ఐపీఎల్ ఆటగాళ్ల ‘వేలం’ ముగిసింది. వేలంలో పాల్గొన్న 10 ఫ్రాంచైజీలూ కలిపి ఆటగాళ్ల కోసం రు. 639 కోట్లకు పైగా ఖర్చుపెట్టాయి. మరోవైపు – ఆది, సోమవారాల్లో తొలిరోజు పాట జరుగుతున్నంత సేపూ.. కోటి రూపాయల ప్రశ్న ఒకటి ఇంటర్నెట్‌ను పల్టీలు కొట్టిస్తూనే ఉంది. ‘‘ఆమె ఎవరు? ఆమె పేరేంటి?’’ – ఇదీ ఆ ప్రశ్న. ‘‘ఆమె జాహ్నవీ మెహతా. కోల్‌కతా నైట్ రైడర్స్’’ – ఇదీ జవాబు. ‘‘జాహ్నవీ మెహతానా! సో క్యూట్’’ – ఒకరు.‘దేవుడా! ఏమిటి ఇంతందం!!’’ – ఇంకొకరు.
ఆట ముగిసినా కూడా, ‘‘ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు?’’ అంటూ కొన్ని గంటల పాటు నెట్‌లో ఆమె కోసం వేట’ సాగుతూనే ఉంది. అందమే కాదు, అందాన్ని మించిన తెలివితేటలు ఉన్న అమ్మాయి జాహ్నవి మెహతా. డాటర్ ఆఫ్ జూహీ చావ్లా. అవునా! అక్కడేం పని ఈ అమ్మాయికి! అక్కడే మరి పని! కోల్‌కతా నైట్ రైడర్స్‌కి కో–ఓనర్ జూహి చావ్లా. టైమ్‌కి ఆమె వేలం పాటకు చేరుకోలేకపోయారు. ‘‘ఇదుగో వస్తున్నా..’’ అంటూ జెడ్డా ఫ్లయిట్ నుంచి వీడియో పంపారు. ఆమె వచ్చేలోపు పాట మొదలైందో, లేక ‘‘నువ్వేశాడు’’ అని అంతటి బాధ్యతను కూతురిపై ఉంచారో.. తల్లికి బదులుగా జాహ్నవి వేలం పాటలో పాల్గొంది. 21 మంది ఆటగాళ్లను దక్కించుకుంది. వాళ్లకు పెట్టిన ఖర్చుపోగా, ఇంకో ఐదు లక్షలు మిగిల్చింది కూడా!
జాహ్నవి సోషల్ మీడియాలో కనిపించటం అరుదు. ఆమెకొక ‘పబ్లిక్ ఇన్‌స్ట్రాగామ్ పేజ్’ ఉంది కానీ, అందులో 2022 తర్వాత ఒక్క పోస్టు కూడా ఆమె పెట్టలేదు. అయితే ఆ ఏడాది ఐపీఎల్ వేలంలో మాత్రం షారుక్ ఖాన్ కూతురు సుహానా, కొడుకు ఆర్యన్‌లతో కలిసి తొలిసారి కనిపించింది. తల్లి తరఫున జాహ్నవి, షారుక్ తరఫున సుహానా, ఆర్యన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కె.కె.ఆర్) వేలంలో కూర్చున్నారు. (షారుఖ్ కూడా కె.కె.ఆర్‌కి ఒక కో ఫౌండర్). ఆ తర్వాత జాహ్నవి బాహ్య ప్రపంచానికి కనిపించటం మళ్లీ ఇప్పుడే!
గత ఏడాదే ఆమె కొలంబియా యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అప్పుడు కూడా ఆమె సోషల్ మీడియాలోకి రాలేదు. జూహీ చావ్లానే గ్రాడ్యుయేషన్ గౌన్‌లో ఉన్న తన కూతురి కాన్వొకేషన్ ఫొటోను ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసి, ‘కొలంబియా క్లాస్ 2023’ అని కాప్షన్ పెట్టి తన మురిపెం తీర్చుకున్నారు. జాహ్నవి స్కూల్ చదువు కూడా ఇంగ్లండ్‌లోనే అక్కడి చాటర్ హౌస్ స్కూల్లో సాగింది. అంతకుముందు ముంబైలోని ధీరూబాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివింది.
తల్లి పోస్ట్ చేసిన ఫొటోలో గ్రాడ్యుయేషన్ గౌన్‌లో జాహ్నవిని అప్పుడు పెద్దగా ఎవరూ పట్టించుకున్నట్లు లేదు. ఇప్పుడు మాత్రం తల్లి తరఫున ఐపీఎల్ ఆక్షన్‌లో డార్క్ బ్లూ వెల్వెట్ జాకెట్, వైట్ టీ షర్టుతో కనిపించిన జాహ్నవిని చూసి ‘‘ఎవరబ్బా ఈ అమ్మాయి?!’’ అని ఆరాలు తీశారు. ఎవరో తెలిశాక, ‘‘తల్లి పోలికలు ఎక్కడికిపోతాయి?’’ అని ఒకప్పటి మిస్ ఇండియా, బాలీవుడ్ అందాల నటి అయిన జూహీ చావ్లాను కూడా ఆరాధనగా ట్యాగ్ చేశారు. ‘అందం ఒక్కటేనా తల్లి పోలిక? ఆ తెలివి మాత్రం!’ అన్నట్లు ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీ విజేత ఎవరో గుర్తుంది కదా. కోల్‌కతా నైట్ రైడర్స్.
(చదవండి:
Comments
Please login to add a commentAdd a comment