కళ్లు, ముక్కు, నోటి నుంచి రక్తం..
అరుదైన వ్యాధితో బాధపడుతున్న మూడేళ్ల చిన్నారి...
సాక్షి, హైదరాబాద్: కళ్లు, ముక్కు, నోటి నుంచి రక్తం కారుతూ హెమటో డ్రేసిన్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న 3 ఏళ్ల చిన్నారి నగరంలోని రెయిన్‌బో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఫలక్‌నుమాకు చెందిన మహ్మద్ అబ్దుల్లా, నజీమాబేగంల కుమార్తె అహనాబేగం. లక్ష మందిలో ఒకరికి వచ్చే హెమటో డ్రేసిన్ వ్యాధితో అహనా గత 20 నెలల నుంచి బాధపడుతోంది. పుట్టిన 18 నెలల వరకూ ఆరోగ్యంగానే ఉన్న చిన్నారి 16 నెలల క్రితం అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైంది.
ముక్కు, నోరు, కళ్లలో నుంచి రక్తస్రావం అవుతుండటంతో బెంగళూరు, ముంబై, సీఎంసీ(వెల్లూరు) ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు. అయినా ఫలితం దక్కలేదు. చివరకు రెయిన్‌బో ఆస్పత్రి వైద్యులను సంప్రదించగా, వైద్య పరీక్షల అనంతరం హెమటో డ్రేసిన్ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. అహనాకు రక్తస్రావం నిలిచిపోయిందని, ప్రస్తుతం చికిత్స అందిస్తున్నామని రెయిన్‌బో వైద్య నిపుణురాలు శిరీషారాణి తెలిపారు.