చిన్నారితో ఆసుపత్రి సిబ్బంది
పంజగుట్ట: అరుదైన గుండె సంబందిత వ్యాధితో బాధపడుతున్న మూడు రోజుల పసికందుకు రెయిన్ బో చిల్డ్రన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు పసికందుకు ఐసీయూలో చికిత్స అందించామని ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగా ఉందని ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ ధర్మారావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. వైద్య పరిభాషలో హైపోప్లాస్టిక్ లెఫ్ట్ హార్ట్ సిండ్రోమ్ (హెచ్‌ఎల్‌హెచ్‌ఎస్) అనే అరుదైన గుండె వ్యాధితో బాధపడుతున్న మూడు రోజుల చిన్నారి సంక్లిష్టమైన పరిస్థితుల్లో వెంటిలేటర్‌పై ఉండగా తమ ఆసుపత్రికి వచ్చిందన్నారు. ఈ సమస్య ఎదురైతే శ్వాస తీసుకోవడం కష్టమౌతుందని, ఎడమ వైపు గుండె రక్తనాళాలకు రక్తం పంప్ చేసే నాళాలు చిన్నవిగా ఉండటంతో అత్యవసర గుండె శస్త్రచికిత్స అనివార్యమైందన్నారు.
దీనిని ‘నార్ వుడ్ ప్రొసీజర్’ ప్రక్రియగా పేర్కొంటారని, ఎంతో సంక్లిష్టమైన ఈ గుండె శస్త్రచికిత్స దేశంలోని అతి కొన్ని ఆసుపత్రుల్లో మాత్రమే చేసే అవకాశం ఉందన్నారు. రెయిన్‌బో వైద్యులు విజయవంతంగా ఈ ఆపరేషన్ చేశారన్నారు. తొమ్మిది రోజుల ఐసీయూలో చికిత్స అందించిన తర్వాత ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం పూర్తిగా నిలకడగా ఉందన్నారు. పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జి చేసేందుకు వైద్యులు అనుమతిచ్చారన్నారు. శస్త్రచికిత్స నిర్వహించిన పిడియాట్రిక్ సర్జన్ డైరెక్టర్ డాక్టర్ తపన్ కె డాష్ మాట్లాడుతూ .. కరోనా నేపథ్యంలో, లాక్‌డౌన్ సమయంలో ఈ శస్త్రచికిత్స చేయడంవల్ల ఓ చిన్నారి ప్రాణం కాపాడామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment