అరిచి గోల చేస్తోంది... ఆపేదెలా?
కిడ్స్ మైండ్స్
మా బాబు మూడో తరగతి చదువుతున్నాడు. తను అస్సలు కుదురుగా ఉండడు. ఎప్పుడూ పరుగులు తీస్తూ, గెంతుతూ ఉంటాడు. అవీ ఇవీ ఎక్కి దూకుతుంటాడు. చదువు మీద కాన్సన్‌ట్రేట్ చేయడు. స్కూల్లో కూడా పక్కనున్న పిల్లలతో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడని, తాము చెప్పేది వినడని టీచర్లు కంప్లయింట్ చేస్తున్నారు. వాణ్ని ఎలా దారిలో పెట్టాలో తెలియడం లేదు. సలహా ఇవ్వండి.
- కావ్య, రఘునాథపల్లి
కొంతమంది పిల్లలు అంతే. నిలకడగా కూర్చోరు. కాన్సన్‌ట్రేట్ చేయరు. ఇది కావాలని చేసేది కాదు. వాళ్లు నిజంగానే అలా ఉండలేరు, చేయలేరు. మీ అబ్బాయి మరీ ఎక్కువ అల్లరి చేస్తున్నాడంటే, తనకి అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ ఉందని నా అనుమానం. ఇది ఉన్నవాళ్లు ఉండాల్సిన దానికన్నా ఎక్కువ యాక్టివ్‌గా ఉంటారు. దేనిమీదా శ్రద్ధ పెట్టలేరు. ఓసారి బాబుని చైల్డ్ సైకాలజిస్టుకు చూపించండి. తనకి ఆ సమస్య ఉంటే బిహేవియరల్ థెరపీ చేస్తారు. అవసరమైతే మందులు కూడా సూచిస్తారు.
మా పాప వయసు మూడేళ్లు. తను ఏదడిగితే అది ఇచ్చేయాలి. లేకపోతే గట్టిగా అరుస్తుంది. లేదంటే దొర్లి దొర్లి ఏడుస్తుంది. ఒక్కోసారి తిరగబడి కొడుతుంది కూడా. దాంతో అడిగిందల్లా ఇవ్వాల్సి వస్తోంది. స్కూల్లో టీచర్లు చెప్పింది చక్కగా వింటుందట. ఇంట్లోనే ఇలా. ఈ ప్రవర్తనని ఎలా మార్చాలి?
- భవాని, విజయవాడ
పిల్లలన్నాక ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. తల్లిదండ్రులు అవసరమైనవి ఇవ్వడం, అవసరం లేనివి ఇవ్వకుండా ఉండటం జరుగుతుంది. మంకుపట్టు పడితే మాత్రం ఒక్కోసారి బాధ కలిగో, విసుగొచ్చో ఇచ్చేస్తూ ఉంటారు. కానీ ప్రతిసారీ ఇలానే చేస్తూ ఉంటే వాళ్లకదే అలవాటైపోతుంది. ఏడిస్తే ఇచ్చేస్తారు కదా అని ప్రతిసారీ ఏడుస్తూంటారు.
మీ అమ్మాయి విషయంలో అదే జరుగుతోంది. కాబట్టి తను అడిగింది ఇవ్వదగినది కాకపోతే కుదరదని కచ్చితంగా చెప్పండి. ఏడ్చినా చూడనట్టే ఉండండి. మొదట్లో గొడవ చేసినా మెల్లగా తనకు మీ ఉద్దేశం తెలుస్తుంది. ఎంత ఏడ్చినా మీరిక ఇవ్వరు అని అర్థమై, మెల్లగా ఏడ్చే అలవాటు పోతుంది. అయితే ఇది ఏ ఒక్కరో కాదు, ఇంట్లో పెద్దలందరూ చేయాలి. ఒకళ్లు పాటించి మరొకళ్లు పాటించకపోతే మీ పాపను మార్చడం కష్టం.
మా బాబు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అదేమిటో, ఆరు నెలల నుంచి వాడికి శుభ్రం మరీ ఎక్కువైపోయింది. స్నానం గంటసేపు చేస్తున్నాడు. స్కూలుకు లేటయిపోతున్నా తెమల్చడు. చేతులు కూడా అస్తమానం కడుగుతూంటాడు. దాంతో చేతుల చర్మం పగిలిపోయింది కూడా. ఎందుకలా చేస్తున్నావంటే వాడికి కోపం వచ్చేస్తోంది. ఎందుకిలా?
- రవి యాదవ్, భువనగిరి
మీ బాబు అబ్సెసివ్ కంపల్సివ్ డిజా ర్డర్ బారిన పడ్డాడని అనిపిస్తోంది. ఇది ఉన్న పిల్లలు అతి శుభ్రతను పాటించడం, చేసిన పనినే మళ్లీ మళ్లీ చేయడం చేస్తారు. అలా చేయకుండా చేయకుండా ఉండాల్సిన పరిస్థితి వస్తే యాంగ్జయిటీ ఫీలవుతారు. టెన్షన్ పడిపోతారు. అందుకే మీరు వద్దని చెప్పినా మీ బాబు అలా చేయకుండా ఉండలేకపో తున్నాడు. తనను వెంటనే సైకియాట్రిస్టు దగ్గరకు తీసుకెళ్లండి. నిజంగానే ఈ డిజార్డర్ ఉంటే కనుక ఎక్స్‌పోజర్ రెస్పాన్స్ ప్రివెన్షన్ థెరపీ చేస్తారు. ఇది మంచి ఫలితాలనిస్తుంది.
మా బాబు స్కూలుకు బాగానే వెళ్లేవాడు. కానీ ఈ మధ్య మాట్లాడితే కడుపునొప్పి అని తరచూ స్కూలు ఎగ్గొట్టేస్తున్నాడు. చాలామంది డాక్టర్లకు చూపించాం. ఏ సమస్యా లేదన్నారు. దాంతో స్కూలు ఎగ్గొట్టడానికి సాకు చెబుతున్నాడని అనిపిస్తోంది. నేనేం చేయాలి?
- వసుంధర, కాకినాడ
ఒక్కోసారి పిల్లలకు భయం వల్ల కానీ, బాధ వల్ల కానీ కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. పెద్దవాళ్లకు ఒత్తిడి ఎక్కువైతే తలనొప్పి వచ్చినట్టు, పిల్లలకూ అలాంటి శారీరక బాధలు కలుగుతాయన్నమాట. మీ అబ్బాయికి స్కూల్లో ఏదైనా ఇబ్బంది ఉందేమో, దేనివల్లనయినా ఒత్తిడికి లోనవుతున్నాడేమో అడిగి తెలుసుకోండి. తన టీచర్లు, స్నేహితులతో కూడా మాట్లాడండి. ఏదైనా ఇబ్బంది ఉంటే అది తొలగించండి. అప్పటికీ తను వెళ్లడానికి ఇష్టపడకపోతే, మెల్లగా స్కూలుని అలవాటు చేయండి.
ఓ గంటసేపు స్కూల్లో ఉండి వచ్చేస్తే చాలని నచ్చజెప్పి పంపించండి. కొన్ని రోజులు అలా వెళ్లాక రెండు గంటలు అని చెప్పండి. అలా కొద్దికొద్దిగా సమయం పెంచుతూ పోతే, ఈలోపు బాబు భయం తగ్గుతుంది. కావాలంటే స్కూలువారి సాయం తీసుకోండి. మరీ అవసరమనుకుంటే కౌన్సెలర్ సలహా కూడా తీసుకోండి.
డా॥పద్మ పాల్వాయ్
చైల్డ్ - అడల్ట్ సైకియాట్రిస్ట్, రెయిన్‌బో హాస్పిటల్,హైదరాబాద్