Rainbow hospital
-
ప్రభుత్వ ఆసుపత్రులకు రెయిన్బో సాయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.1.2 కోట్ల విలువైన అత్యాధునిక పరికరాలను రెయిన్బో ఆసుపత్రి విరాళంగా అందజేసింది. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని ఆపరేషన్ థియేటర్లలో ఎయిర్ పెట్రి శాంప్లింగ్ సిస్టమ్‌లను అమర్చేందుకు సహకారం అందించిన రెయిన్‌బోను అభినందించారు. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ కె.రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ..మొత్తం ఇన్ఫెక్షన్లలో మూడోవంతు పోస్ట్–ఆపరేటి వ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నట్లు అధ్యయనాలు రుజువు చేశాయని తెలిపారు. ఈ ఎయిర్ పెట్రీ శాంప్లర్ల ద్వారా గాలిలో బ్యాక్టీరియా ఫంగస్ 13 రెట్లు తగ్గించొచ్చన్నారు. పరికరాలను హోంశాఖ మంత్రి మహమూద్ అలీకి అందజేసిన అనంతరం.. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ చైర్మన్, ఎండీ డాక్టర్ రమేశ్ కంచర్ల మాట్లాడుతూ.. కార్పొరేట్ సామాజిక బాధ్యత లో భాగంగా ఈ విరాళం అందించామన్నారు. -
అరుదైన శస్త్ర చికిత్స.. ప్రసవం జరుగుతుండగా శిశువుకు సర్జరీ.. 11 నిమిషాల్లోనే
సాక్షి, హైదరాబాద్: నగరంలోని రెయిన్బో ఆస్పత్రి వైద్యులు తొలిసారిగా అరుదైన శస్త్ర చికిత్స చేశారు. తల్లి గర్భంలో ఉండగానే శిశువుకు ఏర్పడిన కణితిని ప్రసవ సమయంలోనే తొలగించారు. బంజారాహిల్స్‌లోని రెయిన్బో ఆస్పత్రిలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలను వెల్లడించారు. వరంగల్‌కు చెందిన ఓ మహిళ పలుమార్లు గర్భస్రావానికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే మరోసారి గర్భం దా ఆమె ఈసారి గర్భాన్ని నిలబెట్టుకోగలిగినప్పటికీ, గర్భస్థ శిశువుకు మెడపై భారీ కణితి ఉన్నట్టు స్కానింగ్ ద్వారా అక్కడి వైద్యులు నిర్ధారించారు. ఆ దశలో చికిత్స అసాధ్యం కావడంతో మరోసారి గర్భస్రావం చేయించుకుంటేనే మేలని సూచించారు. ఈ నేపథ్యంలో ఆమె తన భర్తతో నగరానికి వచ్చి రెయిన్బో వైద్యులను సంప్రదించారు. అనంతరం రెయిన్బో వైద్యుల పర్యవేక్షణలో 9 నెలలు నిండిన అనంతరం.. వైద్యులు ఆమెకు సిజేరియన్ చేశారు. ఓ వైపు ప్రసవం జరుగుతున్న సమయంలోనే మరోవైపు బిడ్డ మెడకు ఉన్న కణితిని కూడా తొలగించారు. అత్యంత సంక్లిష్టమైన ఎక్సూటరో ఇంట్రా పార్టమ్ ట్రీట్మెంట్ (ఎగ్జిట్) ద్వారా ఈ కణితి తొలగింపు ప్రక్రియ నిర్వహించారు. పాక్షిక ప్రసవం సమయంలో తల ఒక్కటే బయట ఉండి మిగిలిన దేహమంతా తల్లి గర్భాన్ని అంటిపెట్టుకుని ఉండగానే 11 నిమిషాల అత్యంత స్వల్ప సమయంలో శస్త్ర చికిత్స జరగడం వైద్యరంగంలో అపూర్వమని వైద్యులు తెలిపారు. ప్రసవం అనంతరం ప్రస్తుతం తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నట్టు వెల్లడించారు. సంక్లిష్టమైన ఈ శస్త్ర చికిత్స కోసం రెయిన్బో ఆస్పత్రికి చెందిన వివిధ విభాగాలకు చెందిన 25 మంది వైద్య నిపుణులు పాల్గొన్నారని తెలిపారు. (చదవండి: టెన్త్‌లో ఆరా? పదకొండు పేపర్లా? ఎస్సీఈఆర్టీ మొగ్గు ఎటువైపు?) -
అశ్విత్‌కు తగిన సాయం చేయండి
ఇల్లందకుంట (హుజూరాబాద్): జన్యుపరమైన కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఏడేళ్ల బాలుడు ఆకుల అశ్విత్ ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆరాతీశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని బిజిగిరిషరీఫ్‌కు చెందిన అశ్విత్ మృత్యువుతో పోరాడుతున్న విషయంపై ‘అప్పుడు అన్న.. ఇప్పుడు తండ్రిని కోల్పోయి’శీర్షికతో ఈ నెల 25న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ బాలుడి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. బాలుడి చికిత్సకు తగిన సాయం చేయాలని తన కార్యాలయ సిబ్బందికి సూచించారు. దీంతో పూర్తి వివరాలు తెలుసునేందుకు హైదరాబాద్ నుంచి మంత్రి సిబ్బంది అశ్విత్ కుటుంబ సభ్యులకు శుక్రవారం ఫోన్ చేశారు. కాగా, ‘సాక్షి’ కథనాన్ని కొందరు ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేయడంతో సాయం చేసేందుకు పలువురు దాతలు ముందుకొస్తున్నారు. రెండ్రోజుల్లో రూ.1.85 లక్షలు విరాళంగా వచ్చాయి. అశ్విత్ పరిస్థితిని తెలుసుకున్న హైదరాబాద్ రెయిన్బో ఆస్పత్రి వైద్యులు బాలుడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. అశ్విత్‌ను తమ ఆస్పత్రికి తీసుకురావాలని సూచించారు. శుక్రవారం బాలుడిని అక్కడికి తీసుకెళ్లడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. -
62,400 మంది దాతలు.. రూ.16 కోట్లు.. బాలుడికి పునర్జన్మ
సాక్షి, హైదరాబాద్: ఆ బిడ్డకు తల్లిదండ్రులు జన్మనిస్తే...దాతలు పునర్జన్మను ప్రసాదించారు. పుట్టుకతోనే అతి క్లిష్లమైన స్పైనల్ మసు్కలర్ ఆట్రోఫీ (ఎస్ఎంఏ) తో బాధపడుతున్న మూడేళ్ల బాలున్ని కాపాడేందుకు ప్రపంచ వ్యాప్తంగా 62,400 మంది దాతలు చేయూతను అందించారు. ఇందుకు ఇంపాక్ట్ గురు సంస్థ ఆన్లైన్ వేదికగా గత ఏడాది కాలంగా క్రౌడ్ ఫండింగ్ నిర్వహించి రూ.16 కోట్లు సమకూర్చింది. చందానగర్‌కు చెందిన ఓ సాఫ్ట్వేర్ దంపతులకు మూడేళ్ల క్రితం అయాన్ష్ గుప్తా జన్మించాడు. శారీరక, మానసిక ఎదుగుదల లోపంతో బాధపడుతుండటంతో చికిత్స కోసం తల్లిదండ్రులు నగరంలోని సికింద్రాబాద్ రెయిన్బో ఆస్పత్రికి చెందిన పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణంకికి చూపించారు. సదరు వైద్యుడు బాలుడికి పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. బాలుడు పుట్టుకతోనే అరుదైన వెన్నెముక సంబంధిత సమస్య (స్పైనల్ మసు్కలర్ ఆట్రోఫీ)తో బాధపడుతున్నట్లు గుర్తించారు. రూ.22 కోట్లు ఖరీదు చేసే ఇంజెక్షన్ ఈ వ్యాధికి చికిత్స కూడా చాలా ఖరీదుతో కూడినది కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. వైద్యుల సలహా మేరకు ఆన్లైన్ వేదికగా విరాళాలు సేకరించే ఇంపాక్ట్ గురు స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించారు. సదరు నిర్వాహకులు ఆన్లైన్ వేదికగా దాతలను అభ్యరి్థంచారు. ఇందుకు దాతలు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చారు. సాధారణంగా ఇలాంటి అరుదైన వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు చికిత్సల్లో భాగంగా రూ.22 కోట్ల విలువ చేసే ‘జొలెస్మా’ ఇంజెక్షన్ వాడాల్సి వస్తుంది. ఇది అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంది. అయితే కేంద్రం రూ.6 కోట్లు దిగుమతి సుంకాన్ని రద్దు చేసింది. దాతల నుంచి సేకరించిన రూ.16 కోట్లు వెచి్చంచి కొనుగోలు చేసిన ఈ మందును బాలునికి ఇచ్చి ఆరోగ్య పరిస్థితిని మెరుగుపర్చారు. ప్రస్తుతం బాలుడు కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఇదే తరహా వ్యాధితో బాధపడుతున్న ఇద్దరు పిల్లలకు ఇప్పటికే ఇదే ఆస్పత్రి లో విజయవంతంగా వైద్యం చేసినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. శనివారం మీడియా ము ఖంగా చికిత్సకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు వైద్యవర్గాలు ప్రకటించాయి. చదవండి: దిక్కులేని వారయ్యాం.. ఆదుకోండి -
మూడు రోజుల చిన్నారికి అరుదైన శస్త్ర చికిత్స
పంజగుట్ట: అరుదైన గుండె సంబందిత వ్యాధితో బాధపడుతున్న మూడు రోజుల పసికందుకు రెయిన్ బో చిల్డ్రన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు పసికందుకు ఐసీయూలో చికిత్స అందించామని ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగా ఉందని ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ ధర్మారావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. వైద్య పరిభాషలో హైపోప్లాస్టిక్ లెఫ్ట్ హార్ట్ సిండ్రోమ్ (హెచ్ఎల్హెచ్ఎస్) అనే అరుదైన గుండె వ్యాధితో బాధపడుతున్న మూడు రోజుల చిన్నారి సంక్లిష్టమైన పరిస్థితుల్లో వెంటిలేటర్‌పై ఉండగా తమ ఆసుపత్రికి వచ్చిందన్నారు. ఈ సమస్య ఎదురైతే శ్వాస తీసుకోవడం కష్టమౌతుందని, ఎడమ వైపు గుండె రక్తనాళాలకు రక్తం పంప్ చేసే నాళాలు చిన్నవిగా ఉండటంతో అత్యవసర గుండె శస్త్రచికిత్స అనివార్యమైందన్నారు. దీనిని ‘నార్ వుడ్ ప్రొసీజర్’ ప్రక్రియగా పేర్కొంటారని, ఎంతో సంక్లిష్టమైన ఈ గుండె శస్త్రచికిత్స దేశంలోని అతి కొన్ని ఆసుపత్రుల్లో మాత్రమే చేసే అవకాశం ఉందన్నారు. రెయిన్బో వైద్యులు విజయవంతంగా ఈ ఆపరేషన్ చేశారన్నారు. తొమ్మిది రోజుల ఐసీయూలో చికిత్స అందించిన తర్వాత ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం పూర్తిగా నిలకడగా ఉందన్నారు. పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జి చేసేందుకు వైద్యులు అనుమతిచ్చారన్నారు. శస్త్రచికిత్స నిర్వహించిన పిడియాట్రిక్ సర్జన్ డైరెక్టర్ డాక్టర్ తపన్ కె డాష్ మాట్లాడుతూ .. కరోనా నేపథ్యంలో, లాక్డౌన్ సమయంలో ఈ శస్త్రచికిత్స చేయడంవల్ల ఓ చిన్నారి ప్రాణం కాపాడామన్నారు. -
కవిత కుమారుడిని పరామర్శించిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : తీవ్ర జ్వరంతో బాధపడుతున్న మనవడు ఆర్యను (నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత) తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం పరామర్శించారు. ఎంపీ కవిత రెండో కుమారుడు ఆర్య తీవ్ర జ్వరంతో ఈ నెల 15వ తేదీ నుంచి రెయిన్ బో హాస్పటల్లో చికిత్స పొందుతున్నాడు. నిన్న మధ్యాహ్నం కేసీఆర్ స్వయంగా హాస్పటల్‌కి వెళ్లి మనవడిని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన చికిత్స అందించాల్సిందిగా వైద్యులను ఆయన కోరారు. కాగా ఆర్యను ఇవాళ హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. -
8 నెలలు..7.5 కేజీల బరువు
సాక్షి, హైదరాబాద్: పుట్టుకతోనే మూగ, వినికిడిలోపంతో బాధపడుతున్న ఎనిమిది నెలలు..7.5 కేజీల బరువు ఉన్న శిశువుకు ఒకే సమయంలో రెండు వైపులా కాక్లియర్ ఇంప్లాంట్స్‌ను విజయవంతంగా అమర్చారు. ప్రస్తుతం ఆ శిశువు వినికిడి లోపాన్ని జయించడమే కాకుండా స్వయంగా మాట్లాడుతోంది. చిన్నవయసులోనే ఒకే సమయంలో రెండు వైపులా చికిత్స చేయడం దేశంలోనే ఇదే తొలిదని ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జన్ డాక్టర్ సత్యకిరణ్ చికిత్స వివరాలను మీడియాకు వెల్లడించారు. బెంగళూరుకు చెందిన జశ్వంత్(8 నెలలు) మెదడు సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. ఇది చెవి, గొంతు పనితీరుపై ప్రభావం చూపింది. మాట్లాడలేక పోవడమే కాకుండా వినికిడిలోపం తలెత్తింది. దీంతో శిశువు తల్లి దండ్రులు ఇటీవల బంజారాహిల్స్‌లోని రెయిన్బో ఆస్పత్రిలోని సత్యకిరణ్, మనుసృత్లను సంప్రదించగా, వారు శిశువుకు పలు పరీక్షలు నిర్వహించి, కాక్లియర్ ఇంప్లాంట్ ఒక్కటే దీనికి పరిష్కారమని సూచించారు. ఇందుకు తల్లిదండ్రులు అంగీకరించడంతో మార్చి 21న ఒకే సమయంలో రెండు వైపులా కాక్లియర్ ఇంప్లాంట్స్‌ను విజయవంతంగా అమర్చారు. ఈ నెల 17న స్పీచ్ ప్రోసెసర్‌ను అమర్చి, పనితీరును పరిశీలించారు. ప్రస్తుతం బాలుడు వినడంతో పాటు నోటిద్వారా పలు శబ్దాలను చేయగలుగుతున్నాడని తెలిపారు. -
కళ్లు, ముక్కు, నోటి నుంచి రక్తం..
అరుదైన వ్యాధితో బాధపడుతున్న మూడేళ్ల చిన్నారి... సాక్షి, హైదరాబాద్: కళ్లు, ముక్కు, నోటి నుంచి రక్తం కారుతూ హెమటో డ్రేసిన్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న 3 ఏళ్ల చిన్నారి నగరంలోని రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఫలక్‌నుమాకు చెందిన మహ్మద్ అబ్దుల్లా, నజీమాబేగంల కుమార్తె అహనాబేగం. లక్ష మందిలో ఒకరికి వచ్చే హెమటో డ్రేసిన్ వ్యాధితో అహనా గత 20 నెలల నుంచి బాధపడుతోంది. పుట్టిన 18 నెలల వరకూ ఆరోగ్యంగానే ఉన్న చిన్నారి 16 నెలల క్రితం అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైంది. ముక్కు, నోరు, కళ్లలో నుంచి రక్తస్రావం అవుతుండటంతో బెంగళూరు, ముంబై, సీఎంసీ(వెల్లూరు) ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు. అయినా ఫలితం దక్కలేదు. చివరకు రెయిన్బో ఆస్పత్రి వైద్యులను సంప్రదించగా, వైద్య పరీక్షల అనంతరం హెమటో డ్రేసిన్ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. అహనాకు రక్తస్రావం నిలిచిపోయిందని, ప్రస్తుతం చికిత్స అందిస్తున్నామని రెయిన్బో వైద్య నిపుణురాలు శిరీషారాణి తెలిపారు. -
రెయిన్బో ఆసుపత్రి గిన్నిస్ రికార్డు
హైదరాబాద్: నెలలు నిండకుండానే పుట్టిన 445 మంది చిన్నారులను కాపాడిన ఆసుపత్రిగా రెయిన్ బో ప్రపంచ రికార్డు సృష్టించింది. రెయిన్బో ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రపంచ ప్రీ మెచ్యూర్ డే వేడుకలను గురువారం బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్ హోటల్లో నిర్వహించారు. ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రీ మెచ్యూర్డు చిన్నారులు 445 మంది ఒకే చోట చేరి గిన్నిస్ రికార్డు సృష్టించారు. గతంలో 386 మంది ప్రీ మెచ్యూర్డ్ చిన్నారులతో అర్జెంటీనా నెలకొల్పిన రికార్డును తిరగ రాశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కే తారకరామారావు మాట్లాడుతూ నియోనాటల్ చికిత్స అందించడం ఎంతో క్లిష్టమైందన్నారు. అలాంటి సమస్యను అధిగమిస్తూ ఇక్కడ ఎంతో మంది చిన్నారులకు రెయిన్ బో ప్రాణదానం చేస్తోందని ఆయన కొనియాడారు. గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించిన తల్లులు, పిల్లలు అందరికీ ఆయన అభినందనలు తెలిపారు. ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ రమేష్ కంచర్ల మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో ఇప్పటివరకూ కేజీ కన్నా తక్కువ బరువు కలిగిన 300 మంది చిన్నారులను కాపాడామని ఇందులో 24 వారాలు మాత్రమే తల్లి కడుపులో ఉండి 449 గ్రాములు బరువుతో జన్మించిన శిశువును సైతం రక్షించగలిగామన్నారు. ఆసుపత్రి ప్రారంభమైన నాటి నుంచి ప్రీ మెచ్యూర్డ్‌గా జన్మించిన వారందరినీ ఆహ్వానించామని ఒకేసారి 445 మంది ఇక్కడికి హాజరై రికార్డు సృష్టించడం తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు మంత్రి సమక్షంలో ఆసుపత్రి నిర్వాహకులకు సర్టిఫికెట్ అందజేశారు. -
చదువుతాడు... మర్చిపోతాడు... ఎందుకని?
కిడ్స్ మైండ్స్ మా బాబు వయసు పద్నాలుగేళ్లు. చురుగ్గా ఉంటాడు. కానీ నన్ను వదిలి ఒక్కక్షణం ఉండడు. నేను, మావారు ఇద్దరం ప్రైవేటు ఉద్యోగులమే. దాంతో శెలవులు సరిగ్గా ఉండవు. బాబుకి శెలవులు ఉన్నప్పుడు వాణ్ని మా అమ్మవాళ్ల ఇంటికి పంపింద్దామనుకుంటే అస్సలు వెళ్లడు. వాళ్లు ఎంత బతిమిలాడినా పోనంటాడు. తన ఫ్రెండ్స్ బర్త్ డే ఫంక్షన్లకి కూడా నేనే తీసుకెళ్లాలి. నువ్వు వెళ్లు అంటే వినడు. తీసుకెళ్లకపోతే బెంగపడతాడని వాడి కోసం పని గట్టుకుని టైమ్ కేటాయించాల్సి వస్తోంది. ఇది నాకు చాలా ఇబ్బంది కలిగిస్తోంది. వాడినెలా మార్చాలి? - బి.విజయ, హైదరాబాద్ బాబు ఈ వయసులో మిమ్మల్ని వదిలి ఉండలేకపోవడం ఇబ్బందిగానే ఉంటుంది. చిన్నప్పట్నుంచీ తనకు మీరు లేకుండా బయటకు వెళ్లడం అలవాటు చేశారో లేదో మీరు చెప్పలేదు. చేసి వుండకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిం దని నేననుకుంటున్నాను. ఇలా ఉన్న ట్టుండి మిమ్మల్ని వదిలి వెళ్లడానికి బెంగగా ఉండివుంటుంది పాపం. ఒకవేళ తనకి మొదట్నుంచీ అలవాటు ఉండి ఇప్పుడు వెళ్లలేకపోతుంటే... తనకి మెల్లగా అల వాటు చేయడం మంచిది. ముందు ఫ్రెండ్స్ ఇళ్లకి పార్టీలకవీ పంపించండి. మీరు వెళ్లొద్దు. తనని వెళ్లమని పంపిం చండి. కొత్తలో సిగ్గుగానో భయంగానో ఫీలయినా తర్వాత అలవాటు పడతాడు. ఊళ్లో తనంత తాను తిరగడం అలవాటైన తర్వాత ఒకటి రెండు రోజుల కోసం ఎక్కడికైనా పంపడం మొదలుపెట్టండి. అది కూడా అలవాటయ్యాక ఎక్కువ రోజులు పంపించవచ్చు. ఇది సమస్యేమీ కాదు. ఎప్పుడూ మీతోనే ఉంటాడు కాబట్టి అమ్మ లేకపోతే ఎలా అని ఫీలవుతున్నట్టున్నాడు. మెల్లగా అలవాటు చేస్తే తనే దారికి వస్తాడు. మా బాబు ఐదో తరగతి చదువుతున్నాడు. చదువులో తను చాలా డల్. ఏ విషయమూ నాలుగైదుసార్లు చెబితేకానీ బుర్రకి ఎక్కదు. చదివిందే పదిసార్లు చదివినా కూడా మైండ్‌లో ఉండదు. అంతేకాదు... ఏదైనా పని చెప్పినా పక్క గదిలోకి వెళ్లేసరికి మర్చిపోతుంటాడు. తన వస్తువులు తనే ఎక్కడ పెట్టాడో గుర్తు లేదంటాడు. స్కూల్లో కూడా తన వస్తువులు మర్చిపోయి వచ్చేస్తుంటాడు. ఇంత చిన్న వయసులో ఇంత మతిమరుపు అసహజం కదా... ఇదేమైనా మానసిక సమస్యా? - సుదర్శన్, గుంతకల్లు చదువు అర్థం కావడం లేదు అంటే తనకి ఓసారి ఐక్యూ టెస్ట్ చేయించడం మంచిది. ఒక్కోసారి ఐక్యూ తక్కువ ఉండటం వల్ల కూడా పిల్లలకు పాఠాలు అర్థం కావు. అలాగే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ) ఉన్నా కూడా పిల్లలు చదువులో వెనక బడిపోతారు. అస్సలు శ్రద్ధ పెట్టలేక పోతారు. ఒకవేళ చదివినా మర్చి పోతుంటారు. కాబట్టి ముందు ఈ రెండిటిలో ఏ సమస్య అయినా బాబుకి ఉందేమో సైకి యాట్రిస్టుతో పరీక్ష చేయించండి. సమస్య ఉన్నా టెన్షన్ పడాల్సిన పని లేదు. వాటికి తగ్గ మంచి చికిత్సలు ఉన్నాయి. చేయిస్తే ఫలితం ఉంటుంది. ధైర్యంగా ఉండండి. మా పాప పదో తరగతి చదువుతోంది. వచ్చే యేడు ఇక్కడే ఏదైనా కాలేజీలో చేర్పించాలని అనుకుంటున్నాం. కానీ తను మాత్రం సిటీకి వెళ్లి ఒక మంచి కాలేజీలో చేరతానంటోంది. అంటే హాస్టల్లో ఉండాలి. అది నాకు ఇష్టం లేదు. రోజూ ఆడపిల్లల విషయంలో జరిగేవి వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అందుకే ఇప్పటివరకూ బయటికి వెళ్లని తనని ఒక్కసారిగా అంత దూరం పంపడానికి భయమేస్తోంది. నా భయం తనకి అర్థమయ్యేలా ఎలా చేయాలి? - యు.ఉషశ్రీ, బాపట్ల మీరు, మీవారు అన్నీ ఆలోచించిన తర్వాతే తనను ఇంటి దగ్గర కాలేజీలో చదవడం మంచిదని డిసైడ్ చేసి ఉంటే... అది తనకు వివరించి చెప్పండి. మీరు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, ఎందుకింత పంతం పడుతున్నారు అనేది తనకు అర్థమయ్యేలా చెప్పండి. తను వింటే సరే. వినకపోతే మంకుపట్టు పట్ట వచ్చు. అలాంటప్పుడు మీరు కాస్త కఠినంగానే మాట్లాడాల్సి ఉంటుంది. మీరు నిర్ణయం తీసేసుకున్నారని, ఇక మార్చుకునే వీలు లేదని చెప్పేయండి. అవసరం అయితే ఆపై చదువులకు పంపిస్తామని చెప్పండి. అయితే ఒకటి. ఇదంతా చేసేముందు ఒక్కసారి మీరు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో బాగా ఆలోచించండి. కేవలం భయంతోటే తీసుకుంటే మాత్రం మీ నిర్ణయం కరెక్ట్ కాదు. ఎందుకంటే సమస్యలు అన్నిచోట్లా ఉంటాయి. ప్రమాదాలు ఇంట్లో ఉన్నా ముంచుకొస్తాయి. అందుకని ఇలా ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉంచుకుంటాం అంటే కుదరదు కదా! రేపు ఏ విదేశీ యూనివర్శిటీలోనో తనకి సీటు వస్తే ఏం చేస్తారు? వదులుకోలేరు కదా! తప్పక పంపించాలి కదా! కాబట్టి వట్టి భయంతో తన ఆశల్ని చంపేయకండి. మీరు తీసుకున్న నిర్ణయం నూటికి నూరుపాళ్లూ పాపకి మంచిదని అనిపిస్తేనే దాన్ని అమలు చేయండి. - డా॥పద్మ పాల్వాయ్ చైల్డ్ - అడల్ట్ సైకియాట్రిస్ట్, రెయిన్బో హాస్పిటల్, హైదరాబాద్ -
తల్లికోసం తల్లడిల్లుతున్న చిన్నారి
హైదరాబాద్: బంజారాహిల్స్‌లో ని ప్రైవేట్ ఆస్పత్రి నుంచి అదృశ్యమైన కె.జ్యోతి(26) ఆచూకీ తెలీకపోవడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఏడాదిన్నర కుమారుడు అల్లాడిపోతున్నాడు. పాలు లేక ఆకలితో రోది స్తున్న చిన్నారి అవస్థలు చూసి తండ్రి వెంకన్నబాబుతో పాటు ఆస్పత్రి సిబ్బంది చలించిపోతున్నారు. ఈ నెల 15న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జ్యోతి తన భర్త వెంకన్నబాబుతో కలిసి కుమారుడిని చికిత్స నిమిత్తం రెయిన్బో ఆస్పత్రికి తీసుకు వచ్చింది. భర్త చిన్నారికి స్కానింగ్ తీయించేందుకు లోపలికి వెళ్లగా ఆమె భర్తకు తెలియకుండా ఎటో వెళ్లిపోయింది. దీంతో ఆ చిన్నారి తల్లికోసం గుక్కపట్టి ఏడుస్తున్నాడు. అయితే, కనిపించకుండా పోయిన జ్యోతి ఆచూకి కోసం పోలీ సులు ప్రత్యేక బృందంతో గా లింపు చేపట్టినా ఫలితం కనిపించ లేదు. రెండు బృందాలను విజయవాడ, నెల్లూరుకు పంపించారు. ఆస్పత్రిలో చిన్నరి పరిస్థితి క్షీణిస్తున్నదని వైద్యులు తెలిపారు. -
మందులంటే... మారాం చేస్తోందెలా?
కిడ్స్ మైండ్స్ మా పాప వయసు పదేళ్లు. సంవత్సరం క్రితం సడెన్‌గా అనారోగ్యం పాలయ్యింది. డాక్టర్‌కి చూపిస్తే ఓ చిన్న హార్ట్ ప్రాబ్లెమ్ ఉందని చెప్పారు. కొన్నాళ్ల పాటు మందులు వేస్తే సమస్య తీరిపోతుందన్నారు. అయితే పాపతో మందులు మింగించడం చాలా కష్టంగా ఉంటోంది. మందు అంటే చాలు అరిచి గీపెడుతుంది. తనని ఎలా డీల్ చేయాలో చెప్తారా? - కె.మనోజ్ఞ, హైదరాబాద్ పాప ఎందుకు మందు వేసుకోనం టోందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిం చండి. మందు చేదుగా ఉంటుందనా? మింగడం రాదా? లేక మందు ఎందుకు వేసుకోవాలి అనే మంకుపట్టా? ఎందుకు వేసుకోనంటోందో తెలిస్తే ఎలా కన్విన్స్ చేయాలో ఆలోచించవచ్చు. సాధారణంగా పిల్లలు భయంతో మందులు వేసుకోవ డానికి మారం చేస్తుంటారు. అలాం టప్పుడు జమ్స్ లాంటి చాకొలెట్స్తో ప్రాక్టీస్ చేయించాలి. అవి తియ్యగా ఉంటాయి కాబట్టి, వాళ్లకు నచ్చుతాయి కాబట్టి భయం పోతుంది. మందులు కూడా అలానే ఉంటాయి అని చెబితే, వేసుకోవడానికి సిద్ధపడతారు. లేదంటే నీతో పాటు నేను కూడా వేసుకుంటాను అని చెప్పి, మీరు కూడా కొన్ని రోజుల పాటు ఓ విటమిన్ మాత్ర మింగుతూ ఉండండి. అప్పుడు తనకీ ధైర్యం వస్తుంది. నాకు ఈ మధ్యనే ఓ పాప పుట్టింది. తను పుట్టినప్పట్నుంచీ మా పెద్దపాపలో (రెండో తరగతి చదువుతోంది) చాలా మార్పు వచ్చింది. చెప్పినమాట చక్కగా వినేది, ఇప్పుడు వినడం లేదు. చిన్న పాపకు స్నానం చేయి స్తున్నప్పుడో నిద్ర పుచ్చుతున్నప్పుడో ఏదో ఒకటి కావాలని అడుగుతుంది. ఆగమంటే ఆగదు. వెంటనే కావాలంటూ గొడవ గొడవ చేస్తుంది. నేను చిన్న పాపతో ఉన్న ప్రతిసారీ తను ఇలా కావాలనే చేస్తోందని అర్థమైంది. అలా అని తనని పట్టించుకోకపోవడం ఏమీ లేదు. మరి ఇంకెందుకింత అసూయ? - జ్యోతి, విశాఖపట్నం ఇంతవరకూ మీ పెద్ద పాప ఒక్కతే ఉంది కాబట్టి మీ అటెన్షన్ అంతా తనమీదే ఉండేది. ఇప్పుడు చిన్న పాప పుట్టడంతో ఆ అటెన్షన్ డివైడ్ అయ్యింది. దీన్ని చాలా మంది పిల్లలు తట్టుకోలేరు. అందుకే చెల్లి వచ్చినా తన స్థానం అలాగే ఉంది అనే ఫీలింగ్ పాపకు కలిగించాలి. రోజూ కొంత సేపు తనతో గడపండి. అప్పుడు చిన్న పాపను మీతో ఉంచుకోవద్దు. ఇంతకు ముందుకంటే ఎక్కువగా పాప పనుల్లో సాయం చేయండి. తనకు మీరిచ్చే ప్రాధా న్యత అర్థమవుతుంది. అలాగే చిన్నపాప పనుల్లో పెద్ద పాపను ఇన్వాల్వ్ చేయండి. పాపను తన ఒడిలో కూర్చోబెట్టండి. స్నానం చేయించేటప్పుడు తనను హెల్ప్ చేయమనండి. చెల్లికి ఏ బట్టలు వేయాలో నువ్వే సెలెక్ట్ చెయ్యి అని చెప్పండి. చెల్లిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి మీరు వేరే పనులు చేసుకుంటూ ఉండండి. దానివల్ల చెల్లెలి బాధ్యత తనకూ ఉందని తెలు స్తుంది. ప్రేమ పెరుగుతుంది. ఇంకొకరు వచ్చారు కాబట్టి తనను చూడరేమో అన్న భయం పిల్లల్ని ఇలా తయారు చేస్తుంది. కొన్ని రోజుల్లో తనే మారిపోతుందిలెండి. మా బాబు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. తెలివికి వంక పెట్టక్కర్లేదు. కాకపోతే వాడు ఈ మధ్య ఫ్యాషన్మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాడు. ఏదైనా డ్రెస్ కొంటే నాకు నచ్చలేదు, వేసుకోను అని చెప్పేస్తున్నాడు. వాడి డ్రెస్ వాడే సెలెక్ట్ చేసుకోవాలట. అలాగే చాలాసేపు తయారవుతున్నాడు. పదే పదే అద్దంలో చూసుకుంటున్నాడు. ఇంత చిన్న వయసులో ఇలా చేయడం కరెక్ట్ కాదేమో అనిపిస్తోంది. నా ఆలోచన కరెక్టేనా? - వి.పవన్‌కుమార్, రేణిగుంట తొమ్మిదో తరగతి అంటే 13-14 సంవత్సరాలు ఉండవచ్చేమో కదా! టీనేజీలో పిల్లలకు సహజంగానే అప్పియరెన్స్ మీద ఆసక్తి పెరుగుతుంది. అలాగే ఈ వయయసులో వాళ్లు తమ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది అవసరం కూడా. పెద్దయిన తర్వాత తమ నిర్ణయాలు తాము సొంతగా తీసుకునేందుకు ఇది సహాయపడుతుంది. తప్పు చేసినా పెద్దగా హాని చేయని నిర్ణయాలు తీసుకున్నప్పుడు మెచ్చుకోవాలే తప్ప కంగారు పడకూడదు. అలాంటి విషయాల్లో తనని అలా వదిలేయండి. మరీ ఇన్‌డీసెంట్‌గా ఉంటే చెప్పండి తప్ప... తన దుస్తులు, వాటి రంగులు, స్టయిల్స్ మీకు నచ్చకపోయినా పట్టించుకోకండి. తను సంతోషంగా ఉంటాడు కదా! అయితే ఏదైనా డ్యామేజ్ జరిగే నిర్ణయాలు తీసుకున్నప్పుడు మాత్రం అడ్డుకోండి. అలాగని తిట్టకూడదు. కూర్చోబెట్టి మాట్లాడి, అర్థమయ్యేలా వివరించాలి. అంటే తనకి ఫ్రీడమ్ ఇస్తూనే మంచి చెడులను కనుక్కోవాలన్నమాట. బట్టలు కూడా మీరు చెప్పినవే వేసుకునే వయసు కాదు తనది. అది మీరు అర్థం చేసుకోవాలి. - డా॥పద్మ పాల్వాయ్ చైల్డ్ - అడల్ట్ సైకియాట్రిస్ట్, రెయిన్బో హాస్పిటల్, హైదరాబాద్ -
అన్నీ ఇస్తున్నాం... అయినా ఎందుకిలా?!
కిడ్స్ మైండ్స్ మా బాబు ఏడో తరగతి చదువుతున్నాడు. తెలివైనవాడే. కానీ ఎందుకో పరీక్షల సమయం వచ్చేసరికి విపరీతంగా టెన్షన్ పడిపోతాడు. స్లిప్ టెస్టులకు కూడా ఫైనల్ ఎగ్జామ్స్లాగా కంగారు పడిపోతాడు. పరీక్ష అంటే చాలు జ్వరం వచ్చేస్తుంది. దాంతో ఎంత చదివినా సరిగ్గా రాయలేడు. ఎంత ధైర్యం చెప్పినా పరిస్థితి మారట్లేదు. కౌన్సెలింగ్ లాంటిదేమైనా ఇప్పిస్తే మంచిదంటారా? - రవికాంత్, ఆదిలాబాద్ పరీక్షలకు టెన్షన్ పడటం వల్ల పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. ఒకవేళ మీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయేమో చూసుకోండి. ఎందుకంటే చాలాసార్లు పెద్దవాళ్లు పిల్లలతో డెరైక్ట్‌గా ‘నీకెన్ని మార్కులు వచ్చినా ఫర్వాలేదు నాన్నా’ అంటారు. కానీ మార్కులు కాస్త తక్కువ వచ్చినా పెదవి విరవడం, ఫస్ట్ ర్యాంక్ కాకుండా సెకెండ్ ర్యాంక్ వచ్చినా... చూశావా, నేను చెప్పినట్టు ఆ రోజు చదివివుంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చేది అనడం చేస్తుంటారు. ఒక్కసారి ఇంట్లో కానీ, స్కూల్లో కానీ ఎవరైనా అతిగా ఒత్తిడి చేస్తున్నారేమో చూడండి. అలాంటి పరిస్థితి ఉంటే వెంటనే సరి చేయండి. అలాంటిదేమీ లేకపోతే బాబును తప్పకుండా కౌన్సెలింగుకు తీసుకు వెళ్లండి. బాబుది భయపడే మనస్తత్వం అయితే కనుక కౌన్సెలింగ్ తప్పకుండా పని చేస్తుంది. ఈ భయం ముందు ముందు వేరే భయాలకు దారి తీయకుండా ఉంటుంది. మా పాప ఎనిమిదో తరగతి చదువుతోంది. ఆరు నెలల క్రితం మెచ్యూర్ అయ్యింది. అయితే అప్పటి నుంచీ ఎందుకో చాలా సెలైంట్ అయిపోయింది. ఎవరితోనూ ఎక్కువ మాట్లాడటం లేదు. ముభావంగా ఉంటోంది. ఒంట్లో బాలేదా అంటే బాగానే ఉంది అంటోంది. కానీ డల్‌గానే కనిపిస్తోంది. ఎప్పుడూ హుషారుగా ఉండే తనలో ఈ మార్పు ఎందుకు వచ్చింది? - మధుమణి, రాజమండ్రి అసలు పాప మెచ్యూర్ అవ్వడానికి, ఈ బిహేవియర్‌కి సంబంధం ఉందా లేదా అన్నది ఆలోచించాలి. ఒకవేళ తన మనసులో ఏవైనా అనుమానాలు, సందేహాలు, భయాలు ఉన్నాయేమో కనుక్కోండి. తను మెచ్యూర్ అయినప్పుడు స్కూల్లో తన స్నేహితులు ఏమైనా చెప్పారేమో అడగండి. లేదా తనలో వచ్చిన ఈ కొత్త మార్పు వల్ల ఏవైనా అపోహలు తలెత్తాయా అన్నది కనుక్కోండి. కూల్‌గా మాట్లాడితే తన మనసులో మాట తెలుస్తుంది. తను చెప్పినదాన్ని బట్టి తన సందేహాలను తీర్చండి. భయాలుంటే పోగొట్టండి. ఒకవేళ మీరు ఎంత ప్రయత్నించినా తన మనసులో మాట మీతో చెప్పకపోతే కౌన్సెలర్ ఒకసారి దగ్గరకు తీసుకు వెళ్లండి. మాకు ఒక్కడే బాబు. రెండో తరగతి చదువు తున్నాడు. తనని మేం బాగా గారాబం చేస్తాం. అడిగినదల్లా ఇస్తాం. కానీ అదేంటో... తన దగ్గర ఎన్ని ఉన్నా, పక్క పిల్లల పెన్నులు, పెన్సిళ్లు తీసేసుకుంటున్నాడు. ఒక్కోసారి వాళ్లకు చెప్పకుండా కూడా తీసేసుకుంటున్నా డని తెలిసింది. ఈ మధ్యనే స్కూలు నుంచి కంప్లయింట్ వస్తే మేం షాకయ్యాం. ఎదుటి వాళ్ల వస్తువులు చెప్పకుండా తీసుకోకూడదని, దొంగతనం తప్పు అని ఎంత చెప్పినా అలా చేయడం మానట్లేదు. దీనికి కారణం ఏమై ఉంటుంది? ఇది మానసిక సమస్య కాదు కదా? - ఎస్.ప్రభాకర్, విశాఖపట్నం బాబు ఏదైనా వస్తువు తనకు నచ్చగానే తీసేసుకుంటున్నట్టున్నాడు. తనకేదైనా కావాలనుకుంటే ఆగలేక పోతున్నాడు. కాబట్టి ముందు మీరు చేయాల్సింది ఏంటంటే... ఏదైనా కావాలి అనుకున్న వెంటనే దొరకదని, దొరికే వరకూ ఆగాలని చెప్పాలి. ప్రతిదీ అడగ్గానే ఇవ్వకండి. ఏది ఇవ్వొచ్చో, ఏది ఇవ్వ కూడదో ఆలోచించండి. తనకేదైనా వస్తువు నచ్చి తీసేసుకున్నప్పుడు... ఆ వస్తువు ఎవరిదో వారి దగ్గరకు తీసుకెళ్లి, బాబుతోనే ఆ వస్తువు తిరిగి ఇప్పించి, క్షమాపణ చెప్పేలా చేయండి. అంటే దొంగిలించడం తప్పని, దొంగతనం చేయడం వల్ల తనకు ఎటువంటి లాభం చేకూరలేదనీ మీరు బాబుకి చెప్పినట్టు అవుతుంది. అయినా అలాగే చేస్తుంటే... తప్పు చేసిన ప్రతిసారీ ఖండించడం, తనకు నచ్చినవి ఇవ్వకపోవడం, టీవీ చూడనివ్వకపోవడం లాంటి చిన్న చిన్న పనిష్మెంట్లు ఇవ్వండి. అందరూ ఒకే మాట మీద ఉండాలి. ఒకళ్లు స్ట్రిక్ట్‌గా ఉండి మరొకరు ముద్దు చేస్తూ ఉంటే బాబు తన తప్పు తెలుసుకోడు. కాబట్టి అందరూ కలిసి బాబుకున్న ఈ చెడు అలవాటును మాన్పించండి. డా॥పద్మ పాల్వాయ్ చైల్డ్ - అడల్ట్ సైకియాట్రిస్ట్, రెయిన్బో హాస్పిటల్, హైదరాబాద్ -
అరిచి గోల చేస్తోంది... ఆపేదెలా?
కిడ్స్ మైండ్స్ మా బాబు మూడో తరగతి చదువుతున్నాడు. తను అస్సలు కుదురుగా ఉండడు. ఎప్పుడూ పరుగులు తీస్తూ, గెంతుతూ ఉంటాడు. అవీ ఇవీ ఎక్కి దూకుతుంటాడు. చదువు మీద కాన్సన్ట్రేట్ చేయడు. స్కూల్లో కూడా పక్కనున్న పిల్లలతో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడని, తాము చెప్పేది వినడని టీచర్లు కంప్లయింట్ చేస్తున్నారు. వాణ్ని ఎలా దారిలో పెట్టాలో తెలియడం లేదు. సలహా ఇవ్వండి. - కావ్య, రఘునాథపల్లి కొంతమంది పిల్లలు అంతే. నిలకడగా కూర్చోరు. కాన్సన్ట్రేట్ చేయరు. ఇది కావాలని చేసేది కాదు. వాళ్లు నిజంగానే అలా ఉండలేరు, చేయలేరు. మీ అబ్బాయి మరీ ఎక్కువ అల్లరి చేస్తున్నాడంటే, తనకి అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ ఉందని నా అనుమానం. ఇది ఉన్నవాళ్లు ఉండాల్సిన దానికన్నా ఎక్కువ యాక్టివ్‌గా ఉంటారు. దేనిమీదా శ్రద్ధ పెట్టలేరు. ఓసారి బాబుని చైల్డ్ సైకాలజిస్టుకు చూపించండి. తనకి ఆ సమస్య ఉంటే బిహేవియరల్ థెరపీ చేస్తారు. అవసరమైతే మందులు కూడా సూచిస్తారు. మా పాప వయసు మూడేళ్లు. తను ఏదడిగితే అది ఇచ్చేయాలి. లేకపోతే గట్టిగా అరుస్తుంది. లేదంటే దొర్లి దొర్లి ఏడుస్తుంది. ఒక్కోసారి తిరగబడి కొడుతుంది కూడా. దాంతో అడిగిందల్లా ఇవ్వాల్సి వస్తోంది. స్కూల్లో టీచర్లు చెప్పింది చక్కగా వింటుందట. ఇంట్లోనే ఇలా. ఈ ప్రవర్తనని ఎలా మార్చాలి? - భవాని, విజయవాడ పిల్లలన్నాక ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. తల్లిదండ్రులు అవసరమైనవి ఇవ్వడం, అవసరం లేనివి ఇవ్వకుండా ఉండటం జరుగుతుంది. మంకుపట్టు పడితే మాత్రం ఒక్కోసారి బాధ కలిగో, విసుగొచ్చో ఇచ్చేస్తూ ఉంటారు. కానీ ప్రతిసారీ ఇలానే చేస్తూ ఉంటే వాళ్లకదే అలవాటైపోతుంది. ఏడిస్తే ఇచ్చేస్తారు కదా అని ప్రతిసారీ ఏడుస్తూంటారు. మీ అమ్మాయి విషయంలో అదే జరుగుతోంది. కాబట్టి తను అడిగింది ఇవ్వదగినది కాకపోతే కుదరదని కచ్చితంగా చెప్పండి. ఏడ్చినా చూడనట్టే ఉండండి. మొదట్లో గొడవ చేసినా మెల్లగా తనకు మీ ఉద్దేశం తెలుస్తుంది. ఎంత ఏడ్చినా మీరిక ఇవ్వరు అని అర్థమై, మెల్లగా ఏడ్చే అలవాటు పోతుంది. అయితే ఇది ఏ ఒక్కరో కాదు, ఇంట్లో పెద్దలందరూ చేయాలి. ఒకళ్లు పాటించి మరొకళ్లు పాటించకపోతే మీ పాపను మార్చడం కష్టం. మా బాబు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అదేమిటో, ఆరు నెలల నుంచి వాడికి శుభ్రం మరీ ఎక్కువైపోయింది. స్నానం గంటసేపు చేస్తున్నాడు. స్కూలుకు లేటయిపోతున్నా తెమల్చడు. చేతులు కూడా అస్తమానం కడుగుతూంటాడు. దాంతో చేతుల చర్మం పగిలిపోయింది కూడా. ఎందుకలా చేస్తున్నావంటే వాడికి కోపం వచ్చేస్తోంది. ఎందుకిలా? - రవి యాదవ్, భువనగిరి మీ బాబు అబ్సెసివ్ కంపల్సివ్ డిజా ర్డర్ బారిన పడ్డాడని అనిపిస్తోంది. ఇది ఉన్న పిల్లలు అతి శుభ్రతను పాటించడం, చేసిన పనినే మళ్లీ మళ్లీ చేయడం చేస్తారు. అలా చేయకుండా చేయకుండా ఉండాల్సిన పరిస్థితి వస్తే యాంగ్జయిటీ ఫీలవుతారు. టెన్షన్ పడిపోతారు. అందుకే మీరు వద్దని చెప్పినా మీ బాబు అలా చేయకుండా ఉండలేకపో తున్నాడు. తనను వెంటనే సైకియాట్రిస్టు దగ్గరకు తీసుకెళ్లండి. నిజంగానే ఈ డిజార్డర్ ఉంటే కనుక ఎక్స్పోజర్ రెస్పాన్స్ ప్రివెన్షన్ థెరపీ చేస్తారు. ఇది మంచి ఫలితాలనిస్తుంది. మా బాబు స్కూలుకు బాగానే వెళ్లేవాడు. కానీ ఈ మధ్య మాట్లాడితే కడుపునొప్పి అని తరచూ స్కూలు ఎగ్గొట్టేస్తున్నాడు. చాలామంది డాక్టర్లకు చూపించాం. ఏ సమస్యా లేదన్నారు. దాంతో స్కూలు ఎగ్గొట్టడానికి సాకు చెబుతున్నాడని అనిపిస్తోంది. నేనేం చేయాలి? - వసుంధర, కాకినాడ ఒక్కోసారి పిల్లలకు భయం వల్ల కానీ, బాధ వల్ల కానీ కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. పెద్దవాళ్లకు ఒత్తిడి ఎక్కువైతే తలనొప్పి వచ్చినట్టు, పిల్లలకూ అలాంటి శారీరక బాధలు కలుగుతాయన్నమాట. మీ అబ్బాయికి స్కూల్లో ఏదైనా ఇబ్బంది ఉందేమో, దేనివల్లనయినా ఒత్తిడికి లోనవుతున్నాడేమో అడిగి తెలుసుకోండి. తన టీచర్లు, స్నేహితులతో కూడా మాట్లాడండి. ఏదైనా ఇబ్బంది ఉంటే అది తొలగించండి. అప్పటికీ తను వెళ్లడానికి ఇష్టపడకపోతే, మెల్లగా స్కూలుని అలవాటు చేయండి. ఓ గంటసేపు స్కూల్లో ఉండి వచ్చేస్తే చాలని నచ్చజెప్పి పంపించండి. కొన్ని రోజులు అలా వెళ్లాక రెండు గంటలు అని చెప్పండి. అలా కొద్దికొద్దిగా సమయం పెంచుతూ పోతే, ఈలోపు బాబు భయం తగ్గుతుంది. కావాలంటే స్కూలువారి సాయం తీసుకోండి. మరీ అవసరమనుకుంటే కౌన్సెలర్ సలహా కూడా తీసుకోండి. డా॥పద్మ పాల్వాయ్ చైల్డ్ - అడల్ట్ సైకియాట్రిస్ట్, రెయిన్బో హాస్పిటల్,హైదరాబాద్ -
లిఫ్ట్ నుంచి జారిపడి మహిళ మృతి
నెల్లూరు : నెల్లూరులోని రెయిన్బో ఆసుపత్రిలో ఆదివారం ఉదయం ప్రమాదవశాత్తూ లిఫ్ట్ నుంచి జారిపడి భాగ్యమ్మ(50) అనే మహిళ మృతిచెందింది. మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా తరలించేందుకు ఆసుపత్రి సిబ్బంది ప్రయత్నించడంతో మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మృతరాలి స్వగ్రామం అనంతసాగరం మండలం గోవిందమ్మపల్లి. -
డెంగీతో చిన్నారి మృతి
వేంపల్లె: వైఎస్సార్ జిల్లా వేంపల్లెకు చెందిన పదేళ్ల బాలుడు డెంగీతో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. వేంపల్లె దేవాంగుల వీధికి చెందిన ఫయాజీ, మెహబూబా దంపతుల కుమారుడు షేక్ ఉమర్ (10) డెంగీ వ్యాధి బారిన పడగా మూడు రోజులుగా కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స ఇప్పించారు. పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని రెయిన్బో ఆస్పత్రికి ఆదివారం తెల్లవారుజామున తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ ఉమర్ ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. -
అదో మధుర జ్ఞాపకం: మహేష్ బాబు
హైదరాబాద్ : తనకు పిల్లలంటే చాలా ఇష్టమని, జీవితంలో తండ్రి కావడం మధురమైన జ్ఞాపకమని ప్రముఖ సినీహీరో, ప్రిన్స్ మహేష్‌బాబు అన్నారు. తాను తండ్రినైన క్షణంలో మరచిపోలేని అనుభూతులు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు. ఓ కార్పొరేట్ ఆస్పత్రికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన సందర్భంగా బంజారాహిల్స్‌లోని ఓ హోటల్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. గౌతమ్ పుట్టినప్పుడు చేతుల్లోకి వాడిని తీసుకున్న క్షణాలను మాటల్లో వర్ణించలేనన్నారు. మన చేతుల్లో చిన్నారులు కేరింతలు కొడుతుంటే ఆ ఆనందానికి వెల కట్టలేమన్నారు. రెయిన్బో ఆస్పత్రిలో గౌతం, కూతురు సితార పుట్టినప్పుడు తాను పది రోజుల వరకు అక్కడి నుంచి ఇంటికి వెళ్లలేకపోయానన్నారు. సినిమా జీవితాన్ని కాసేపు పక్కనబెట్టి పిల్లలే లోకంగా ఆ సమయాన్ని ఆస్వాదిస్తుంటానని చెప్పారు. తాను పని ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇంట్లోని పిల్లలతో గడుపుతానని, ఆ క్షణంలో తాను కూడా పిల్లాడినైపోతానని మహేష్‌బాబు అన్నారు. ఆ క్షణంలో మానసిక, శారీరక ఒత్తిడి ఒక్కసారిగా పోతుందన్నారు. పిల్లలతో గడిపేందుకు తండ్రికి ప్రత్యేకంగా తండ్రుల దినోత్సవం అవసరం లేదన్నారు. 'శ్రీమంతుడు' చిత్రం బాగా వచ్చిందని, ఇందులో శృతిహాసన్ చాలా బాగా నటించిందని ప్రశంసించారు. తన కొత్త సినిమా మరో మూడు నెలల్లో ప్రారంభమవుతుందని, తనకు బాలీవుడ్‌కు వెళ్లే ఆలోచన లేదన్నారు. -
ఇలా పెరుగుతుంటే...హెల్దీగా ఉన్నట్లే!
ఆరోగ్యకరమైన శిశువు పుట్టినప్పుడు 2.5 నుంచి 4 కేజీల బరువు ఉంటుంది. భారతీయుల విషయానికి వస్తే గరిష్ట బరువు 3.5 కేజీలు. ఐదవ నెల నిండేసరికి పిల్లలు... పుట్టిన నాటికి ఉన్న బరువుకు రెండింతలు అవుతారు. ఏడాది నిండేసరికి మూడింతలవుతారు. మొదటి నెల నుంచి మూడవ నెల వరకు సరాసరిన నెలకు 800 గ్రాముల నుంచి కేజీ వరకు బరువు పెరుగుతారు. ఏడు నుంచి పన్నెండు నెలల వరకు నెలకు 250 గ్రాముల చొప్పున పెరుగుతారు. ఏడాది దాటినప్పటి నుంచి యౌవన దశ (14-15 ఏళ్లు) వచ్చేవరకు ఏడాదికి సరాసరిన ఒకటిన్నర నుంచి రెండు కిలోల బరువు పెరుగుతారు. ఇక ఎత్తు విషయానికి వస్తే... పుట్టినప్పుడు పిల్లలు సాధారణంగా 50 సెంటీమీటర్ల పొడవుంటారు. ఆరు నెలలు నిండేసరికి 66 సెంటీమీటర్లు, ఏడాది నిండేటప్పటికి 75 సెంటీమీటర్ల వరకు పెరుగుతారు. ఏడాది నిండినప్పటి నుంచి యౌవన (ఫ్యూబర్టీ) దశ వరకు ఏడాదికి ఐదారు సెంటీమీటర్లు పెరుగుతారు. సాధారణ పురోగతి ఇలా... 6-8 వారాల వయసులో పలకరింపుగా నవ్వడం, ‘ఊ’కొట్టడం మూడు నెలల వయసులో మెడ నిలపడం నాలుగైదు నెలలకు బోర్లా పడడం, పాకడం ఆరు-ఏడు నెలలకు కూర్చోవడం, తొమ్మిది నెలలకు ఎవరి సహాయం లేకుండా సొంతంగా కూర్చోవడం పది నెలలకు దేనినైనా పట్టుకుని సొంతంగా లేచి నిలబడడం, ఏదో ఒకటి పలకడం 12-13 నెలలకు సొంతంగా అడుగులు వేయడం, చెప్పాలనుకున్న పదాలు పలకడం. - డా. ప్రీతమ్ కుమార్, పీడియాట్రీషియన్, రెయిన్బో హాస్పిటల్ -
గౌతమ్ పుట్టినప్పుడు ఆందోళన చెందాం: నమ్రత
హైదరాబాద: ‘గౌతమ్ నెలలు నిండక ముందే తక్కువ బరువు (1.46 కేజీలు)తో పుట్టాడు. అందరిలాగే నేను కూడా బాబు శారీరక, మానసిక ఎదుగుదలపై ఆందోళన చెందాను’ అని సూపర్‌స్టార్ మహేష్‌బాబు సతీమణి, నటి నమ్రత శిరోద్కర్ చెప్పారు. వరల్డ్ ప్రిమెచ్యూర్ డేను పురస్కరించుకుని గురువారం హోటల్ తాజ్ డెక్కన్‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నెలలు నిండక ముందు తక్కువ బరువుతో పుట్టిన పిల్లలను కాపాడటంలో వైద్యులు చేస్తున్న కృషి మరిచిపోలేనిదని చెప్పారు. రెయిన్బో ఆస్పత్రి ఇంటెన్సివ్ కేర్ డెరైక్టర్ డాక్టర్ దినేష్ చీరాల మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఏటా 15 మిలియన్ల మంది నెలలు నిండక ముందు తక్కువ బరువుతో జన్మిస్తుండగా, ఇందులో ఒక్క భారతదేశంలోనే 36 లక్షల ప్రిమెచ్యూర్ జననాలు చోటు చేసుకుంటుడంటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సుమారు 200 మంది చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.