎందుకో ఈ మధ్య అబద్ధాలు ఆడుతోంది. హోమ్‌వర్క్ చేయకపోయినా చేశానంటుంది. టీచర్ ఏదైనా అన్నా, స్నేహితులతో గొడవ పడినా మాకు చెప్పడం లేదు. విషయం తెలిసి మేము నిలదీసినా ఏదేదో చెప్తోంది తప్ప నిజం చెప్పట్లేదు. పోనీ మేం తిడతామని భయపడుతోందా అంటే... నేను అస్సలు కోప్పడను. మావారు నాకంటే కూల్. అయినా ఎందుకిలా చేస్తోందంటారు?
 - మంజూష, చెన్నై

 
మీది కోప్పడే తత్వం కాకపోయినా ఒక్కో సారి పిల్లలు నిజం చెప్పడానికి భయపడ వచ్చు. కాబట్టి తనను కూర్చోబెట్టి కూల్‌గా మాట్లాడండి. అబద్ధం చెప్పడం తప్పు, నిజమే చెప్పాలి అని చెప్పండి. మేమేమీ అనం, నువ్వు నిజాలే చెప్పు, అలా చెబితే మేం సంతోషపడతాము అంటూ వివరించండి. తను నిజం చెప్పినప్పుడు బాగా మెచ్చుకోండి.

వీలైతే ఓ చిన్న గిఫ్ట్ ఇవ్వండి. అలాగే అబద్ధం చెప్పినప్పుడు చిన్న చిన్న పనిష్‌మెంట్స్ ఇవ్వండి. అలా చేయడం వల్ల తనకు మంచికుండే విలువ, చెడు వల్ల కలిగే ఫలితం అన్నీ స్పష్టంగా అర్థమవుతాయి. మీరు ఎన్ని చేసినా కూడా పాప మారకపోతే మాత్రం వెంటనే కౌన్సెలర్ దగ్గరకు తీసుకెళ్లండి. వాళ్లు తమదైన పద్ధతిలో పాప అలవాటును తప్పకుండా మార్చగలుగుతారు.
 
   
* మా బాబు ఆరో తరగతి చదువుతున్నాడు. టీవీ విపరీతంగా చూస్తాడు. అయితే చదువులో, ఆటల్లో అన్నిట్లో ఫస్ట్ వస్తాడు. అందుకే ఎప్పుడూ ఏమీ అనం. కాకపోతే వాడు చిన్నపిల్లలు చూసేవేమీ చూడడు. డిస్కవరీ, కార్టూన్ చానెల్స్ పెట్టడు. క్రైమ్‌స్టోరీలు, హారర్ స్టోరీలు చూస్తుంటాడు. సినిమాలు చూసినా ఇంగ్లిష్ యాక్షన్ మూవీసే చూస్తాడు. ఇది వాడి మనసు మీద చెడు ప్రభావం చూపిస్తుందేమో నని భయమేస్తోంది. అయినా కానీ ఆ అలవాటు మాన్పించలేకపోతున్నాం. ఏదైనా సలహా చెప్పండి.
 - శ్రీనివాసరావు, నంద్యాల

 
బాబు బాగా చదవడం సంతోష కరమైన విషయం. కానీ ఎంత బాగా చదివినా టీవీ ఎక్కువసేపు చూడడం మాత్రం మంచిది కాదు. దానివల్ల చాలా నష్టాలున్నాయి. ఫిజికల్ యాక్టివిటీ తగ్గి బరువు పెరుగుతారు. ఇతర పిల్లలతో ఆడడం తగ్గిపోయి, వయసుకు తగిన సోషల్ బిహేవియర్ నేర్చుకోలేరు. ఇంకా పెద్ద క్లాసులకు వెళ్లినప్పుడు చదువుపై కూడా ప్రభావం పడుతుంది. ఎంత మంచి ప్రోగ్రాములైనా సరే, ఒక గంటకు మించి స్క్రీన్ టైమ్ ఇవ్వకండి.

అంటే.... టీవీ, ఐప్యాడ్, స్మార్ట్ ఫోన్, వీడియో గేమ్స్ వంటివి ఏవైనా కూడా గంటను మించి చూడనివ్వకండి. అలాగే మీ బాబు పెద్దవాళ్ల ప్రోగ్రాములు చూడటం కూడా మంచిది కాదు. కాబట్టి తను చూడకూడని చానెల్స్‌ని లాక్ చేసేయండి. ఆ సౌకర్యం టీవీల్లో ఉంటోంది. అన్నిటికంటే ముందు మీరు తను టీవీ చూసే టైమును స్ట్రిక్ట్‌గా తగ్గించేయండి. ఏడ్చినా, అరిచినా, ఎంత గోల చేసినా అందులో మార్పు చేయకండి. తర్వాత సమస్య దానికదే పరిష్కారమవుతుంది.                     
 
- డా॥పద్మ పాల్వాయ్
చైల్డ్ - అడల్ట్ సైకియాట్రిస్ట్, రెయిన్‌బో హాస్పిటల్,
హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement