guennis record
-
ప్రపంచ పొట్టి మనిషి మగర్ మృతి
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతి పొట్టి మనిషిగా ‘గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ లోకి ఎక్కిన నేపాల్‌కు చెందిన 27 ఏళ్ల ఖగేంద్ర థాప మగర్ శుక్రవారం రాత్రి మరణించారు. 2.4 అంగులాల ఎత్తు మాత్రమే ఉన్న మగర్ గత కొంత కాలంగా నిమోనియాతో బాధ పడుతున్నారని, ఆయన గుండెపోటుతో ఆస్పత్రిలో మరణించారని సోదరుడు మహేష్ థాప మగర్ తెలిపారు. మగర్ తన 18వ ఏట సందర్భంగా 2010లో ప్రపంచంలోనే పొట్టి మనిషిగా ‘గిన్సిస్’ సర్టిఫికేట్ అందుకున్నారు. అదే సంవత్సరం జరిగిన నేపాల్ భామల అందాల పోటీలో హల్‌చల్‌చేసి విజేతలతో ఫొటోలకు ఫోజిచ్చారు. ‘ప్రపంచంలోనే అత్యంత పొట్టివాడు పుట్టిన నేపాల్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎంతైన శిఖరం అందాలు’ నేపాల్ పర్యాటక శాఖ ప్రచారానికి మగర్ అంబాసిడర్‌గా పనిచేసి పలు దేశాలు తిరిగారు. ప్రపంచంలోని అత్యంత పొట్టి అబ్బాయిలను, అమ్మాయిలను కలుసుకున్నారు. పొట్టి అమ్మాయిని కలుసుకోవడానికి ఆయన భారత్ దేశానికి వచ్చారు. ఆ తర్వాత నేపాల్‌లోనే పుట్టిన చంద్ర బహదూర్ డాంగీ (ఒక అడుగు 7.9 అంగుళాలు) చేతుల్లో మగర్ గిన్నీస్ రికార్డు కోల్పోయారు. 2015లో డాంగీ మరణించడంతో మళ్లీ ప్రపంచ రికార్డు మగర్‌కే దక్కింది. -
షీ ఈజ్ సమ్‌థింగ్!
ఆమెకు చిన్నప్పటి నుంచి ఆర్ట్ అంటే ఇష్టం. అమ్మ చీరలపై ఆర్ట్ వేస్తుంటే చూసి ఆశ్చర్యపోయేది. తానూ పెయింటింగ్ నేర్చుకొని ‘ది బెస్ట్’ అనిపించుకోవాలనుకుంది. అమ్మ స్ఫూర్తిగా మొదలైన ఆమె ప్రస్థానం.. నేడు గిన్నిస్ బుక్కి ఎక్కింది. ఆమే నగర యువతి జాహ్నవి మాగంటి. హిమాయత్‌నగర్: మొదట నోట్ పుస్తకాలు, బ్లాక్ బోర్డులపై కొన్ని కాన్సెప్ట్‌లకు సంబంధించిన పెయింటింగ్స్ వేయడం అలవర్చుకుంది జాహ్నవి. అలా వేస్తూ వేస్తూ ఇప్పుడు ఏకంగా కాలితో పెయింటింగ్ వేసి గిన్నిస్ బుక్ రికార్డులో చోటు సంపాదించింది. మణికొండలోని ల్యాంకోహిల్స్‌లో నివసించే జాహ్నవి ప్రస్తుతం యూకేలో గ్రాడ్యుయేషన్ చేస్తోంది. ఆమె తల్లి జయశ్రీ డ్రెస్ మెటీరియల్స్‌పై డిజైన్స్ వేసేది. చీరలపై వేసిన పెయింటింగ్స్ చూసిన వారంతా జయశ్రీని కొనియాడేవారు. అదిచూసిన జాహ్నవి అమ్మలా మంచి పేరు తెచ్చుకోవాలనుకుంది. అలా పెయింటింగ్స్ వేయాలనే ఆలోచన ఆరేళ్ల ప్రాయంలోనే ఆమె మదిలో మెదిలింది. ‘గ్లోబల్ ఆర్ట్ ఎక్స్పో’లో తొలి ప్రదర్శన జాహ్నవి వేసే పెయింటింగ్స్‌కు స్కూల్లో మంచి ప్రశంసలు దక్కేవి. ఈ క్రమంలో 2014లో 9 దేశాలు ప్రాతినిధ్యం వహించే ‘గ్లోబల్ ఆర్ట్ ఎక్స్పో’లో ఆమెకు అవకాశం వచ్చింది. ఇందులో దివంగత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం చిత్రాన్ని ప్రదర్శించింది. దీనికి ప్రశంసలు రావడంతో పాటు పదుల సంఖ్యలో అమ్ముడుపోయాయి. ఇక అప్పటి నుంచి దేశవిదేశాల్లో నిర్వహించిన ప్రదర్శనల్లో పాల్గొని మన్ననలు అందుకుంది. ఆర్ట్ విత్ డ్యాన్స్ ఎప్పుడూ చేతితో పెయింటింగ్ వేయడమేనా? కాలితో వేస్తే ఎలా ఉంటుంది? అని ఆలోచించిన జాహ్నవి... ఓ నెల రోజులు అలా ప్రయత్నించింది. తర్వాత ‘లోటస్’ అనే ఒక కాన్సెప్ట్‌తో డ్యాన్స్ చేస్తూ పాదాలు, కాళ్ల వేళ్లతో పెయింటింగ్ వేసింది. ఈ వీడియోను తన ఫేస్బుక్ (స్ట్రోక్) పేజ్, యూట్యూబ్‌లలో అప్లోడ్ చేసింది. అదే విధంగా దీనిని గిన్నిస్ బుక్ ప్రతినిధులకు పంపగా, వారు అంగీకరించి తాము చెప్పిన విధంగా చేయాలని సూచించారు. 9 గంటలు.. 141 చదరపు మీటర్లు అయితే పాదాలు, కాళ్ల వేళ్లతో కాకుండా కాలితో బ్రష్ పట్టుకొని డ్యాన్స్ చేస్తూ పెయింటింగ్ వేయాలని గిన్నిస్ బుక్ ప్రతినిధులు సూచించారు. దీనికి జాహ్నవి అంగీకరించింది. డిసెంబర్ 29న ల్యాంకోహిల్స్‌లోని క్లబ్‌హౌస్‌లో గిన్నిస్ బుక్ అధికారుల సమక్షంలో జాహ్నవి తన ప్రతిభను చాటింది. ‘అక్రిలిక్’ పెయింటింగ్‌ను 9 గంటల్లో 141.75 చదరపు మీటర్ల విస్తీర్ణంలో వేసి గిన్నిస్ రికార్డు సొంతం చేసుకుంది. అద్భుతమైన ఆర్టిస్ట్ అయిన జాహ్నవి సేవాహృదయురాలు. తన పెయింటింగ్స్‌ను ఎగ్జిబిషన్లలో ప్రదర్శించగా వస్తున్న డబ్బులను ఆమె సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. ఇవి ఏడాదికి రూ.50–60 వేలు అవుతుండగా, వాటిని నగరంలోని విజయనగర్ కాలనీలోని ‘గిల్డ్ ఆఫ్ సర్వీస్ సేవా సమాజం’, విజయవాడలోని ‘చిన్మయి విజయ’ బాలికల అనాథాశ్రమాలకు నాలుగేళ్లుగా అందజేస్తున్నారు. వృత్తిని సేవగా ఎంచుకోవడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు జాహ్నవి. కాలుతో పెయింటింగ్ వేస్తున్న జాహ్నవి తల్లి జయశ్రీతో -
రెయిన్బో ఆసుపత్రి గిన్నిస్ రికార్డు
హైదరాబాద్: నెలలు నిండకుండానే పుట్టిన 445 మంది చిన్నారులను కాపాడిన ఆసుపత్రిగా రెయిన్ బో ప్రపంచ రికార్డు సృష్టించింది. రెయిన్బో ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రపంచ ప్రీ మెచ్యూర్ డే వేడుకలను గురువారం బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్ హోటల్లో నిర్వహించారు. ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రీ మెచ్యూర్డు చిన్నారులు 445 మంది ఒకే చోట చేరి గిన్నిస్ రికార్డు సృష్టించారు. గతంలో 386 మంది ప్రీ మెచ్యూర్డ్ చిన్నారులతో అర్జెంటీనా నెలకొల్పిన రికార్డును తిరగ రాశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కే తారకరామారావు మాట్లాడుతూ నియోనాటల్ చికిత్స అందించడం ఎంతో క్లిష్టమైందన్నారు. అలాంటి సమస్యను అధిగమిస్తూ ఇక్కడ ఎంతో మంది చిన్నారులకు రెయిన్ బో ప్రాణదానం చేస్తోందని ఆయన కొనియాడారు. గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించిన తల్లులు, పిల్లలు అందరికీ ఆయన అభినందనలు తెలిపారు. ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ రమేష్ కంచర్ల మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో ఇప్పటివరకూ కేజీ కన్నా తక్కువ బరువు కలిగిన 300 మంది చిన్నారులను కాపాడామని ఇందులో 24 వారాలు మాత్రమే తల్లి కడుపులో ఉండి 449 గ్రాములు బరువుతో జన్మించిన శిశువును సైతం రక్షించగలిగామన్నారు. ఆసుపత్రి ప్రారంభమైన నాటి నుంచి ప్రీ మెచ్యూర్డ్‌గా జన్మించిన వారందరినీ ఆహ్వానించామని ఒకేసారి 445 మంది ఇక్కడికి హాజరై రికార్డు సృష్టించడం తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు మంత్రి సమక్షంలో ఆసుపత్రి నిర్వాహకులకు సర్టిఫికెట్ అందజేశారు.