షీ ఈజ్‌ సమ్‌థింగ్‌! | she is something.. special story | Sakshi
Sakshi News home page

Published Sat, Jan 6 2018 9:05 AM | Last Updated on Fri, Mar 22 2019 1:41 PM

she is something.. special story - Sakshi

ఆమెకు చిన్నప్పటి నుంచి ఆర్ట్‌ అంటే ఇష్టం. అమ్మ చీరలపై ఆర్ట్‌ వేస్తుంటే చూసి ఆశ్చర్యపోయేది. తానూ పెయింటింగ్‌ నేర్చుకొని ‘ది బెస్ట్‌’ అనిపించుకోవాలనుకుంది. అమ్మ స్ఫూర్తిగా మొదలైన ఆమె ప్రస్థానం.. నేడు గిన్నిస్‌ బుక్‌కి ఎక్కింది. ఆమే నగర యువతి జాహ్నవి మాగంటి.   

హిమాయత్‌నగర్‌: మొదట నోట్‌ పుస్తకాలు, బ్లాక్‌ బోర్డులపై కొన్ని కాన్సెప్ట్‌లకు సంబంధించిన పెయింటింగ్స్‌ వేయడం అలవర్చుకుంది జాహ్నవి. అలా వేస్తూ వేస్తూ ఇప్పుడు ఏకంగా కాలితో పెయింటింగ్‌ వేసి గిన్నిస్‌ బుక్‌ రికార్డులో చోటు సంపాదించింది. మణికొండలోని ల్యాంకోహిల్స్‌లో నివసించే జాహ్నవి ప్రస్తుతం యూకేలో గ్రాడ్యుయేషన్‌ చేస్తోంది. ఆమె తల్లి జయశ్రీ డ్రెస్‌ మెటీరియల్స్‌పై డిజైన్స్‌ వేసేది. చీరలపై వేసిన పెయింటింగ్స్‌ చూసిన వారంతా జయశ్రీని కొనియాడేవారు. అదిచూసిన జాహ్నవి అమ్మలా మంచి పేరు తెచ్చుకోవాలనుకుంది. అలా పెయింటింగ్స్‌ వేయాలనే ఆలోచన ఆరేళ్ల ప్రాయంలోనే ఆమె మదిలో మెదిలింది.  

‘గ్లోబల్‌ ఆర్ట్‌ ఎక్స్‌పో’లో తొలి ప్రదర్శన    
జాహ్నవి వేసే పెయింటింగ్స్‌కు స్కూల్‌లో మంచి ప్రశంసలు దక్కేవి. ఈ క్రమంలో 2014లో 9 దేశాలు ప్రాతినిధ్యం వహించే ‘గ్లోబల్‌ ఆర్ట్‌ ఎక్స్‌పో’లో ఆమెకు అవకాశం వచ్చింది. ఇందులో దివంగత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం చిత్రాన్ని ప్రదర్శించింది. దీనికి ప్రశంసలు రావడంతో పాటు పదుల సంఖ్యలో అమ్ముడుపోయాయి. ఇక అప్పటి నుంచి దేశవిదేశాల్లో నిర్వహించిన ప్రదర్శనల్లో పాల్గొని మన్ననలు అందుకుంది.   

ఆర్ట్‌ విత్‌ డ్యాన్స్‌  
ఎప్పుడూ చేతితో పెయింటింగ్‌ వేయడమేనా? కాలితో వేస్తే ఎలా ఉంటుంది? అని ఆలోచించిన జాహ్నవి... ఓ నెల రోజులు అలా ప్రయత్నించింది. తర్వాత ‘లోటస్‌’ అనే ఒక కాన్సెప్ట్‌తో డ్యాన్స్‌ చేస్తూ పాదాలు, కాళ్ల వేళ్లతో పెయింటింగ్‌ వేసింది. ఈ వీడియోను తన ఫేస్‌బుక్‌ (స్ట్రోక్‌) పేజ్, యూట్యూబ్‌లలో అప్‌లోడ్‌ చేసింది. అదే విధంగా దీనిని గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులకు పంపగా, వారు అంగీకరించి తాము చెప్పిన విధంగా చేయాలని సూచించారు.

9 గంటలు.. 141 చదరపు మీటర్లు  
అయితే పాదాలు, కాళ్ల వేళ్లతో కాకుండా కాలితో బ్రష్‌ పట్టుకొని డ్యాన్స్‌ చేస్తూ పెయింటింగ్‌ వేయాలని గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులు సూచించారు. దీనికి జాహ్నవి అంగీకరించింది. డిసెంబర్‌ 29న ల్యాంకోహిల్స్‌లోని క్లబ్‌హౌస్‌లో గిన్నిస్‌ బుక్‌ అధికారుల సమక్షంలో జాహ్నవి తన ప్రతిభను చాటింది.  ‘అక్రిలిక్‌’ పెయింటింగ్‌ను 9 గంటల్లో 141.75 చదరపు మీటర్ల విస్తీర్ణంలో వేసి గిన్నిస్‌ రికార్డు సొంతం చేసుకుంది.  అద్భుతమైన ఆర్టిస్ట్‌ అయిన జాహ్నవి సేవాహృదయురాలు. తన పెయింటింగ్స్‌ను ఎగ్జిబిషన్లలో ప్రదర్శించగా వస్తున్న డబ్బులను ఆమె సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. ఇవి ఏడాదికి రూ.50–60 వేలు అవుతుండగా, వాటిని నగరంలోని విజయనగర్‌ కాలనీలోని ‘గిల్డ్‌ ఆఫ్‌ సర్వీస్‌ సేవా సమాజం’, విజయవాడలోని ‘చిన్మయి విజయ’ బాలికల అనాథాశ్రమాలకు నాలుగేళ్లుగా అందజేస్తున్నారు. వృత్తిని సేవగా ఎంచుకోవడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు జాహ్నవి.   


కాలుతో పెయింటింగ్‌ వేస్తున్న జాహ్నవి

తల్లి జయశ్రీతో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement