రెయిన్‌బో ఆసుపత్రి గిన్నిస్ రికార్డు
హైదరాబాద్: నెలలు నిండకుండానే పుట్టిన 445 మంది చిన్నారులను కాపాడిన ఆసుపత్రిగా రెయిన్ బో ప్రపంచ రికార్డు సృష్టించింది. రెయిన్‌బో ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రపంచ ప్రీ మెచ్యూర్ డే వేడుకలను గురువారం బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్ హోటల్‌లో నిర్వహించారు. ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రీ మెచ్యూర్డు చిన్నారులు 445 మంది ఒకే చోట చేరి గిన్నిస్ రికార్డు సృష్టించారు. గతంలో 386 మంది ప్రీ మెచ్యూర్డ్ చిన్నారులతో అర్జెంటీనా నెలకొల్పిన రికార్డును తిరగ రాశారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కే తారకరామారావు మాట్లాడుతూ నియోనాటల్ చికిత్స అందించడం ఎంతో క్లిష్టమైందన్నారు. అలాంటి సమస్యను అధిగమిస్తూ ఇక్కడ ఎంతో మంది చిన్నారులకు రెయిన్ బో ప్రాణదానం చేస్తోందని ఆయన కొనియాడారు. గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించిన తల్లులు, పిల్లలు అందరికీ ఆయన అభినందనలు తెలిపారు.
ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ రమేష్ కంచర్ల మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో ఇప్పటివరకూ కేజీ కన్నా తక్కువ బరువు కలిగిన 300 మంది చిన్నారులను కాపాడామని ఇందులో 24 వారాలు మాత్రమే తల్లి కడుపులో ఉండి 449 గ్రాములు బరువుతో జన్మించిన శిశువును సైతం రక్షించగలిగామన్నారు.
ఆసుపత్రి ప్రారంభమైన నాటి నుంచి ప్రీ మెచ్యూర్డ్‌గా జన్మించిన వారందరినీ ఆహ్వానించామని ఒకేసారి 445 మంది ఇక్కడికి హాజరై రికార్డు సృష్టించడం తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు మంత్రి సమక్షంలో ఆసుపత్రి నిర్వాహకులకు సర్టిఫికెట్ అందజేశారు.